సాక్షి,హైదరాబాద్:ఉగాదికి గద్దర్ (సినిమా) అవార్డులను ప్రదానం చేయాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.ఈ మేరకు శనివారం(జనవరి18) సచివాలయంలో జరిగిన గద్దర్ అవార్డుల కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం వెల్లడించారు. అవార్డుల ప్రదానోత్సవానికి ఏర్పాట్లు చేసుకోవాలని కమిటీ సభ్యులు,అధికారులకు సూచించారు.
సినిమా నిర్మాణంలో హైదరాబాద్‌ను ప్రపంచ గమ్యస్థానంగా మారుస్తామని ఈ సందర్భంగా భట్టి తెలిపారు.అవార్డుల కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్టు చెప్పారు. అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జాతీయ స్థాయి కార్యక్రమాల తరహాలో నిర్వహించాలని సూచించారు.
గత పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్ పార్టీ చిత్ర పరిశ్రమను నిర్లక్ష్యం చేసిందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో అవార్డుల ప్రదానం జరగలేదన్నారు. రాష్ట్రంలో సినిమాల నిర్మాణాన్ని ప్రోత్సహించే అవార్డులను ఏటా అందజేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.అవార్డుల కోసం లోగోతో సహా విధివిధానాలు, నియమ నిబంధనలపై కమిటీ చర్చించింది.
గతంలో తెలుగు సినిమా రంగానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నంది అవార్డులు బహుకరించేవారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో నంది అవార్డుల సంప్రదాయం కొనసాగినప్పటికీ తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం సినిమా రంగానికి అవార్డులివ్వలేదు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత సినిమా రంగానికి తెలంగాణ యుద్ధనౌక గద్దర్ పేరుతో అవార్డులివ్వాలని నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment