ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: జిల్లాలోని నూనె మిల్లులు సంక్షోభంలో ఉన్నాయి. మూడు నెలలుగా ఈ పరిస్థితి నెలకొంది. కొద్ది నెలల క్రితం నూనె మిల్లులు కళకళలాడుతుండేవి. ప్రస్తుతం మిల్లులు ఆడని కారణంగా బోసిపోయాయి. విత్తనాల కొరత ఇందుకు ప్రధాన కారణమని వ్యాపారులు తెలుపుతున్నారు. జిల్లాలోని ప్రొద్దుటూరు, బద్వేలు, కడప, రాయచోటి, మైదుకూరు, ఎర్రగుంట్ల తదితర ప్రాంతాల్లో సుమారు 50 నూనె మిల్లులు ఉన్నాయి. ఇందులో 15 మిల్లుల వరకు ప్రొద్దుటూరులోనే ఉండటం గమనార్హం.
ఇక్కడి నుంచే ట్యాంకర్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు నూనెను తరలిస్తుంటారు. ఈ పరిశ్రమపై ఆధారపడి వందల మంది కూలీలు ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవిస్తున్నారు. మిల్లుల యజమానులు విత్తనాల లభ్యతను బట్టి పొద్దుతిరుగుడు నూనె (సన్‌ఫ్లవర్ ఆయిల్), వేరుశనగ నూనెను తయారు చేస్తుంటారు.
వేరుశనగ నూనెను నేరుగా మార్కెట్‌లోకి తీసుకొచ్చే అవకాశం ఉండగా పొద్దుతిరుగుడు నూనెను మాత్రం రీఫైండ్ కోసం హైదరాబాద్‌కు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తుంటారు. ప్రస్తుతం విత్తనాల కొరత తో పాటు ధరలు కూడా పడిపోవడంతో పరిశ్రమకు గడ్డుకాలం ఏర్పడింది. కొంత కాలం క్రితం హోల్ సేల్‌గా 10 కిలోల వేరుశనగ నూనె రూ.1100 ఉండగా ప్రస్తుతం రూ.700 ఉంది. అలాగే పొద్దుతిరుగుడు నూనె (రా ఆయిల్) 10 కిలోలు రూ.720-620కి తగ్గింది. దిగుమతుల ప్రభావం కారణంగానే ధరలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
ఇటీవలి కాలంలో యాంత్రీకరణ ప్రభావం కారణంగా పొద్దుతిరుగుడు పంట స్థానంలో ఎక్కువగా శనగ పంటను రైతులు సాగు చేస్తున్నారు. దీంతో పొద్దుతిరుగుడు పంట విస్తీర్ణం 25 శాతానికి పడిపోయిందని వ్యాపారులు తెలిపారు. ఆగిన మిల్లును తిరిగి నడపాలంటే కనీసం మూడు రోజులకు సరిపడ విత్తనాలైనా ఉండాలని, అవి దొరకడం కష్టతరంగా ఉందని ఓ వ్యాపారి తెలిపాడు. వేరుశనగ విస్తీర్ణం కూడా తగ్గిపోవడంతో నూనెమిల్లులకు విత్తనాల కొరత ఏర్పడింది. కొంత మంది వ్యాపారులు అనంతపురం జిల్లా నుంచి వేరుశనగ విత్తనాలు కొనుగోలు చేసి తీసుకొస్తున్నారు.
దిగుమతుల ప్రభావమే కారణం
ఇతర దేశాల నుంచి నూనెలు ఎక్కువగా దిగుమతి అవుతున్నాయి. దీంతో లోకల్ మార్కెట్‌లో నూనెతోపాటు విత్తనాల ధరలు పడిపోయాయి. ప్రభుత్వం పన్ను రాయితీ ఇవ్వడంతో విచ్చలవిడిగా నూనెలు దిగుమతి అవుతున్నాయి. దీంతో మిల్లులు సంక్షోభంలో ఉన్నాయి.
- గువ్వల నారాయణరెడ్డి,
ఆయిల్ మిల్లర్, ప్రొద్దుటూరు
షట్‌డౌన్
Published Thu, Jan 16 2014 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM
Advertisement
Advertisement