దుమ్ము రేపిన హామీలు దమ్ముకేవీ నీళ్లు | agricultue water problem east godavari | Sakshi
Sakshi News home page

దుమ్ము రేపిన హామీలు దమ్ముకేవీ నీళ్లు

Published Fri, Jun 16 2017 11:33 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

దుమ్ము రేపిన హామీలు దమ్ముకేవీ నీళ్లు - Sakshi

దుమ్ము రేపిన హామీలు దమ్ముకేవీ నీళ్లు

  • మాటలు కోటలు దాటాయి 
  •   చేతలు చతికిలపడ్డాయి
  • - మంత్రుల హామీలన్నీ నీటి మీద కోతలే 
  • - ఏరువాక హడావుడి ఏమైందో...
  • - జూలై 15కి ఖరీఫ్‌ నాట్లు కష్టమే 
  • - మండిపడుతున్న రైతులు
  • - మరోసారి సాగు సమ్మెకు సన్నద్ధమవుతున్న వైనం
  • సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఖరీఫ్‌లో వారం రోజులు ముందుగానే సాగునీరు అందించిన ఘనత తమదేనని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు జబ్బలుచరుచుకున్నారు... ముందస్తుగా నీరిచ్చే దమ్ము మా పార్టీదేనని జూన్‌ 2న తెగ సంబరపడిపోయారు... మాటలు కోటలు దాటినా పంట పొలాల్లోకి మాత్రం నీరు దరి చేరలేదు. మంత్రుల మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. నీరు విడుదలచేసి రెండు వారాలు గడచినా ఇప్పటికీ ఈస్ట్రన్, సెంట్రల్‌ డెల్టాల్లో చాలా పొలాల్లో రైతులకు ఎదురు తెన్నులు తప్పడం లేదు. ఈ నెల రెండో తేదీన ధవళేశ్వరం నుంచి ఈ రెండు డెల్టాల పరిధిలోని పంట కాలువలకు సాగునీరును అధికారికంగా విడుదల చేశారు. సాగునీటిని కుడి చేత్తో విడుదల చేసి ఎడమ చేత్తో ఆపేసి రైతులను ఇబ్బందులుపాల్జేశారు. ఖరీఫ్‌లో క్లోజర్‌ పనులు పంట కాలువలకు నీరు ఆపేసిన వెనువెంటనే చేపట్టకుండా తాత్సారం చేశారు. వారం, పది రోజుల్లో నీరు విడుదల చేసేస్తారనగా క్లోజర్‌ పనులు మొదలుపెట్టి అటు పనులు పూర్తికాకుండా చేశారు. మరోపక్క వారం రోజులు ముందుగానే సాగునీరు విడుదలచేసినా వాటి ఫలాలు రైతులకు దక్కకుండా చేశారు. 

    కానీ వారం ముందుగానే నీటిని విడుదలచేసి రైతులకు ఎంతో ప్రయోజనం కల్పించామని స్వయంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పే గొప్పగా ప్రకటించుకున్నారు. అసలు ఖరీఫ్‌ చరిత్రలో తమ ప్రభుత్వమే సాగునీటిని వారం ముందుగా తొలిసారి విడుదలచేసిందని కూడా సెలవిచ్చారు. ఇటీవల కాకినాడలో మహా సంకల్ప సభకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వేదికపై ఉంగానే ఈ విషయాన్ని చెవిలో వేయడం ఆయనేమో అధికారికంగా ఏరువాక కూడా నిర్వహించాలని ఆదేశాలు జారీచేశారు. ఆ మాట పట్టుకుని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అనపర్తి నియోజకవర్గంలో ఏరువాక అంటూ ఆర్భాటం చేయగా, మిగిలిన ఎమ్మెల్యేలు తమ, తమ నియోజకవర్గాల్లో ఏదో ఘనకార్యం సాధించినట్టు ఏరువాక పేరుతో నాగలిపట్టి ఫొటోలకు ఫోజులిచ్చి ఆర్భాటం చేశారు. తప్పితే రైతులకు ఒరిగిందేమీ లేదు. 
    క్షేత్రస్థాయిలో ఇదీ దుస్థితీ...
    ఓ  పక్క క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి చూస్తే జిల్లాలో పలు పంటకాలువల పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు లేక ఇప్పటికీ నారుమళ్లు వేసిన దాఖలాలు లేవు. మరోపక్క జూలై 15 నాటికి ఖరీఫ్‌ నాట్లు పూర్తి చేయాలంటూ జిల్లా వ్యవసాయశాఖ కార్యచరణ ప్రకటించింది. ఈ విషయాన్ని గురువారం ఆలమూరు మండలంలో పర్యటించిన సందర్బంలో వ్యవసాయ శాఖ జేడీ కె.ఎస్‌.వి. ప్రసాద్‌ రైతులకు సూచించారు. పూర్తి స్థాయిలో పంటకాలువల నుంచి సాగునీరు పొలాలకు చేరకుండా నారుమళ్లు ఎప్పుడు పోయాలి, ఆకు ఎప్పటికి వస్తుంది, నాట్లు ఎప్పుడు వేయాలంటూ రైతులు లబోదిబోమంటున్నారు.
    ప్రతిఏటా నిర్లక్షమే...
    అధికారులు ఈ నెల2న  నీరు విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఖరీఫ్‌ సీజన్‌లో కూడా పంటకాలువల పరిధిలో క్లోజర్‌ పనులు పూర్తి స్థాయిలో చేపట్టకుండా నిర్లక్ష్యం చేయడంతో మధ్యలోనే ఉండిపోయాయి. ఓ పక్క పనులు పూర్తి కాలేదు, మరోపక్క పొలాలకు సాగునీరు అందలేదు. ఈ విషయంలో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పనులు చేసిన కాంట్రాక్టర్లకు తప్ప మరెవరికీ కలిసి రాలేదంటున్నారు. ప్రధానంగా అమలాపురం–చల్లపల్లి పంట కాలువ, ఇటు సామర్లకోట కెనాల్‌పై పనులతో రెండు ప్రాంతాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని ఆందోళన చెందారు. ఈ రెండు ప్రాంతాలు ఉప ముఖ్యమంత్రి చినరాజప్పకు అనుబంధం ఉన్నవే. అయినా పనుల పేరుతో కాంట్రాక్టర్లకు ఇచ్చిన ప్రాధాన్యం తమకు ఇవ్వకుండా వారం రోజులకుపైనే నీరు విడుదల చేయకుండా నిలిపివేశారని ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండుచోట్ల సుమారు రూ.13 కోట్లతో పనులు చేపట్టినా పూర్తి చేయలేకపోయారు. ఈ విషయమై ‘సాక్షి’లో వరుస కథనాలు రావడంతో ఎట్టకేలకు గురువారం సామర్లకోట కెనాల్‌కు అనివార్యంగా నీరు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇవికాకుండా జిల్లాలోని అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం, అల్లవరం మండలాలు, ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం మండలాలు, పి గన్నవరం, రాజోలు, కొత్తపేట, అనపర్తి, మండపేట తదితర నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల ఆయకట్టుకు ఇప్పటికీ నీరు చేరలేదు. ఉదాహరణకు కపిలేశ్వరపురం మండలం టేకి, రాయవరం మండలం సోమేశ్వరం తదితర శివారు పొలాలకు ఇప్పటికీ నీరు చేరలేదు.అనపర్తి నియోజవకర్గంలో ఎర్రకాలువకు సాగునీరు పూర్తిస్థాయిలో అందడం లేదని అక్కడి ఆయకట్టు రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ ప్రాంతాలకు ఆలస్యంగా విడుదల చేయడమే కాకుండా కాలువ  లెవెల్‌కు నీరు చేరకపోవడంతో పొలాలకు నీరందక రైతులు విత్తనాలు చల్లుకోవడానికి ఇబ్బందిగా మారింది. 
    అవగాహన లేమే కారణహా...!
    నీటిపారుదలశాఖ ఎస్‌ఈగా వచ్చిన రాంబాబుకు ఈ డెల్టా వ్యవస్థపై అంతగా అవగాహన లేకపోవడమే ప్రస్తుత సమస్యకు ప్రధాన కారణమంటున్నారు. గతంలో పనిచేసిన సుగుణాకరరావు సహా పలువురు ఎస్‌ఈలు ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు సమయస్ఫూర్తితో కాలువలకు నీరు సరఫరా చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూశారు. రాంబాబుకు ఇక్కడి పరిస్థితులపై పెద్దగా అవగాహన లేకపోవడంతోనే నీరు విడుదలచేసినా పంట పొలాలకు సకాలంలో నీరు చేరని పరిస్థితి ఎదురైందని రైతు ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఎస్‌ఈగా రాంబాబును ప్రతిపాదించిన మంత్రి దృష్టికి ఇదే అనుమానాన్ని రైతు ప్రతినిధులు అప్పట్లో తీసుకువెళ్లినా ఆయన కొట్టిపారేశారంటున్నారు. అందుకు మూల్యం రైతులు ఇప్పుడు చెల్లించుకోవాల్సి వస్తోందంటున్నారు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయాధికారులు చెబుతున్నట్టు వచ్చే నెల 15 నాటికి ఎట్టి పరిస్థితుల్లోను నాట్లు పూర్తి చేయలేమని రైతులు పేర్కొంటున్నారు. ఆగస్టు 20 నాటికి పూర్తి అయితే గొప్పేనంటున్నారు. ఇటువంటి విషయాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యక్రమాలంటూ ఆర్భాటాలకు పోకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించేలా అధికారులను ఆదేశించాలంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే సాగు సమ్మెకు మరోసారి సన్నద్ధమవడానికి రైతాంగం సమాయత్తమవుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నిరసనలు ప్రారంభమయ్యాయి. ముమ్మిడివరం నియోజకవర్గంలో రైతులు పిడికిలి బిగించడం ... ఎమ్మెల్యే  చర్చలు జరిపినా ససేమిరా అనడం విదితమే. ఇదే తరహాలో మిగిలిన ప్రాంతాల్లో కర్షకులు కన్నెర్ర చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement