తూర్పు మన్యంలో ప్రకృతి సేద్యం
తూర్పు మన్యంలో ప్రకృతి సేద్యం
Published Wed, Mar 29 2017 11:23 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
జిల్లాలోనే ముందంజ
సత్ఫలితాలు సాధిస్తున్న రంపచోడవరం వ్యవసాయశాఖ
రంపచోడవరం : తూర్పు ఏజెన్సీలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు వ్యవసాయశాఖ శ్రీకారం చుట్టి సత్ఫలితాలు సాధిస్తోంది. జిల్లాలోనే ప్రకృతి సేద్యంలో అందరికంటే ముందంజలో ఇక్కడి వ్యవసాయశాఖ ఉంది. 2016–17 సంవత్సరంలో ఎటపాక డివిజ¯ŒSలో రికార్డు స్థాయిలో ఎకరాకు 45 క్వింటాళ్ల వరకు మిర్చి పండించారు. క్వింటాకు రూ. 15 వేలు రైతులు మార్కెట్ చేసుకున్నారు.దీంతో ఈ ఏడాది కూడా అధిక సంఖ్యలో రైతులు ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి చూపుతున్నారు. ఈ ప్రాంతంలో మిర్చి పంటలో రసాయనాల వాడకం వల్ల తెల్ల దోమ పెరిగి వైరస్ తెగుళ్లు అధికమై దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. ఎకరానికి 4 క్వింటాళ్లకు దిగుబడి పడిపోయింది. ఇలాంటి పరిస్థితిలోనే మిర్చి రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇప్పుడు పరిస్థితి మారి పురుగు మందుల నుంచి తేరుకుని ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లుతున్నారు. దీనికి కారణం కొండ ఆవుల సంపద వేల సంఖ్యలో ఉండడం, గోమూత్రం, గోమయం సుమారుగా 70 రెట్లు జెర్సీ ఆవుకంటే పురుగులు, తెగుళ్లు నివారించడంలో ముందుంది. ఈ ఫలితాలను దృష్టిలో ఉంచుకుని రంపచోడవరం డివిజ¯ŒSలో జీడిమామిడిపై ప్రకృతి వ్యవసాయాన్ని ప్రస్తుతం ఆరు గ్రామాల్లో ప్రారంభించారు. గిరిజన రైతులకు గోమయం, గోమూత్రం ద్వారా జీవామృతం తయారు చేసుకోవడంపై శిక్షణ ఇచ్చారు.
జీడిమామిడి కాపు గుత్తులుగా కాయడం, గింజ పెద్దదిగా ఉండడం, టీదోమ మటుమాయం కావడం, తెగుళ్లు దరిదాపునకు రాకపోవడం వంటి అంశాలు గిరిజన రైతాంగం ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపడానికి కారణమైయింది. ఇటీవల ఏజెన్సీలో పర్యటించిన ప్రభుత్వ రైతు సాధికారత సంస్థ వైస్ చైర్మన్, రాష్ట్రప్రభుత్వ వ్యవసాయశాఖ ప్రత్యేక సలహాదారు పి.విజయకుమార్ ప్రకృతి సేద్యం చేస్తున్న క్లస్టర్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఏజెన్సీలో ప్రకృతి సాగుకు ప్రోత్సహించేందుకు నిధులు కేటాయిస్తామన్నారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చర్యలు
ఏజెన్సీలో దాదాపు 75 శాతం వ్యవసాయం వర్షాధారంపైనే ఆధారపడుతున్నదని వ్యవసాయశాఖ ఏడీఏ దల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రంపచోడవరం డివిజ¯ŒSలో భూపతిపాలెం, ముసురుమిల్లి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ అవీ ఇంకా పూర్తిగా కార్యరూపం దాల్చలేదు. ఇలాంటి పరిస్థితిలో వ్యవసాయ అభివృద్థికి ఆటంకం లేకుండా రైతులకు 135 ఆయిల్ ఇంజన్లు, 195 స్ప్రింక్లర్లు పైపులను 2016 సంవత్సరంలో రైతులకు అందించి ప్రోత్సహించాం. ఇలాంటి చర్యల ఫలితంగా మొక్కజొన్న 1825 హెక్టార్లు, పత్తి 1660 హెక్టార్లు, వరి 10330 హెక్టార్లలోను, మినుము 3009, పెసర 1900 హెక్టార్లలో సేద్యం చేస్తున్నారన్నారు. పూర్తిగా వర్షాధారంతో జొన్న 1692 హెక్టార్లు, నువ్వులు 2000 హెక్టార్లు, కంది 600 హెక్టార్లు, జీడిమామిడి 40 వేల హెక్టార్లు సాగు చేయడం జరిగిందన్నారు. రికార్డుస్థాయిలో మొక్కజొన్న, మినుములు దిగుబడి వచ్చిందన్నారు. ఈ రబీలో కొత్త వంగడాలతో నువ్వుల పంటలో భారీ దిగుబడి సాధించాం. కందులు 584 హెక్టార్లకు ఉచితంగా ఇచ్చి పోడు వ్యవసాయంలోను, మిశ్రమ పంటకు ప్రోత్సహించినట్టు తెలిపారు. వీటితో పాటు ఏజెన్సీలో కనుమరుగవుతున్న చిరుధాన్యాలు కొర్రలు, జొన్న, సామా, రాగి, సజ్జలను పెద్ద ఎత్తున ప్రభుత్వ సహకారంతో అభివృద్థి చేస్తున్నామన్నారు. చిరుధాన్యాలను మూడు వేల ఎకరాల్లో సాగు చేసేందుకు కోవెల ఫౌండేషన్, శక్తి, ఏఎస్‌డీఎస్ వంటి స్వచ్ఛంద సంస్థల సహకారంతో మారుమూల గ్రామాల్లో కూడా వ్యవసాయాభివృద్థిలో ప్రగతి సాధించాలని కార్యచరణ అమలు చేస్తున్నట్లు తెలిపారు.
Advertisement
Advertisement