పడకేసిన పల్లె పాలన
- జిల్లాలో గ్రామ కార్యదర్శులకు కొరత
- మొత్తం పంచాయతీలు 1069.. ఉన్న కార్యదర్శులు 524 మంది
- సగానికి పైగా ఇన్‌చార్జిల ఏలుబడిలోనే..
- క్లస్టర్ పంచాయతీల్లోనూ ఖాళీలే..
- అదనపు భారంతో సిబ్బంది ఇక్కట్లు
బర్త్ సర్టిఫికెట్ కావాలన్నా.. చేతిపంపు మరమ్మతు చేయించుకోవాలన్నా.. డ్రైన్లు శుభ్రం చేయించుకోవాలన్నా.. రోజుల తరబడి పేరుకుపోయే చెత్తను తొలగించాలన్నా పంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదు చేయాల్సిందే. గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే పంచాయతీ పాలనలో కార్యదర్శులదే కీలకపాత్ర. ధ్రువపత్రాల మంజూరు, ఫించన్ల పంపిణీ, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, గ్రామసభల నిర్వహణ, ఉపాధి హామీ సేవలు, తాగునీటి సరఫరా, పన్నుల వసూళ్లు, ఇతర పరిపాలనాపరమైన విధులను వీరు నిర్వర్తిస్తున్నారు. అంతటి కీలకమైన గ్రామ కార్యదర్శుల పోస్టులు జిల్లాలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉండడంతో పల్లెల్లో పాలన పడకేస్తోంది.
మండపేట : జిల్లాలోని పంచాయతీల్లో కార్యదర్శులకు కొరత వచ్చింది. సగానికి పైగా పంచాయతీలు ఇన్‌చార్జిల ఏలుబడిలోనే కాలం వెళ్లదీస్తున్నాయి. ప్రభుత్వం ఏళ్ల తరబడి ఖాళీలను భర్తీ చేయకపోవడంతో ఉన్న సిబ్బంది అదనపు భారంతో సతమతమవుతున్నారు. దీంతో గ్రామ పాలన గాడి తప్పుతోంది. కార్యదర్శులు లేకపోవడంతో వివిధ పనులు, సమస్యల పరిష్కారానికి వస్తున్న ప్రజలు.. పంచాయతీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. జిల్లాలో మొత్తం 1,069 పంచాయతీలకుగాను ప్రస్తుతం 524 మంది మాత్రమే కార్యదర్శులున్నారంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో ఊహించుకోవచ్చు.
క్లస్టర్లకూ తప్పని కొరత
సిబ్బంది కొరతను అధిగమించి, పాలనా సౌలభ్యం కోసం రెండు మూడు మైనర్ పంచాయతీలు లేదా మేజర్ పంచాయతీకి సమీపంలోని మైనర్ పంచాయతీని కలిపి క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. ఒక్కో క్లస్టర్‌ను ఒక్కో కార్యదర్శి పర్యవేక్షించాల్సి ఉంది. ఈ మేరకు జిల్లాలోని 1,069 పంచాయతీలను 779 క్లస్టర్లుగా విభజించారు. ఇలా లెక్కేసుకున్నా కూడా పూర్తిస్థాయిలో కార్యదర్శులు లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం 524 మంది కార్యదర్శులు మాత్రమే ఉండటంతో ఇంకా 255 క్లస్టర్ పంచాయతీలకు కార్యదర్శుల కొరత వేధిస్తోంది. ఫలితంగా ఒక్కో కార్యదర్శి రెండు లేదా మూడు పంచాయతీలను పర్యవేక్షించాల్సి వస్తోంది. కొన్నిచోట్ల నాలుగైదు పంచాయతీలకు సహితం ఒక్కరే విధులు నిర్వహించాల్సి వస్తోంది.
అందని సేవలు
ఇన్‌చార్జి బాధ్యతలను సాకుగా చూపి కొందరు కార్యదర్శులు విధులకు డుమ్మా కొడుతున్నారన్న విమర్శలున్నాయి. ఫలితంగా అధిక శాతం పంచాయతీల్లో కీలకమైన పారిశుద్ధ్య నిర్వహణ, రక్షిత నీటి సరఫరా అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. వేసవి దృష్ట్యా గ్రామాల్లో తాగునీటికి కటకటలాడాల్సిన దుస్థితి నెలకొంటోంది. రామచంద్రపురం రూరల్ పరిధిలో 25 గ్రామ పంచాయతీలకు 10 మంది కార్యదర్శులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. కరప మండలంలో 23 పంచాయతీలకుగాను కేవలం 11 మంది కార్యదర్శులే ఉన్నారు. మిగిలిన పంచాయతీల్లో ఇన్‌చార్జిలే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కపిలేశ్వరపురం మండలంలో 19 పంచాయతీలకు 13 పంచాయతీల్లోనే కార్యదర్శులు ఉన్నారు. ఇవి మచ్చుకు మాత్రమే. జిల్లావ్యాప్తంగా అధిక శాతం మండలాల్లో దాదాపు ఇదే దుస్థితి నెలకొని ఉంది. కార్యదర్శులు లేకపోవడంతో సకాలంలో పనులు జరగడం లేదని, చిన్నచిన్న సమస్యలు కూడా పరిష్కారం కావడం లేదని గ్రామీణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనిపై పంచాయతీ కార్యాలయాలకు వెళుతుంటే అక్కడి సిబ్బంది ఆఫీసరుగారు లేరంటున్నారని ప్రజలు వాపోతున్నారు. పలు పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. దీంతో దోమల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇతర సమస్యల పరిష్కారంలోనూ తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. కార్యదర్శుల కొరతను అధిగమించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.