Russia Ukraine War: Russian Military Moves To Eastern Ukraine To Focus On Donbas - Sakshi
Sakshi News home page

War Moves East: ఇక తూర్పుపైకి

Published Wed, Apr 6 2022 1:16 AM | Last Updated on Wed, Apr 6 2022 8:47 AM

Russian War Moves East and Russian Military Focus On Donbas - Sakshi

లివీవ్‌: తూర్పు ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద డోన్బాస్‌ ప్రాంతాలపై భారీ దాడికి రష్యా సిద్ధపడుతోందని ఉక్రెయిన్‌ ఆరోపించింది. ‘ఇందుకోసం సైన్యాన్ని భారీగా అక్కడికి పంపుతోంది. అక్కడి డొనెట్స్‌క్, లుహాన్స్‌క్‌ ప్రాంతాలను నియంత్రణలోకి తీసుకోవడమే దాని లక్ష్యం. అక్కడి పొపస్న, రుబిజిన్‌ నగరాలను ఆక్రమించేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అక్కడి ఇతర పట్టణాలు, ప్రాంతాలపై కాల్పులకు దిగింది’ అని చెప్పింది.

డోన్బాస్‌పై దాడి నిమిత్తం ఇతర ప్రాంతాల నుంచి రష్యా దళాలు వెనక్కు వెళ్తున్న నేపథ్యంలో మరిన్ని పట్టణాలు, గ్రామాలను ఉక్రెయిన్‌ తిరిగి స్వాధీనం చేసుకుందని ఇంగ్లండ్‌ రక్షణ శాఖ పేర్కొంది. రాజధాని కీవ్‌తో పాటు చెర్నిహివ్‌ పరిసరాల్లోని పలు కీలక ప్రాంతాలు కూడా తిరిగి ఉక్రెయిన్‌ నియంత్రణలోకి వచ్చినట్టు చెప్పింది. రష్యా కాల్పులు మాత్రం భారీగా కొనసాగుతూనే ఉన్నాయి. మారియుపోల్‌ రేవులో దాడి ధాటికి ప్రయాణికుల నౌక మునిగిపోతున్నట్టు సమాచారం.

బుచాలో ప్రాణాలు కోల్పోయిన పౌరులను వలంటీర్లు శ్మశానానికి తీసుకొచ్చిన దృశ్యం 

యుద్ధంలో చిక్కుబడ్డ వారిని సురక్షితంగా తరలించేందుకు మారియుపోల్, బెర్డియాన్స్‌క్, తొక్‌మక్, సెవెరొ డొనెట్స్‌క్, లిసిచాన్స్‌క్, పొపస్న తదితర చోట్ల మంగళవారం మరో ఏడు మానవీయ కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్టు ఉక్రెయిన్‌ వెల్లడించింది. అంతులేని అకృత్యాలకు పాల్పడుతున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను యుద్ధ నేరాల ఆరోపణలపై విచారించాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ అన్నారు. ‘‘పుతిన్‌ కర్కోటకుడు. బుచాలో జరిగినవి క్షమించరాని ఘోరాలు’’ అంటూ దుయ్యబట్టారు. ఉక్రెయిన్‌లో నిర్వాసితుల సంఖ్య 1.2 కోట్లు దాటినట్టు ఐరాస పేర్కొంది. వీరిలో 45 లక్షల మంది దాకా దేశం వీడినట్టు అంచనా.  

దౌత్య సిబ్బంది బహిష్కరణ 
పలు దేశాలు తమ రష్యా రాయబార కార్యాలయంలోని సిబ్బందిని భారీ సంఖ్యలో బహిష్కరిస్తున్నాయి. ఉక్రెయిన్లో మందుపాతర్లు పెట్టొద్దని రష్యాకు ఐరాస విజ్ఞప్తి చేసింది. అవి పౌరుల ప్రాణాలను బలిగొంటాయని గుర్తుంచుకోవాలని మందుపాతరల ఉత్పత్తి, వాడకాన్ని నిషేధించేందుకు ఏర్పాటైన ఐరాస కన్వెన్షన్‌ ప్రెసిడెంట్‌ అలీసియా అరంగో ఒల్మోస్‌ అన్నారు. తాను విదేశాంగ మంత్రిగా ఉండగా రష్యాతో ఇంధన ఒప్పందాలు కుదుర్చుకోవడమే గాక ఆ దేశంతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుని పొరపాటు చేశానని జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్‌ వాల్టర్‌ స్టెయిన్‌మెయిర్‌ అభిప్రాయపడ్డారు.

యుద్ధ భయం, ఆకలిచావుకు బలైన తన తల్లి సమాధి వద్ద విషణ్ణవదనంతో ఆరేళ్ల పిల్లాడు వ్లాద్‌ తన్యుయ్‌. కీవ్‌ సమీపంలో తీసిందీ ఫొటో.  

గ్యాస్‌ సరఫరాకు నోర్డ్‌స్ట్రీమ్‌ 2 పైప్‌లైన్‌ నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకోకుండా ఉండాల్సిందన్నారు. తూర్పు యూరప్‌ దృష్టిలో జర్మనీ విశ్వసనీయతను ఇది బాగా తగ్గించిందని అంగీకరించారు. యూరోపియన్‌ యూనియన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిషన్‌ ప్రెసిడెంట్‌ ఉర్సులా వాండర్‌ లెయెన్‌ త్వరలో కీవ్‌లో జెలెన్‌స్కీతో భేటీ కానున్నారు. యుద్ధం వల్ల ఆసియాలో పలు దేశాల ఆర్థి్థక వ్యవస్థలు సుదీర్ఘకాలం పాటు నెమ్మదిస్తాయని ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక ఒకటి జోస్యం చెప్పింది. 

రష్యాపై మరిన్ని ఆంక్షలు 
బుచా హత్యాకాండ నేపథ్యంలో రష్యాపై ఆంక్షల విషయంలో దృఢంగా వ్యవహరించాలని ఈయూ సభ్య దేశాలన్నీ పట్టుదలతో ఉన్నాయి. రష్యాపై సంయుక్తంగా మరిన్ని ఆంక్షలు విధించనున్నట్టు ఫ్రాన్స్‌ ఆర్థిక మంత్రి బ్రూనో లీ మారీ వెల్లడించారు. వీటిలో భాగంగా రష్యా నుంచి బొగ్గు దిగుమతులను పూర్తిగా నిషేధించాలని యూరప్‌ భావిస్తోంది. రష్యా నుంచి యూరప్‌ ఏటా 400 కోట్ల యూరోల విలువైన బొగ్గు దిగుమతి చేసుకుంటోంది.

రష్యా నరమేధానికి బలై బుచాలో సొంతింట్లో నిర్జీవంగా పడి ఉన్న ఒక వృద్ధురాలు 

యుద్ధాన్ని ఆపేలా రష్యాపై ఒత్తిడి మరింత పెంచాల్సిన అవసరముందని యూరోపియన్‌ కమిషన్‌ ప్రెసిడెంట్‌ ఉర్సులా వాండర్‌ లెయెన్‌ అన్నారు. అయితే కీలకమైన గ్యాస్‌ దిగుమతులపై నిషేధం అంశాన్ని ఆమె ప్రస్తావించలేదు. రష్యా బ్యాంకింగ్‌ రంగంలో 23 శాతం వాటా ఉన్న మరో నాలుగు మేజర్‌ రష్యా బ్యాంకులపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు. ఐటీపరంగా రష్యాను బలహీనపరిచే మరిన్ని ఆంక్షలను కూడా ఈయూ ముందు ఆమె ప్రతిపాదించారు. 

రష్యా చమురు వద్దు: అమెరికా 
రష్యా నుంచి చమురు, ఇతర దిగుమతులను పెంచుకోవడం భారత ప్రయోజనాలకు మంచిది కాదని అమెరికా వ్యాఖ్యలు చేసింది. రష్యాపై ఆధారపడటం తగ్గించుకునే ప్రయత్నంలో భారత్‌కు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రెటరీ జెన్‌ సాకీ చెప్పారు. అమెరికా జాతీయ భద్రతా ఉప సలహాదారు దలీప్‌సింగ్‌ ఇటీవల ఇవే వ్యాఖ్యలు చేశారు. రష్యాపై ఇతర దేశాలతో కలిసి అమెరికా విధించిన ఆంక్షలకు అంతా కట్టుబడి ఉండాలన్నదే తమ ఉద్దేశమన్నారు. భారత్‌ తన చమురు అవసరాల్లో రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నది 1 శాతం కంటే తక్కువే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement