Russian military
-
లంచ్ బ్రేక్‌లో లవ్వు!
అసలే జననాల రేటు తగ్గుతోంది. అది చాలదన్నట్టుగా రెండున్నరేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధం రష్యా సైనికులను భారీగా బలి తీసుకుంటోంది. దీనికి తోడు నిర్బంధంగా సైన్యంలో చేరాల్సి వస్తుండటంతో యువకులు భారీ సంఖ్యలో దేశం వీడుతున్నారు. వెరసి రష్యాలో జనాభా శరవేగంగా తగ్గిపోతోంది. ఈ పరిణామం అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను తీవ్రంగా ఆందోళన పరుస్తోంది. దాంతో ఎలాగైనా జనాభాను ఇతోధికంగా పెంచి దేశసేవ చేయాలంటూ రష్యన్లకు ఆయన తాజాగా విజ్ఞప్తి చేశారు. అందుకోసం రోజూ పని మధ్యలో లంచ్, టీ విరామ సమయాల్లో కూడా వీలైనంతగా కిందా మీదా పడాల్సిందిగా సూచించారు! పుతిన్ ఇచి్చన ఈ గమ్మత్తైన పిలుపుపై నెటిజన్లు అంతే ఆసక్తికరమైన కామెంట్లు కూడా చేస్తున్నారు. లంచ్, కాఫీ బ్రేకులను సంతానోత్పత్తికి వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకోవాల్సిన అవసరం చాలా ఉందని రష్యా ఆరోగ్య మంత్రి యెవగనీ షెస్తోపలోవ్ కూడా పేర్కొనడం విశేషం. ఇది ఆచరణ సాధ్యమా అన్న ప్రశ్నలను ఆయన కొట్టిపారేశారు. ‘‘దయచేసి రోజంతా పనిలో బిజీగా ఉంటున్నామని చెప్పకండి. అది పసలేని సాకు మాత్రమే. సృష్టికార్యానికి ఆఫీసు పని అడ్డంకి కారాదు. లంచ్, కాఫీ బ్రేక్... ఇలా ప్రతి అవకాశాన్నీ సెక్స్ కోసం గరిష్టంగా ఉపయోగించుకోండి. లేదంటే కాలం ఎవరి కోసమూ ఆగదు. బేబీలను కనేందుకు బ్రేక్ టైంలో కష్టపడండి’’ అంటూ హితబోధ కూడా చేశారు.పడిపోతున్న ప్రజనన నిష్పత్తి ఏ దేశంలోనైనా జనసంఖ్య స్థిరంగా ఉండాలన్నా ప్రజనన నిష్పత్తి కనీసం 2.1గా ఉండాలి. రష్యాలో అది నానాటికీ తగ్గిపోతోంది. ప్రస్తుతం ప్రతి మహిళకూ కేవలం 1.4గా ఉంది. 2024 తొలి అర్ధ భాగంలో గత పాతికేళ్లలోనే అత్యంత తక్కువ జననాల రేటు నమోదైంది! ఇది దేశ భవిష్యత్తుకు మరణశాసనమేనంటూ క్రెమ్లిన్ హాహాకారాలు చేస్తోంది.తొలి కాన్పుకు రూ.9.4 లక్షలు! జననాల రేటును పెంచేందుకు రష్యా పలు చర్యలకు దిగింది. అబార్షన్, విడాకులు అత్యంత కష్టసాధ్యంగా మార్చేసింది. పిల్లల్ని కని పెంచడమే మహిళల ప్రధాన బాధ్యతంటూ ప్రముఖులు, మత పెద్దలతో చెప్పిస్తోంది. చెల్యాబిన్స్క్ ప్రావిన్స్ తొలి కాన్పుకు ఏకంగా రూ.9.4 లక్షలు ప్రకటించింది!– సాక్షి, నేషనల్ డెస్క్ -
Russia-Ukraine War: తూర్పు ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల వాన
కీవ్: ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్ ప్రాంతం లక్ష్యంగా రష్యా మిలటరీ బుధవారం రాత్రి ఎస్–300 దీర్ఘ శ్రేణి క్షిపణులతో విరుచుకుపడింది. ఆ ప్రాంతంలోని పొక్రోవ్స్్క, నోవోహ్రోడివ్కా, మిర్నోహ్రాడ్ నగరాలపై జరిగిన దాడుల్లో ఒకరు చనిపోగా పదుల కొద్దీ భవనాలు నేలమట్టమయ్యాయి. భవనాల శిథిలాల్లో కొందరు చిక్కుకుని ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది నెలలుగా భీకర పోరాటం కొనసాగుతున్న అవ్డివ్కా నగరానికి సమీపంలోనే పై మూడు నగరాలున్నాయి. బఖ్ముత్ చుట్టుపక్కల ప్రాంతం, కీలకమైన అవ్డివ్కాలపై పట్టుసాధించేందుకు రష్యా బలగాలు వరుస దాడులకు పాల్పడుతున్నట్లు ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. -
Russia-Ukraine War: అపార్టుమెంట్‌పై రష్యా మృత్యుపాశం
కీవ్: పశ్చిమ ఉక్రెయిన్‌లో చిన్నపట్టణమైన సెర్హివ్‌కాలో రష్యా సైన్యం మారణకాండ సృష్టించింది. శుక్రవారం తెల్లవారుజామునే క్షిపణులతో విరుచుకుపడింది. ఈ ఘటనలో ఓ అపార్టుమెంట్ ధ్వంసమయ్యింది. 19 మంది సాధారణ పౌరులు మరణించారని ఉక్రెయిన్ అధికార వర్గాలు తెలిపాయి. నల్లసముద్రంలోని స్నేక్ ఐలాండ్ నుంచి రష్యా సేనలు వెనక్కి మళ్లిన మరుసటి రోజే ఈ దాడులు జరగడం గమనార్హం. ఉక్రెయిన్‌లోని కీలకమైన రేవు నగరంఒడెసాకు 50 కిలోమీటర్ల దూరంలో సెర్హివ్కా ఉంది. అపార్టుమెంట్‌పై క్షిపణి దాడి దృశ్యాలు మీడియాలో కనిపించాయి. రష్యా బాంబర్లు ఎక్స్–22 మిస్సైళ్లను అపార్టుమెంట్‌తోపాటు రెండు క్యాంప్‌సైట్లపై ప్రయోగించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడి కార్యాలయం వెల్లడించింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నారని, 38 మంది గాయపడ్డారని సమాచారం. వారిలో ఆరుగురు బాలలు, ఒక గర్భిణి ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో చాలామంది అపార్టుమెంట్ వాసులే. లీసిచాన్‌స్క్‌లో భీకర దాడులు తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్బాస్ను ఆక్రమించడమే లక్ష్యంగా రష్యా సేనలు దాడులను ఉధృతం చేస్తున్నాయి. లీసిచాన్స్క్ నగర శివార్లలోని చమురు శుద్ధి కర్మాగారంపై రష్యా భీకర దాడులు చేస్తోంది. ఒక్కో ఇంటిని ధ్వంసం చేస్తోందని అధికారులన్నారు. ఆయిల్ రిఫైనరీ, జిలెటిన్ ఫ్యాక్టరీలను స్వాధీనం చేసుకుందన్నారు. వైమానిక దాడుల్లో ఖర్కీవ్‌లో నలుగురు, డోంటెస్క్‌లో మరో నలుగురు మరణించారని సమాచారం. -
War Moves East: ఇక తూర్పుపైకి
లివీవ్: తూర్పు ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద డోన్బాస్ ప్రాంతాలపై భారీ దాడికి రష్యా సిద్ధపడుతోందని ఉక్రెయిన్ ఆరోపించింది. ‘ఇందుకోసం సైన్యాన్ని భారీగా అక్కడికి పంపుతోంది. అక్కడి డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలను నియంత్రణలోకి తీసుకోవడమే దాని లక్ష్యం. అక్కడి పొపస్న, రుబిజిన్ నగరాలను ఆక్రమించేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అక్కడి ఇతర పట్టణాలు, ప్రాంతాలపై కాల్పులకు దిగింది’ అని చెప్పింది. డోన్బాస్‌పై దాడి నిమిత్తం ఇతర ప్రాంతాల నుంచి రష్యా దళాలు వెనక్కు వెళ్తున్న నేపథ్యంలో మరిన్ని పట్టణాలు, గ్రామాలను ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకుందని ఇంగ్లండ్ రక్షణ శాఖ పేర్కొంది. రాజధాని కీవ్‌తో పాటు చెర్నిహివ్ పరిసరాల్లోని పలు కీలక ప్రాంతాలు కూడా తిరిగి ఉక్రెయిన్ నియంత్రణలోకి వచ్చినట్టు చెప్పింది. రష్యా కాల్పులు మాత్రం భారీగా కొనసాగుతూనే ఉన్నాయి. మారియుపోల్ రేవులో దాడి ధాటికి ప్రయాణికుల నౌక మునిగిపోతున్నట్టు సమాచారం. బుచాలో ప్రాణాలు కోల్పోయిన పౌరులను వలంటీర్లు శ్మశానానికి తీసుకొచ్చిన దృశ్యం యుద్ధంలో చిక్కుబడ్డ వారిని సురక్షితంగా తరలించేందుకు మారియుపోల్, బెర్డియాన్స్క్, తొక్మక్, సెవెరొ డొనెట్స్క్, లిసిచాన్స్క్, పొపస్న తదితర చోట్ల మంగళవారం మరో ఏడు మానవీయ కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్టు ఉక్రెయిన్ వెల్లడించింది. అంతులేని అకృత్యాలకు పాల్పడుతున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను యుద్ధ నేరాల ఆరోపణలపై విచారించాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అన్నారు. ‘‘పుతిన్ కర్కోటకుడు. బుచాలో జరిగినవి క్షమించరాని ఘోరాలు’’ అంటూ దుయ్యబట్టారు. ఉక్రెయిన్‌లో నిర్వాసితుల సంఖ్య 1.2 కోట్లు దాటినట్టు ఐరాస పేర్కొంది. వీరిలో 45 లక్షల మంది దాకా దేశం వీడినట్టు అంచనా. దౌత్య సిబ్బంది బహిష్కరణ పలు దేశాలు తమ రష్యా రాయబార కార్యాలయంలోని సిబ్బందిని భారీ సంఖ్యలో బహిష్కరిస్తున్నాయి. ఉక్రెయిన్‌లో మందుపాతర్లు పెట్టొద్దని రష్యాకు ఐరాస విజ్ఞప్తి చేసింది. అవి పౌరుల ప్రాణాలను బలిగొంటాయని గుర్తుంచుకోవాలని మందుపాతరల ఉత్పత్తి, వాడకాన్ని నిషేధించేందుకు ఏర్పాటైన ఐరాస కన్వెన్షన్ ప్రెసిడెంట్ అలీసియా అరంగో ఒల్మోస్ అన్నారు. తాను విదేశాంగ మంత్రిగా ఉండగా రష్యాతో ఇంధన ఒప్పందాలు కుదుర్చుకోవడమే గాక ఆ దేశంతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుని పొరపాటు చేశానని జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్‌మెయిర్ అభిప్రాయపడ్డారు. యుద్ధ భయం, ఆకలిచావుకు బలైన తన తల్లి సమాధి వద్ద విషణ్ణవదనంతో ఆరేళ్ల పిల్లాడు వ్లాద్ తన్యుయ్. కీవ్ సమీపంలో తీసిందీ ఫొటో. గ్యాస్ సరఫరాకు నోర్డ్‌స్ట్రీమ్ 2 పైప్‌లైన్ నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకోకుండా ఉండాల్సిందన్నారు. తూర్పు యూరప్ దృష్టిలో జర్మనీ విశ్వసనీయతను ఇది బాగా తగ్గించిందని అంగీకరించారు. యూరోపియన్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లెయెన్ త్వరలో కీవ్‌లో జెలెన్స్కీతో భేటీ కానున్నారు. యుద్ధం వల్ల ఆసియాలో పలు దేశాల ఆర్థి్థక వ్యవస్థలు సుదీర్ఘకాలం పాటు నెమ్మదిస్తాయని ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక ఒకటి జోస్యం చెప్పింది. రష్యాపై మరిన్ని ఆంక్షలు బుచా హత్యాకాండ నేపథ్యంలో రష్యాపై ఆంక్షల విషయంలో దృఢంగా వ్యవహరించాలని ఈయూ సభ్య దేశాలన్నీ పట్టుదలతో ఉన్నాయి. రష్యాపై సంయుక్తంగా మరిన్ని ఆంక్షలు విధించనున్నట్టు ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి బ్రూనో లీ మారీ వెల్లడించారు. వీటిలో భాగంగా రష్యా నుంచి బొగ్గు దిగుమతులను పూర్తిగా నిషేధించాలని యూరప్ భావిస్తోంది. రష్యా నుంచి యూరప్ ఏటా 400 కోట్ల యూరోల విలువైన బొగ్గు దిగుమతి చేసుకుంటోంది. రష్యా నరమేధానికి బలై బుచాలో సొంతింట్లో నిర్జీవంగా పడి ఉన్న ఒక వృద్ధురాలు యుద్ధాన్ని ఆపేలా రష్యాపై ఒత్తిడి మరింత పెంచాల్సిన అవసరముందని యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లెయెన్ అన్నారు. అయితే కీలకమైన గ్యాస్ దిగుమతులపై నిషేధం అంశాన్ని ఆమె ప్రస్తావించలేదు. రష్యా బ్యాంకింగ్ రంగంలో 23 శాతం వాటా ఉన్న మరో నాలుగు మేజర్ రష్యా బ్యాంకులపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు. ఐటీపరంగా రష్యాను బలహీనపరిచే మరిన్ని ఆంక్షలను కూడా ఈయూ ముందు ఆమె ప్రతిపాదించారు. రష్యా చమురు వద్దు: అమెరికా రష్యా నుంచి చమురు, ఇతర దిగుమతులను పెంచుకోవడం భారత ప్రయోజనాలకు మంచిది కాదని అమెరికా వ్యాఖ్యలు చేసింది. రష్యాపై ఆధారపడటం తగ్గించుకునే ప్రయత్నంలో భారత్‌కు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకీ చెప్పారు. అమెరికా జాతీయ భద్రతా ఉప సలహాదారు దలీప్‌సింగ్ ఇటీవల ఇవే వ్యాఖ్యలు చేశారు. రష్యాపై ఇతర దేశాలతో కలిసి అమెరికా విధించిన ఆంక్షలకు అంతా కట్టుబడి ఉండాలన్నదే తమ ఉద్దేశమన్నారు. భారత్ తన చమురు అవసరాల్లో రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నది 1 శాతం కంటే తక్కువే. -
Russia-Ukraine war: ట్యాంకుతో సహా లొంగిపోయాడు
ఉక్రెయిన్‌లో రష్యా సైనికుడొకరు ఆ దేశానికి లొంగిపోయాడు. తన అధీనంలోని అత్యాధునిక టి–72బి3 యుద్ధ ట్యాంకును కూడా ఉక్రెయిన్పరం చేశాడు. బదులుగా 7,500 పౌండ్ల రివార్డుతో పాటు ఉక్రెయిన్ పౌరసత్వం పొందనున్నాడు. తాము చేస్తున్నది అర్థం లేని యుద్ధమని మిషా అనే ఆ సైనికుడు అన్నట్టు ఉక్రెయిన్ మంత్రి విక్టర్ ఆండ్రుసివ్ చెప్పారు. రష్యా సైనికులు వాడుతున్న ఫోన్లను గుర్తించిన ఉక్రెయిన్, ఎలా లొంగిపోవాలో వివరిస్తూ కొంతకాలంగా వాటికి ఎస్ఎంఎస్లు పంపుతూ వస్తోంది. అది ఈ విధంగా వర్కౌటవుతోంది. ‘‘మిషా కొద్ది రోజులుగా ఉక్రెయిన్ పోలీసులను ఫోన్లో సంప్రదించి లొంగిపోయాడు. రష్యా సైనికులకు తినడానికి తిండి కూడా లేదని అతను చెప్పుకొచ్చాడు. సేనలు నైతికంగా చాలా దెబ్బ తిని ఉన్నాయన్నాడు. ప్రస్తుతానికి మిషాను యుద్ధ ఖైదీగానే చూసినా సకల సౌకర్యాలూ కల్పిస్తాం’’ అని విక్టర్ చెప్పుకొచ్చారు. రష్యా యుద్ధ విమానాన్ని స్వాధీనం చేసుకునే వారికి 10 లక్షల డాలర్లు, హెలికాప్టర్‌కు 5 లక్షల డాలర్లు ఇస్తామని కూడా ఉక్రెయిన్ ప్రకటించింది! ఈ ఆఫర్ రష్యా పైలట్లకు కూడా వర్తిస్తుందని చెప్పింది!! -
రష్యాతో సైనిక సహకారం కట్
ఉక్రెయిన్‌పై సైనిక జోక్యానికి నిరసనగా అమెరికా ప్రతిచర్య ఉక్రెయిన్‌కు రూ. 6 వేల కోట్ల ఇంధ న రాయితీ ప్యాకేజీ కీవ్ చేరుకున్న అమెరికా మంత్రి ఉక్రెయిన్ సరిహద్దులోని సైన్యాన్ని వెనక్కి పిలిచిన రష్యా వాషింగ్టన్/మాస్కో: ఉక్రెయిన్ సంక్షోభం అంతర్జాతీయ సమస్యగా మారింది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక జోక్యానికి నిరసనగా అమెరికా రష్యాతో సైనిక సహకారాన్ని నిలిపివేసింది. సైనిక విన్యాసాలు, భేటీలు, పర్యటనలను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. ఉక్రెయిన్‌కు వంద కోట్ల డాలర్ల(రూ. 6 వేల కోట్లు)ఇంధన రాయితీని కూడా ప్రకటించింది. తాజా పరిస్థితిపై ఉక్రెయిన్ నేతలతో చ ర్చించేందుకు అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ మంగళవారం కీవ్ చేరుకున్నారు. మరోపక్క.. ఉక్రెయిన్ సరిహద్దులో కవాతు చేస్తున్న తమ 1.50 లక్షల మంది సైనికులను తిరిగి స్థావరాలకు చేరుకోవాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించా రు. అయితే ఉక్రెయిన్‌లోని రష్యన్ జాతీయులను కాపాడుకోవడానికి సైన్యాన్ని వాడే హక్కు తమకున్నదని, కానీ ఆ అవసరం రాకూడదని ఆశిస్తున్నానన్నారు. పరారీలో ఉన్న యానుకోవిచే ఆ దేశానికి నిజమైన అధ్యక్షుడని పునరుద్ఘాటించారు. పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌లో రాజ్యాంగ విరుద్ధ తిరుగుబాటుకు ఊతమిస్తూ, ఆ దేశాన్ని అరాచకం దిశగా తీసుకెళ్తున్నాయని దుయ్యబట్టారు. తమపై పాశ్చాత్య దేశాలు ఆర్థిక ఆంక్షలు విధిస్తే అవి వాటికే బెడిసికొడతాయన్నారు. రష్యాది చారిత్రక తప్పిదం: ఒబామా ఉక్రెయిన్‌పైకి రష్యా దండెత్తి చారిత్రక తప్పిదం చేస్తోందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆరోపించారు. వెంటనే వెనక్కి తగ్గకపోతే రష్యాను శిక్షించేందుకు దౌత్య, ఆర్థిక చర్యలు చేపట్టే అవకాశాలను పరిశీలిస్తున్నానన్నారు. ఉక్రెయిన్ల భవితను వారే నిర్ణయించుకోవాలన్నది తమ అభిమతమన్నారు. ఉక్రెయిన్‌కు ఇంధన దిగుమతుల భారాన్ని తగ్గించేందుకు వందకోట్ల డాల్లర్ల రాయితీ ప్యాకేజీకి ఆయన ఆమోదం తెలిపారు. దీంతోపాటు ఆర్థిక, ఎన్నికల సంస్థలకు శిక్షణలో సాయం చేయనున్నట్లు వైట్‌హౌస్ తెలిపింది. క్రిమియాలో ఉద్రిక్తత ఉక్రెయిన్‌లోని స్వయంప్రతిపత్తి ప్రాంతమైన క్రిమియాలోని రష్యా అనుకూల సైనికులు మంగళవారం బెల్బెక్ వైమానిక స్థావరాన్ని స్వాధీనం చేసుకున్నారు. తమ ఉద్యోగాలు తమికివ్వాలని అక్కడ పనిచేసిన 300 మంది ఉక్రెయిన్ సైనికులు డిమాండ్ చేస్తూ ముందుకురాగా హెచ్చరికగా రష్యా జవాన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. క్రిమియాలోని సెవస్తపోల్ రేవులో రెండు ఉక్రె యిన్ యుద్ధనౌకలను రష్యా నౌకలు దిగ్బంధించాయి. యానుకోవిచ్ కోరితేనే పంపాం: రష్యా క్రిమియాలో 16 వేల మంది రష్యా సైనికులు ఉన్నారని ఉక్రెయిన్ ప్రతినిధి ఐక్యరాజ్య సమితికి చెప్పగా, శాంతిభద్రతల కోసం వారిని అక్కడికి పంపాలని యానుకోవిచ్ పుతిన్‌ను కోరడంతోనే మోహరించామని రష్యా చెప్పింది. అయితే పరారీ ఉన్న యానుకోవిచ్‌కు విదేశీ సాయం కోరే అధికారం లేదని ఉక్రెయిన్ ప్రతినిధి అన్నారు. సంక్షోభాన్ని నివారించకపోతే రష్యాపై దౌత్య, ఆర్థిక ఆంక్షలు విధిస్తామని, జీ-8 నుంచి తప్పిస్తామని యూరోపియన్ యూనియన్, కెనడా తదితర దేశాలు హెచ్చరించాయి. ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా యూరో విలువ డాలర్‌తో పోలిస్తే 1.38 నుంచి 1.37కు పడిపోయింది. ‘మిజో విద్యార్థులకు భద్రత కల్పించండి’ ఉక్రెయిన్‌లో చిక్కుకున్న దాదాపు 40 మంది మిజో విద్యార్థుల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని మిజోరం ముఖ్యమంత్రి లాల్ తన్హవ్లా భారత విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రి వయలార్ రవిలకు లేఖ రాశారు.