జనాభాను బాగా పెంచండి
రష్యన్లకు పుతిన్ పిలుపు
నానాటికీ తగ్గుతున్న జనాభా
అసలే జననాల రేటు తగ్గుతోంది. అది చాలదన్నట్టుగా రెండున్నరేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధం రష్యా సైనికులను భారీగా బలి తీసుకుంటోంది. దీనికి తోడు నిర్బంధంగా సైన్యంలో చేరాల్సి వస్తుండటంతో యువకులు భారీ సంఖ్యలో దేశం వీడుతున్నారు. వెరసి రష్యాలో జనాభా శరవేగంగా తగ్గిపోతోంది. ఈ పరిణామం అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను తీవ్రంగా ఆందోళన పరుస్తోంది.
దాంతో ఎలాగైనా జనాభాను ఇతోధికంగా పెంచి దేశసేవ చేయాలంటూ రష్యన్లకు ఆయన తాజాగా విజ్ఞప్తి చేశారు. అందుకోసం రోజూ పని మధ్యలో లంచ్, టీ విరామ సమయాల్లో కూడా వీలైనంతగా కిందా మీదా పడాల్సిందిగా సూచించారు! పుతిన్ ఇచి్చన ఈ గమ్మత్తైన పిలుపుపై నెటిజన్లు అంతే ఆసక్తికరమైన కామెంట్లు కూడా చేస్తున్నారు.
లంచ్, కాఫీ బ్రేకులను సంతానోత్పత్తికి వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకోవాల్సిన అవసరం చాలా ఉందని రష్యా ఆరోగ్య మంత్రి యెవగనీ షెస్తోపలోవ్ కూడా పేర్కొనడం విశేషం. ఇది ఆచరణ సాధ్యమా అన్న ప్రశ్నలను ఆయన కొట్టిపారేశారు. ‘‘దయచేసి రోజంతా పనిలో బిజీగా ఉంటున్నామని చెప్పకండి. అది పసలేని సాకు మాత్రమే. సృష్టికార్యానికి ఆఫీసు పని అడ్డంకి కారాదు. లంచ్, కాఫీ బ్రేక్... ఇలా ప్రతి అవకాశాన్నీ సెక్స్ కోసం గరిష్టంగా ఉపయోగించుకోండి. లేదంటే కాలం ఎవరి కోసమూ ఆగదు. బేబీలను కనేందుకు బ్రేక్ టైంలో కష్టపడండి’’ అంటూ హితబోధ కూడా చేశారు.
పడిపోతున్న ప్రజనన నిష్పత్తి
ఏ దేశంలోనైనా జనసంఖ్య స్థిరంగా ఉండాలన్నా ప్రజనన నిష్పత్తి కనీసం 2.1గా ఉండాలి. రష్యాలో అది నానాటికీ తగ్గిపోతోంది. ప్రస్తుతం ప్రతి మహిళకూ కేవలం 1.4గా ఉంది. 2024 తొలి అర్ధ భాగంలో గత పాతికేళ్లలోనే అత్యంత తక్కువ జననాల రేటు నమోదైంది! ఇది దేశ భవిష్యత్తుకు మరణశాసనమేనంటూ క్రెమ్లిన్ హాహాకారాలు చేస్తోంది.
తొలి కాన్పుకు రూ.9.4 లక్షలు!
జననాల రేటును పెంచేందుకు రష్యా పలు చర్యలకు దిగింది. అబార్షన్, విడాకులు అత్యంత కష్టసాధ్యంగా మార్చేసింది. పిల్లల్ని కని పెంచడమే మహిళల ప్రధాన బాధ్యతంటూ ప్రముఖులు, మత పెద్దలతో చెప్పిస్తోంది. చెల్యాబిన్‌స్క్ ప్రావిన్స్ తొలి కాన్పుకు ఏకంగా రూ.9.4 లక్షలు ప్రకటించింది!
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment