సాక్షి, గుంటూరు: నగరంలోని ఈస్ట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో వర్గపోరు బయటపడింది. ఆర్టీసీ కాలనీలో లోకేష్ పుట్టినరోజు వేడుకలకు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ హాజరు కాగా, తనకు చెప్పకుండా మా డివిజన్‌లోకి ఎలా వస్తారంటూ ఎమ్మెల్యేను డివిజన్ పార్టీ అధ్యక్షుడు యాసిన్ అడ్డుకున్నారు.
ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌కు యాసిన్ వర్గీయులు వార్నింగ్ ఇవ్వడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌పై యాసీన్ వర్గీయులు దాడికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
తంబళ్లపల్లె టీడీపీలో..
కాగా, తంబళ్లపల్లె టీడీపీలో ఇప్పటికే వర్గపోరు నడుస్తుండగా.. లోకేష్ బర్త్‌డేతో అది రచ్చకెక్కింది. డిప్యూటీ సీఎం, సీఎం అంటూ లోకేష్‌పై సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకున్న వేళ ఈ ఘటన మరింత చర్చనీయాంశంగా మారింది. మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్బంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆ పార్టీలో రెండు వర్గాల మధ్య చిచ్చును మరింత రాజేశాయి. ఈ క్రమంలో నారా లోకేష్ సహా ఇతర మంత్రులు ఉన్న ఫ్లెక్సీలను చించిపాడేసింది మరో వర్గం. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తతలు చోటుచేసుకోగా.. కేసు నమోదైంది.
తంబళ్లపల్లె టీడీపీలో మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్సెస్ ఇంఛార్జి దాసరిపల్లి జై చంద్రారెడ్డి వర్గాల మధ్య చాలాకాలంగా వర్గపోరు నడుస్తోంది. నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని ఆకర్షించే ఉద్దేశంతో పోటాపోటీగా ఫ్లెక్సీలు వెలిశాయి. బుధవారం రాత్రి శంకర్ వర్గీయులు పట్టణంలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. శంకర్ ప్రధాన అనుచరుడు, మండల బీసీ సెల్ అధ్యక్షుడు పురుషోత్తం బాబు ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అదే సమయంలో.. ఇంఛార్జి జైచంద్రారెడ్డి విడిగా తన అనుచరులతో లోకేష్ పుట్టినరోజు కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు.
అందులో శంకర్‌కు చోటు లేకుండా చూసుకున్నారు కూడా!. అయితే రాత్రికి రాత్రే కేవలం శంకర్ వర్గం ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలను ఎవరో చించేశారు. చంద్రారెడ్డి ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలు మాత్రం అలాగే ఉన్నాయి. దీంతో ఇది చంద్రారెడ్డి వర్గీయుల పనిగా పురుషోత్తం అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment