రెంటికీ చెడ్డ రేవడి
రెంటికీ చెడ్డ రేవడి
Published Sat, Jan 21 2017 11:42 PM | Last Updated on Tue, Sep 5 2017 1:46 AM
(లక్కింశెట్టి శ్రీనివాసరావు)
ఆయనొకప్పుడు జిల్లాలో ఇప్పుడున్న అధికార పార్టీని తన చెప్పు చేతల్లో పెట్టుకున్న నాయకుడు. తెరవెనక మంత్రాంగం నడపడంలో దిట్ట. ఆర్థికంగా స్థితిమంతుడు, పార్టీ అధినేత నుంచి దండిగా భరోసా ఉన్న నాయకుడాయన. ఆయన ఏమి చెబితే అది చేసే అధినేత. ఆయన మాటకు తిరుగులేకుండాపోయేది. అటు మెట్ట, ఇటు కోనసీమలో దాదాపు పార్టీ నేతలు వ్యూహ, ప్రతివ్యూహాలు ఆయన కనుసన్నల్లోనే జరిగేవి. అటువంటి నాయకుడు పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడి సామెత మాదిరిగా తయారైంది. రాజకీయాల్లో మూడు దశాబ్థాల చరిత్ర కలిగిన ఆ నాయకుడు రాజకీయాల్లో ‘బొడ్డు’ఊడని నేతల ముందు నిలవలేకపోతున్నారు.
రచ్చ గెలిచి ఇంట గెలవలేక...
ఎక్కడైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ ఆ నాయకుడు రచ్చ గెలిచి (పరోక్ష పద్ధతిలో ఎన్నికయ్యారు) ఇంట గెలవలేక నానా పాట్లుపడుతున్నారు. అలాగని రచ్చ గెలిచిన చోటైనా పార్టీలో తన మాట చెల్లుబాటవుతుందా అంటే అదీ లేదు. అతనేమైనా ప్రతిపక్ష పార్టీలో ఉన్నారా అంటే అదీ లేదు. తాను ఉన్న పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్ష పాత్ర పోషించే పరిస్థితి ఏర్పడింది.గల్లీ స్థాయి రాజకీయ నాయకుడైనా పార్టీ అధికారంలో ఉంటే అతని మాటకు తిరుగే ఉండదు. అటువంటిది పార్టీ అధికారంలో ఉంది. రాజకీయంగా మూడు దశాబ్దాల అనభవం ఉంది. పోనీ ఆర్థికంగా ఏమైనా సామాన్యుడా అంటే జిల్లాలో టాప్10లో ఒకరిగా ఉన్నారు. ఇన్ని ఉన్నా అతని మాట అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో వినే నాథుడే లేకుండా పోయాడు.
పింఛను కూడా ఇప్పించుకోలేని దీనస్థితి...
సొంత నియోజకవర్గం ఒకటి. ఒకప్పుడు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఒకటి. ఈ రెండు నియోజకవర్గాలను తన గుప్పెట్లో పెట్టుకుని పార్టీ రాజకీయాలను శాసించిన నాయకుడాయన. అటువంటి నాయకుడు అర్హత ఉన్నప్పటికీ కనీసం పింఛను కూడా ఇప్పించుకోలేకపోవడంతో అతనిలో చేవతగ్గిపోయిందా అంటున్నారు ఆయన వెనుకనుండే అనుచరులు. పింఛన్ మాటేమిటి తాను పుట్టిపెరిగిన మండలంలో తన భార్యకు దేవస్థానం చైర్మన్ కూడా ఇప్పించుకోలేకపోయారు. ఆ నాయకుడిని నమ్మి వెంట ఉన్న ఒక మహిళా ప్రజాప్రతినిధికి అవమానం జరిగితే ఏదో తన ప్రయత్నంగా ఆందోళనకు వచ్చారు తప్పించి ఏమీ చేయలేక చేతులేత్తేశారు, ఈ విషయాలన్నిటిపైనా అధినేత ముందు పెట్టి తాడోపేడో తేల్చుకుంటానని గట్టిగానే హెచ్చరించారు.
ఈ నాయకుడితో రాజకీయ వైరం ఉన్న నాయకుడు పెద్ద రాజకీయ దురంధరుడు కూడా కాదు. తొలిసారి ప్రజలు పట్టంకట్టగా రెడ్డి రాజ్యాన్ని ఏలుతున్న నేత. తండ్రి ద్వారా సంక్రమించిన రాజకీయ వారసత్వంతో చెలరేగిపోతున్నా సీనియర్ నాయకుడైనా కట్టడి చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నా ఫలితం లేక కారాలు, మిరియాలు నూరుతున్నారు. పార్టీపై కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహాన్ని బయట పెట్టలేని పరిస్థితి. ఈ పరిస్థితులన్నీ గమనించి వచ్చే ఎన్నికల్లో తనకు రాజకీయంగా అండదండలందించిన నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే అనుకుంటున్నారు. కానీ అక్కడేమో స్థానికేతరుడైనా ప్రభుత్వంలో కీలకమైన ప్రజాప్రతినిధిగా ఉన్న కోనసీమ నేత తిష్టవేసే పనిలో ఉన్నారు. ఇటీవలనే ఆయన తిరిగి అక్కడి నుంచే పోటీ చేస్తానని కూడా చెప్పారని ఈ నాయకుడి చెవిన పడింది. అప్పటి నుంచి ఏటూ పాలుపోవడం లేదట. అనుకున్నట్టు అనుకూలించకపోతే ఏ ఊరులో ఎవరినైనా పేరుపెట్టి పిలిచే చనువు, అనుబంధం ఉంటడంతో స్వతంత్ర పోరుకైనా సిద్ధపడాలనే ఆలోచనలో ఉన్నారట. అందుకు ఇంకా రెండేళ్లు ఆగాలి కదా..అప్పుడు చూద్దాం ఏమి జరుగుతుందో.
Advertisement
Advertisement