హక్కుపై ఉక్కుపాదం
హక్కుపై ఉక్కుపాదం
Published Fri, Jan 27 2017 12:32 AM | Last Updated on Tue, Sep 5 2017 2:11 AM
అడుగడుగునా అరెస్టులు
కొవ్వొత్తి కనిపిస్తే చాలు రెచ్చిపోయిన పోలీసులు
గృహ నిర్బంధాలతో కట్టడి
అయినా ఆగని హోదా కేక
ఆగదు ఈ ఉద్యమ హోరు
నినదించిన వైఎస్సార్‌సీపీ ... గొంతుకలిపిన ఉద్యమకారులు
జేఎన్‌టీయూ విద్యార్థులనూ వదలలేదు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ప్రత్యేక హోదా కోసం నినదించిన ప్రజల గొంతుకను రాష్ట్ర ప్రభుత్వం నొక్కేసింది. కొవ్వొత్తులు వెలిగించడమే మహాపాపం అన్నట్టుగా పోలీసులు వాటిని ఆర్పేసి ర్యాలీలను అడ్డుకున్నారు. పోలీసుల నిర్బంధం ఉన్నా లెక్కచేయకుండా చాలా ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు విద్యార్థులు, యువత కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.కాకినాడ జేఎన్‌టీయూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించగా పోలీసులు ప్రధాన ద్వారం వద్ద మోహరించి వారిని చెదరగొట్టేశారు. యువకులు వాకలపూడి బీచ్‌లో అర్ధనగ్న ప్రదర్శనకు బయలుదేరుతుండగా గొడారిగుంట వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ మోహన్‌రెడ్డి పిలుపుతో జిల్లాలో పార్టీ శ్రేణులు గురువారం కాకినాడలో నిర్వహించే కొవ్వొత్తుల ప్రదర్శనకు బయలుదేరతారని తెలిసి ముందస్తుగానే ఎక్కడికక్కడ అవుట్ పోస్టులు ఏర్పాటుచేసి పోలీసులు అడ్డుకున్నారు. ఉదయం నుంచే పార్టీ నాయకులకు ఫోన్లు చేసి ఇళ్లకు వెళ్లి మరీ గృహ నిర్బంధాలు చేశారు. జిల్లా అంతటా ఎక్కడికక్కడ నేతలను గృహ నిర్బంధాలు చేసి హోదా కోసం ఉద్యమించిన నేతలను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌లకు తరలించారు.
విశాఖకు వెళ్తుండగా...
విశాఖపట్నంలో జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొనాల్సిన కొవ్వొత్తుల ప్రదర్శనకని బయలుదేరిన తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను అరెస్టు చేసి విశాఖ జిల్లా పాయకరావుపేట, నక్కపల్లి, కోటఉరట్ల పోలీసు స్టేషన్‌లకు తిప్పించి చివరగా నర్సీపట్నం ఏజెన్సీలోని గొలుగొండ పోలీసు స్టేష¯ŒSలో రాత్రి వరకు నిర్బంధించారు. జిల్లా కేంద్రం కాకినాడలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరాగా కలిసి కొవ్వొత్తుల ర్యాలీ కోసం భారీ ర్యాలీగా బయలుదేరగా పోలీసులు అడ్డుకుని వ్యాన్లలో పోలీసు స్టేషన్‌కు తరలించారు. నాగమల్లి తోట జంక్షన్‌లో స్వయంగా కాకినాడ డీఎస్పీ వెంకటేశ్వరరావు నేతల వద్ద వెలుగుతున్న కొవ్వొత్తులు ఆర్పేయగా, కన్నబాబు కాగడా ప్రదర్శించడంతో మరోసారి పోలీసులు ఆయన చేతిలో కాగడాను లాగేసే ప్రయత్నం చేస్తూ వ్యాన్లలో ఎక్కించేశారు. కన్నబాబు, పార్టీ కాకినాడ పార్లమెంటు కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్, కో ఆర్డినేటర్లు పెండెం దొరబాబు, తోట నాయుడు, ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ తదితరులను ఈడ్చుకుంటూ పోలీసు వాహనంలో ఎక్కించి త్రీటౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించి పోలీసు స్టేషన్ వద్ద నేతలు, కార్యకర్తలు కొవ్వొత్తులు ప్రదర్శించారు. అరెస్టు చేసిన నేతలను విడుదల చేయాలని పోలీసు స్టేషన్ ఎదుట నేతలు, కార్యకర్తలు ధర్నా చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రాజమహేంద్రవరం నగరపాలకసంస్థ ఫ్లోర్ లీడర్ షర్మిలారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎం.మోహన్ తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. అమలాపురం, రాజమహేంద్రవరం నుంచి వస్తున్న పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి తదితరులను కాకినాడ వైఎస్సార్ వార«ధి వద్ద పోలీసులు బలంవతంగా అదుపులోకి తీసుకుని మూడో పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
రాజమహేంద్రవరంలో...
రాజమహేంద్రవరం సిటీలో పార్టీ రాష్ట్ర యువజ న విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా విశాఖ పట్నం బయలు దేరుతుండగా పోలీసులు గృహనిర్బంధ చేశారు. ప్రకాష్‌నగర్‌లో మాజీ ఎమ్మె ల్సీ కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం రూర ల్ కోఆర్డినేటర్ గిరజాల బాబు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కడియం దేవీ చౌక్ సెంటర్‌లో సీఎం దిష్టిబొమ్మను దహనం చేయగా పోలీస్‌లు ఆయనతోపాటు పార్టీ కార్యకర్తలను అరెస్టు చేసి కడియం స్టేషన్‌కు తరలించారు. రాజవోలులో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నక్కా రాజబాబును అరెస్టు చేశారు. కాకినాడలో కొవ్వొత్తుల ప్రదర్శనకు వెళ్తున్న రాజమహేంద్రవరం సిటీ కో–ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని, యువజన విభాగం కార్యదర్శి పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి, కార్యదర్శి గుర్రం గౌతమ్, మాజీ ఫ్లోర్‌లీడర్ పోలు విజయలక్షి్మని రాజానగరంలో అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
∙మండపేట బస్టాండ్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్న కో–ఆర్డినేటర్ లీలాకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలను బస్టాండ్ వద్ద పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కో–ఆర్డినేటర్ వేగుళ్ళ పట్టాభిరామయ్యచౌదరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొవ్వొత్తుల ర్యాలీని పోలీసులు భగ్నం చేశారు. పట్టాభి, రైతు రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాధరెడ్డిని అరెస్టు చేశారు. గోకవరంలో ఇంటివద్ద జగ్గంపేట కో–ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్, శంఖవరంలో కోఆర్డినేటర్ పర్వత ప్రసాద్‌లను గృహనిర్బంధించారు. అనపర్తిలో కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డిలను అరెస్టు చేశారు. నగరంలో పి.గన్నవరం కో–ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబును గృహ నిర్బంధంచేయగా, మామిడికుదురు బస్టాండ్ కూడలిలో 216వ నెంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తోన్న కో–ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావును అడ్డుకుని అరెస్టు చేసి నగరం పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిద్దరూ కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రాజానగరం నియోజకవర్గం సీతానగరం నుంచి కాకికాడకు బయలుదేరుతున్న పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా పోలీసు స్టేషన్‌కు తరలించేశారు. కొత్తపేటలో పార్టీ సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రామచంద్రపురంలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ తనయుడు సూర్యప్రకాష్, బీసీ సెల్ నాయకుడు వాసంశెట్టి శ్యామ్ తదితరులను ముందస్తు అరెస్టులు చేసినా స్టేషన్‌లో కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు.
Advertisement