సీబీఎస్‌ఈ పేరుతో బురిడీ
సీబీఎస్‌ఈ పేరుతో బురిడీ
Published Thu, Jun 8 2017 11:13 PM | Last Updated on Tue, Sep 5 2017 1:07 PM
-లేని గుర్తింపు ఉందంటూ కొన్ని విద్యాసంస్థల వంచన
-పుస్తకాలు, బోధన అదే అయినా..స్టేట్ సిలబస్‌తోనే మార్కులు
-చివరిలో విషయం తెలిసి హతాశులవుతున్న తల్లిదండ్రులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : తిరుమలరావు తన కుమారుడు యశ్వంత్‌ను మంచి విద్యను అందించాలని ఒక ప్రముఖ కార్పొరేట్ స్కూలులో సీబీఎస్‌ఈ సిలబస్‌లో చేర్పించాడు. అయితే ఎనిమిదో తరగతి చదువుతున్న కుమారుడిని ఏవో కారణాలతో స్కూలు మార్చాలని టీసీ, మార్కుల లిస్టు తీసుకుని మరొక స్కూలుకు వెళ్లి సీబీఎస్‌ఈ సిలబస్‌లో చేర్చబోయాడు. అయితే ఆ స్కూలు వారు ‘మీ అబ్బాయి చదివింది సీబీఎస్‌ఈ సిలబస్ కాదు. స్టేట్‌బోర్డు సిలబసే. మేము అందులోనే చేర్పించుకుంటాం’ అంటే ‘అదేమి’టంటూ మండిపడ్డాడు. అయితే ఆ స్కూలు నిర్వాహకులు ముందు స్కూలులో జరిగిన మోసాన్ని విప్పి చెప్పి, మార్కుల లిస్టులో స్టేట్‌బోర్డు సిలబస్ అని రాసి ఉండడాన్ని చూపడంతో హతాశుడయ్యాడు. ఇన్నాళ్లూ సీబీఎస్‌ఈ సిలబస్ చదువుతున్నాడనుకున్నానని, ఇంత మోసమా అని వాపోయాడు. ఈ అనుభవం ఒక్క తిరుమలరావుకే కాదు.. జిల్లాలో కొన్ని వందలమంది తల్లిండ్రులు, విద్యార్థులకు ఎదురవుతున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల మోసం.
తల్లిదండ్రుల ఆసక్తిని ఆసరాగా తీసుకుని..
జిల్లాలో మొత్తం 1500 ప్రైవేట్, కార్పోరేట్ విద్యాసంస్థలున్నాయి. వాటిలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించేవి 900, ఆరు నుంచి పదో తరగతి వరకు బోధించేది 600 ఉన్నాయి. వీటిలో మొత్తం నాలుగు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రస్తుతం తల్లిదండ్రుల్లో ఎక్కువమంది సీబీఎస్‌ఈ, ఐసీసీఎస్ సిలబస్‌లకే మొగ్గు చూపుతున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలు తల్లిదండ్రులు, విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. తమ స్కూలులో సీబీఎస్‌ఈ సిలబస్ ఉందంటూ, పుస్తకాలు, స్కూలు ఫీజులకు వేల రూపాయలు గుంజుతున్నాయి. అలాంటి స్కూళ్లలో విద్యార్థికి ఇచ్చేది సీబీఎస్‌ఈ పుస్తకాలే, చెప్పేది అదే కోర్సు, కాని పరీక్ష పూర్తయిన తర్వాత వారికి ఇచ్చే మార్కుల లిస్టులో సీబీఎస్‌ఈ అని కాక స్టేట్‌బోర్డు అని ఉండడం గమనార్హం. చాలా మంది తల్లిదండ్రులకు, విద్యార్థులకు మార్కుల లిస్టు వచ్చిన తర్వాత కూడా అర్థం కాని పరిస్థితి. మరో స్కూలులో చేర్పించే సమయంలో ఆ యాజమాన్యం చెప్పేవరకు తమ పిల్లలు ఏ సిలబస్ చదివారో తెలియని స్థితి.
కొన్ని స్కూళ్లలో అయితే ‘మీ పిల్లాడు సరిగా చదవడం లేదు. సీబీఎస్‌ఈలో అయితే కొంచెం కష్టం. సేట్‌బోర్డు సిలబస్‌లోకి మార్చేస్తాం’ అంటూ తొమ్మిదో తరగతి పూర్తిచేసి పదో తరగతిలోకి అడుగెడుతున్న వారి తల్లిదండ్రులకు అనునయంగా చెపుతూ వారి మోసం బయటపడకుండా పడుతున్నారు.
జిల్లాలో ఈ స్కూళ్లకే సీబీఎస్‌ఈ, ఐసీసీఎస్ గుర్తింపు
జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడలలో మాత్రమే సీబీఎస్‌ఈ, ఐసీసీఎస్ గుర్తింపు ఉన్న స్కూళ్లు ఉన్నాయి. జిల్లా విద్యాశాఖాధికారి సమాచారం మేరకు.. రాజమహేంద్రవరంలో సీబీఎస్‌ఈ గుర్తింపు ఉన్నవి శ్రీషిర్డీసాయి విద్యానికేతన్, ఫ్యూచర్‌కిడ్స్, గురుకులం, భారతీయ విద్యాభవన్, ఐసీసీఎస్ గుర్తింపు ఉన్నవి ప్యూచర్‌కిడ్స్, సెంట్ ఏన్స్, కాకినాడలో సీబీఎస్‌ఈ గుర్తింపు ఉన్నవి లక్ష్య, గ్రీన్‌ఫీల్డ్, శ్రీప్రకాశ్, ఐసీసీఎస్ గుర్తింపు ఉన్నవి ఆశ్రమ, అక్షర స్కూల్స్ మాత్రమే.
చర్యలు తీసుకుంటాం
స్టేట్‌బోర్డు గుర్తింపు మాత్రమే ఉన్నా సీబీఎస్‌ఈ, ఐసీసీఎస్ సిలబస్ అంటూ పిల్లలను చేర్పించుకోవడం, వారికి అదే సిలబస్ బోధించి చివరకు స్టేట్‌బోర్డు అని ఇవ్వడం నేరం. జిల్లాలో కొని స్కూల్స్‌కు మాత్రమే ఆ గుర్తింపు ఉంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులు స్కూళ్లలో చేర్చేటప్పుడే గమనించాలి. ఈ విధంగా ఏ విద్యాసంస్థ అయినా మోసం చేసిందని మాకు చెపితే కఠిన చర్యలు తీసుకుని, ఆ విద్యాసంస్థను మూసివేయించే చర్యలు తీసుకుంటాం.
–ఎస్.అబ్రహాం, జిల్లా విద్యాశాఖాధికారి
Advertisement
Advertisement