recognizing
-
రోబో తోటమాలి!
కృత్రిమ మేధ ఇందుగలదు, అందులేదనే సందేహానికి తావులేకుండా విస్తరిస్తోంది. అన్ని రంగాల్లోనూ ఏఐ వాడకం ఇంతింతై... అన్నట్టుగా క్రమంగా పెరిగిపోతోంది. వ్యవసాయంలో కూడా ఇప్పటికే కృత్రిమ మేధను పలు రకాలుగా ఉపయోగిస్తున్నారు. నెదర్లాండ్స్‌లో తులిప్స్ రైతులు ఈ విషయంలో ఇంకో అడుగు ముందుకేశారు. తెగుళ్ల బారిన పడ్డ పూల ఏరివేతకు హైటెక్ బాట పట్టారు. వాటిని ఎప్పటికప్పుడు గుర్తించి ఏరేసేందుకు ఏఐ సాయంతో రూపొందిన రోబోను ఉపయోగిస్తున్నారు. ఖరీదు చాలా ఎక్కువే అయినా ఈ రోబో మనుషులకు ఏమాత్రంతీసిపోకుండా పని పూర్తి చేస్తూ మన్ననలు అందుకుంటోంది. దాంతో నెదర్లాండ్స్ అంతటా తులిప్ తోటల్లో ఈ రోబోల వాడకం నానాటికీ పెరిగిపోతోంది. అందాల తులిప్ పూలకు నెదర్లాండ్స్ పెట్టింది పేరు. అంతేగాక ప్రపంచంలోకెల్లా అతి పెద్ద తులిప్స్ ఉత్పత్తిదారు కూడా. సీజన్లో విరగబూసి అందాలు వెదజల్లే అక్కడి తులిప్ తోటలను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచీ పర్యాటకులు బారులు తీరతారు. ఇలా తులిప్స్ సాగు ఉత్పత్తిపరంగానే గాక పర్యాటకంగా కూడా నెదర్లాండ్స్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. అయితే వాటి సాగు ఖరీదైన వ్యవహారం. పూలను, మొక్కలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. చీడపీడల బారిన పడకుండా నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. వైరస్లు, తెగుళ్ల బారిన పడ్డ పూలు, మొక్కలను ఎప్పటికప్పుడు కనిపెట్టి ఏరివేయడం చాలా కీలకం. లేదంటే మొక్కలు బలహీనపడిపోతాయి. పూలు కూడా చిన్నగా, బలహీనంగా పూస్తాయి. పైగా వైరస్ తోటంతా విస్తరించి మొత్తానికే చేటు తప్పదు. ఇప్పటిదాకా మనుషులే రాత్రింబవళ్లూ తోటల్లో కలియదిరుగుతూ ఒక్కో మొక్కనూ, పువ్వునూ పట్టి చూస్తూ పాడైన వాటిని గుర్తించి ఏరేసేవారు. ఇందుకు ప్రత్యేక నైపుణ్యం అవసరం. వారిని సిక్నెస్ స్పాటర్స్‌గా పిలిచేవారు. కానీ ఏఐ సాయంతో తయారు చేసిన రోబో ఇప్పుడు వారికి దీటుగా ఈ పని చేసి పెడుతోంది. తులిప్ తోటలను తెగుళ్ల బారినుంచి కాపాడే హైటెక్ ఆయుధంగా మారుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 45కు పైగా ఏఐ రోబోలు తులిప్ తోటలను కాపు కాస్తున్నాయి. చీడపీడలు, రోగాల బారినుంచి వాటిని కాపాడే పనిలో తలమునకలుగా ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ ఇలా పని చేస్తుంది... ► ఏఐ రోబో తులిప్ తోటల్లో ఒక్కో సాలు గుండా గంటకు కిలోమీటర్ వేగంతో నింపాదిగా కదులుతుంది. ►ఒక్కో మొక్కనూ, ఒక్కో పూవునూ, దాని తాలూకు రెమ్మలను అణువణువూ పరీక్షిస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వేలాది పొటోలు తీస్తుంది. ►తనలో స్టోరై ఉన్న సమాచారం సాయంతో ఆ ఫొటోలను కూలంకషంగా విశ్లేషిస్తుంది. తద్వారా సదరు మొక్క, పూవు పాడైందీ, బాగున్నదీ నిర్ణయిస్తుంది. ►పాడైనవాటిని ఎప్పటికప్పుడు ఏరేస్తూ ముందుకు సాగుతుంది. ►ఈ రోబోలను తయారు చేసింది హెచ్2ఎల్ రోబోటిక్స్ లిమిటెడ్‌కు చెందిన ఎరిక్ డీ జోంగ్ కంపెనీ. ►తెగుళ్ల బారిన పడ్డ మొక్కలు, పూలను పక్కగా గుర్తించేందుకు కావాల్సిన సమాచారమంతటినీ రోబోకు ఫీడ్ చేసినట్టు కంపెనీ వివరించింది. ►ఈ సమాచారాన్ని తులిప్స్ సాగు చేసే రైతులు, సిక్నెస్ స్పాటర్ల నుంచి కంపెనీ సేకరించింది. కచ్చితత్వంతో కూడిన సాగు... అలెన్ విసర్ అనే ఆసామి తన తులిప్ తోటలో రెండేళ్లుగా ఏఐ రోబోను వాడుతున్నాడు. ఆయన కుటుంబం మూడు తరాలుగా తులిప్స్సాగు చేస్తోంది. ‘‘ఈ రోబో ఖరీదు 2 లక్షల డాలర్లు! అంత డబ్బుతో ఓ ఖరీదైన స్పోర్ట్స్ కారే కొనుక్కోవచ్చు’’ అన్నాడాయన. అయితే, ‘స్పోర్ట్స్ కారు పాడైన తులిప్‌లను ఏరిపడేయదు కదా!’ అంటూ చమత్కరించాడు. ‘‘ఈ రోబో ఖరీదైనదే. కానీ నిపుణులైన సిక్నెస్ స్పాటర్లు నానాటికీ తగ్గిపోతున్న సమయంలో సరిగ్గా చేతికి అందివచ్చింది’’ అని చెప్పాడు. దీన్ని ‘కచ్చితత్వంతో కూడిన సాగు’గా అభివరి్ణంచాడు! కొసమెరుపు నెదర్లాండ్స్ ఉత్తర కోస్తా తీరంలో ప్రఖ్యాత డబ్ల్యూఏఎం పెన్సింగ్స్ తులిప్ తోటలోని ఏఐ రోబోకు అక్క డే జీవితాంతం సిక్నెస్ స్పాటర్‌గా పని చేసి రిటైరైన థియో వాన్‌డర్ వూర్ట్ పేరు పెట్టారు. దీని పనితీరు ఆయన్ను కూడా మెప్పించడం విశేషం. ‘‘తోటల్లో తిరిగీ మా నడుములు పడిపోయేవి! మా పనిని ఈ రోబో అలవోకగా చేసేస్తోంది. పాడైన మొ క్కలు, పూలను మాకు ఏ మాత్రమూ తీసిపోని విధంగా గుర్తించి ఏరేస్తోంది’’ అంటూ కితాబిచ్చాడాయన! -
సీబీఎస్ఈ పేరుతో బురిడీ
-లేని గుర్తింపు ఉందంటూ కొన్ని విద్యాసంస్థల వంచన -పుస్తకాలు, బోధన అదే అయినా..స్టేట్ సిలబస్‌తోనే మార్కులు -చివరిలో విషయం తెలిసి హతాశులవుతున్న తల్లిదండ్రులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : తిరుమలరావు తన కుమారుడు యశ్వంత్‌ను మంచి విద్యను అందించాలని ఒక ప్రముఖ కార్పొరేట్ స్కూలులో సీబీఎస్ఈ సిలబస్‌లో చేర్పించాడు. అయితే ఎనిమిదో తరగతి చదువుతున్న కుమారుడిని ఏవో కారణాలతో స్కూలు మార్చాలని టీసీ, మార్కుల లిస్టు తీసుకుని మరొక స్కూలుకు వెళ్లి సీబీఎస్ఈ సిలబస్‌లో చేర్చబోయాడు. అయితే ఆ స్కూలు వారు ‘మీ అబ్బాయి చదివింది సీబీఎస్ఈ సిలబస్ కాదు. స్టేట్‌బోర్డు సిలబసే. మేము అందులోనే చేర్పించుకుంటాం’ అంటే ‘అదేమి’టంటూ మండిపడ్డాడు. అయితే ఆ స్కూలు నిర్వాహకులు ముందు స్కూలులో జరిగిన మోసాన్ని విప్పి చెప్పి, మార్కుల లిస్టులో స్టేట్‌బోర్డు సిలబస్ అని రాసి ఉండడాన్ని చూపడంతో హతాశుడయ్యాడు. ఇన్నాళ్లూ సీబీఎస్ఈ సిలబస్ చదువుతున్నాడనుకున్నానని, ఇంత మోసమా అని వాపోయాడు. ఈ అనుభవం ఒక్క తిరుమలరావుకే కాదు.. జిల్లాలో కొన్ని వందలమంది తల్లిండ్రులు, విద్యార్థులకు ఎదురవుతున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల మోసం. తల్లిదండ్రుల ఆసక్తిని ఆసరాగా తీసుకుని.. జిల్లాలో మొత్తం 1500 ప్రైవేట్, కార్పోరేట్ విద్యాసంస్థలున్నాయి. వాటిలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించేవి 900, ఆరు నుంచి పదో తరగతి వరకు బోధించేది 600 ఉన్నాయి. వీటిలో మొత్తం నాలుగు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రస్తుతం తల్లిదండ్రుల్లో ఎక్కువమంది సీబీఎస్ఈ, ఐసీసీఎస్ సిలబస్లకే మొగ్గు చూపుతున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలు తల్లిదండ్రులు, విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. తమ స్కూలులో సీబీఎస్ఈ సిలబస్ ఉందంటూ, పుస్తకాలు, స్కూలు ఫీజులకు వేల రూపాయలు గుంజుతున్నాయి. అలాంటి స్కూళ్లలో విద్యార్థికి ఇచ్చేది సీబీఎస్ఈ పుస్తకాలే, చెప్పేది అదే కోర్సు, కాని పరీక్ష పూర్తయిన తర్వాత వారికి ఇచ్చే మార్కుల లిస్టులో సీబీఎస్ఈ అని కాక స్టేట్‌బోర్డు అని ఉండడం గమనార్హం. చాలా మంది తల్లిదండ్రులకు, విద్యార్థులకు మార్కుల లిస్టు వచ్చిన తర్వాత కూడా అర్థం కాని పరిస్థితి. మరో స్కూలులో చేర్పించే సమయంలో ఆ యాజమాన్యం చెప్పేవరకు తమ పిల్లలు ఏ సిలబస్ చదివారో తెలియని స్థితి. కొన్ని స్కూళ్లలో అయితే ‘మీ పిల్లాడు సరిగా చదవడం లేదు. సీబీఎస్ఈలో అయితే కొంచెం కష్టం. సేట్బోర్డు సిలబస్‌లోకి మార్చేస్తాం’ అంటూ తొమ్మిదో తరగతి పూర్తిచేసి పదో తరగతిలోకి అడుగెడుతున్న వారి తల్లిదండ్రులకు అనునయంగా చెపుతూ వారి మోసం బయటపడకుండా పడుతున్నారు. జిల్లాలో ఈ స్కూళ్లకే సీబీఎస్ఈ, ఐసీసీఎస్ గుర్తింపు జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడలలో మాత్రమే సీబీఎస్ఈ, ఐసీసీఎస్ గుర్తింపు ఉన్న స్కూళ్లు ఉన్నాయి. జిల్లా విద్యాశాఖాధికారి సమాచారం మేరకు.. రాజమహేంద్రవరంలో సీబీఎస్ఈ గుర్తింపు ఉన్నవి శ్రీషిర్డీసాయి విద్యానికేతన్, ఫ్యూచర్‌కిడ్స్, గురుకులం, భారతీయ విద్యాభవన్, ఐసీసీఎస్ గుర్తింపు ఉన్నవి ప్యూచర్కిడ్స్, సెంట్ ఏన్స్, కాకినాడలో సీబీఎస్ఈ గుర్తింపు ఉన్నవి లక్ష్య, గ్రీన్‌ఫీల్డ్, శ్రీప్రకాశ్, ఐసీసీఎస్ గుర్తింపు ఉన్నవి ఆశ్రమ, అక్షర స్కూల్స్ మాత్రమే. చర్యలు తీసుకుంటాం స్టేట్‌బోర్డు గుర్తింపు మాత్రమే ఉన్నా సీబీఎస్ఈ, ఐసీసీఎస్ సిలబస్ అంటూ పిల్లలను చేర్పించుకోవడం, వారికి అదే సిలబస్ బోధించి చివరకు స్టేట్‌బోర్డు అని ఇవ్వడం నేరం. జిల్లాలో కొని స్కూల్స్‌కు మాత్రమే ఆ గుర్తింపు ఉంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులు స్కూళ్లలో చేర్చేటప్పుడే గమనించాలి. ఈ విధంగా ఏ విద్యాసంస్థ అయినా మోసం చేసిందని మాకు చెపితే కఠిన చర్యలు తీసుకుని, ఆ విద్యాసంస్థను మూసివేయించే చర్యలు తీసుకుంటాం. –ఎస్.అబ్రహాం, జిల్లా విద్యాశాఖాధికారి