ఈసారైనా అర్హులకు అందేనా ?
ఈసారైనా అర్హులకు అందేనా ?
Published Sun, Oct 9 2016 11:32 PM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM
జిల్లాలో 463 రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
రెవెన్యూ డివిజన్ల వారీగా దరఖాస్తుల స్వీకరణ
అర్హుల ఎంపికకు త్వరలో రాత పరీక్ష
మండపేట : రేషన్ దుకాణాల డీలర్ల ఖాళీల భర్తీ ప్రక్రియ మరోమారు తెరపైకి వచ్చింది. జిల్లాలోని 463 దుకాణాల్లో డీలర్ల ఖాళీలను భర్తీ చేసేందుకు ఇప్పటికే రెవెన్యూ అధికారులు నోటిఫికేషన్లు జారీ చేశారు. రెవెన్యూ డివిజన్ల వారీగా దరఖాస్తులు స్వీకరణ మొదలైంది. అర్హుల ఎంపికకు త్వరలో రాత పరీక్ష నిర్వహించనున్నారు. కాగా ఈసారైనా గతంలో మాదిరి పక్షపాతం చూపకుండా అర్హులకు షాపులు కేటాయించాలని అభ్యర్థులు కోరుతున్నారు.
జిల్లాలో తెల్లరేషన్ కార్డులు 14,39,183 ఉండగా, అంత్యోదయ కార్డులు 84,742, అన్నపూర్ణ కార్డులు 1,199 ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 2,647 దుకాణాలు ద్వారా వీరికి సరుకులు అందిస్తున్నారు. ఒక్కో రేషన్ దుకాణం పరిధిలో 500 కార్డులు మాత్రమే ఉండాలి. కాగా 800 నుంచి 1200ల వరకు కార్డులు ఉన్న రేషన్‌షాపులు ఎన్నో ఉన్నాయి. అధిక సంఖ్యలో కార్డులు ఉండటంతో సరుకులు తీసుకునేందుకు వినియోగదారులు ఇబ్బం దులు పడుతున్నారు. ఏడాదిక్రితం ఒక్కో షాపు పరిధిలో 500 కార్డులతో షాపుల సర్ధుబాటు చేయగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన 173 షాపులు, ఇన్‌చార్జిల పరిధిలో ఉన్న మరో 100 దుకాణాలు కలిపి 273 షాపుల్లో డీలర్ల భర్తీకి ఏడాది క్రితం రెవెన్యూ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. డీలర్ల ఎంపికకు రాత పరీక్షతో ఇంటర్వూ్యలు కూడా నిర్వహించారు. కాగా అర్హతతో నిమిత్తం లేకుండా పలు రెవెన్యూ డివిజన్లలో అధికార పార్టీ వారు చెప్పిన వారికి, తెలుగు తమ్ముళ్లకు షాపులు కట్టబెట్టే ప్రయత్నాలు అప్పట్లో ముమ్మరంగా జరిగాయి. ఇంటర్వూ్యల నిర్వహణలోను నిబంధనలకు నీళ్లొదిలి కావాల్సిన వారికి కట్టబెట్టే ప్రయత్నం చేశారు. అభ్యర్థుల ఎంపికపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తడంతో ఉన్నతాధికారులు విచారణకు సైతం ఆదేశించారు. పలు విమర్శల నడుమ అప్పట్లో భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా మరోమారు షాపుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
కార్డుల సర్దుబాటుతో...
కొత్తగా 463 దుకాణాల భర్తీకి ఇటీవల ఉన్నతాధికారులు ఉత్తర్వులిచ్చారు. కార్డుల సర్దుబాటుతో జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఏర్పడిన షాపులు 300లు కాగా ఇన్‌చార్జిల పరిధిలో ఉన్న 163 షాపులు భర్తీ చేయనున్నారు. అందులో భాగంగా జిల్లాలోని ఆయా రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఇప్పటికే షాపుల అధికారులు వెల్లడించారు. దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. 80 మార్కుల ప్రాతిపదికన త్వరలో రాత పరీక్ష, 20 మార్కులకు ఇంటర్వూ్య నిర్వహిస్తారని సమాచారం. కాగా ఈసారైన పక్షపాతానికి తావులేకుండా పూర్తి పారదర్శకంగా భర్తీ ప్రక్రియను నిర్వహించాలని అభ్యర్థులు కోరుతున్నారు. అర్హులకు మాత్రమే షాపులు కేటాయించాలంటున్నారు.
Advertisement
Advertisement