లోకేశ్ రాకతో నిబంధనలు హుష్
– ఉపాధి కూలీలతో రోడ్లు ఊడ్పించిన అధికారులు
- మంత్రి సభకు వస్తే నాలుగు రోజుల మస్తర్లు
- రాకుంటే వారం రోజులు పనిలోకి తీసుకోరని బెదిరింపు
కాకినాడ రూరల్ : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ మంగళవారం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో కాకినాడ నుంచి వేళంగి వరకు ప్రధాన రోడ్డు వెంబడి ఉన్న తుప్పలు, రోడ్డుపై ఉన్న ఇసుకను ఉపాధి కూలీలతో తుడిపించి అధికారులు నిబంధనలు తుంగలో తొక్కారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అధికారులు దగ్గరుండీ మరీ ఉపాధి కూలీలతో పనులు చేయించారు. గ్రామాల్లో రోడ్ల పక్కన ముళ్ల కంపలతో ఇబ్బందులు పడుతున్నాం, తొలగించండని మొర పెట్టుకున్నా పట్టించుకోని ఉపాధి, మండల పరిషత్ అధికారులు లోకేశ్ వస్తున్నారని మండుటెండలో ఉపాధి కూలీలతో పనులు చేయించారని పలువురు విమర్శిస్తున్నారు. రోడ్డు మీద ఇసుక రేణువు కూడా లేకుండా చూడాల్సిన బాధ్యత ఉపాధి కూలీలదేనంటూ అధికారులు ఆదేశించినట్టు కూలీలు చెబుతున్నారు. సోమవారం కాకినాడ అన్నమ్మగాటీ సెంటర్ నుంచి తూరంగి, నడకుదురు, పెనుగుదురు, కరపల మీదుగా వేళంగి వరకు వందలాది మంది ఉపాధి కూలీలు రోడ్డు పక్కన పిచ్చిమొక్కలు, రోడ్డుపై ఉన్న ఇసుక తొలగింపు పనులు చేశారు. ఉదయం 7 నుంచి 11 గంటల వరకు ఉపాధి పనులు చేస్తున్నామని, అయితే మంత్రి లోకేశ్ వస్తున్నారని మధ్యాహ్నం 2 గంటలు అయినా పనులు చేయిస్తున్నారని కూలీలు చెప్పారు. మంగళవారం కరపలో జరిగే లోకేశ్ సభకు భారీగా ఉపాధి కూలీలు, డ్వాక్రా మహిళలు తరలి రావాలని కరప, కాకినాడ రూరల్ ప్రాంతాల్లోని అధికారులు హుకుం జారీచేశారు. ఎవరైనా సభకు రాకపోతే రుణాలు పొందే అర్హత కోల్పోతారని, ఏ డ్వాక్రా సంఘానికి చెందిన వ్యక్తుల రావడం లేదో జాబితా తయారు చేయించాలంటూ మండల మహిళా సంఘాల ప్రతినిధులను టీడీపీ కార్యకర్తలు హెచ్చరించినట్టు చెబుతున్నారు. సభకు వచ్చే ఉపాధి కూలీలకు మూడు నుంచి నాలుగు రోజులు పనులు చేసినట్టు మస్తర్లు వేయాలని కరపకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ఉపాధి అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. ఈ విషయాన్ని అన్ని గ్రామాల్లో ప్రచారం చేయాలని చెప్పినట్టు ఆయా ప్రాంతాల కూలీలు చెబుతున్నారు. సభకు రాకపోతే వారం రోజులు పనిలోకి తీసుకోవద్దని చెప్పడంతో కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పక్కన నిబంధనలకు విరుద్ధంగా పలుచోట్ల లోకేశ్‌ను స్వాగతిస్తూ అధికార పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా అధికారులు కిమ్మనలేదన్న విమర్శలు వినిపించాయి.