లోకేష్ పర్యటన ఏర్పాట్లలో అపశ్రుతి
ఫ్లెక్సీ కడుతుండగా విద్యుదాఘాతం
యువకుడికి తీవ్ర గాయాలు
కాకినాడ రూరల్ : నాయకుల పర్యటనలు యువకుల ప్రాణాల మీదకు వస్తున్నాయి. కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న యువకులు నాయకులు, మంత్రులు, ప్రభుత్వాధినేతల పర్యటనల సందర్భంగా స్థానిక నాయకులు మంత్రులు, పార్టీ నాయకుల మెప్పు పొందేందుకు వేస్తున్న ఫ్లెక్సీలు కడుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలాంటి సంఘటనే కాకినాడ రూరల్ మండలం వలసపాకలలో సోమవారం చోటు చేసుకుంది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు, వివిధ ఫ్యాక్టరీలకు చెందిన యజమానులు భారీగా ఫ్లెక్సీలు కట్టేందుకు ప్రయత్నాలు చేశారు. ఫ్యాక్టరీల నుంచి ఫ్లెక్సీలు కట్టాలని డిమాండ్ చేసి మరీ టీడీపీ నాయకులు వేయించారు. దీనిలో భాగంగా వలసపాకలలో ఫ్లెక్సీలు కట్టేందుకు రమణయ్యపేట ఇందిరాకాలనీకి చెందిన దున్నా అనిల్‌కుమార్ అనే యువకుడు కాంట్రాక్ట్‌కు ఒప్పుకున్నాడు. ఫ్లెక్సీ బోర్డులు ఇనుప ఊచలతో ఉండడంతో విద్యుత్ స్తంభాలకు కడుతుండగా షాక్‌కు గురై కిందపడిపోయాడు. చేతులు, కాళ్లు, ఉదర భాగంలో తీవ్రంగా కాలిపోయాయి. మనిషి మొత్తం నల్లగా మారిపోయాడు. దాదాపు 80 శాతం పైగా కాలిపోవడంతో స్థానికులు కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అనిల్‌కుమార్ చావుబతుకుల మధ్య జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఫ్లెక్సీలను వలసపాకల జన్మభూమి కమిటీ సభ్యుడు తాతపూడి రామకృష్ణ దగ్గరుండి కట్టిస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటనలో అనిల్‌కుమార్‌తో పాటు తాతపూడికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటన జరిగిన వెంటనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీలు పట్టుకొని అక్కడ నుంచి పారిపోయినట్టు చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన అనిల్‌కుమార్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఏడాది బాబు ఉన్నాడు. అనిల్‌కుమార్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.