హామీలపై లేదు భరోసా!
అంతా ప్రసంగాల ప్రయాస..
చప్పగా సాగిన పంచాయతీ రాజ్ మహోత్సవం
సమస్యలను ఏకరువు పెట్టిన అధికార పక్షం సభ్యులు
దాటవేత ధోరణిలో లోకేష్
భానుగుడి(కాకినాడ) : పంచాయతీరాజ్ మహోత్సవం–2017 పేరుతో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ఆశాఖ మంత్రి నారా లోకేష్ జిల్లాలోని పలు అభివృద్ధి పనులు, సమస్యలపై మంగళవారం అంబేడ్కర్ భవన్‌లో నిర్వహించిన సమావేశం పార్టీ శ్రేణుల్లో, అధికారుల్లో తీవ్ర నిరుత్సాహాన్ని నింపింది. చినబాబు రాకతో నిధులు వరదలా వస్తాయనుకున్న నేతల ఆశలు ఆవిరయ్యాయి. మంత్రి కేవలం సమస్యలను విని వాటిని ముఖ్యమంత్రితో చర్చిస్తానని ప్రతి విషయంలో దాటవేత «ధోరణి ప్రదర్శించడం, నిధులడిగితే రిక్తహస్తం చూపడంతో సమావేశం ఆద్యంతం విమర్శలకు తావిచ్చింది.
మంగళవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి 8గంటల వరకు సాగినా పలు పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు మినహా సమావేశంలో ఏ విషయం పెద్దగా ఆకట్టుకోలేదు. తొలుత పంచాయతీరాజ్, ఎన్‌ఆర్‌ఈజీయస్ శాఖల ప్రగతి నివేదికలను కలెక్టర్ అరుణ్‌కుమార్ సమావేశం ముందుంచారు. జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, పంచాయతీరాజ్ కమిషన్ బి.రామాంజనేయులు పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి, తెదేపా హయాంలో జరిగిన పనులపై వివరించారు.
సమస్యలను ఏకరువుపెట్టిన అధికార పక్షం సభ్యులు
ప్రభుత్వంపై గ్రామాల్లో ఉన్న వ్యతిరేకతను సమావేశంలో అధికార సభ్యులే ఏకరువు పెట్టడంతో చినబాబు కంగుతిన్నారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు ప్రసంగాల్లో కోరుమిల్లి సర్పంచ్ సలాది వీరబాబు ఉచిత ఇసుక విధానంలో ఉన్న లోపాలను వివరించారు. గ్రామాల్లో గృహరుణాలు ఇవ్వకపోవడంతో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. రంపచోడవం సర్పంచ్ నిరంజనీదేవి గ్రామాల్లో నీటి కొరత విపరీతంగా ఉన్నా పట్టించుకునే నాథుడు కరవయ్యాడని పేర్కొన్నారు. పాఠశాల భవనాలు కూలిపోతున్నా ఎవరికీ చిత్తశుధ్ధి లేదని వాపోయారు. జెడ్పీటీసీ సభ్యులు నాయుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు కనీసం ఎంపీడీవో కార్యాలయాల్లో ఒక గదిని కేటాయించలేని అ«ధ్వాన స్థితిలో ఉన్నామన్నారు. ఉచిత ఇసుక విధానం కారణంగా జెడ్పీకి సీనరేజీ ఆదాయం లేకపోవడం, 14వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీలకే జమ కావడం కారణంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ఏజెన్సీ మండలాల ప్రజాప్రతినిధులు తమతమ గ్రామాల్లో కనీస వైద్యసదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు.
గ్రామీణాభివృద్ధికి కేటాయించింది రూ.940 కోట్లే..
హోం మంత్రి చినరాజప్ప, ఎమ్మెల్యేల ప్రసంగాల అనంతరం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ పల్లె తల్లి లాంటిది.. పట్నం ప్రియురాలు లాంటిదని, తల్లి ఇస్తే ప్రియురాలు తెమ్మంటుందంటూ ఛలోక్తులు విసరారు. కన్వర్షన్ ఆఫ్ ఫండ్స్ అనే పదం ఒకప్పుడు ముఖ్యమంత్రి వాడారని, మూడేళ్ల క్రితం ఆ పదం ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు తీసుకుంటే గాని అర్థం తెలియలేదన్నారు. గ్రామీణ అభివృద్ధి కోసం కేవలం రూ.940 కోట్లు ఖర్చుచేశామని చెప్పడం, మైనర్ పంచాయతీల కరెంటు బిల్లులపై ప్రజాప్రతినిధులకు సరైన హామీ ఇవ్వలేకపోవడం, ప్రతి విషయానికీ దాటవేత ధోరణి ప్రదర్శించడంతో ప్రసంగం ఆద్యంతం సభికుల్లో నిరుత్సాహాన్ని నింపింది.
కులాల మధ్య చిచ్చుపెట్టింది మీరు కాదా? : జెడ్పీ ప్రతిపక్షనేత శాఖా ప్రసన్నకుమార్
ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని సా«గిస్తున్న అరాచకాల గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని, ప్రజా సమస్యలను అక్షర సత్యాలుగా అందిస్తున్న ‘సాక్షి’పై మంత్రి నారా లోకేష్ విమర్శించడం తగదని జెడ్పీ ప్రతిపక్షనేత శాఖా ప్రసన్నకుమార్ అన్నారు. నాయకులు ప్రజల్లోంచి రావాలని, వంశాన్ని, పలుకుబడిని అడ్డుపెట్టికుని వచ్చిన లోకేష్‌కు ప్రజాపాలన గురించి ఏం తెలుసునని ఆయన ఎద్దేవా చేశారు. సాక్షి పత్రిక కుల మతాల గురించి చిచ్చు రేపుతుందంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ ఎస్సీ వర్గీకరణ పేరుతో చిచ్చుపెట్టింది తెదేపా ప్రభుత్వం అని, కాపులు, బిసీ కులాల మధ్య చిచ్చు పెట్టి అగ్గిరాజేస్తోంది ఎవరి ప్రభుత్వమో తెలుసుకోవాలని ఆయన విమర్శించారు.