
జూలై 2, 3 తేదీల్లో తూర్పు, విశాఖల్లో జగన్ పర్యటన
వాయుగుండం, రోడ్డు ప్రమాదాల్లో మృతుల కుటుంబాలకు పరామర్శ
కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జూలై 2, 3 తేదీల్లో తూర్పు, విశాఖ జిల్లాల్లో పర్యటిస్తారని పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ చెప్పారు. సోమవారం కాకినాడలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ రెండున రాజమండ్రి చేరుకుని అక్కడి నుంచి రంపచోడవరం నియోజకవర్గంలోని సూరంపాలెం వెళ్లి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆ ప్రాంతవాసుల కుటుంబాలను పరామర్శిస్తారన్నారు.
అనంతరం ఇటీవల వాయుగుండం కారణంగా మరణించిన మత్స్యకార కుటుంబాలను పరామర్శించేందుకు కాకినాడ, కాకినాడరూరల్ నియోజకవర్గాల్లో పర్యటిస్తారన్నారు. రాత్రికి కాకినాడలో బస చేసి 3వ తేదీ ఉదయం తుని నియోజకవర్గంలోని పెరుమాళ్లపురం వెళ్లి బాధిత మత్స్యకారులను, అక్కడి నుంచి విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గంలోని అచ్యుతాపురం వెళ్లి ధవళేశ్వరం వద్ద తూఫాన్ వ్యాన్ గోదావరిలో పడి మృతి చెందిన వారి బంధువులను పరామర్శిస్తారన్నారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు తదితరులు పాల్గొన్నారు.