దాడికి పాల్పడినవారిపై చట్టపరంగా చర్యలు
దాడికి పాల్పడినవారిపై చట్టపరంగా చర్యలు
Published Thu, Aug 11 2016 1:03 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
సూదాపాలెం దళితులను పరామర్శించిన కలెక్టర్
బాధితులకు రూ.లక్ష చొప్పున సహాయం
అమలాపురం :
ఉప్పలగుప్తం మండలం సూదాపాలెంలో దళితులపై దాడి చేసిన వారిపై చట్టపరంగా చర్య తీసుకుంటామని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ ప్రకటించారు. అమలాపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను బుధవారం ఆయన పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యసేవలందించాలని వైద్యులను ఆదేశించారు. సంఘటన వివరాలను బాధితుల కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, టీడీపీ నాయకులు కూడా బాధితులను పరామర్శించారు. దాడి అమానుషమైన సంఘటన అని, బాధితులకు అండగా నిలుస్తామని వారు పేర్కొన్నారు. ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ మెట్ల రమణబాబు, ఎంపీపీ బొర్రా ఈశ్వరరావు, మున్సిపల్ విప్ నల్లా స్వామి, కౌన్సిలర్ గంపల నాగలక్ష్మి తదితరులు ఎమ్మెల్యే ఆనందరావు వెంట ఉన్నారు.
రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం
సూదాపాలెం ఘటనలో బాధితులకు ప్రభుత్వం రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించింది. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప జరిగిన విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వెళ్లగా ఆయన స్పందించి రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వాల్సిందిగా కలెక్టర్ అరుణ్‌కుమార్‌ను ఆదేశించారు. ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు మోకాటి లాజర్, మోకాటి ఎలీషా, సవరపు లక్ష్మణకుమార్‌కు ఈ ఆర్థిక సహాయాన్ని ఆర్డీవో జి.గణేష్
కుమార్ అందించారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన
సూదాపాలెం సంఘటనకు నిరసనగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో బుధవారం అమలాపురం గడియారస్తంభం సెంటరులో నిరసన ప్రదర్శన నిర్వహించారు. దాడికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా నినాదాలు చేశారు. ఎస్పీ రవిప్రకాష్‌ను కలిసి 164 స్టేట్‌మెంట్స్ రికార్డులోని వాస్తవాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. పీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కె.విజయ్‌కుమార్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కాశి లక్ష్మణస్వామి, పీసీసీ కార్యదర్శులు మహ్మద్ ఆరీఫ్, యార్లగడ్డ రవీంద్ర, పీసీసీ ఉపాధ్యక్షురాలు అయితాబత్తుల సుభాషిణి, పార్టీ నాయకులు అడపా మాచరరావు, ములపర్తి సత్యనారాయణ పాల్గొన్నారు.
Advertisement
Advertisement