నోటు పాట్లు | note effect east godavari | Sakshi
Sakshi News home page

నోటు పాట్లు

Published Thu, Nov 10 2016 12:11 AM | Last Updated on Mon, Sep 4 2017 7:39 PM

నోటు పాట్లు

నోటు పాట్లు

ఎక్కడ చూసినా రూ.500, రూ.1000 నోట్ల రద్దు పాట్లే
కుదుపునకు లోనైన దైనందిన జీవనం
పాలప్యాకెట్ల నుంచి మాత్రల వరకూ.. ఏం కొనాలన్నా ఇక్కట్లే
పెద్ద నోట్లను తీసుకోమంటున్న వ్యాపారులు
కనీస అవసరాలూ తీరక లబోదిబోమంటున్న జనం
జిల్లాలో ఎవరిని కదిపినా, ఎవరి నోట విన్నా పెద్దనోట్ల రద్దు తెచ్చిన చిక్కులూ, ఇక్కట్లే. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలతో పాటు అమలాపురం వంటి పట్టణాలు, గ్రామాలు, మారుమూల పలెల్లో..ఇలా జిల్లా అంతటా కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించిన రూ.500, రూ.1000 నోట్లంటేనే.. పోట్లగిత్తను చూసినట్టు బెదురుతున్నారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ : నోట్ల రద్దుతో సామాన్య, మధ్యతరగతి వర్గాలకైతే దైనందిన జీవనం స్తంభించినట్టయింది. కేంద్రం మినహాయిం పునిచ్చిన పాలబూత్‌లు, మందుల షాపులలో సైతం పెద్దనోట్లు తీసుకోవడం లే దు. మంగళవారం అర్థరాత్రి వరకు వంద నోట్ల కోసం ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణలు చేసినా దొరక లేదు. తెల్లారి లేస్తే పాలప్యాకెట్‌  నుంచి కాయగూరలు, టీ, టిఫిన్, నిత్యావసర సరుకులు, తినుబండారాలు, రెస్టారెంట్లు, పెట్రోలు బంక్‌లు, పళ్ల దుకాణాల్లో ఎక్కడ చూసినా వంద నోటు ఉంటేనే సరుకు ఇస్తున్నారు. చేతిలో వంద నోట్లు లేక ఏమి చేయాలో దిక్కుతోచక జనం సతమతమవుతున్నారు. తమ వద్ద ఉన్న రూ.500, రూ.1000 నోట్లు బ్యాంక్‌లలో ఎప్పుడు జమ చేస్తాం, కొత్త నోట్లు ఎప్పుడు తిరిగి చేతికిస్తారు, అవసరాలు ఎప్పటికి తీరతాయని ఆందోళన చెందుతున్నారు. పెట్రోలు బంకులలో రూ.500 ఇచ్చి వంద రూపాయలకు పెట్రోలు పోయమంటే పోయడం లేదు. కావాలంటే రూ.500 పెట్రోలు పోస్తామనడంతో అందుకు సిద్ధపడ్డవారే పోయించుకున్నారు. అన్నవరం దేవస్థానంలో వ్రతాల కౌంటర్‌ వద్ద కూడా భక్తులకు ఇవే ఇబ్బందులు ఎదురయ్యాయి.
పడిపోయిన వ్యాపారాలు
నోట్ల చిక్కులతో జిల్లాలోసగానికి సగం వ్యాపారాలు పడిపోయాయి. ఇంతవరకూ వినియోగదారులు రూ.500 నోటు తీసుకువెళ్లి రూ.70 లేదా రూ.80 సరుకులు కొన్నా వ్యాపారులు తిరిగి చిల్లర ఇచ్చేవారు. ఇప్పుడు రూ.500 నోటు ఇచ్చినా అంత మొత్తానికీ సరుకులు తీసుకోమంటున్నారు. వినియోగదారుల నుంచి రూ.500 తీసుకుని అడిగిన సరుకులు ఇచ్చేస్తే ఆ నోట్లు హోల్‌సేల్‌ వ్యాపారికి ఇచ్చినా తీసుకోవడం లేదని వ్యాపారులంటున్నారు. వంద నోటు లేదా కొన్న సరుక్కి సరిపడా చిల్లర తెస్తేనే సరుకులు ఇస్తుండడంతో  వ్యాపారాలు పడిపోయాయంటున్నారు.  
వంద నోట్లతో వ్యాపారం
కోనసీమలోని అమలాపురం, అంబాజీపేట, కాకినాడ సహా పలు పట్టణాల్లో ఈ నోట్ల వ్యవహారాన్ని కూడా కొందరు వ్యాపారంగా మార్చేశారు. వంద నోట్లు ఉన్న వారు కమీషన్‌  వ్యాపారంగా సొమ్ము చేసుకుంటున్నారు. నెల, నెల, రోజువారీ వడ్డీవ్యాపారులు ఈ వ్యవహారంలో ముందున్నారు. వంద నోటుకు ప్రస్తుతం ఉన్న డిమాండ్‌ను బట్టి వెయ్యి రూపాయలకు వంద కమీషన్‌గా నిర్ణయించారు. కొందరు రూ.500 నోటు తీసుకుని రూ.450 ఇస్తున్నారు. తీసుకునే వారు రూ.50 పోతే పోయాయి ప్రస్తుతం అవసరం గట్టెక్కుతుందని సరిపెట్టుకుంటున్నారు.
మందగించిన రిజిస్ట్రేషన్‌ లు
సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో దశమి, ఏకాదశి రోజుల్లో సుమారు రోజుకి వెయ్యి వరకు రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. సుమారు రూ.3 కోట్లు లావాదేవీలు జరుగుతాయి. పెద్ద నోట్ల రద్దు, బ్యాంకులు సెలవు కావడం, ఏటీఎంలు పనిచేయకపోవడంతో బుధవారం రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు వెలవెలపోయాయి. జిల్లాలోని 32 సబ్‌ రిజిస్ట్రేషన్‌  కార్యాలయాలలో సుమారు 100 నుంచి 150 రిజిస్ట్రేషన్లు మాత్రమే  కాగా ఆదాయం సుమారు రూ.50 లక్షలు మాత్రమే వచ్చింది. 
శుభకార్యాలపైనా ప్రభావం 
పెద్దనోట్ల రద్దు ప్రభావం వివాహాది శుభకార్యాలపైనా కనిపించింది. కాకినాడ వినుకొండ వీధిలో గుండా వెంకటసత్యనారాయణ కుమార్తె వివాహానికని అన్నీ రూ.500 నోట్లు తెచ్చి ఇంటిలో పెట్టారు. తీరా ఇప్పుడు ఆ నోట్లు తిరిగి జమచేయాలనడంతో ఎప్పటికి తిరిగి సొమ్ములు చేతికొస్తాయా అని ఎదురుచూస్తున్నారు. కె.గంగవరం మండలం భట్లపాలికలో వడ్లపాటి వీరవెంకటసత్యనారాయణ కుమార్తె సూర్యకళకు ఈ నెల 15న వివాహం. పెళ్ళి కోసం రూ.50 వేలు అప్పు తెచ్చుకున్నారు. ఆ సొమ్మంతా రూ.500 నోట్లే.  ముహూర్తం చూస్తే దగ్గరకు వచ్చేసిందని,  ఏం చేయాలో పాలుపోవడం లేదని సత్యనారాయణ ఆందోళన చెందుతున్నారు.
అందాలు చూసేందుకు వచ్చి అవస్థలు
కోనసీమ అందాలను ఆస్వాదించేందుకు మహారాష్ట్ర నాగపూర్‌ యూనివర్సిటీ నుంచి నాలుగు కుటుంబాలు రాజమహేంద్రవరంలో రైలు దిగి అమలాపురంలో  స్నేహితుడైన ప్రొఫెసర్‌ ఇంటికి వచ్చారు. ఇంతలో వారిని రూ.1000, రూ.500 నోట్ల రద్దు ఆందోళనలో పడేసింది. బుధవారం ఏటీఎంలు, బ్యాంకులు పనిచేయక, తమ వద్ద ఉన్న పెద్ద నోట్లు మారక, అవసరాలు తీరక ఆ నాలుగు కుంటుంబాలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యాయి.
మారకంలో ‘నకిలీ సిరి’ మంతులు బిజీబిజీ
నకిలీ కరెన్సీకి పెట్టని కోటలు జిల్లాలో చాలానే ఉన్నాయి. ప్రధానంగా రావులపాలెం, అనపర్తి, మండపేట, కాకినాడ తదిర ప్రాంతాల్లో దొంగనోట్ల వ్యాపారంలో కోట్లు గడించిన వారు అనేకులు ఉన్నారు. ఇప్పుడు అలాంటి వారు తమ వద్ద పనిచేసే ఉద్యోగుల ద్వారా డబ్బు మారకం పనిలో ఉన్నారని తెలుస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement