రేపటి నుంచి స్వచ్ఛశక్తి సప్తాహం
రేపటి నుంచి స్వచ్ఛశక్తి సప్తాహం
Published Mon, Feb 27 2017 10:44 PM | Last Updated on Tue, Sep 5 2017 4:46 AM
అధికారుల సమీక్షలో కలెక్టర్ అరుణ్‌కుమార్
కాకినాడ సిటీ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలో మార్చి ఒకటి నుంచి 8వ తేదీ వరకు స్వచ్ఛశక్తి సప్తాహం ద్వారా మహిళా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ అరుణ్‌కుమార్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కోర్టు హాలులో వివిధ శాఖలఅధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తాగునీరు, పారిశుద్ధ్యం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సప్తాహంలో పారిశుద్ధ్య నిర్వహణలో కృషిచేసిన మహిళలకు సత్కారం, మహిళలకు, బాలికలకు ఆటల పోటీలు, పారిశుద్ధ్యంపై పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు, బహిరంగ మల విసర్జన లేని గ్రామాలలో అవగాహన పర్యటనలు నిర్వహిస్తారన్నారు. వేసవిలో నీటిఎద్దడి లేకుండా జాగ్రత్తలు చేపట్టాలని, జిల్లాలో నీటి సమస్య ఉండే ప్రాంతాలను గుర్తించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకంలో ప్రస్తుతం 89,500 పని దినాలు కల్పిస్తున్నారని, వాటిని పెంచాలని సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ సమన్వయ నిధులతో చేపట్టే పనుల ప్రతిపాదనలను రెండు రోజుల్లో ఇవ్వాలని ఆదేశించారు.
ఆహార భద్రతకు ముప్పు రాకూడదు
ప్రాథమిక రంగ అభివృద్ధికి మత్స్య పరిశ్రమను ప్రోత్సహిస్తున్నప్పటికీ చేపల చెరువుల మూలంగా ఆహారభద్రతకు ముప్పు రాకూడదని çకలెక్టర్ స్పష్టం చేశారు. వ్యవసాయానికి పనికిరాని భూములు, ఉత్పత్తి తగ్గిన భూములను మాత్రమే ఆక్వారంగంలో చేపల చెరువులకు అనుమతించాలని మత్స్య, వ్యవసాయశాఖల అధికారులను ఆదేశించారు. మత్స్యశాఖ వద్ద ఉన్న 1159 దరఖాస్తుల పరిశీలన నిశితంగా చేపట్టాలని సూచించారు.
ఇన్నోవేటివ్ నిధుల పనులు త్వరగా పూర్తి చేయాలి
జిల్లాలో ఇన్నోవేటివ్ నిధులతో మంజూరు చేసిన పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ చాంబర్‌లో పనుల ప్రగతిపై సమీక్షించారు. మత్స్యశాఖ మూడు, ఉద్యానశాఖ రెండు ప్రాజెక్ట్‌లను రూ.2.44 కోట్లకు ప్రతిపాదించగా కలెక్టర్ ఆమోదించి అంచనాలు పంపాలని ఆదేశించారు.
యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి
637 పంచాయతీలను మార్చి మాసాంతానికి బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించేందుకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి మండల స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, పంట కుంతలు, వర్మీకంపోస్ట్ యూనిట్లు, అంగన్‌వాడీ భవనాలు, ఎన్టీఆర్ జలసిరి, గృహనిర్మాణం, అంశాలపై తహసీల్దార్లు, ఎండీఓలు, ఆర్డీవోలు, దత్తత అధికారులతో సమీక్షించారు. రెండువందల కంటే ఎక్కువ సంఖ్యలో మరుగుదొడ్లు కట్టాల్సిన గ్రామాలలో నిర్మాణ ప్రక్రియను కాంట్రాక్టర్లకు అప్పగించాలన్నారు. ఎన్‌టీఆర్ జలసిరి కింద డ్రిల్లింగ్ పూర్తయిన 800 బావులకు సోలార్ పంపుసెట్ల కోసం లబ్ధిదార్ల వాటా కట్టించి, పంపుల కోసం ట్రాన్స్‌కోకు ప్రతిపాదించాలని సూచించారు. ఈ సమీక్షల్లో జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జేసీ–2 జె.రాధాకృష్ణమూర్తి, జిల్లా రెవెన్యూ అధికారి చెన్నకేశవరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement