sakthi
-
ఏపీలో ‘దిశ’లాగే మహారాష్ట్రలో ‘శక్తి’..
సాక్షి, ముంబై: మొదటి రోజు మాదిరిగానే రెండో రోజూ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కాపీ (అనుకరణ), మాఫీతో గరంగరంగా సాగిన కార్యకలాపాలు రెండో రోజు కూడా దాదాపు అలాగే కొనసాగాయి. ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య ప్రారంభమైన గురువారం నాటి సభా కార్యకలాపాలు చివరకు ఆంధ్రప్రదేశ్‌లో మహిళల రక్షణకోసం తీసుకువచ్చిన ‘దిశ’ లాంటి చట్టాన్ని ‘శక్తి’ పేరుతో అమలు చేయాలనే ప్రతిపాదనను ఆమోదించుకున్నాయి. ఈ చట్టాన్ని ప్రతిపక్షాలు కూడా స్వాగతించాయి. ఇదిలాఉండగా సభ కార్యకలాపాల ప్రారంభానికి ముందు ప్రతిపక్ష నేతలందరూ అసెంబ్లీ హాలులోకి వెళ్లే మెట్లపై కూర్చున్నారు. అదే సమయంలో పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే రావడంతో మెట్లపై గుంపులో కూర్చున్న ఎమ్మెల్యే నితేశ్ రాణే ఆయన్ని చూస్తూ మ్యావ్, మ్యావ్ అంటూ శబ్ధం చేశారు. ఒకప్పుడు పులిలా గాండ్రించే శివసేన పార్టీ ఇప్పుడు పిల్లిలా మారిందని, దీన్ని గుర్తు చేయడానికే ఇలా మ్యావ్, మ్యావ్ మంటూ శబ్ధం చేశానని చెప్పి సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆదిత్య ఠాక్రే నితేశ్ రాణేను పట్టించుకోకుండా నేరుగా ముందుకు వెళ్లిపోయారు. సభా కార్యకలాపాలు ప్రారంభం కాగానే సభా ప్రాంగణంలో కొందరు సభ్యులు మాస్క్ లేకుండా తిరుగుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గమనించారు. దీంతో మాస్క్ ధరించని సభ్యులను (పరోక్షంగా బీజేపీ నాయకులు) సభ నుంచి బయటకు పంపించాలని డిప్యూటీ స్పీకర్ నరహరి జిరావల్కు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ ప్రభూ మాట్లాడుతూ ఆదిత్య ఠాక్రేకు వాట్సాప్‌లో బెంగళూర్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిందని, అది కర్నాటక నుంచే వచ్చిందని అన్నారు. చదవండి: (‘మహా’ అసెంబ్లీ సమావేశాలు: 10 మందికి పాజిటివ్) గతంలో దాబోల్కర్, పాన్సారేలను హత్య చేసిన హంతకులకు కర్నాటకతో సంబంధాలున్నాయి. కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతుందని ఘటనకు ముడిపెట్టే ప్రయత్నం చేశారు. దీంతో వెంటనే ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సునీల్ ప్రభూ ఈ అంశాన్ని కావాలనే రాజకీయం చేస్తున్నారని, అవసరమైతే తాను స్వయంగా కర్నాటక ముఖ్యమంత్రితో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని ఫడ్నవీస్ సభకు స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం ఉన్నంత మాత్రాన హంతకులతో సంబంధాలున్నట్లా? అన్ని ప్రశ్నిస్తూనే, సాక్షాలు లేనిదే అనవసరంగా ఆరోపణలు చేయవద్దని సభ్యులకు ఫడ్నవీస్ హితవు పలికారు. చదవండి: (Flight Charges: విమాన చార్జీల మోత) కొత్త చట్టంతో మహిళలకు సత్వర న్యాయం మహిళలపై, బాలికలపై జరుగుతున్న అత్యాచారాల ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలన్నా, నిందితులకు కఠిన శిక్షలు విధించాలన్నా ఆంధ్రప్రదేశ్‌లో దిశ చట్టం మాదరిగానే ‘శక్తి’ చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం ఎంతైన ఉందని ఎమ్మెల్యే అనిల్ దేశ్‌ముఖ్ అన్నారు. ఆ ప్రకారం శక్తి చట్టాన్ని అమలుచేసేందుకు రూపొం దించిన బిల్లుపై గత సంవత్సరం జరిగిన ఆర్థిక బడ్జెట్ సమావేశాల్లో చర్చించారు. ఈ చట్టం ద్వారా సమాజంలో మహిళలపై జరిగే వేధింపు లు, యాసిడ్ దాడులు, అసభ్యకర ప్రవర్తన తదిత ర నేరాలపై నాన్‌బెయిల్ కేసు నమోదు చేస్తారు. కేసు నమోదు చేసిన నెల రోజుల్లోనే విచారణ జరిపి తీర్పు వెల్లడించడం, ప్రతి జిల్లాలో దీనికోసం స్వతంత్రంగా దర్యాప్తు సంస్ధలు, ప్రత్యేక కోర్టులు స్ధాపించడం లాంటివి ఈ చట్టం ద్వారా సాధ్యమవుతుంది. రెండోరోజు జరిగిన సమావేశంలో శక్తి చట్టాన్ని అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించుకున్నాయి. అందుకు ప్రతిపక్షాలు కూడా సహకరించాయి. దీంతో ఇకనుంచి యాసి డ్ దాడులు, సామూహిక అత్యాచారం, హత్య చేసిన నిందితులకు సత్వరమే శిక్షలు విధించేందుకు ప్రత్యేక కోర్టు స్ధాపించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి అజీత్ పవార్ సభకు వెల్లడించారు. -
ఆడపిల్లల్ని వేదిస్తే తాట తీస్తారు!
ఆడపిల్ల కనిపిస్తే చాలు వెకిలి చేష్టలు మొదలెడతారు. వెంటపడతారు. వేధిస్తారు. పసిపిల్లల నుంచి పండు ముదుసలి వరకు ఎవర్నీ వదలరు. ఒంటరిగా కనిపిస్తే చాలు అఘాయిత్యాలకు పాల్పడతారు.. ఇకపై వారి ఆటలు సాగవు. కన్నెత్తి చూస్తే కుళ్లబొడుస్తారు. మాట జారితే తాట తీస్తారు. ఆడపిల్లల్ని వేధించే వారిపై అపర కాళికలవుతారు. వారే శక్తి టీమ్ సభ్యులు. మహిళల రక్షణ కోసం ఎస్పీ రాజకుమారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన బృందమే ఈ శక్తి టీమ్. ఎలాంటి సమస్యనైనా సమర్థవంతంగా ఎదుర్కొనగలిగేలా ఈ టీమ్‌ను తయారుచేసి రంగంలోకి దింపారు. ప్రత్యేక డ్రెస్ కోడ్‌లో ఆకట్టుకుంటూ బైక్‌పై రయ్ మంటూ దూసుకుపోతూ.. విద్యార్థినులు, మహిళలకు అవగాహన కలిగిస్తూ.. తామున్నామనే భరోసా కల్పిస్తున్నారు. సాక్షి, విజయనగరం: ప్రస్తుతం మహిళలపై ఇంటా.. బయటా అఘాయిత్యాలు, దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి. ఇంట్లో భర్త రోజూ వేధిస్తున్నా.. బయటి ప్రపంచానికి చెప్పుకోలేని మహిళలెందరో ఉన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో సహ విద్యార్థో.. ఉపాధ్యాయుడో.. అక్కడ పనిచేసే సిబ్బందో శారీరకంగా, మానసికంగా నరకయాతన చూపిస్తున్నా బయటికి చెప్పుకోలేని దుస్థితి. రోడ్లపై వెళ్తుంటే అసభ్యకరంగా ప్రవర్తించే ఆకతాయిలు.. కార్యాలయాల్లో ఇబ్బంది పెట్టే తోటి ఉద్యోగులు ఇలా పురుషుల ద్వారా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పరువు పోతుందనో.. సమాజం ఏమనుకుంటుందనో భావంతో బాధిత మహిళలు మౌనంగా ఉండిపోతున్నారు. అలాంటి వారికి అండగా నిలుస్తున్నారు శక్తి టీమ్ సభ్యులు. చట్టాలపై అవగాహన కలిగించి చైతన్యపరుస్తున్నారు. ఫలితంగా.. జిల్లా వ్యాప్తంగా బాధితురాళ్లు తమకు జరిగిన అన్యాయాలపై శక్తి టీమ్‌కు ఫోన్లో సమాచారమందిస్తున్నారు. 24 మందితో టీమ్‌ల ఏర్పాటు ఎస్పీ బి.రాజకుమారి ఈ ఏడాది జూన్ నెలలో శక్తి టీమ్‌లను ప్రారంభించారు. మహిళలపై దాడులను నిరోధించాలనే లక్ష్యంగా శక్తి బృందాలు పనిచేస్తాయి. ఇందుకోసం 24 మంది మహిళా కానిస్టేబుళ్లను పది శక్తి టీమ్‌లుగా ఏర్పాటు చేశారు. జిల్లాలోని ప్రతి సబ్ డివిజన్, డివిజన్ పరిధిలో ఈ టీమ్‌లు పనిచేస్తాయి. స్టేషన్ విధులతో సంబంధం లేకుండా మహిళా చట్టాలపై అవగాహన కల్పించేందుకు.. మహిళలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈవ్ టీజింగ్‌ను అదుపు చేసేందుకు పనిచేస్తాయి. కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన సదస్సులు ఏర్పాటుచేసి మహిళా చట్టాలపై అవగాహన కలిగిస్తాయి. శక్తి బృందాలకు మహిళా పీఎస్ డిఎస్పీ పెంటారావు నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. కంట్రోల్ రూమ్ సీఐ సుభద్రమ్మ బృందాల పనితీరును పర్యవేక్షిస్తారు. శక్తి బృందాల పనితీరు రోజూ పర్యవేక్షించి, ఎస్పీకీ నివేదికను అదనపు ఎస్పీ ఎం.నరసింహారావు అందజేస్తారు. శక్తి బృందాలకు ప్రత్యేక శిక్షణ కానిస్టేబుళ్లుగా శిక్షణ ఇచ్చే సమయంలోనే శక్తి బృందాల్లో చేరేందుకు ఆసక్తి ఉన్న వారందరూ ముందుకు రావాలని సూచించారు. ముందుకొచ్చిన వారందరికీ ప్రత్యేక శిక్షణ అందజేశారు. వీరికి ప్రత్యేకంగా స్కూటర్, కారు డ్రైవింగ్, ఈత, కరాటే, కుంగ్‌పూ, మహిళలు, చిన్న పిల్లల నేరాలకు సంబంధించిన చట్టాలు, పలు సామాజిక కోణాల్లో సమస్యను పరిష్కరించే విధానాలపై శిక్షణ ఇచ్చారు. దీంతో శక్తి టీమ్ శక్తిమంతమై రంగంలోకి దిగింది. మహిళలు, విద్యార్థినుల ఆనందం శక్తి టీమ్‌లు ప్రారంభమై రెండు నెలలైనప్పటికీ మహిళలు, విద్యార్థినుల మనసులో స్థానం పొందాయి. శక్తి టీమ్‌ల పుణ్యమా అని కళాశాల వద్ద అల్లరిమూకలు కనిపించకపోవడంతో విద్యార్థినులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయా టీమ్‌ల పరిధిలో ఎక్కడికక్కడ శక్తిటీమ్ డయల్ 100, 121, 1090 లేక వాట్సాప్ నంబర్ 6309898989కి కాల్ చేయమని సూచిస్తున్నారు. సంఘటన స్థలం చెబితే సెకెన్లలో అందుబాటులో ఉండి సమస్యను పరిష్కరిస్తామని భరోసా కల్పిస్తుండటంతో బాధితుల్లో ధైర్యం పెరిగింది. ఇక సమస్య తీవ్రతను బట్టి ఆ ప్రాంత పోలీస్ స్టేషన్ అధికారి వద్ద సమస్యలను వివరించి, వాటికి కూడా పరిష్కారం చూపించడంతో ఎంతో మంది మహిళలు, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు శక్తి టీమ్‌ను అభినందిస్తున్నారు. ఇళ్లల్లో ఎదుర్కొంటున్న సమస్యలను సైతం శక్తి టీమ్‌ల దృష్టికి తీసుకొస్తుండటంతో భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చి సమస్య పరిష్కరిస్తున్నారు. ఇలా విద్యార్థినులు, మహిళల మనసులో శక్తి టీమ్‌లు చెరగని ముద్ర వేసుకుంటున్నాయి. ఆకట్టుకుంటున్న డ్రస్ కోడ్ ఖాకీ ప్యాంట్, నీలం రంగు షర్ట్, టోపీ, బూట్లతో శక్తి టీమ్ సభ్యులు విదేశీ పోలీసుల్లా ఆకట్టుకుంటున్నారు. వీరు ప్రయాణించే ద్విచక్ర వాహనం ముందు భాగాన పోలీస్ చిహ్నం, ఏపీ పోలీస్, మరో వైపు శక్తి.. మహిళలకు చేరువ.. అనే నినాదాలు ఆకర్షిస్తున్నాయి. మహిళలు ఎక్కువగా ఉండే కూడళ్లు, కళాశాలల జంక్షన్లు, షాపింగ్ మాల్స్, బస్టాండ్ల వద్ద వీరు వారికిచ్చిన షెడ్యూల్ ప్రకారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఎక్కువగా కనిపిస్తారు. శక్తి బృందాల స్వరూపం శక్తి బృందాలు 10 మహిళా కానిస్టేబుళ్ల సంఖ్య 24 శక్తి టీమ్ నంబర్లు 100, 121, 1090 శక్తి వాట్సాప్ నంబర్ 6309898989 విజయనగరం 3 బృందాలు పార్వతీపురం 2 బృందాలు గజపతినగరం 1 బృందం బొబ్బిలి 1 బృందం సాలూరు 1 బృందం కొత్తవలస 1 బృందం గరివిడి 1 బృందం వేటాడుతున్నాం ఆడపిల్లలను కాపాడుకునే అవకాశం మాకు దక్కడం ఆనందంగా ఉంది. బయటి ప్రపంచంలో ఆడపిల్లల విషయంలో ఏం జరుగుతోందనేది పూర్తి అవగాహన ఉంది. సమస్య ఉన్న ప్రతి చోటా అడుగడుగునా వేటాడుతున్నాం. చాలా మంది ప్రత్యేక యూనిఫాంలో మమ్మల్ని చూసి దగ్గరికొచ్చి సమస్య చెబుతున్నారు. – కంది శాంతి, కానిస్టేబుల్, గుర్ల పోలీస్ స్టేషన్ ముందుకొస్తున్నారు శక్తిటీమ్లో పనిచేస్తున్న మమ్మల్ని మహిళలు, విద్యార్థినులు సొంత మనుషుల్లా భావిస్తున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను మా దృష్టికి తీసుకొస్తున్నారు. సమస్య పరిష్కారమైతే ఎంతో కృతజ్ఞత చూపుతున్నారు. రోడ్లపై మా యూనిఫాంలు చూసి వారి సమస్యలను చెప్పుకొనేందుకు ముందుకొస్తున్నారు. – వైఎం లెనీనా, కానిస్టేబుల్, భోగాపురం పోలీస్ స్టేషన్ ధైర్యంగా చెబుతున్నారు ఉద్యోగినులు, కళాశాల విద్యార్థినులు ధైర్యంగా వచ్చి తమ సమస్యలు చెప్పుకొంటున్నారు. తమ ఇబ్బందులను ఇంట్లో వారికి చెబితే చదువులు ఆపేస్తారనే భయంతో విద్యార్థినులు మాకు చెప్పుకొంటున్నారు. దీంతో అధికారుల సహకారంతో వారి సమస్యల్ని పరిష్కరిస్తూ భరోసా కల్పిస్తున్నాం. – పి.అచ్చియమ్మ, కానిస్టేబుల్, జామి పోలీస్ స్టేషన్ ఆనందంగా ఉంది శక్తి టీమ్ ద్వారా విద్యార్థినులకు ఓ నమ్మకం కలిగించాం. వారికి అండగా నిలవడం మాకు ఆనందంగా ఉంది. మా విధుల్లో కొత్తదనం ఉంది. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను కొంతవరకూ అరికడుతున్నామనే సంతృప్తి ఉంది. – ఆర్.దేవి, టూ టౌన్ కానిస్టేబుల్, విజయనగరం నమ్మకం కలిగించాం సహజంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను భర్తలతో సైతం చెప్పుకొనేందుకు ముందుకు రారు. ఇక పోలీసుల దృష్టికి వెళ్తే పరువు పోతుందని భావిస్తారు. కానీ మమ్మల్ని పూర్తిగా నమ్ముతున్నారు. మా యూనిఫాం వేరుగా ఉండటం, పోలీసుల్లా కాకుండా, కుటుంబ సభ్యుల్లా వారితో కలిసిపోతుండటంతో మా వద్దకు వచ్చి సమస్యలు చెబుతున్నారు. వాటి పరిష్కారానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నాం. – టి.యమున, కానిస్టేబుల్, గంట్యాడ పోలీస్ స్టేషన్ ఆత్మ స్థయిర్యం నింపేందుకే.. ఆడపిల్లలు తమ కాళ్లమీద తాము నిలబడాలంటే చదువే ముఖ్యం. ఆ చదువును ఆకతాయి చేష్టల వల్ల మధ్యలో ఆపేయకూడదు. అందుకే వారికి ఆత్మ స్థయిర్యం కల్పించేందుకు శక్తి టీమ్‌ను ఏర్పాటు చేశాం. తొమ్మిది సర్కిల్స్‌లో ఈ టీమ్ పనిచేస్తుంది. అన్ని పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి అవగాహన కల్పిస్తారు. నిఘా వేస్తారు. బస్టాండ్, ఆటో స్టాండ్లలో మహిళలకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ వారికి భరోసా కల్పించేందుకు పెట్రోలింగ్ నిర్వహిస్తారు. మగపిల్లలు ఇలాంటి నేరాలకు పాల్పడితే వారి భవిష్యత్తు ఏంటనేది వివరిస్తున్నారు. ఒకసారి కేసు నమోదైతే వారి జీవితం నాశనమైనట్టే. తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. – బి.రాజకుమారి, ఎస్పీ, విజయనగరం -
విశాఖ వనితకు కొత్త శక్తి
మహిళలకు మరింత రక్షణ కల్పించడం.. భద్రతపై వారిలో అవగాహన కల్పించడమే లక్ష్యంగా పోలీసు శాఖలో కొత్తగా శక్తి టీములను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో తొలిసారి విశాఖలోనే ఈ బృందాన్ని గురువారం డీజీపీ ఆర్.పి.ఠాకూర్ ప్రారంభించారు. 35 మంది మహిళా కానిస్టేబుళ్లతో ఏర్పాటైన ఈ బృందానికి జీపీఎస్ తదితర అధునాతన సాంకేతిక వ్యవస్థతో కూడిన 5 కార్లు, 26 యాక్టివా స్కూటర్లు సమకూర్చారు. వీటిని 100, 1090 నెంబర్లతో అనుసంధానించారు. మహిళలకు సంబంధించి వీటికి వచ్చే ఫిర్యాదులకు శక్తి టీం సభ్యులు వెనువెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకుంటారు. ద్వారకానగర్(విశాఖ దక్షిణ): మహిళలకు మరింత రక్షణకు గాను ‘శక్తి’ టీం మొబైల్ క్యాప్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డీజీపీ ఆర్.పి.ఠాకూర్ తెలిపారు. ఆర్కేబీచ్లో పోలీస్ మెస్ వద్ద శక్తి టీం మొబైల్ క్యాప్స్‌ను సీపీ మహేష్‌చంద్రలడ్డాతో కలిసి ఆయన జెండా ఊపి గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో 18 యూనిట్లతో శక్తి టీంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విశాఖ నగరంలో 35 మంది మహిళా పోలీసులతో శక్తి టీం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీరికి 5 కార్లు, 26 హోండా యాక్టివ్ వాహనాలు అందుబాటులో ఉంటాయన్నారు. మహిళలపై దాడులు, ఈవ్ టీజింగ్‌లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాయన్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు సిబ్బంది విధులు నిర్వహిస్తారన్నారు. అలాగే ఈ టీంలు నగరంలో వివిధ విద్యా సంస్థల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తాయన్నారు. ఈ టీంలు పోలీస్ కంట్రోల్ రూమ్ (డయల్–100, 1090) దగ్గరలో ఉన్న జీపీఎస్ వైరల్ సెట్ ద్వారా అనుసంధానమై ఉంటాయన్నారు. 35 మంది శక్తి టీం సభ్యులు విజయనగరంలోని పీటీసీలో 21 రోజులపాటు శిక్షణ పొందారని తెలిపారు. వీరికి టూ వీలర్, ఫోర్ వీలర్ వాహనాల డైవింగ్, ఆత్మరక్షణ, మహిళలపై జరిగే నేరాలపై తీసుకొనే చట్టపరమైన చర్యలపై శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. ఈ టీం సభ్యులు నీలం రంగు షర్ట్, ఖాకీ ప్యాంట్ యూనిఫారం కలిగి ఉంటారన్నారు. రాత్రి వేళ రెండు టీంలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాబోయే రోజుల్లో శక్తి టీంలు పెంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రవీంధ్రబాబు, అదామ్ నయిన్ ఆశ్మీ, ఏడీసీపీలు, సురేష్‌బాబు, రమేష్‌కుమార్, శ్రీనివాస్, ఎ.వి.రమణ, ఏసీపీలు, ఆర్.శ్రీనివాస్‌రావు, పూర్ణచంద్రరావు, వై.వి.నాయుడు, మల్లేశ్వరరావు, కె.ప్రభాకర్, దేవప్రసాద్, టేకు మోహన్‌రావు, టాస్క్ఫోర్సు ఏసీపీ మహేంద్ర, ప్రవీణ్‌కుమార్, ఎం.ఆర్.కె.రాజు, త్రినా«థరావు, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆమె..శక్తిమంతం
షర్ట్‌పై కెమెరా.. చేతిలో వాకీటాకీ.. ఎల్లప్పుడు అందుబాటులో ఉండేందుకు ప్రత్యేక బ్యాటరీ సైకిల్.. నిరంతర గస్తీ.. అత్యవసర సమయాల్లో రయ్ మంటూ దూసుకెళ్లేందుకు ప్రత్యేకంగా కారు. ఇక ఈవ్ టీజింగ్‌కు నో చాన్స్.. మందుబాబుల అల్లర్లు జాన్తా నయ్.. ఎవరైనా కట్టుదాటారా.. ఊచలు లెక్కపెట్టాల్సిందే. అంతేమరి.. మహిళల రక్షణ, భద్రత లక్ష్యంగా విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ‘శక్తి’ టీం ఈ నెల 17 నుంచి చార్జ్ తీసుకోనుంది. సాక్షి, అమరావతిబ్యూరో : మహిళల రక్షణ, భద్రత కోసం ‘శక్తి’ టీమ్‌లు రాజధాని రహదారులపైకి రానున్నాయి. డీజీపీ ఠాకూర్ ఆదేశాల మేరకు బెజవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలో పైలెట్ ప్రాజెక్టుగా ఈ బృందాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ టీమ్ సభ్యులకు పోలీసు శాఖ ప్రత్యేక శిక్షణను ఇచ్చింది. ఇటీవలె శిక్షణ పూర్తి చేసుకున్న ఈ బృందాలు 17 నుంచి తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి. ఐదు టీమ్‌లు.. నిరంతరం గస్తీ పోలీసు కమిషనరేట్‌లో కొత్తగా చేరిన 70 మంది మహిళా కానిస్టేబుళ్లతో మహిళా శక్తి బృందం ఏర్పాటు చేశారు. ఈ బృందం వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో విధులు నిర్వహిస్తారు. సమాజంలో పెరుగుతున్న వివిధ రకాల నేరాలు, వాటి నివారణ, జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు గురించి చేరువ వాహనం ద్వారా ప్రజలకు వివరిస్తారు. మేమున్నామంటూ భరోసా కల్పిస్తారు. దీని కోసం ఈ మహిళా శక్తి బృందానికి పలు అంశాల్లో శిక్షణ ఇచ్చారు. నగర కమిషనరేట్ పరిధిలోని ఐదు జోన్లలో ఐదు బృందాలను నియమించనున్నారు. ఒక్కొ బృందంలో ఏడుగురు ఒక్కో బృందంలో ఏడుగురు మహిళా పోలీసులు ఉంటారు. వీరికి శిక్షణలో యోగా, జూడో, కరాటే, స్విమ్మింగ్, డ్రైవింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్‌తోపాటు మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. నగర పోలీసు కమిషనర్ ద్వారకాతిరుమలరావు ఆధ్వర్యంలో పనిచేసే ‘శక్తి’ టీమ్ నగరంలో నిరంతరం ఈ–బైస్కిళ్లపై గస్తీ నిర్వహిస్తూ ఆకతాయిలపై నిఘా పెడతారు. మహిళల భద్రతే ధ్యేయం.. మహిళల భద్రత, రక్షణే లక్ష్యంగా ఈ బృందాలు పనిచేస్తాయి. ప్రత్యేక పోలీసు డ్రెస్‌లో ఉండే శక్తి టీమ్స్ సభ్యులు నగరంలో నిత్యం గస్తీ నిర్వహిస్తూ మహిళలకు రక్షణ కవచంలా ఉంటారు. మహిళలను ఎవరైనా వేధించినా.. వెకిలి చేష్టలకు పాల్పడినా తక్షణమే వారిని అదుపులోకి తీసుకుంటారు. అమ్మాయిల వెంటబడి ఏడిపించే ఆకతాయిలు.. బస్టాపుల్లో ఆడపిల్లల్ని వేధించేవారు.. మద్యం తాగి హడావుడి చేసేవారు.. ఇకపై ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే. కాదని కట్టుదాటారా.. ఇక ఊచలు లెక్కపెట్టాల్సిందే అంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు. పోకిరీలపై నిఘా.. ముఖ్యంగా విద్యార్థినులపై వేధింపులు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే పోకరీలను అరెస్టు చేసి చట్ట ప్రకాశం శిక్షించడం వీరి విధి. ఈవ్టీజర్ల తల్లిదండ్రులను పోలీసు స్టేషన్‌కు పిలిపించి వారి సమక్షంలో కౌన్సెలింగ్ ఇవ్వడం, మళ్లీ పట్టుబడితే నిర్భయ కేసును నమోదు చేయడం ‘శక్తి’ బృంద సభ్యుల ముఖ్య నిర్వహణ. చట్టాలపై అవగాహన.. సైబర్ నేరాలు, ఈవ్‌టీజింగ్ నిరోధక చట్టాలు, సమాజంలో జరిగే వివిధ తరహా నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తారు. బృంద సభ్యులు నగరంలో ఆకతాయిల ఆట కట్టించటమే కాకుండా కాలనీలు, రహదారులపై గస్తీ తిరుగుతూ శాంతిభద్రతల పరిరక్షణలో ముఖ్యభూమిక పోషిస్తారు. -
రేపటి నుంచి స్వచ్ఛశక్తి సప్తాహం
అధికారుల సమీక్షలో కలెక్టర్ అరుణ్‌కుమార్ కాకినాడ సిటీ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలో మార్చి ఒకటి నుంచి 8వ తేదీ వరకు స్వచ్ఛశక్తి సప్తాహం ద్వారా మహిళా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ అరుణ్‌కుమార్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కోర్టు హాలులో వివిధ శాఖలఅధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తాగునీరు, పారిశుద్ధ్యం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సప్తాహంలో పారిశుద్ధ్య నిర్వహణలో కృషిచేసిన మహిళలకు సత్కారం, మహిళలకు, బాలికలకు ఆటల పోటీలు, పారిశుద్ధ్యంపై పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు, బహిరంగ మల విసర్జన లేని గ్రామాలలో అవగాహన పర్యటనలు నిర్వహిస్తారన్నారు. వేసవిలో నీటిఎద్దడి లేకుండా జాగ్రత్తలు చేపట్టాలని, జిల్లాలో నీటి సమస్య ఉండే ప్రాంతాలను గుర్తించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకంలో ప్రస్తుతం 89,500 పని దినాలు కల్పిస్తున్నారని, వాటిని పెంచాలని సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ సమన్వయ నిధులతో చేపట్టే పనుల ప్రతిపాదనలను రెండు రోజుల్లో ఇవ్వాలని ఆదేశించారు. ఆహార భద్రతకు ముప్పు రాకూడదు ప్రాథమిక రంగ అభివృద్ధికి మత్స్య పరిశ్రమను ప్రోత్సహిస్తున్నప్పటికీ చేపల చెరువుల మూలంగా ఆహారభద్రతకు ముప్పు రాకూడదని çకలెక్టర్ స్పష్టం చేశారు. వ్యవసాయానికి పనికిరాని భూములు, ఉత్పత్తి తగ్గిన భూములను మాత్రమే ఆక్వారంగంలో చేపల చెరువులకు అనుమతించాలని మత్స్య, వ్యవసాయశాఖల అధికారులను ఆదేశించారు. మత్స్యశాఖ వద్ద ఉన్న 1159 దరఖాస్తుల పరిశీలన నిశితంగా చేపట్టాలని సూచించారు. ఇన్నోవేటివ్ నిధుల పనులు త్వరగా పూర్తి చేయాలి జిల్లాలో ఇన్నోవేటివ్ నిధులతో మంజూరు చేసిన పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ చాంబర్లో పనుల ప్రగతిపై సమీక్షించారు. మత్స్యశాఖ మూడు, ఉద్యానశాఖ రెండు ప్రాజెక్ట్‌లను రూ.2.44 కోట్లకు ప్రతిపాదించగా కలెక్టర్ ఆమోదించి అంచనాలు పంపాలని ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి 637 పంచాయతీలను మార్చి మాసాంతానికి బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించేందుకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి మండల స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, పంట కుంతలు, వర్మీకంపోస్ట్ యూనిట్లు, అంగన్వాడీ భవనాలు, ఎన్టీఆర్ జలసిరి, గృహనిర్మాణం, అంశాలపై తహసీల్దార్లు, ఎండీఓలు, ఆర్డీవోలు, దత్తత అధికారులతో సమీక్షించారు. రెండువందల కంటే ఎక్కువ సంఖ్యలో మరుగుదొడ్లు కట్టాల్సిన గ్రామాలలో నిర్మాణ ప్రక్రియను కాంట్రాక్టర్లకు అప్పగించాలన్నారు. ఎన్టీఆర్ జలసిరి కింద డ్రిల్లింగ్ పూర్తయిన 800 బావులకు సోలార్ పంపుసెట్ల కోసం లబ్ధిదార్ల వాటా కట్టించి, పంపుల కోసం ట్రాన్స్‌కోకు ప్రతిపాదించాలని సూచించారు. ఈ సమీక్షల్లో జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జేసీ–2 జె.రాధాకృష్ణమూర్తి, జిల్లా రెవెన్యూ అధికారి చెన్నకేశవరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.