మహిళలకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు
షర్ట్‌పై కెమెరా.. చేతిలో వాకీటాకీ.. ఎల్లప్పుడు అందుబాటులో ఉండేందుకు ప్రత్యేక బ్యాటరీ సైకిల్.. నిరంతర గస్తీ.. అత్యవసర సమయాల్లో రయ్ మంటూ దూసుకెళ్లేందుకు ప్రత్యేకంగా కారు. ఇక ఈవ్ టీజింగ్‌కు నో చాన్స్.. మందుబాబుల అల్లర్లు జాన్‌తా నయ్.. ఎవరైనా కట్టుదాటారా.. ఊచలు లెక్కపెట్టాల్సిందే. అంతేమరి.. మహిళల రక్షణ, భద్రత లక్ష్యంగా విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ‘శక్తి’ టీం ఈ నెల 17 నుంచి చార్జ్ తీసుకోనుంది.
సాక్షి, అమరావతిబ్యూరో : మహిళల రక్షణ, భద్రత కోసం ‘శక్తి’ టీమ్‌లు రాజధాని రహదారులపైకి రానున్నాయి. డీజీపీ ఠాకూర్ ఆదేశాల మేరకు బెజవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలో పైలెట్ ప్రాజెక్టుగా ఈ బృందాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ టీమ్ సభ్యులకు పోలీసు శాఖ ప్రత్యేక శిక్షణను ఇచ్చింది. ఇటీవలె శిక్షణ పూర్తి చేసుకున్న ఈ బృందాలు 17 నుంచి తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి.
ఐదు టీమ్‌లు.. నిరంతరం గస్తీ
పోలీసు కమిషనరేట్‌లో కొత్తగా చేరిన 70 మంది మహిళా కానిస్టేబుళ్లతో మహిళా శక్తి బృందం ఏర్పాటు చేశారు. ఈ బృందం వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో విధులు నిర్వహిస్తారు. సమాజంలో పెరుగుతున్న వివిధ రకాల నేరాలు, వాటి నివారణ, జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు గురించి చేరువ వాహనం ద్వారా ప్రజలకు వివరిస్తారు. మేమున్నామంటూ భరోసా కల్పిస్తారు. దీని కోసం ఈ మహిళా శక్తి బృందానికి పలు అంశాల్లో శిక్షణ ఇచ్చారు. నగర కమిషనరేట్ పరిధిలోని ఐదు జోన్లలో ఐదు బృందాలను నియమించనున్నారు.
ఒక్కొ బృందంలో ఏడుగురు
ఒక్కో బృందంలో ఏడుగురు మహిళా పోలీసులు ఉంటారు. వీరికి శిక్షణలో యోగా, జూడో, కరాటే, స్విమ్మింగ్, డ్రైవింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్‌తోపాటు మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. నగర పోలీసు కమిషనర్ ద్వారకాతిరుమలరావు ఆధ్వర్యంలో పనిచేసే ‘శక్తి’ టీమ్ నగరంలో నిరంతరం ఈ–బైస్కిళ్లపై గస్తీ నిర్వహిస్తూ ఆకతాయిలపై నిఘా పెడతారు.
మహిళల భద్రతే ధ్యేయం..
మహిళల భద్రత, రక్షణే లక్ష్యంగా ఈ బృందాలు పనిచేస్తాయి. ప్రత్యేక పోలీసు డ్రెస్‌లో ఉండే శక్తి టీమ్స్ సభ్యులు నగరంలో నిత్యం గస్తీ నిర్వహిస్తూ మహిళలకు రక్షణ కవచంలా ఉంటారు. మహిళలను ఎవరైనా వేధించినా.. వెకిలి చేష్టలకు పాల్పడినా తక్షణమే వారిని అదుపులోకి తీసుకుంటారు. అమ్మాయిల వెంటబడి ఏడిపించే ఆకతాయిలు.. బస్టాపుల్లో ఆడపిల్లల్ని వేధించేవారు.. మద్యం తాగి హడావుడి చేసేవారు.. ఇకపై ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే. కాదని కట్టుదాటారా.. ఇక ఊచలు లెక్కపెట్టాల్సిందే అంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు.
పోకిరీలపై నిఘా..
ముఖ్యంగా విద్యార్థినులపై వేధింపులు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే పోకరీలను అరెస్టు చేసి చట్ట ప్రకాశం శిక్షించడం వీరి విధి. ఈవ్‌టీజర్ల తల్లిదండ్రులను పోలీసు స్టేషన్‌కు పిలిపించి వారి సమక్షంలో కౌన్సెలింగ్ ఇవ్వడం, మళ్లీ పట్టుబడితే నిర్భయ కేసును నమోదు చేయడం ‘శక్తి’ బృంద సభ్యుల ముఖ్య నిర్వహణ.
చట్టాలపై అవగాహన..
సైబర్ నేరాలు, ఈవ్‌టీజింగ్ నిరోధక చట్టాలు, సమాజంలో జరిగే వివిధ తరహా నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తారు. బృంద సభ్యులు నగరంలో ఆకతాయిల ఆట కట్టించటమే కాకుండా కాలనీలు, రహదారులపై గస్తీ తిరుగుతూ శాంతిభద్రతల పరిరక్షణలో ముఖ్యభూమిక పోషిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment