she teams
-
ఖైరతాబాద్ గణేశుడి నవరాత్రి ఉత్సవాలు.. వెయ్యిమంది కీచకుల అరెస్ట్
సాక్షి,హైదరాబాద్ : గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో కీచకులు రెచ్చిపోయారు. గణేష్ నవరాత్రల్లో మహిళలను తాకుతూ కీచకులు వేధించారు. ఖైరతాబాద్ గణేష్ వద్ద 11 రోజుల్లో సుమారు వెయ్యిమందిని కీచకుల్ని షీటీమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కీచకులను పట్టుకునేందుకు పోలీసులు స్పై ఆపరేషన్ చేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకునేందుకు వచ్చిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ పట్టుబడ్డారని, తదుపరి చట్టపరమైన చర్యల కోసం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి, తగిన శిక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. -
ఖైరతాబాద్‌లో షీ టీమ్స్ ఫోకస్.. 285 మంది పోకిరీలు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గణపతి నవ రాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలిస్తున్నారు. ఈ క్రమంలో మహిళల పట్ల కొందరు ఆకతాయిలు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో, పోకిరీలకు షీ టీమ్స్ చెక్‌పెడుతున్నాయి. గణేష్ ఉత్సవాల్లో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన 285 మంది అకతాయిలను షీ టీమ్స్ పట్టుకున్నారు.కాగా, గణేష్ ఉత్సావాల సందర్భంగా ఖైరతాబాద్ బడా గణపతి వద్దకు వేలాది సంఖ్యలో మహిళలు, యువతులు హాజరయ్యారు. ఈ క్రమంలో వారి పట్ల కొందరు ఆకతాయిలు అనుచితంగా ప్రవర్తించారు. గడిచిన ఏడు రోజుల్లో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన 285 మందిని అరెస్ట్ చేసినట్టు షీ టీమ్స్ తెలిపాయి. ఇక, గణేష్ ఉత్సవాల్లో మహిళల భద్రతపై హైదరాబాద్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ సందర్భంగా మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఇది కూడా చదవండి: ఖైరతాబాద్‌లో కిక్కిరిసిన భక్త సందోహం -
అతివకు అండగా..
ఆడ బిడ్డ.. ఇంటి నుండి బయటికొస్తే అడుగడుగునా వంకరచూపులే. బస్టాపు మొదలు కాలేజీ, కార్యాలయం, కార్ఖానా.. ప్రదేశం ఏదైనా అవకాశం దొరికితే వెకిలి చేష్టలు, వేధింపులు.. డబుల్ మీనింగ్ డైలాగులతో టార్చర్. ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నా..సెల్‌ఫోన్‌కు అసభ్య సందేశాలు, ప్రేమ పేరుతో పలకరింపులు, వద్దని తిరస్కరిస్తే ఫొటోల మార్ఫింగ్‌లతో బ్లాక్‌మెయిలింగ్‌లు. ఇవీ.. పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా నేటి మహిళను వెంటాడుతున్న అతిపెద్ద సమస్యలు. భయం, కుటుంబ పరువు ,ప్రతిష్ట, గౌరవం దృష్ట్యా అనేకమంది ఈ నిత్య వేధింపులను భరిస్తున్నారు. షీ టీమ్స్ లేదా పోలీసుల వద్దకు వచ్చి నిర్భయంగా ఫిర్యాదు చేస్తున్నవారు కొందరే. అందుకే ‘సాక్షి’ ఇక మీ నేస్తం అవుతోంది. ఇంటా బయట, చదివే చోట, పని ప్రదేశంలో, ప్రయాణంలో, చివరకు ‘నెట్’ఇంట్లో.. ఇలా ఎక్కడ, ఎలాంటి వేధింపులు ఎదురవుతున్నా 8977794588 నంబర్‌కు వాట్సాప్ ద్వారా తెలపండి. మీ సమస్యల్ని ‘సాక్షి’ తెలంగాణ మహిళా భద్రతా విభాగం డీజీ శిఖా గోయల్ దృష్టికి తీసుకెళ్తుంది. మూడో కంటికి తెలియకుండా మీ సమస్యకు పరిష్కారం చూపుతుంది. భయం వీడండి..ధైర్యంగా ముందుకు కదలండి. వేధింపుల నుంచి విముక్తి పొందండి. -
అతివకు అండగా..
ఆడ బిడ్డ.. ఇంటి నుండి బయటికొస్తే అడుగడుగునా వంకరచూపులే. బస్టాపు మొదలు కాలేజీ, కార్యాలయం, కార్ఖానా.. ప్రదేశం ఏదైనా అవకాశం దొరికితే వెకిలి చేష్టలు, వేధింపులు.. డబుల్ మీనింగ్ డైలాగులతో టార్చర్. ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నా..సెల్‌ఫోన్‌కు అసభ్య సందేశాలు, ప్రేమ పేరుతో పలకరింపులు, వద్దని తిరస్కరిస్తే ఫొటోల మార్ఫింగ్ లతో బ్లాక్‌మెయిలింగ్‌లు. ఇవీ.. పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా నేటి మహిళను వెంటాడుతున్న అతిపెద్ద సమస్యలు. భయం, కుటుంబ పరువు ,ప్రతిష్ట, గౌరవం దృష్ట్యా అనేకమంది ఈ నిత్య వేధింపులను భరిస్తున్నారు. షీ టీమ్స్ లేదా పోలీసుల వద్దకు వచ్చి నిర్భయంగా ఫిర్యాదు చేస్తున్నవారు కొందరే. అందుకే ‘సాక్షి’ ఇక మీ నేస్తం అవుతోంది. ఇంటా బయట, చదివే చోట, పని ప్రదేశంలో, ప్రయాణంలో, చివరకు ‘నెట్’ఇంట్లో.. ఇలా ఎక్కడ, ఎలాంటి వేధింపులు ఎదురవుతున్నా 8977794588 నంబర్‌కు వాట్సాప్ ద్వారా తెలపండి. మీ సమస్యల్ని ‘సాక్షి’ తెలంగాణ మహిళా భద్రతా విభాగం డీజీ శిఖా గోయల్ దృష్టికి తీసుకెళ్తుంది. మూడో కంటికి తెలియకుండా మీ సమస్యకు పరిష్కారం చూపుతుంది. భయం వీడండి..ధైర్యంగా ముందుకు కదలండి. వేధింపుల నుంచి విముక్తి పొందండి.నోట్: పేరు, వివరాలు గోప్యంగా ఉంచాలని కోరితే..వారి అభిప్రాయాలను ‘సాక్షి’ గౌరవిస్తుంది -
ప్రత్యేక చట్టమూ లేదు... ఠాణా హోదా రాదు!
సాక్షి, హైదరాబాద్: యువతులు, మహిళలను వేధించే పోకిరీలకు చెక్ చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం 2014లో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన షీ–టీమ్స్ గత ఎనిమిదేళ్లుగా ఎనలేని సేవలు అందిస్తున్నా నేటికీ వాటికి ప్రత్యేక చట్టం, కనీసం పోలీసుస్టేషన్ హోదా లేకపోవడంతో బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగట్లేదు. నేరాల తీవ్రత ఎక్కువగా ఉండి, పక్కా ఆధారాలు ఉంటే తప్ప ఆకతాయిలపై ఐపీసీతోపాటు ఇతర చట్టాల కింద కేసులు నమోదు చేయడం సాధ్యం కావట్లేదు. గతేడాది రాజధానిలోని మూడు కమిషనరేట్లలో ఉన్న షీ–టీమ్స్‌కు అందిన ఫిర్యాదులు, పట్టుబడ్డ పోకిరీల సంఖ్య 2,322గా నమోదైనప్పటికీ వాటిలో 395 మాత్రమే ఎఫ్ఐఆర్లుగా నమోదయ్యాయి. మిగిలిన వాటిలో కొన్ని పెట్టీ కేసులు కాగా, మరో 1,798 మందికి కౌన్సెలింగ్‌తో సరిపెట్టాల్సి వచ్చింది. ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతూ రెండోసారి చిక్కిన ఓ వ్యక్తితోపాటు తీవ్రస్థాయిలో రెచ్చిపోయిన వారిపైనే కేసులు నమోదు చేయగలిగారు. ప్రత్యేక చట్టం కోసం... ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు ఈవ్‌టీజర్లను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు ప్రత్యేక చట్టం అవసరమని భావించారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాలను అధ్యయనం చేసి చివరకు తమిళనాడులో అమలవుతున్న ‘తమిళనాడు ప్రొహిబిషన్ ఆఫ్ ఈవ్ టీజింగ్ యాక్ట్’ఉపయుక్తంగా ఉందని తేల్చారు. అక్కడి చట్టంలోని అంశాలతోపాటు ఇతర అంశాలను చేరుస్తూ ఓ ముసాయిదాను రూపొందించి 2014లోనే ప్రభుత్వానికి పంపారు. అయితే ఈ ఫైలు న్యాయశాఖ వద్ద పెండింగ్‌లో ఉండిపోయింది. పోలీసుస్టేషన్ల మెట్లెక్కాల్సిందే... షీ–టీమ్స్ ఏర్పడి ఇన్నాళ్లైనా ఇప్పటికీ వాటికి పోలీసుస్టేషన్ హోదా ఇచ్చే అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదు. తమ బాధలు, సమస్యలు పోలీసుస్టేషన్లో చెప్పుకోలేక చాలామంది అతివలు షీ–టీమ్స్‌ను ఆశ్రయిస్తున్నా కేసు నమోదు తప్పనిసరైతే ఆ పనిని ఠాణా హోదా లేని షీటీమ్స్ చేయలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా బాధితురాలు నివసించే పరిధిలో ఉండే మహిళా ఠాణా, సైబర్‌క్రైమ్ పోలీసుస్టేషన్... ఇలా ఏదో ఒక చోటకు బాధితురాలిని తీసుకెళ్లి షీ–టీమ్స్ కేసులు నమోదు చేయిస్తున్నాయి. అయితే అక్కడ అధికారులకు నిత్యం వస్తున్న అనేక కేసుల్లో ఇదీ ఒకటిగా మారిపోతోంది. దీంతో షీ–టీమ్స్‌పై ఉన్న నమ్మకం, ధైర్యంతో వచ్చిన బాధితురాళ్లకు నిరాశ తప్పట్లేదు. షీ–టీమ్స్‌కే ఠాణా హోదా ఇచ్చి అవసరమైన సిబ్బందిని కేటాయిస్తే వాటి లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ‘షీ–టీమ్స్’ ముసాయిదా చట్టంలోని కొన్ని అంశాలు బహిరంగ ప్రదేశాలతోపాటు పని చేసే ప్రాంతాలు, మాల్స్... ఇలా ఎక్కడైనా ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతూ చిక్కిన పోకిరీలపై నేరం నిరూపణ అయితే ఏడాది జైలు లేదా రూ. 10 వేల జరిమానా లేదా రెండూ. ఈవ్ టీజింగ్ చేయడానికి పోకిరీలు వాహనాలను వినియోగిస్తే వాటిని స్వాధీనం చేసుకొనే వీలు. దేవాలయాలు, విద్యాసంస్థలు తదితర చోట్ల జరిగే ఈవ్ టీజింగ్‌లను నిరోధించాల్సిన బాధ్యత వాటి నిర్వాహకులదే. అలాంటి సమాచారాన్ని తక్షణం సంబంధిత పోలీసులకు చేరవేయాల్సిందే. దీనికి భిన్నంగా వ్యవహరిస్తే ఆ నేరానికి యాజమాన్యాలనూ బాధ్యుల్ని చేయవచ్చు. వారికి న్యాయస్థానం జరిమానా విధించే అవకాశం. -
అతివలకు భరోసా.. హైదరాబాద్‌లో సైబర్ షీ–టీమ్స్ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు, యువతులకు మరింత భరోసా ఇవ్వడానికి హైదరాబాద్ నగర పోలీసు విభాగం చర్యలు చేపట్టింది. ఈ మేరకు కొత్తగా సైబర్ షీ–టీమ్స్‌ను ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నిర్ణయించారు. ఈ బృందాల్లో సాంకేతిక నిపుణులతోపాటు ఎథికల్ హ్యాకర్లు కూడా ఉండనున్నారు. ఈవ్‌టీజింగ్ సహా వివిధ రకాల వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు, యువతులు, బాలికల కోసం షీ–టీమ్స్ పని చేస్తున్నాయి. ఈవ్‌టీజర్లపై కన్నేసి రెడ్çహ్యాండెడ్‌గా పట్టుకోవడం దగ్గరి నుంచి కుటుంబ సమస్యల పరిష్కారం వరకు అనేక విధాలుగా అండగా నిలుస్తున్నాయి. కానీ ఇటీవల కాలంలో వేధింపుల తీరు మారింది. స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ‘ఈ–పోకిరీ’లు పెరిగిపోయారు. వారు బాహ్య ప్రపంచంలో కాకుండా సోషల్ మీడియా ద్వారా రెచి్చపోతున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్.. ఇలా వివిధ రకాల ప్లాట్‌ఫామ్స్ కేంద్రంగా వేధింపులకు పాల్పడుతున్నారు. వారికి చెక్ చెప్పడానికే సైబర్ షీ–టీమ్స్ ఏర్పాటు చేయనున్నారు. బయటికి చెప్పుకోలేక భరిస్తూ.. ఆన్లైన్ వేధింపుల బారినపడుతున్న అతివల్లో అనేక మంది తమకు ఎదురైన ఇబ్బందులను బయటికి చెప్పుకోలేకపోతున్నారు. వేధింపులకు పాల్పడుతున్నవారి నుంచి వస్తున్న బెదిరింపులకు తోడు పరువు పోతుందనే ఉద్దేశంతో మిన్నకుండిపోతున్నారు. ఈ పరిస్థితిని అలుసుగా తీసుకుంటున్న మోసగాళ్లు మరింతగా రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ షీ–టీమ్స్‌కు వస్తున్న ఫిర్యాదుల్లో 60శాతం దాకా ఆన్లైన్ వేధింపులకు సంబంధించినవే ఉంటున్నాయి. శాంతిభద్రతల విభాగం, సైబర్ క్రైమ్ ఠాణాలకు వస్తున్న సైబర్ కేసుల్లోనూ వేధింపులకు సంబంధించినవే అధికంగా ఉంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే.. 2022లో సైబర్ నేరాల కేసులు 9,815 నమోదుకాగా.. వీటిలో సైబర్ వేధింపులకు సంబంధించినవి 1,118, అశ్లీల సందేశాలు పంపడానికి సంబంధించినవి 141 ఉన్నాయి. ఈ వేధింపులు, అశ్లీల సందేశాల కేసుల్లో బాధితులు మహిళలు, యువతులే. దీనికితోడు ఇటీవలి కాలంలో ప్రేమ ముసుగులో జరిగే ‘ఈ–నేరాలు’ పెరిగిపోయాయి. వాటితో యువతులు, మహిళలు వ్యక్తిగతంగా, మానసికంగా, ఆర్థికంగా నష్టపోతున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో.. సైబర్ వేధింపులు ఎదురైన బాధితులు నేరుగా షీ–టీమ్స్ వద్దకు రావాల్సిన అవసరం లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఫోన్, వాట్సాప్, ఫేస్బుక్.. ఇలాంటి మార్గాల్లోనూ ఫిర్యాదు చేయవచ్చని చెప్తున్నారు. బాధితుల వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సైబర్ షీ–టీమ్స్‌కు వచ్చే ఫిర్యాదులకు సంబంధించిన అంశాలను దర్యాప్తు చేయడం, నిందితులను గుర్తించి పట్టుకోవడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతోపాటు ప్రత్యేక టూల్స్ వినియోగించనున్నారు. ఆయా అంశాల్లో నిష్ణాతులైన వారిని బృందాల్లో నియమించనున్నారు. అవసరమైతే డార్క్‌నెట్‌ను కూడా ఛేదించే నైపుణ్యమున్న ఎథికల్ హ్యాకర్ల సేవలను వినియోగించుకుంటారు. ఇప్పటికే సిటీ పోలీసు విభాగం మహేశ్ బ్యాంకు కేసు సహా పలు సైబర్ నేరాల దర్యాప్తు కోసం ఎథికల్ హ్యాకర్ల సేవలు వినియోగించుకుంది. స్మార్ట్‌ఫోన్ కూడా చేటుకు కారణం! ఒకప్పుడు ఫోన్ విలాసవస్తువు. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ నిత్యావసరంగా మారిపోయింది. ఇవి వచ్చాక ఎవరికి వారికి ‘స్వేచ్ఛ’ పెరిగింది. ఆకర్షణను ప్రేమగా భావిస్తున్న యువతులు అపరిచితులతోనూ హద్దులు దాటుతున్నారు. కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత అంశాలను రికార్డు చేయడాన్నీ పట్టించుకోవడం లేదు. ఓ దశలో ఇవే వారి పాలిట శాపంగా మారుతున్నాయి. ఏటా నమోదవుతున్న సైబర్ నేరాల్లో ఈ తరహాకు చెందినవి పెద్ద సంఖ్యలో ఉంటున్నాయి. సైబర్ షీ–టీమ్స్ ఏర్పాటుతో పరిస్థితులు మారే అవకాశం ఉంది. – సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవల షీ–టీమ్స్‌కు వచ్చిన ‘ఈ–కేసు’ల్లో కొన్ని... ► బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొంతకాలం హైదరాబాద్‌లోని ఓ మలీ్టనేషనల్ కంపెనీలో పనిచేశాడు. అప్పట్లో తన సహోద్యోగిని అయిన యువతిపై ఆన్లైన్లో వేధింపులకు పాల్పడ్డాడు. ఈ–మెయిల్స్, సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ద్వారా అభ్యంతరకర ప్రచారానికి దిగాడు. పోలీసులు సదరు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను అరెస్టు చేశారు. ► హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లికి చెందిన ఓ మరుగుజ్జు యువకుడు ఫేజ్‌బుక్‌లో తనదేనంటూ ఓ అందమైన యువకుడి ఫొటో పెట్టాడు. ఓ యువతి ‘ఫ్రెండ్’గా పరిచయం కావడంతో చాటింగ్ ప్రారంభించాడు. ప్రేమ పేరుతో వలవేసి.. అనేక కారణాలు చెప్పి ఆమె నుంచి రూ.3 లక్షల నగదు, 50 తులాల బంగారం స్వాహా చేశాడు. ► ఓ వ్యక్తి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. గతంలో ప్రాజెక్టు వర్క్ నేపథ్యంలో పరిచయమైన యువతిని ప్రేమించాడు. ఆమె తిరస్కరించడంతో కక్షగట్టాడు. ఓ ల్యాప్‌టాప్, డేటాకార్డ్ కొనుగోలు చేసి.. సదరు యువతి మెయిల్ ఐడీని హ్యాక్ చేశాడు. ఆమె బంధువులు, స్నేహితులకు ఆమే పంపిస్తున్నట్టుగా అసభ్య చిత్రాలు, సందేశాలు పంపాడు. చదవండి: Telangana: గ్రూప్–4లో 8,039 పోస్టులే! -
Delhi Acid Attack: జాగ్రత్త... ప్రమాదం పొంచే ఉంది
యాసిడ్ అమ్మకాల మీద నిఘా పెట్టాం. మహిళల రక్షణకు చట్టాలు కఠినతరం చేశాం. షీ టీమ్స్ సిద్ధంగా ఉన్నాయి. యాప్స్ డెవలప్ అయ్యాయి. నిజమే. కాని ప్రమాదం పొంచే ఉంది. ఢిల్లీలో తాజా యాసిడ్ దాడి ఘటన ఈ విషయమే నిర్థరిస్తోంది. ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ (ఎన్.సి.ఆర్.బి) నివేదిక ప్రకారం 2021లో దేశవ్యాప్తంగా 176 యాసిడ్ దాడులు నమోదయ్యాయి. మరో 73 అటెంప్ట్స్ జరిగాయి. అంటే ప్రమాదం పొంచే ఉంది. నిర్లక్ష్యం ఏ మాత్రం పనికి రాదు. వాస్తవాలు ఆందోళన కలిగిస్తున్నప్పుడు ఎవరి జాగ్రత్తలో వారు ఉండటం మంచిది. 2013లో సుప్రీం కోర్టు యాసిడ్ అమ్మకాల మీద జవాబుదారీ ఉండాలని చెప్పింది. రిజిస్టర్ మెయింటెయిన్ చేయాలని చెప్పింది. అంతే కాదు ఐ.డి.ప్రూఫ్ లేకుండా యాసిడ్ అమ్మకూడదు. అలా చేస్తే 50 వేల రూపాయల ఫైన్ ఉంది. అయితే 2016లో ఢిల్లీలో కొంతమంది పోలీసులు మఫ్టీలో యాసిడ్ కొన ప్రయత్నిస్తే 23 షాపులు ఎవరు ఏమిటి అనకుండా అమ్మారు. అప్పుడు గగ్గోలు అయ్యింది. తాజాగా ఢిల్లీలో జరిగిన యాసిడ్ దాడిలో నిందితుడు ఫ్లిప్‌కార్ట్ ద్వారా యాసిడ్‌ను కొన్నాడని పోలీసులు గుర్తించారు. ఇప్పుడు ఆన్లైన్ అమ్మకం దారులను యాసిడ్ అమ్మకాలపై జాగ్రత్త వహించవలసిందిగా తాకీదులు పంపుతున్నారు. అంటే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే. పరిస్థితి దారుణం కోవిడ్ కాలంలో తప్ప దేశంలో యాసిడ్ దాడులు జరుగుతూనే ఉన్నాయి. స్త్రీలు బలవుతూనే ఉన్నారు. ప్రేమ వద్దన్నారని, ప్రేమలో ఉన్నాక బ్రేకప్ చెప్పారని, పెళ్లయ్యాక విడిపోయారని రకరకాల కారణాల వల్ల పురుషులు ద్వేషంతో యాసిడ్ దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. 2016 నుంచి 2021 మధ్య 1300 యాసిడ్ దాడులు జరిగాయి. విషాదం ఏమిటంటే ఈ యాసిడ్ దాడుల్లో నేరస్తులకు శిక్ష పడుతున్న శాతం అతి తక్కువగా ఉండటం. 400 కేసులు నమోదు అయితే 10 మందికి మాత్రమే శిక్ష పడుతోందంటే ఎన్ని విధాలుగా తప్పించుకుంటున్నారో, తప్పించుకోవచ్చులే అనే ధైర్యంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అప్రమత్తత అవసరం విద్యార్థినులు, యువతులు, స్త్రీలు తమకు తారసపడుతున్న ప్రేమ, వైవాహిక బంధాలలో పురుషుల ధోరణి పట్ల అప్రమత్తంగా ఉండాలి. బెదిరిస్తున్నవారిని, వద్దనుకున్నా వెంటపడుతున్నవారిని, ఒకవేళ బంధం నుంచి బయటపడాలనుకుంటే ఆ మగవారిని గమనించి వారి ధోరణి ప్రమాదకరంగా అనిపిస్తే ముందే కుటుంబ సభ్యుల, పోలీసుల మద్దతు తీసుకోవాలి. ముఖ్యంగా ఇష్టం లేని ప్రేమ ప్రతిపాదిస్తున్నప్పుడు, ప్రేమలో నుంచి బ్రేకప్ చెబుతున్నప్పుడు, విడాకుల సందర్భాలలో ఒంటరిగా తిరిగేటప్పుడు అప్రమత్తంగా ఉండటం, ఎవరైనా అపరిచితుడు లేదా పాత మిత్రుడు దగ్గరిగా వస్తుంటే జాగ్రత్త పడటం, అసలు వీలైనంత సామరస్యంగా, ఒప్పుదలతో బంధాల నుంచి బయటపడటం... ఇవన్నీ ముఖ్యమైనవే. దేశంలో యాసిడ్ దాడులను నిర్మూలించామని ఎవరూ హామీ ఇవ్వడం లేదు. కనుక మన రక్షణకు మనమే బాధ్యత వహించాలి. కుటుంబం, పోలీసుల వద్ద సమస్యను దాచకుండా సాయం పొందాలి. (క్లిక్ చేయండి: వరతమ్మా నీకు వందనాలమ్మా!) -
పాఠశాలల్లో ‘షీ’క్రెట్ ఏజెంట్స్.. గుడ్, బ్యాడ్ టచ్‌లపై శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ లోని పాఠశాలలు, వసతి గృహాల్లో మైనర్లపై అఘాయిత్యాలు పెరిగాయి. సెలవుల్లో ఇంటికి వెళ్లిన పిల్లలు ప్రవర్తన చూసి తల్లిదండ్రులు ఆరా తీస్తే తప్ప అక్కడేం జరిగిందో బయటపడటం లేదు. పోలీసులంటే పిల్లల్లో నెలకొన్న భయం, ఇతరత్రా కారణాలతో సంఘటన జరిగిన వెంటనే విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించడంలో జాప్యం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు సరికొత్త కార్యాచరణ రూపొందించారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేటు, ప్రభుత్వ వసతి గృహాలలో షీ టీమ్స్ గూఢచారులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటి పనేంటంటే? ప్రతి సంస్థలో వంద మంది విద్యార్థులకు 5–10 మంది ఆసక్తి ఉన్న వలంటీర్లను గూఢచారులుగా ఎంపిక చేసి వీరికి గుడ్, బ్యాడ్ టచ్‌లతో పాటు పోక్సో చట్టం, కేసులు, శిక్షలు వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఆకతాయిలపై ఎలా నిఘా వేయాలి, పోలీసులను సంప్రదించే తీరు, ఏ సమస్యపై ఎలా స్పందించాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి? వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు. దీంతో ఆయా విద్యా సంస్థలు, వసతి గృహాలలోని విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించిన వెంటనే బృందం సభ్యులు గుర్తించి, వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తారు. నివాసిత సంఘాల్లోనూ.. నివాసిత సంఘాలలో ఆత్మహత్యలు, గృహ హింస కేసులు పెరిగిపోతున్నాయి. వీటిని నివారించేంవదుకు గృహ కమ్యూనిటీలలోనూ స్వచ్ఛంద బృందాలను ఏర్పాటు చేయాలని సైబరాబాద్ షీ టీమ్స్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరిస్తే మేలని సైబరాబాద్ షీ టీమ్స్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అందుకే హౌసింగ్ కమ్యూనిటీలలో స్వచ్ఛంద గ్రూప్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ గ్రూపులో పోలీసులు, మనస్తత్వ నిపుణులు, న్యాయ సలహాదారులు, వైద్య నిపుణులు, సామాజిక కార్యకర్తలు సభ్యులుగా ఉంటారు. సైబరాబాద్‌లోని ప్రతి కమ్యూనిటీల్లో ఈ సభ్యుల ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంటాయని ఉన్నతాధికారి తెలిపారు. (క్లిక్: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కీలక ప్రకటన.. ఏడాదికి యాక్షన్ ప్లాన్) -
ముస్లిం మహిళల కోసం ‘షీ ఎరా’
సాక్షి, హైదరాబాద్: మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న రాచకొండ పోలీసులు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. షీ టీమ్స్ ఎంపవరింగ్ రూరల్ ఆస్పిరెంట్స్ (షీ ఎరా) అనే ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం కింద గ్రామీణ మహిళల్లో ఆత్మవిశ్వాసం, స్వయం ఉపాధి కల్పించేందుకు కుట్టు మిషన్‌లో శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ (ఆర్కేఎస్సీ) మహిళా విభాగం, రాచకొండ పోలీసు కమిషనరేట్ భాగస్వామ్యమయ్యారు. త్వరలోనే పహాడీషరీఫ్‌లో ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ వంటి శిక్షణ ఇస్తారు. ఇందుకు వందల సంఖ్యలో దరఖాస్తులు రాగా.. తొలి విడతలో 50 మంది మహిళలను ఎంపిక చేశారు. వీరిని రెండు బ్యాచ్‌లుగా విభజించి, రోజుకు నాలుగు గంటల చొప్పున ఆరు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. వారికే ఎందుకంటే? ఇటీవలి కాలంలో పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికలను, పిల్లలను వ్యభిచార గృహ నిర్వాహకులకు విక్రయించడం, మానవ అక్రమ రవాణా తదితర కేసులు వెలుగు చూశాయి. ఆయా కేసులలో బాధితులను విచారించగా.. వ్యసనాలకు అలవాటు పడిన భర్తతో విసుగుచెంది, కన్న పిల్లలను పోషించే ఆరి్ధక స్థోమత లేకపోవడంతో పిల్లలను అమ్ముకుంటున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. చట్ట ప్రకారం వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నప్పటికీ.. నిరక్షరాస్యులైన మహిళలకు జీవనోపాధి కల్పిస్తే సమస్యను కొంత వరకు పరిష్కరించవచ్చని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. (చదవండి: భాద్యత నాది సమ్మె విరమించండి) -
నిమజ్జనంలో నికృష్ట పనులు.. 240 మంది పోకిరీల పట్టివేత
సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి నుంచి నిమజ్జనం వరకు జరిగిన నవరాత్రి ఉత్సవాలపై నగర షీ– టీమ్స్‌కు చెందిన ప్రత్యేక బృందాల డేగకన్ను ఫలితంగా 240 మంది పోకిరీలు చిక్కినట్లు అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ సోమవారం ప్రకటించారు. నిమజ్జనం రోజుతో పాటు విగ్రహాలను ఏర్పాటు చేసిన మండపాల దగ్గరా షీ–టీమ్స్ నిఘా వేశాయి. మఫ్టీల్లో, రహస్య కెమెరాలతో ఉన్న ఈ బృందాలకు మహిళలు, యువతులను వేధిస్తున్న 240 మంది పోకిరీలు చిక్కారు. వీరిని పక్కా సాక్ష్యాలతో సంబంధిత కోర్టుల్లో హాజరుపరిచినట్లు ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. పోకిరీలకు కనిష్టంగా రెండు నుంచి గరిష్టంగా పది రోజుల వరకు జైలు శిక్ష విధించినట్లు చెప్పారు. షీ–టీమ్స్ కృషిని కొత్వాల్ సీవీ ఆనంద్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థినులపై హెచ్ఎం అసభ్యకర ప్రవర్తన మహబూబాబాద్ రూరల్: విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఓ హెచ్ఎంను పాఠశాలకు రావద్దని.. విద్యార్థుల తల్లిదండ్రులు, తండావాసులు వెళ్లగొట్టారు. మహబూబాబాద్ దూదియ తండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం షేక్ సర్వర్ పాషా కొన్నిరోజులుగా తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఐదుగురు విద్యార్థినులు శుక్రవారం వారి తల్లిదండ్రులకు చెప్పారు. సోమవారం వారందరూ పాఠశాలకు చేరుకుని హెచ్ఎంను నిలదీశారు. పిల్లలకు విద్యాభోధన చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. అయితే, తనను క్షమించమని, ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా పనిచేస్తానని ఉపాధ్యాయుడు చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే.. కొన్ని రోజులుగా మద్యం తాగి పాఠశాలకు వచ్చి హెచ్ఎం తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని విద్యార్థినులు ఆరోపించారు. గతంలోనూ ఇలాగే ప్రవర్తించాడని, ఇంట్లో చెబుతామంటే వద్దన్నాడని తెలిపారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పర్వతగిరి జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం రాందాస్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపించిన డీఈఓ.. ఉపాధ్యాయుడు సర్వర్ పాషాను సస్పెండ్ చేశారు. (చదవండి: హాస్టల్లో కామాంధుడు.. విద్యార్థులకు వీడియోలు చూపించి..) -
ఆర్టీసీ బస్సులో మహిళలతో కండక్టర్ అసభ్యకర ప్రవర్తన
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఓ మహిళా ప్రయాణికురాలి పట్ల కండక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో రంగంలోకి దిగిన షీ టీమ్స్.. అతడిని అదుపులోకి తీసుకున్నాయి. ఈ ఘటన నాచారం పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నగరంలోని సిటీ ఆర్టీసీ బస్సుల్లో ఓ మహిళా ప్రయాణికురాలితో కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సయీద్ అమీన్(40) బస్సులో మహిళా ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. బస్సు టికెట్స్ ఇచ్చే క్రమంలో మహిళా ప్రయాణీకులను తాకరాని చోట తాకుటుండటంతో వారు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఈ క్రమంలో ఓ మహిళా ప్రయాణీకురాలు ధైర్యం చేసి నాచారాం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఈ విషయాన్ని టీ షీమ్స్ దృష్టికి తీసుకెళ్లారు. రంగంలోకి దిగిన షీ టీమ్స్.. బస్సులో నిఘా ఉంచి కండక్టర్ అమీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇది కూడా చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను.. ఇలా చేస్తాడని ఎవరు అనుకోరు -
ఇక వీకెండ్ షీ టీమ్స్.. ఈ ప్రాంతాల్లో ఫోకస్
సాక్షి, హైదరాబాద్: ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ నుంచి ఆఫీస్ వైపు క్రమంగా మొగ్గుచూపుతున్నాయి. దీంతో ఉద్యోగుల రాక పెరిగిపోయింది. ఇదే సమయంలో మహిళా ఉద్యోగులకు రక్షణ, భద్రత కల్పించేందుకు సైబరాబాద్ షీ టీమ్ బృందాలు సిద్ధమయ్యాయి. బృందాల సంఖ్యను పెంచడంతో పాటు, మఫ్టీలో గస్తీ కాస్తూ పోకిరీల ఆట కట్టిస్తున్నాయి. విదేశీ సంస్థలకు సేవలందించే చాలా వరకు ఐటీ కంపెనీలు 24 గంటలు పని చేస్తుంటాయి. దీంతో రాత్రి వేళలో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు రక్షణ కల్పించేందుకు షీ టీమ్ స్పెషల్ ఫోకస్ పెట్టాయి. కీలక ప్రాంతాల్లో తిష్ట వేసుకునే అల్లరి మూకల ఆగడాలను కట్టించేందుకు ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ విభాగం ప్రత్యేకంగా వీకెండ్ షీ టీమ్స్‌ను ఏర్పాటు చేసింది. పెరిగిన షీ టీమ్స్.. మహిళల భద్రత, రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న సైబరాబాద్ పోలీసులు గతంలో నాలుగు షీ టీమ్స్ ఉండగా.. వాటి సంఖ్యను 11కు పెంచారు. ఆన్లైన్లో, ఆఫ్‌లైన్ ఫిర్యాదు అందిన క్షణాల్లోనే పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి చర్యలు తీసుకుంటున్నారు. జన సమ్మర్థం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో వీకెండ్ షీ టీమ్స్ మఫ్టీలో గస్తీ కాస్తున్నారు. మహిళలను కామెంట్ చేసినా, అసభ్యకరంగా ప్రవర్తించినా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని చర్యలు తీసుకుంటున్నారు. షీ టీమ్స్‌కు తోడుకు పెట్రోలింగ్ సిబ్బంది ఉంటూ అర్ధరాత్రి హల్చల్ చేసే పోకిరీల ఆటకట్టిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఫోకస్.. ఐటీ కారిడార్‌లో షీ టీమ్స్ ఎక్కువగా ఫోకస్ పెట్టాయి. గచ్చిబౌలి, రాయదుర్గం, కూకట్పల్లి, మియాపూర్, చందానగర్, మాదాపూర్ ప్రాంతాల్లోని ఫుడ్ కోర్ట్లు, లేడిస్ హాస్టల్స్, మెట్రో స్టేషన్లు, షాపింగ్ మాల్స్ వంటి పలు ప్రాంతాలలో షీ టీమ్స్ ప్రత్యేక దృష్టిసారించాయి. (క్లిక్: ఆమ్నీషియా పబ్ కేసు.. మరో అమ్మాయిపైనా వేధింపులు!) -
పోకిరీ మైనర్!
సాక్షి, సిటీబ్యూరో: ఈవ్ టీజర్ల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మహిళలు, అమ్మాయిలను నడి రోడ్డు మీదే అసభ్య పదజాలంతో దూషించడం, ఫోన్, సోషల్ మీడియాలలో వేధిస్తున్నారు. 319 మంది ఈవ్ టీజర్లకు, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో సైబరాబాద్ షీ టీమ్స్ కౌన్సెలింగ్ ఇచ్చాయి. వీరిలో 98 మంది మైనర్లే ఉన్నారు. 19–24 ఏళ్ల వయస్కులు 112 మంది ఉండగా.. 25–35 ఏళ్ల వాళ్లు 92 మంది, 36–50 ఏళ్ల వయస్సు వారు 17 మంది ఉన్నారు. గత రెండు నెలలో సైబరాబాద్ షీ టీమ్‌కు వివిధ మాధ్యమాల ద్వారా 355 ఫిర్యాదులు అందాయి. వీటిలో అత్యధికంగా 299 ఫిర్యాదుల వాట్సాప్ ద్వారా చేయగా.. ట్విటర్లో 8 మంది, హ్యాక్ ఐలో 7 మంది, ఈ–మెయిల్ ద్వారా 5 మంది, ఉమెన్ సేఫ్టీ వింగ్ ద్వారా 36 మంది, భౌతికంగా 30 మంది ఫిర్యాదు చేశారు. ఫోన్లో మహిళలను వేధించే ఆకతాయిలే ఎక్కువ. గత రెండు నెలలలో 141 పిటీషన్లు ఈ తరహావే కావటం గమనార్హం. ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తున్నారని 34 మంది, సోషల్ మీడియాలో 33, బెదిరింపులు 33, స్టాల్కింగ్ 35 మంది, పెళ్లి చేసుకుంటానని మోసం పోయిన మహిళలు 19 మంది, అసభ్యప్రవర్తన 31, వాట్సాప్‌లో వేధింపులు 11, కామెంట్లు 7 మంది, రహస్యంగా మహిళల ఫొటోలు, వీడియోల చిత్రీకరణ 3, పని ప్రదేశాలలో వేధింపులు 3, ప్రేమ సమస్యలు 2, ఫ్లాషింగ్ 2 మంది మహిళా బాధితులున్నారు. 7 బాల్య వివాహాలకు చెక్.. గత రెండు నెలల వ్యవధిలో సైబరాబాద్ కమిషనరేట్‌లో 7 బాల్య వివాహాలను షీ టీమ్‌లు అడ్డుకున్నాయి. 81 కేసులను నమోదు చేశాయి. వీటిలో 18 క్రిమినల్ కేసులు కాగా.. 63 పెట్టీ కేసులున్నాయి. బస్టాప్స్, రైల్వే స్టేషన్లు, మాల్స్, కాలేజీలు వంటి బహిరంగ ప్రదేశాలలో 1,003 డెకాయ్ ఆపరేషన్లను నిర్వహించారు. ఆయా ప్రాంతాలలో 248 మంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడగా.. వీటిలో 117 పెట్టీ కేసులను నమోదు చేశారు. మిగిలిన ఆకతాయిలను కౌన్సెలింగ్‌కు పంపించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రాత్రి సమయాల్లో నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్లలో 75 మంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్, సైబరాబాద్ షీ టీమ్ సంయుక్తంగా కలిసి కౌన్సెలింగ్ ఇచ్చాయి. -
నా భార్య విడాకులిమ్మని వేధిస్తోంది
సాక్షి, హైదరాబాద్: మహిళలకు, పిల్లలకు భద్రత, రక్షణ కల్పించేందుకు ఏర్పాటు చేసిన షీ టీమ్స్‌కు.. అదే మహిళలపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ఏడాది వివిధ ప్రాంతాల్లోని అయిదుగురు పురుష బాధితులు మహిళలపై సైబరాబాద్ భరోసా సెంటర్లో ఫిర్యాదు చేశారు. ఇలా మహిళలపై గతేడాది 20 కేసులు నమోదు కాగా.. 2019లో 7 ఫిర్యాదులు అందాయి. తాజాగా మైలార్‌దేవ్‌పల్లికి చెందిన ఓ భర్త.. తన భార్య విడాకులు ఇవ్వమంటూ ఏడాది కాలంగా వేధిస్తోందని సైబరాబాద్ భరోసా కేంద్రాన్ని ఆశ్రయించాడు. సైబరాబాద్ పరిధిలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన బాధితుడు మద్యానికి బానిసగా మారి భార్యను మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. దీంతో భార్య అతని నుంచి దూరంగా జీవనం గడుపుతోంది. తన తప్పు తెలుసుకున్నానని, భార్యతో కలిసి ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతానని పోలీసులే న్యాయం చేయాలని కోరుతూ సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. తన భర్త మీద నమ్మకం లేకపోవటంతో సదరు మహిళ.. తాను భర్తతో కలిసి ఉండలేనని, కౌన్సెలింగ్‌కు ఇకపై రానంటూ పోలీసులకు తేల్చి చెప్పింది. పెద్దల సమక్షంలోనే తాడోపేడో తేల్చుకుంటానని తెలిపింది. గత నెలలో 73 కేసులు.. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సంయుక్తంగా కలిసి 2018 అక్టోబర్‌లో భరోసా సెంటర్‌ను ఏర్పాటు చేశాయి. సెప్టెంబర్ నెలలో సైబరాబాద్ భరోసా కేంద్రానికి 73 ఫిర్యాదులు అందాయి. ఇందులో 72 గృహ హింస, ఒకటి పోక్సో కేసు ఉంది. కాగా 35 జంటలను ఒక్కటి చేశారు. 13 ఫిర్యాదులను ఎఫ్ఐఆర్ నమోదు నిమిత్తం సంబంధిత పోలీస్ స్టేషన్లకు సూచించారు. అలాగే 12 మందికి టెలిఫోన్ ద్వారా కౌన్సెలింగ్ ఇచ్చారు. 10 ఫిర్యాదులను న్యాయపరమైన సూచన కోసం రిఫర్ చేశారు. 3 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వాట్సాప్‌లో ఫిర్యాదు చేయండి ఫిర్యాదు అందిన తక్షణమే బాధితులు, ప్రతివాదులు ఇరువురికి కౌన్సెలింగ్ ఇస్తాం. వాట్సాప్ ద్వారా సైబరాబాద్ భరోసా కేంద్రం అందిస్తున్న సేవలపై బాధితుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి. 94906 17261 వాట్సాప్ నంబర్ ద్వారా గానీ 040–29882977, డయల్ 100 నంబర్ల ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. – అనసూయ, డీసీసీ, సైబరాబాద్ షీ టీమ్స్ చదవండి: ఏమైందో.. ఏమో.. -
తెలంగాణ: మహిళలపై నేరాలు జరిగే ప్రాంతాల గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రతకు కీలక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర పోలీసు విభాగం దానికోసం సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటోంది. ఇందులో భాగంగా అమలులోకి తీసుకువచ్చిన పోలీసు అంతర్గత యాప్ ‘షీ–టీమ్స్’లో కొత్త హంగులు చేర్చింది. యువతులు, మహిళలపై నేరాలు జరిగే ప్రాంతాలను గుర్తించి జియోట్యాగింగ్ చేస్తోంది. ఈ మ్యాప్స్‌ను అప్లికేషన్లో ఉంచడం ద్వారా ఉమెన్ సేఫ్టీ వింగ్ ప్రత్యేక పర్యవేక్షణకు మార్గం సుగమమైంది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు ఎక్కడైనా షీ–టీమ్స్ పనితీరు, స్పందన ఒకేలా ఉండేందుకు ఈ యాప్ వినియోగిస్తున్నారు. దీన్ని పోలీసు విభాగం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. నిఘా మూసధోరణిలో కాకుండా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 370 షీ–టీమ్స్ పనిచేస్తున్నాయి. ఈ బృందాలు మఫ్టీలో సంచరిస్తూ ఈవ్‌టీజర్లు, మహిళలపై వేధింపులకు పాల్పడే వారిపై నిఘా వేసి ఉంచుతున్నాయి. సాధారణంగా బస్టాండ్లు, రైల్వేస్టేషన్లతో పాటు ఇతర పబ్లిక్ ప్లేసుల్లో ఈ బృందాలు సంచరిస్తుంటాయి. అన్ని వేళలా, అన్ని ప్రాంతాల్లోనూ ఉండటం సాధ్యం కాకపోవడంతో కొన్ని సందర్భాల్లో షీ–టీమ్స్ నిఘా మూస ధోరణిలో సాగుతోంది. ఉదాహరణకు హైదరాబాద్‌లోని కోఠి ఉమెన్స్ కాలేజ్ బస్టాప్ వద్ద వీళ్లు ఎక్కువ నిఘా ఉంచితే... ముషీరాబాద్‌లో ఈవ్‌టీజింగ్ జరుగుతుంటుంది. ఇలాంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక నగరాలు, పట్టణాలు, జిల్లాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే షీ–టీమ్స్ యాప్‌లో జియోట్యాగింగ్‌ను చేర్చారు. మ్యాప్‌పై ఆ ప్రాంతాలు ప్రత్యక్షం హైదరాబాద్ కేంద్రంగా పని చేసే ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇలాంటి హాట్‌స్పాట్స్‌ను ఎప్పటికప్పుడు గుర్తిస్తుంటుంది. ఆయా ప్రాంతాల్లో నమోదైన కేసులు, వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా వీటిని గుర్తిస్తుంది. మ్యాప్‌పై ఆ వివరాలు పొందుపరుస్తూ జియోట్యాగింగ్ చేస్తుంది. రాష్ట్రంలోని అన్ని షీ–టీమ్స్ వద్ద ఈ యాప్ అందుబాటులో ఉంది. అందులోని మ్యాప్‌లో ఈవ్‌టీజింగ్ హాట్‌స్పాట్స్‌ను నిర్దేశిస్తుంటుంది. దీని ఆధారంగా ఆయా ప్రాంతాలను తెలుసుకునే సిబ్బంది వాటిపైనే ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. కాలమాన పరిస్థితులను బట్టి ఈ హాట్‌స్పాట్స్ మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఉమెన్ సేఫ్టీ వింగ్ ఈ మ్యాప్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ షీ–టీమ్స్‌ను సమాచారం అందేలా చేస్తుంటుంది. ఆ ఫిర్యాదులన్నీ ఈ యాప్‌లోకి.. ఈవ్‌టీజింగ్ తరహాలో మహిళలపై జరిగే నేరాలు, వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులనూ ఈ యాప్‌లోకి తీసుకువస్తున్నారు. షీ–టీమ్స్ కేంద్రాలు, భరోస కేంద్రాలు, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ వింగ్, సైబర్ క్రైమ్... ఇలా కేటగిరీల వారీగా మహిళలు, యువతులపై జరిగే నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు రాష్ట్రంలో ఎక్కడ వచ్చినా వాటిని షీ–టీమ్స్ యాప్‌లో పొందుపరుస్తారు. ఫిర్యాదులోని అంశాలను బట్టి ఆయా విభాగాలకు దీన్ని బదిలీ చేస్తారు. సదరు ఫిర్యాదుపై అధికారులు, సిబ్బంది స్పందించిన తీరు, సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలు, పరిష్కరించిన విధానాలను ఈ యాప్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. పోకిరీల వివరాలు, వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన ప్రాంతాలు, సమయం, తేదీలు ఇందులో నిక్షిప్తం అవుతాయి. వీటి ఆధారంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ పదేపదే ఈ తరహా నేరాలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసుల నమోదుకు చర్యలు తీసుకుంటోంది. -
పోకిరీ మైనర్.. అమ్మాయిల్ని వేధిస్తున్న వారిలో 11.11% వీరే
సాక్షి, హైదరాబాద్: పబ్లిక్ ప్లేసుల్లోకి వస్తున్న అతివల్ని వేధిస్తున్న పోకిరీల్లో మైనర్లు పెద్ద సంఖ్యలోనే ఉంటున్నారు. ఈ ఏడాది ఆరున్నర నెలల కాలంలో నగర షీ టీమ్స్ బృందాలు పట్టుకున్న వారిలో 11.11 శాతం వీళ్లే ఉండటం ఆందోళనకర అంశం. లాక్డౌన్ పూర్తిగా తొలగిపోయి, సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో అతివలకు వేధింపులు పెరిగే ప్రమాదం ఉందని, ఈ నేపథ్యంలోనే నిఘా ముమ్మరం చేయాలని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఆదేశించారు. షీ టీమ్స్ పని తీరుపై ఆయన బుధవారం భరోసా కేంద్రంలో విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని వివరాలు వెల్లడించారు. ► ఈ ఏడాది జనవరి నుంచి జూలై 15 వరకు షీ టీమ్స్‌ను మొత్తం 889 మంది బాధితులు ఆశ్రయించారు. తీవ్రత ఆధారంగా వీటిలో 97 ఫిర్యాదులను ఎఫ్ఐఆర్లుగా నమోదు చేయగా మరో 22 పెట్టీ (చిన్న స్థాయి) కేసులుగా మారాయి. ►మొత్తం 288 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 201 మందిని మందలించి విడిచిపెట్టారు. మరో 87 మందిని మాత్రం ఆయా పోలీసుస్టేషన్లకు అప్పగించారు. మిగిలిన ఫిర్యాదులను దర్యాప్తు అనంతరం వెలుగులోకి వచి్చన అంశాల ఆధారంగా మూసేశారు. ►బహిరంగ ప్రదేశాల్లో రెచి్చపోయే పోకిరీలకు చెక్ చెప్పడానికి షీటీమ్స్‌కు చెందిన బృందాలు ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. వీటిలో పట్టుబడిన 135 మందిలో 15 మంది (11.11 శాతం) మైనర్లే ఉన్నారు. వీరికి అధికారులు భరోసా కేంద్రంలో కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ►బాధితుల్లో 41 శాతం మంది నేరుగా భరోసా కేంద్రానికి వచ్చి షీటీమ్స్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. మిగిలిన వారిలో 30 శాతం మంది వాట్సాప్ ద్వారా, 14 శాతం మంది మెయిల్ ద్వారా, 12 శాతం మంది క్యూ ఆర్ కోడ్స్ స్కాన్ చేయడం ద్వారా, మిగిలిన వారు హాక్ఐ యాప్, ఫేస్బుక్, 100 ద్వారా ఆశ్రయించారు. ►వీటిలో 21 శాతం కేసులు ఫోన్ ద్వారా వేధింపులకు సంబంధించినవే ఉన్నాయి. 17 శాతం కేసులు నేరుగా వెంటపడి వేధించడం, 9 శాతం కేసులు పెళ్లి పేరుతో మోసాలు, 14 శాతం కేసులు బ్లాక్ మెయిలింగ్, మిగిలినవి ఫొటోల మార్ఫింగ్, ప్రాంక్ కాల్స్ తదితరాలు ఉన్నాయి. ఆధునిక టెక్నాలజీ వాడండి మహిళలపై జరుగుతున్న వేధింపుల తరహా నేరాల్లో నిందితుల్ని పట్టుకోవడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించండి. చిక్కిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోండి. బాధితురాళ్లు సైతం ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేసేలా అవగాహన పెంచండి. – షీ టీమ్స్‌తో నగర కొత్వాల్ -
ఈ తరంలో పుట్టడం నా అదృష్టం: మిస్ ఇండియా ఎర్త్
సనత్‌నగర్: వజ్ర సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం మహిళా పోలీసు అధికారులని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ కొనియాడారు. కరోనా లాక్డౌన్ సమయంలో మహిళా పోలీసు అధికారులు విధి నిర్వహణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని స్ఫూర్తిగా నిలిచారన్నారు. ‘షీ’టీమ్, హైదరాబాద్ పోలీసు సంయుక్తంగా బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లోని ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను రెండు రోజుల ముందుగానే శుక్రవారం నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన అంజనీకుమార్ మాట్లాడుతూ మహిళా శక్తి సామర్థ్యాలను సమాజానికి తెలియపర్చాలనే ఉద్దేశ్యంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రెండు రోజులు ముందుగానే నిర్వహించడం జరిగిందన్నారు. మహిళలు సహనానికి ప్రతీకగా అభివర్ణించారు. ఆర్మీ, నేవీ, పారామిలటరీ, పోలీసు వంటి విభాగాల్లో ప్రత్యేక యూనిఫాం వేసుకుని మహిళలు తమ సేవలను అందించడం గర్వకారణమన్నారు. నగర పోలీసు విభాగంలో 33 శాతం మంది మహిళలు ఉన్నారన్నారు. సిటీ పోలీసు కమిషనరేట్‌తో పాటు హెడ్ క్వార్టర్స్‌కు మహిళా పోలీసులు భద్రతగా నిలుస్తున్నారన్నారు. మహిళా పోలీసు అధికారులు అందించే ఈ రకమైన సేవలు దేశంలో మరే ఇతర నగరాల్లోనూ లేవన్నారు. షీ టీమ్స్, భరోసా సెంటర్, ఐటీ సెల్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయన్నారు. నగరంలోని అన్ని పోలీస్స్టేషన్లలో మహిళా పోలీసు అధికారుల కోసం ప్రత్యేకమైన విశ్రాంతి గదులు, వాష్‌రూమ్‌లు, ఛేంజింగ్ గదులను కేటాయించామన్నారు. 2020 ఏడాది పోలీసు అధికారులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారని, ఎందరో పోలీసు అధికారులు కరోనా బారిన పడ్డారన్నారు. అందులో మహిళా అధికారులు కూడా ఉన్నారన్నారు. కరోనా బారిన పడినప్పటికీ 14 రోజుల క్వారంటైన్లో ఉండి ఆ వెనువెంటనే విధుల్లోకి చేరడం వారి అంకితభావానికి నిదర్శనంగా నిలిచిందన్నారు. మహిళా పోలీసు అధికారులైతే ఇంట్లో చిన్న పిల్లలు, పెద్దలు ఉన్నప్పటికీ కరోనా సమయంలో ఏమాత్రం వెరవకుండా అర్ధరాత్రి సైతం సేవలు అందించారని, వారందరికీ నా సెల్యూట్ అన్నారు. మార్చి 8 ఒక్కరోజు మాత్రమే కాదని, ప్రతిరోజూ మహిళా దినోత్సవమేనన్నారు. మహిళలను గౌరవించడం ప్రధాన బాధ్యత అన్నారు. ప్రత్యేక అతిథిగా హాజరైన మిస్ ఇండియా ఎర్త్, ఆల్ ఇండియాస్ బెస్ట్ క్యాడెట్ డాక్టర్ తేజస్విని మనోజ్ఞ మాట్లాడుతూ తాను ఈ తరంలో జన్మించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. నిరంతరం ప్రజాభద్రత, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తున్న పోలీసులు అధికారులకు ఆమె సెల్యూట్ చేశారు. ‘ఆడ పిల్లగా పుట్టినందుకు మనమందరంగా గర్వపడదాం..మార్పు కోసం ప్రయత్నిద్దాం..దేశం కోసం పాటుపడదామని’ ఈ సందర్భంగా ఆమె నినదించారు. కార్యక్రమంలో ఆదాయపన్ను శాఖ చీఫ్ కమిషనర్, నగర పోలీసు కమిషనర్ సతీమణి వసుంధర సిన్హా, ట్రాఫిక్ అదనపు కమిషనర్ అనిల్‌కుమార్, పోలీసు అదనపు కమిషనర్లు డీఎస్ చౌహాన్, జాయింట్ కమిషనర్(ఎస్బీ) తరుణ్ జోషి, నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్వర్ సింగనవర్, శిరీష తదితరులు పాల్గొన్నారు. చదవండి: ‘అమ్మా నన్ను కన్నందుకు’.. మేడమ్ మీవల్లే (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
35 కంపెనీలు.. 3 వేల పోస్టులు
లక్డీకాపూల్ (హైదరాబాద్): నగర మహిళల భద్రతకే కాదు.. వారి ఆర్థిక పురోభివృద్ధికి షీటీమ్ పాటుపడుతోంది. షీ టీమ్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ జి.రాంరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆవరణలో దేశంలోనే తొలిసారిగా ప్రత్యేకంగా నగరమహిళల కోసమే ఏర్పాటు చేసిన జాబ్‌కనెక్ట్ కార్యక్రమమే అందుకు తాజా ఉదాహరణ. ఈ కార్యక్రమంలో సుమారు నాలుగు వేలమంది నగర మహిళలు పాల్గొనగా 35 కంపెనీలలో మూడు వేలమంది నిరుద్యోగ మహిళలు ఉద్యోగాలు దక్కించుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో వివిధ కంపెనీల ప్రతినిధులు, హెచ్ఆర్ మేనేజర్లు, రిక్రూటర్లు పాల్గొని ఇంటర్వ్యూ లు నిర్వహించారు. సుమారు 3 వేల ఉద్యోగాలకు జరిగిన ఇంటర్వ్యూలలో పలువురు ఆఫర్ లెటర్లు అందుకు న్నారు. పోలీసులు, ట్రైనింగ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (టీఎంఐఎస్) సంయుక్తంగా చేపట్టిన ఈ తొలి ప్రయత్నానికి నగర మహిళల నుంచి భారీ స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో ఈస్ట్‌జోన్ జాయింట్ సీపీ రమేశ్, అదనపు సీపీ షికాగోయెల్, షీటీమ్ అదనపు డీసీపీ శిరీష ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జాబ్‌కనెక్ట్ ద్వారా ఉద్యోగులు పొందిన నిరుద్యోగ యువతులు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోబోతున్న తరుణంలో ఉద్యోగాలు పొందడం ద్వారా నిరుద్యోగుల ఆనందం రెట్టింపు అవుతుందన్నారు. చదవండి: టాప్‌గేర్‌లో హైదరాబాద్ మహిళలు! ఆదర్శం నుంచి అధోగతికి! -
పల్లెల్లో షీటీమ్స్!
సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రత, రక్షణ కోసం ఆరేళ్ల కిందట హైదరాబాద్ నగరంలో ప్రారంభించిన ‘షీ టీమ్స్’ అద్భుత ఫలితాలు చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని మరికొన్ని పట్టణాలకూ ‘షీ టీమ్స్’ సేవలు విస్తరించాయి. ఇప్పుడు ఇదే కోవలో పల్లెల్లోని మహిళల కోసమూ ప్రత్యేక కమిటీలు ఏర్పాటుకానున్నాయి. గ్రామ, జిల్లా స్థాయిలో సామాజిక కార్యాచరణ కమిటీ(సోషల్ యాక్షన్ టీమ్)లు ఏర్పడనున్నాయి. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో అంతర్భాగంగా ఉన్న గ్రామీణ దారిద్య్ర నిర్మూలన సొసైటీ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ) ఆధ్వర్యంలో ఇవి ఏర్పడనున్నాయి. జిల్లా స్థాయి కమిటీలో కలెక్టర్, ఎస్పీ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి (డీఆర్డీఓ)కీ చోటు కల్పిస్తారు. గ్రామ, మండల మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను జిల్లా స్థాయి కమిటీలు పరిష్కరించనున్నాయి. శిక్షణ అనంతరం క్షేత్రస్థాయి కార్యాచరణలోకి... రాష్ట్రంలోని ప్రతీ మండలంలో ముగ్గురు స్వయంశక్తి మహిళా సంఘాల సభ్యులతో సహా ఎమ్మార్వో, సబ్–ఇన్స్పెక్టర్, ఇందిరా క్రాంతి పథం ఏపీఎం, అంగన్వాడీ సూపర్వైజర్లు సభ్యులుగా కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా మండలాల పరిధిలోని గ్రామాల్లో స్త్రీల సమస్యల పరిశీలన, తమ దృష్టికొచ్చే సమస్యల పూర్వాపరాలు తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలను ఈ కమిటీలు తీసుకుంటాయి. ఇప్పటికే వివిధ జిల్లాల పరిధిలో పలుచోట్ల సామాజిక కమిటీలు ఏర్పడగా, విడతల వారీ పూర్తి స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు చేపట్టాక క్షేత్రస్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తాయి. ఈ కమిటీల సభ్యులకు న్యాయ, చట్ట, భద్రతా, రెవెన్యూ, ఇతరత్రా అంశాలపై ఆయా రంగాల నిపుణులతో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటిదాకా రెండు, మూడు దశలుగా శిక్షణ కార్యక్రమాలు పూర్తికాగా వేలాది సభ్యులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించినట్లు అధికారులు తెలిపారు. గతంలో ఏర్పాటుచేసిన జెండర్ కమిటీల్లో ఉన్నవారితోపాటు, గ్రామ, మండల సమాఖ్య పాల క మండళ్ల సభ్యులనూ ఈ కమిటీల్లోనూ నియమిస్తున్నారు. అలాగే కార్యాచరణ కమిటీకి గ్రామ స్థాయిలో ముగ్గురిని అనుబంధ సభ్యులుగా నియమిస్తారు. మహిళల సమస్యలను తక్షణం గుర్తించేందుకు వీరి నియామకం ద్వారా అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. గ్రామస్థాయి నుంచి ఆయా అంశాలకు సంబంధించిన బాధ్యతలను ఈ సోషల్ యాక్షన్ టీంలు నిర్వహించనున్నాయి. ఏయే బాధ్యతలు అప్పగించనున్నారంటే.. గ్రామీణ మహిళల సాధికారత సాధన దిశలో స్త్రీల హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించడం. ఆర్థిక, సామాజిక, చట్టపరమైన అంశాల్లో అండగా ఉండడం. బాల్య వివాహాలు, వరకట్న, లైంగిక వేధింపులు, గృహ హింస, మహిళల అక్రమ రవాణా నివారణ, మూఢ నమ్మకాలు అరికట్టడం యుక్త వయసు దశ దాటే వరకు అమ్మాయిలు ఎదుర్కొనే వివిధ సమస్యలు అధిగమించేందుకు ఏం చేయాలనే దానిపై ప్రత్యేక అవగాహన కల్పించడం. కౌమార దశకు వచ్చే బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యపరంగా వచ్చే మార్పులపై అవగాహన కల్పించడం. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండా అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం. అనాథలు, వితంతువుల సమస్యలు అధ్యయనం చేసి, వాటి పరిష్కారానికి అవసరమైన సహాయం అందించడం. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకునే అధికారమూ కమిటీలకే ఇవ్వాలని భావిస్తున్నారు. గ్రామీణ మహిళల రక్షణకు సోషల్ యాక్షన్ టీమ్‌లు -
మహిళల భద్రతకు సీఎం ప్రత్యేక శ్రద్ధ
సాక్షి, యాదాద్రి : రాష్ట్రంలోని ప్రతి మహిళ భద్రతతో ఉండేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో శుక్రవారం ఐఏఎస్, ఐపీఎస్‌లతో కూడిన కోర్ గ్రూపు కమిటీ సమావేశంలో ఆమె మహిళా భద్రత చర్యలను సమీక్షించారు. డయల్ 100, 181 తదితర హెల్ప్‌లైన్ వ్యవస్థల పనితీరు గురించి కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు లైంగిక వేధింపులపై ఫిర్యాదులు చేస్తే కలెక్టర్లు తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే సునీతా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఫిర్యాదులపై మహిళా రక్షణ కమిటీలు తక్షణం స్పందించినప్పుడే న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్, సీఎంఓ హరితహారం ప్రత్యేక అధికారి ప్రియాంక వర్గీస్, ఐఏఎస్ అధికారి యోగితా రాణా, రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖా కమిషనర్ వాకాటి కరుణ, హైదరాబాద్, నల్లగొండ, యాదాద్రి కలెక్టర్లు శ్వేతా మహంతి, ప్రశాంత్ జీవన్ పాటిల్, అనితా రామచంద్రన్, హైదరాబాద్ షీ టీం ఇన్చార్జి అనసూయ పాల్గొన్నారు. -
షీ టీమ్స్ పనితీరు భేష్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళలు, పిల్లల భద్రతపై తెలంగాణ పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన షీ టీమ్స్ పనితీరుపై 96 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన 4 శాతం మంది తాము చేసిన ఫిర్యాదుపై తీసుకున్న చర్యలను తెలపకపోవడం, ఫిర్యాదు చేసేందుకు వెళితే సరిగ్గా స్పందించలేదని చెప్పారు. ఈ గణాంకాలను పోలీస్ శాఖ మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతి లక్రా శుక్రవారం వెల్లడించారు. రాష్ట్రంలో షీ టీమ్స్ సంబంధిత నేరాలపై స్పందించిన అధికారులతో ఒక్క రోజు ఆన్లైన్ కౌన్సెలింగ్ నిర్వహించారు. రాష్ట్రంలోని షీ టీమ్స్ అధికారులు, షీ టీమ్స్‌కు పట్టుబడ్డ దాదాపు 120 మంది నిందితులు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షీ టీమ్స్ మహిళల్లో ఆత్మస్థైర్యం నింపిందని స్వాతిలక్రా పేర్కొన్నారు. షీ టీమ్స్ పనితీరుపై ప్రముఖ సంస్థ ‘సెస్’ద్వారా జీహెచ్ఎంసీ పరిధిలో సర్వే చేయించామని వెల్లడించారు. రాష్ట్రంలో మహిళలపై వేధింపుల కేసులు, ఈవ్ టీజింగ్‌లపై అధికంగా వాట్సాప్, ఫోన్ల ద్వారా ఫిర్యాదులు అందుతున్నాయని, వీటిని కేసులుగా నమోదు చేసి చర్యలు చేపట్టాలని ఆదేశించా రు. కౌన్సెలింగ్‌లో పాల్గొన్న డీఐజీ సుమతి మాట్లాడుతూ.. రాష్ట్రంలో షీ టీమ్స్ పనితీరుపై ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్‌లో షీటీమ్స్‌కు పట్టుపడ్డ వారిలో అధికంగా విద్యావంతులు, మేజర్లే ఉన్నారన్నారు. తప్పు చేస్తే ఎవరినీ వది లేది లేదని.. సైబరాబాద్ పరిధిలో మహిళలను వేధించిన ఘటనలో 51 ఏళ్ల వ్యక్తిపై చర్యలు తీసుకోవడమే ఇం దుకు నిదర్శనమన్నారు. కాగా, మనో చేతనకు చెందిన గీతా చల్లా ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. నవంబర్‌లో అధికంగా ఫిర్యాదులు నవంబర్‌లో షీ టీమ్స్‌కు రాష్ట్రవ్యాప్తంగా 464 ఫిర్యాదులు అందాయి. ఇందులో నేరుగా 151, పరోక్షంగా (వాట్సాప్, ఈ–మెయిల్, ట్విటర్, హాక్–ఐ) 313 ఫిర్యాదులు అందాయి. ఇందులో ఫోన్ ద్వారా వేధింపులు కాగా, 246 ఈవ్ టీజింగ్, సోషల్ మీడియా వేధింపులు తదితరాలు ఉన్నాయి. వీరిలో 90 మందిని హెచ్చరించి, 82 మందికి కౌన్సెలింగ్ చేసి పంపారు. 56 మందిపై కేసులు నమోదు కాగా, 52 మందిపై పెట్టీ కేసులు నమోదు చేశారు. -
మహిళలపై గౌరవం పెంచే బాధ్యత తల్లిదే: సాయిపల్లవి
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహిళలకు సురక్షితమైన నగరమని డీఆర్డీవో శాస్త్రవేత్త డాక్టర్ టెస్సీ థామస్ అన్నారు. 33 ఏళ్లుగా ఉన్న హైదరాబాద్‌లో ఉన్న తాను కొంతకాలం క్రితం బెంగళూరుకు వెళ్లానని, అక్కడికి ఇక్కడికి మహిళల భద్రతలో వ్యత్యాసాలను చూడగలిగానన్నారు. సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సెల్ (ఎస్సీఎస్సీ) సంయుక్త ఆధ్వర్యంలో హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్లో గురువారం నిర్వహించిన ‘షీ ఎం పవర్’ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టెస్సీ థామస్ మాట్లాడుతూ... జనాభాలో మహిళలు 50 శాతం ఉన్నా దురదృష్టవశాత్తు ప్రపంచ సంపదలో ఒక శాతం వాటా మాత్రమే దక్కించుకున్నారన్నారు. పురుషుల కంటే మహిళలు మెరుగ్గా రాణిస్తున్నా అన్ని రంగాల్లో సమానం కావడమనేది కలగానే మిగిలిందన్నారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను మహిళలు సమర్థంగా ఎదుర్కోవాలన్నారు. మల్టీ టాస్కింగ్, పట్టుదల, అంకితభావం, సృజనాత్మకత, అభిరుచి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తదితర లక్షణాలను కలిగి ఉన్న మహిళలను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ‘సవాళ్లనే అవకాశంగా మలచుకోవాలని, విమర్శల నుంచి నేర్చుకోవాలని, వాటిని అభివృద్ధికి బాటలు వేసే దిశగా మార్చుకోవాలన్నారు.’ తెలంగాణ ఉమెన్ అండ్ సేఫ్టీ విభాగం ఐజీ ఇన్చార్జ్ స్వాతిలక్రా మాట్లాడుతూ...చట్టాన్ని ఉల్లంఘించిన వారిని శిక్షించడంతో పాటు మార్పు తీసుకురావల్సిన అవసరముందన్నారు. మహిళల రక్షణకు షీ టీమ్స్ సేవలు విస్తరించడంతో పాటు భద్రత కోసం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నట్లు తెలిపారు. సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ...ఆరు లక్షలకుపైగా సీసీటీవీ కెమెరాలు ఉన్న భాగ్యనగరంలో పటిష్టమైన నిఘా వ్యవస్థ భద్రతకు భరోసా ఇంస్తుందన్నారు., సేఫ్ స్టే, మార్గదర్శక్, షీ షటిల్, బాలమిత్ర, భరోసా కేంద్రాల సేవలతో భద్రతపై మరింత నమ్మకం కల్పిస్తున్నామన్నారు. కుటుంబసభ్యుల్లా భావించాలి... ఇంట్లో అక్క చెల్లెళ్లను గౌరవించినట్లుగానే వీధుల్లో వెళ్లే మహిళలను గౌరవించేలా బాలురను తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిపైనే ఉందని సినీ నటి సాయిపల్లవి అన్నారు. మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. మార్పు ఇంటి నుంచే రావాలని ఆమె పేర్కొన్నారు. దేశంలోనే మొట్టమొదటి మహిళా కమాండో ట్రైనర్ డాక్టర్ సీమారావు మాట్లాడుతూ...మన ప్రతి ఒక్కరిలో యోధుడు ఉన్నారన్నారు. ‘జీవితంలో ఏదైనా సాధించడానికి భార్యభర్తలకు పరస్పర సహకారం అవసరం. నా భర్త నాకు భర్త కంటే ఎక్కువ. అంటే జీవితంలో అంత ప్రాధాన్యం ఇస్తా. అయితే నేను మాత్రం తేలికైన పనులను ఎంచుకోకుండా జీవితంలో కష్టమైన పనులను చేయడానికే ఇష్టపడతాన’ని అన్నారు. అనంతరం మహిళల భద్రత, సాధికారత కోసం కృషి చేసిన కార్పొరేట్ సంస్థలకు సీపీ అవార్డులను ప్రదానం చేశారు. ఎస్సీఎస్సీ సహకారంతో సరికొత్త ఫీచర్లతో రూపొందించిన ‘షీ సేఫ్’ యాప్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సినీ దర్శకుడు రాజమౌళి, హీరోయిన్ రష్మికా మండోనా, టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్, సోషల్ రీసెర్చ్ సెంటర్ ఎండీ డాక్టర్ రజనాకుమారి, సైబరాబాద్ ఉమెన్ అండ్ సేఫ్టీ డీసీపీ అనసూయ, ఎస్సీఎస్సీవైస్ చైర్మన్ భరణి, ప్రధాన కార్యదర్శి కృష్ణ యెదుల, జాయింట్ సెక్రటరీ ప్రత్యూష శర్మ, షీ టీమ్ ఇన్స్పెక్టర్ సునీత పాల్గొన్నారు. -
వేధింపులపై చిందు ఎత్తిన చైతన్యం
ఓ కాలేజీ అమ్మాయిని కొందరు టీజ్ చేస్తున్నారు. అమ్మాయి బెదిరిపోతున్న కొద్దీ మరింత రెచ్చిపోతున్నారు. చూడగానే తెలిసిపోయే డైరెక్ట్ అటాక్ అది. ఆఫీస్‌లోని ఓ మేల్ కొలీగ్ హుందాగా.. చాలా మర్యాదగా ప్రవర్తిస్తున్నట్టే కనిపిస్తాడు. కానీ... ప్రతి మాట, ప్రతి చేష్ట వెనకాల హెరాస్మెంటే. నిరూపించలేని పరోక్ష దాడి. ఈ డైరెక్ట్ అటాక్లనూ, ఇన్‌డైరెక్ట్ వేధింపులనూ ఎలా ఎదుర్కోవాలో రంగస్థలం సాక్షిగా ప్రదర్శిస్తున్నారు ఇద్దరు కళాకారులు. ‘ఫోరమ్ థియేటర్’, ‘ప్లే బ్యాక్ థియేటర్’తో యువతలో చైతన్యాన్ని ‘చిందు’ ఎత్తిస్తున్న సబ్రీనా ఫ్రాన్సిస్, సురేష్‌లది మంచి ప్రయత్నం. హైదరాబాద్... గాంధీ మెడికల్ కాలేజ్ ఆవరణ.. ఒక అమ్మాయిని కొంతమంది అబ్బాయిలు వెంటాడుతున్నారు.. వేధిస్తున్నారు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. పాపం ఆ అమ్మాయి ఎదిరించలేక ఏడుస్తోంది. ఆమె నిస్సహాయత ఆ అబ్బాయిలు మరింత రెచ్చిపోయేలా చేసింది. ఇదంతా గమనిస్తూన్న ఓ గుంపులోంచి ఒక విద్యార్థిని ‘నువ్వు రియాక్ట్ కావాలి’ అంటూ ముందుకొచ్చింది. ‘ఎలా రియాక్ట్ కావాలో మీరు చూపించండి మరి’ అడిగారు ఎవరో. అంతే ఆ అమ్మాయి ఆ రౌడీమూక ను చేరి వాళ్ల చేష్టలను నిలువరించే ప్రయత్నం మొదలుపెట్టింది. ఆ ఆకతాయిలు కూడా ఎక్కడా తగ్గకుండా ప్రతివ్యూహాలు పన్నుతూ ఇబ్బంది పెడ్తున్నారు. కాసేపటికి ఇంకో అమ్మాయి వచ్చింది గుంపులోంచి.. తనదైన పద్ధతిలో ఆ అబ్బాయిల ఆట కట్టించేందుకు. ఇలా ఓ గంట గడిచింది. తర్వాత ప్రశంసలు. ఆ పరిస్థితికి తగ్గట్టుగా తమను తాము రక్షించుకున్న ఆ అమ్మాయిల సమయస్ఫూర్తికి... ధైర్యానికి.. తెగువకు. అవును.. ఇది నాటకమే. ఈ విధానాన్ని ‘ఫోరమ్ థియేటర్’ అంటారు. ఒక కాన్ఫరెన్స్ రూమ్... పాతికమంది వరకూ ఉన్నారు. నిశ్శబ్దంగా ఉంది వాతావరణం. ఒక ఉద్యోగిని తను అనుభవించిన వెతను వెళ్లబోసుకుంటోంది. ‘నేను సింగిల్ ఉమన్‌ను. పెళ్లయిన యేడాదిలోపే విడాకులయ్యాయి. నన్ను తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకొనే స్వాతంత్య్రం కాని, ఆర్థిక స్థోమత కానీ అమ్మానాన్నకు లేవు. దాంతో నా చదువుకి తగ్గ ఉద్యోగాన్ని వెదుక్కుని హైదరాబాద్ వచ్చాను. నా సీనియర్‌తో హెరాస్మెంట్ ఎదుర్కొంటున్నాను’ అని ఆగిపోయింది ఆమె. ‘జాయినై ఆఫీస్‌లోకి ఎంటర్ అవగానే’ అంటూ మళ్లీ మొదలుపెట్టింది.. ‘ముందు నా కాళ్లు చూశారు.. తర్వాత మెడ. మేల్ కొలీగ్స్ దగ్గర్నుంచి హయ్యర్ ఆఫీషియల్స్(పురుషులు)వరకు. దాన్నిబట్టి నా మ్యారిటల్ స్టేటస్ అంచనావేయడం.. మ్యారేజ్ కాలేదని తెలిసాక దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకోవడం. అందులో నా సీనియర్ సిద్ధహస్తుడు. అది ఎలా ఉంటుందంటే దాన్ని వేధింపు అని నేను రుజువు చేయలేను. అలాగని భరించనూ లేను. అతని తీరును గమనించిన ఎవరికైనా అది నా పట్ల కన్సర్న్‌గా.. గౌరవంగానే కనిపిస్తుంది. కాని సదరు మనిషి వ్యక్తిగతంగా నాతో మాట్లాడేటప్పుడు, నా పని గురించి అతనితో చర్చించాల్సి వచ్చినప్పుడు మాత్రమే అతని వెకిలితనాన్ని బయటపెడ్తాడు. దీనివల్ల నేను ఫ్రస్టేట్ అయిపోయి అరిస్తే నన్నో గయ్యాళిగా.. మర్యాద తెలియని మనిషిలా ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఈ సమస్యను ఎవరితో చెప్పుకున్నా నమ్మని పరిస్థితిని క్రియేట్ చేశాడు. భరించలేకపోతున్నా. ఆత్మహత్య ఆలోచనదాకా కూడా వెళ్లా’ అంటూ రెండుచేతుల్లో మొహం దాచుకొని ఏడ్చేసింది ఆమె. అంతలోనే ఆడ, మగ కలిపి పదిమందిదాక ఉన్న ఓ బృందం పోడియం దగ్గరకు చేరింది. ఆ అమ్మాయి పంచుకున్న విషయాలతో అప్పటికప్పుడు నాటకాన్ని అల్లి ప్రదర్శించడం మొదలుపెట్టారు. తాము విన్న దంతా అలా కళ్లకు కడుతుంటే ఆ సమావేశంలో ఉన్నవాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఆ నాటకాన్ని పది రకాల పరిష్కారాలతో ఎండ్ చేశారు. ఇదే ‘ప్లే బ్యాక్ థియేటర్ ’ విధానం. ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉంది. ప్రసిద్ధికెక్కుతోంది. ‘ఫోరమ్ థియేటర్’, ‘ప్లే బ్యాక్ థియేటర్’ ఈ రెండు విధానాల ద్వారా మహిళల్లో ఆత్మస్థయిర్యం, ఆత్మరక్షణా మెలకువలను బోధిస్తున్నారు.. సబ్రీనా ఫ్రాన్సిస్, సురేష్‌లు తమ గ్రూప్‌లోని దివ్యశ్రీ, తదితర కళాకారులతో కలిసి. ఫోరమ్ థియేటర్లో ప్రేక్షకులను భాగస్వామ్యం చేస్తే, ప్లే బ్యాక్ థియేటర్లో ప్రేక్షకులు మనసు విప్పి మాట్లాడే అవకాశాన్ని కల్పించి.. వాళ్ల బాధకు నాటకరూపమిచ్చి వాళ్లే పరిష్కారం వెదుక్కునేలా చేస్తున్నారు. ‘తమకు జరిగింది బయటకు చెప్పుకుంటే చులకనగా చూస్తారని, తల్లిదండ్రులకు చెబితే చదువు మాన్పిస్తారేమోనని, భర్తకు చెబితే ఉద్యోగం వద్దంటాడేమోననే భయంతో వ్యథను అణచుకుని క్షోభననుభవిస్తుంటారు. రేప్‌కి కారణం అమ్మాయి వస్త్రధారణను, ప్రవర్తనను తప్పు పట్టే .. వ్యాఖ్యలు చేసే దుస్థితిలో ఉన్నాం. అలాంటి వాళ్లకు ఊరటే కాదు.. జీవితాన్ని నెగ్గే మెలకువలను నేర్పించే మాధ్యమం ఫోరమ్ థియేటర్, ప్లే బ్యాక్ థియేటర్’ అని చెప్పడమే కాదు నిరూపిస్తున్నారు కూడా సబ్రీనా, సురేష్‌లు. వేధింపులు, వివక్ష, హింసను ఎదుర్కోవడంలో మహిళలను చైతన్యపరిచినట్టే అబ్బాయిలు, తల్లిదండ్రుల్లోనూ జెండర్ ఈక్వాలిటీ పట్ల స్పృహను పెంచుతున్నారు ఈ రెండు నాటక ప్రక్రియలతోనే. గ్రామాలు, పట్టణాలు, స్కూళ్లు, కాలేజీలు, కార్యలయాలు ఇలా ఎక్కడైనా ప్రభుత్వ సిబ్బంది, ప్రైవేట్ యాజమాన్యాల పిలుపు మేరకు వెళ్లి ప్రదర్శనలు ఇస్తున్నారు. ‘దీనివల్ల బెరుకు, భయం పోయి పరిస్థితులకు తగ్గట్టుగా ఎలా స్పందించాలో తెలుస్తుంది. తమను తాము కాపాడుకోవడమే కాదు ఇతరులనూ రక్షించే ధైర్యం వస్తుంది’’ అని వివరిస్తారు సబ్రీనా, సురేష్‌లు. వాళ్లు నేర్చుకున్న, శిక్షణ పొందిన ఈ థియేటర్ ప్రక్రియలను ఇలా జెండర్ సమస్యలను వెలుగులోకి తేవడానికే ఉపయోగిస్తున్నారు. షీటీమ్స్‌తో కలిసి.. గత మూడేళ్లుగా తెలంగాణ షీటీమ్స్‌తో కలిసి పనిచేస్తున్నారు. అందులో భాగమే హైదరాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజ్ ప్రదర్శన. షీ టీమ్స్ సారథ్యంలో కాలేజ్‌లు, హాస్టల్స్‌లో ఫోరమ్ థియేటర్ మెథడ్‌లో అమ్మాయిలు సమయస్ఫూర్తితో వ్యవహరించి, ఆత్మరక్షణా నైపుణ్యాన్ని పెంచుకునేలా చేస్తున్నారు. దీంతోపాటు పిల్లలు, మహిళల రక్షణ, సాధికారత మీద ఆడియో ఆల్బమ్‌లు, డాక్యుమెంటరీలు, షార్ట్‌ఫిల్మ్స్ తీస్తున్నారు. ఇవన్నీ కూడా ‘చిందు’ అనే సాంస్కృతిక వ్యక్తిత్వ వికాస కేంద్రం కింద చేస్తున్నారు. దీన్ని ఇరవై ఏళ్ల కిందట స్థాపించారు వీళ్లు. సబ్రీనా, సురేష్ ఇద్దరూ కళాకారులే. డాన్స్, సంగీతం, డ్రామా.. ఈ మూడింటిలో నిపుణులు. ఒక వర్క్‌షాప్‌లో ఒకరికొకరు పరిచయమయ్యారు. ఇద్దరి అభిరుచులు, లక్ష్యాలు ఒకటే అని అర్థమయ్యాక కలిసి పనిచేస్తే బాగుంటుందని ‘చిందు’ను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఈశాన్య రాష్ట్రాలు సహా దేశమంతా ప్రదర్శనలిస్తుంటారు. విదేశీ వేదికల మీదా వీళ్ల ప్రతిభకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ప్లే బ్యాక్ థియేటర్లో పట్టభద్రులైన ఈ ఇద్దరు డ్రామా థెరపి, సైకోడ్రామా, థియేటర్ అప్రెస్డ్ అనే విధానల్లోనూ శిక్షణ పొందారు. అంతేకాదు యూకేలోని టావిస్టాక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్స్‌లోనూ ట్రైనింగ్ తీసుకున్నారు. జెండర్ సమస్యలు, జెండర్ స్పృహకు సంబంధించి వీరి కళాసహాయం కావాలనుకునే వారు ఈ నంబర్లో సంప్రదించవచ్చు.. 9849091717. -
రోమియోకు కటకటాలు!
సాక్షి, సిటీబ్యూరో: మహిళలు, యువతులకు ఎదురయ్యే వేధింపులను షీ–టీమ్స్ సీరియస్‌గా తీసుకుంటున్నాయి. ఓ రోడ్ సైడ్ రోమియోతో పాటు మరో పోకిరీని పట్టుకున్న షీ బృందాలు వారిని కోర్టులో హాజరుపరిచాయి. పూర్వాపరాలు పరిశీలించిన న్యాయస్థానం వీరికి జైలు శిక్ష విధించినట్లు అదనపు సీపీ షికా గోయల్ సోమవారం తెలిపారు. నిఘా విధుల్లో భాగంగా షీ–టీమ్స్ బృందాలు సంతోష్‌నగర్‌లోని ఓ జూనియర్ కాలేజీ వద్ద కాపుకాశాయి. అదే సమయంలో రెయిన్‌బజార్ పరిధిలోని యాకత్‌పుర కాలనీకి చెందిన మహ్మద్ ఖాజా మొయినుద్దీన్ ఆతిఫ్ తన బైక్‌పై అక్కడికి వచ్చి పదేపదే ఆ కళాశాల వద్ద రౌండ్లు వేయడం మొదలెట్టాడు. దీనిని గుర్తిచిన షీ–టీమ్స్ అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అతడికి నాలుగు రోజుల జైలు, రూ.200 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. అలాగే ఓ మహిళను నేరుగా,ఫోన్ ద్వారా వేధిస్తున్న నాగోలు జైపురికాలనీకి చెందిన బి.వెంకటేష్‌ను సైతం షీ–టీమ్స్ పట్టుకున్నాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడిని కోర్టులో హాజరుపరిచాయి. ఇతడికి న్యాయస్థానం ఐదు రోజుల జైలు, రూ.200 జరిమానా విధించింది. -
మహిళా హాస్టళ్లకు మరింత భద్రత
సాక్షి, హైదరాబాద్: నగరంలో కుప్పలు తెప్పలుగా లేడీస్ హాస్టళ్లు వెలుస్తున్నాయి. వీటిలో అధికశాతం హాస్టళ్లకు సరైన అనుమతులు ఉండవు. ఎలాంటి భద్రతా ప్రమాణాలూ పాటించవు. పార్కింగ్, ఫైర్‌సేఫ్టీ, ఫుడ్ విషయంలోనూ మెజారిటీ యాజ మాన్యాలు నిబంధనలను అమలు చేయడం లేదు. చాలామంది యాజమాన్యాలకు తమ హాస్టళ్లలో ఉండే మహిళలు, విద్యార్థినుల సంఖ్య, వారి చిరు నామాలు కూడా తెలియవు. ఇలాంటి హాస్టళ్లలో ఉండే వారికి భద్రత పెంచాలన్న సంకల్పంతో తెలంగాణ విమెన్‌సేఫ్టీ వింగ్ సరికొత్త కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని లేడీస్ హాస్టళ్లపైనా దృష్టి సారించింది. అన్ని జిల్లాలు, కమిషనరేట్ల పరిధిలో కలిపి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 వేలకుపైగానే ఈ లేడీస్ హాస్టళ్లు ఉంటాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. కేసులైనప్పుడు ఇబ్బందులు.. లేడీస్ హాస్టళ్లలో వర్కింగ్ విమెన్స్, విద్యార్థినులు అదృశ్యమైనా, ఆత్మహత్యలకు పాల్పడినా.. వారిని ఎవరైనా వేధించినా, ఆ విషయం పోలీసుల దృష్టికి రావడంలో తీవ్రజాప్యం నెలకొంటోంది. నగలు, స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్టు వంటివి చోరీ అయినా.. చాలామంది తమ ఊరు కాదు కాబట్టి అస్సలు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడంలేదు. ఇంట్లో వారి సంరక్షణ నుంచి హాస్టల్లోకి వచ్చాక సహజంగానే వారి సంరక్షణ యాజమాన్యాలు తీసుకోవాలి. కానీ చాలా తక్కువ హాస్టళ్లు మాత్రమే అలా చేస్తున్నాయి. చాలా హాస్టళ్లు డబ్బులు తీసుకున్నాక విద్యార్థుల బాగోగులు పట్టించుకోవడం లేదు. అందుకే ఇకపై అన్ని హాస్టల్ యాజమాన్యాలతో కలిపి ఓ రిజిస్టర్‌ను రూపొందించాలని విమెన్‌సేఫ్టీ వింగ్ నిర్ణయించింది. ఇందుకోసం కార్యాచరణ సిద్ధం చేసి, స్థానిక పోలీసుల సాయంతో దశలవారీగా ఈ రిజిస్టర్ రూపొందిస్తారు. అందులో హాస్టల్ యజమాని పేరు, అనుమతులున్నాయా? ఫైర్‌సేఫ్టీ నిబంధనలు పాటిస్తున్నారా? విద్యార్థుల చిరునామాలు సేకరించారా? సీసీ కెమెరాలు, పార్కింగ్ తదితర విషయాల్లో ప్రమాణాలకు లోబడి ఉన్నారా? లేదా? ఎలాంటి ఆహారం పెడుతున్నారు? అన్న విషయాలు పొందుపరుస్తారు. అంతేగాకుండా ఈ అన్ని హాస్టళ్ల విద్యార్థులకు ఆపదలు ఎదురైనపుడు ఎలా ఎదుర్కోవాలి? ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలి? పోకిరీ వేధింపులు, సైబర్ వేధింపులు ఎదురైనపుడు ఎలా వ్యవహరించాలి? తదితర విషయాలపై షీటీమ్స్ ఆధ్వర్యంలో పూర్తి అవగాహన కల్పిస్తారు. ముందుగా భాగ్యనగరంలోనే.. ఈ రిజిస్టర్ అమలు తొలుత హైదరాబాద్ కమిషనరేట్‌లోనే మొదలుకానుంది. ముందుగా అమీర్‌పేట, ఎస్సార్ నగర్ ఏరియాల్లో ప్రారంభించనున్నారు. ఈ రెండు ప్రాంతాల్లోనే దాదాపు 3 వేల హాస్టళ్లు ఉంటాయని పోలీసుల అంచనా. ఇక హైదరాబాద్ కమిషనరేట్, సైబరాబాద్, రాచకొండ ఏరియాలు కలిపితే 10 వేల వరకు హాస్టళ్లు ఉంటాయని సమాచారం. ఇక రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి మరో 5 వేలు అంటే మొత్తం 15 వేల వరకు హాస్టళ్లు ఉంటాయని, అన్నింటి పూర్తి వివరాలు సేకరించాలని విమెన్‌సేఫ్టీ వింగ్ నిర్ణయించింది. దర్యాప్తులో ఇబ్బందులు తొలగించేందుకే: సుమతి, ఎస్పీ, విమెన్‌సేఫ్టీ వింగ్ చాలామంది హాస్టల్ నిర్వాహకులు నిబంధనలు పాటించడం లేదు. తమ హాస్టల్లో ఉండేవారి వివరాలు కూడా సరిగా నమోదు చేయడం లేదు. ఇలాంటి కారణాల వల్ల మిస్సింగ్ కేసులు, చోరీ కేసుల దర్యాప్తులో పోలీసులకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. తల్లిదండ్రులకు దూరంగా ఉన్న చాలామంది తమకు వేధింపులు ఎదురైనా మౌనంగా భరిస్తున్నారు. ఇకపై ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నదే మా లక్ష్యం. హాస్టల్లో ఉండే ఆడవారి రక్షణ మా ధ్యేయం: స్వాతి లక్రా, ఐజీ, విమెన్‌సేఫ్టీ వింగ్ తల్లిదండ్రులకు దూరంగా ఉన్న ఆడవారి భద్రతే మా ధ్యేయం. ఇలా హాస్టళ్లలో ఉండే చాలామంది వేధింపులు ఎదుర్కొంటున్నా.. వాటిని అటు ఇంట్లోనూ, ఇటు పోలీసులకూ తెలియపరచడం లేదు. దీన్ని అలుసుగా తీసుకుని పోకిరీలు మరింత చెలరేగుతున్నారు. అందుకే ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా షీటీమ్స్‌ని ఆశ్రయించేలా వారికి చట్టాలపై అవగాహన కల్పిస్తాం. అందుకే ఈ రిజిస్టర్ రూపొందించే ప్రయత్నాలు మొదలుపెట్టాం.