సాక్షి, సిటీబ్యూరో: బెంగళూరును తలదన్నుతూ ఐటీ రంగంలో దూసుకుపోతోందనే పేరు... మహిళల భద్రత కోసం షీ–టీమ్స్‌తో పాటు ప్రత్యేక షటిల్స్ ఏర్పాటు చేసిన ఘనత... ఐటీ ఇండస్ట్రీకి హబ్‌గా ప్రఖ్యాతి... ఇలా సజావుగా సాగుతున్న సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ ఇమేజ్‌ను దిశ ఉదంతం డ్యామేజ్ చేసింది. గత నెల 28న ఈ ఉదంతం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి కమిషనరేట్ పరిధిలోని పోలీసులందరూ తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. తుండుపల్లి టోల్‌ప్లాజా సమీపం నుంచి దిశను ముష్కరులు కిడ్నాప్ చేయడం, అత్యాచారానికి ఒడిగట్టడంతో పాటు మృతదేహాన్ని తమ లారీలోనే దాదాపు 30 కిలోమీటర్లు తీసుకెళ్లడం, పెట్రోల్ బంక్‌కు వెళ్లిన ఓ నిందితుడు పెట్రోల్ ఖరీదు చేసుకుని వెళ్లడం, చటాన్‌పల్లి బ్రిడ్జి కింద మృతదేహాన్ని కాల్చేయడం తదితర సంఘటనలు చోటు చేసుకున్నాయి. గత నెల 29న పోలీసులు నిందితులను అరెస్టు చేసిన తర్వాత ఈ వివరాలన్నీ వారి విచారణలోనే వెలుగులోకి వచ్చాయి. దీంతో ప్రజల్లో తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఇది సైబరాబాద్ పోలీసులపై మరింత ఒత్తిడి పెరగడానికి కారణమైంది. దీనికితోడు గత నెల 27న అర్ధరాత్రి దిశ మిస్సింగ్ వ్యవహారానికి సంబంధించి ఆమె కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించగా వారికి చేదు అనుభవం ఎదురైంది. పరిధుల పంచాయితీ పెట్టిన రెండు ఠాణాల అధికారులు అటు ఇటు తిప్పి తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం సైబరాబాద్ ప్రతిష్టను మరింత దిగజార్చింది. ఈ డ్యామేజ్‌ను కవర్ చేసుకునేందుకు ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసినా ఆశించిన ఫలితం దక్కలేదు. దీంతో పోలీసు బాస్‌లతో సహా అంతా తీవ్ర నిరాశా నిస్ఫృహలకు లోనయ్యారు.
నిందితులను అరెస్టు చేసినప్పటికీ ప్రజల నుంచి సానుకూల స్పందన రాకపోగా, వారిని తక్షణం శిక్షించాలని, వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలంటూ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులు షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఉన్నట్లు తెలియడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని నిరసనలు తెలిపారు. ఓ దశలో పోలీసులు లాఠీచార్జ్ సైతం చేయాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చివరకు పోలీసులు నిందితులను కోర్టుకు కూడా తరలించలేని పరిస్థితిలో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌ను పోలీస్ స్టేషన్‌కే పిలిపించి ఆయన ముందు హాజరుపరచాల్సి వచ్చింది. వీటన్నింటికీ మించి దిశ హత్యాచారం కేసు దర్యాప్తు పోలీసులు పెద్ద సవాల్‌గా మారింది. సీసీ కెమెరాల ఫుటేజీలు, సాకు‡్ష్యల వాంగ్మూలాలు, పరిస్థితులను బట్టి నిర్ధారించే సర్కమ్‌స్టాన్సియల్ ఎడివెన్స్‌లు తప్ప ఈ కేసులో ఎలాంటి కీలక ఆధారాలు పోలీసులకు చిక్కలేదు. కిడ్నాప్, అత్యాచారం, హత్య.. ఇవి జరుగుతున్నప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షులు లేకపోవడం, హతురాలి శరీరం కాలిపోవడంతో స్వాబ్స్ వంటివి సేకరించే పరిస్థితి లేదు. ఈ పరిణామాలతో కేసు కోర్టులో ఎంత వరకు నిలుస్తుందనే సందేహం వచ్చింది.
నిందితులను తదుపరి విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకునేవదుకు కోర్టు అనుమతించినా... ఇతర కేసుల మాదిరిగా బహిరంగంగా తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఆద్యంతం ఫార్మాలిటీస్‌ను కూడా అత్యంత రహస్యంగా, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పూర్తి చేయాల్సి వచ్చింది. ఇవన్నీ వెరసి గడిచిన ఎనిమిది రోజులు సైబరాబాద్ పోలీసులు నిద్రాహారాలు మరిచిపోయారు. ఎట్టకేలకు నిందితులను గురువారం అర్ధరాత్రి చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి తమ కస్టడీలోకి తీసుకున్నారు. హతురాలికి సంబంధించిన వస్తువులు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకునేందుకు శుక్రవారం తెల్లవారుజామున ఘటనాస్థలాలకు తీసుకెళ్లారు. చటాన్‌పల్లి వద్ద సెల్‌ఫోన్ కోసం గాలిస్తుండగా నిందితులు పోలీసు కస్టడీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల వద్ద ఉన్న తుపాకులు లాక్కుని కాల్పులకు యత్నించారు. ఈ పరిస్థితుల్లో జరగరానిది ఏదైనా జరిగితే సైబరాబాద్ ఇమేజ్ మరింతగా డ్యామేజ్ అవుతుందని భావించిన పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరపడంతో నలుగురు నిందితులూ అక్కడికక్కడే హతమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్ స్పాట్ దిశ మృతదేహాన్ని కాల్చిన ప్రాంతానికి సమీపంలో ఉండటంతో ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఫలితంగా సైబరాబాద్ పోలీసులు గతానికి మించిన ఫైర్‌బ్రాండ్ ఇమేజ్ సొంతమైంది.
Comments
Please login to add a commentAdd a comment