'షీ' వలలో 'మొబైల్' పోరంబోకులు | SHE Teams have till now nabbed 138 persons who harass women over phone. | Sakshi
Sakshi News home page

'షీ' వలలో 'మొబైల్' పోరంబోకులు

Published Sat, Apr 2 2016 6:23 PM | Last Updated on Wed, Sep 26 2018 6:15 PM

'షీ' వలలో 'మొబైల్' పోరంబోకులు - Sakshi

'షీ' వలలో 'మొబైల్' పోరంబోకులు

హైదరాబాద్: 'బీ కేర్ ఫుల్.. 'షీ' ఈజ్ వాచింగ్ యు' అని చెప్పకనే రహస్యంగా నిఘానేత్రంతో ఆకతాయిల ఆట కట్టిస్తున్నాయి షీ టీమ్స్. మహిళల భద్రత కోసం దేశంలోనే మొట్టమొదటిసారి ప్రయోగాత్మకంగా హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలో ప్రారంభమైన షీ బృందాలు.. ఎక్కడికక్కడ పోకిరీల ఆగడాలకు అడ్డుకట్టవేస్తూ భద్రతపై మహిళలకు భరోసా కల్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే మొబైల్ ఫోన్ వేధింపులపైనా దృష్టిసారించిన షీ బృందాలు మొబైల్ పోరంబోకుల తాట తీస్తున్నాయి.

 

వివిధ ప్రాంతాల్లో మహిళలకు ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడటం, అభ్యంతరకరమైన మెసేజ్ లు, ఫొటోలు పంపడం లాంటి నేరాలకు పాల్పడిన 138 మందిని కోర్టులో దోషులుగా నిరూపించి, కటకటాల్లోకి నెట్టాయి షీ బృందాలు. జంట కమిషనరేట్లు వెల్లడించిన వివరాలనుబట్టి మొబైల్ ఫోన్ల ద్వారా వేధింపులకు పాల్పడి, పట్టుబడిన 138 మందిలో వివిధరకాలుగా వేధింపులకు పాల్పడ్డవారి కేసుల వివరాలిలా ఉన్నాయి.

  • 44 కేసులు: మహిళలు ఒంటరిగా ఉండే సమయాలను ముందుగానే తెలుసుకుని పదే పదే ఫోన్లు చేసి విసిగిస్తున్నవారిపై 44 కేసులు నమోదయ్యాయి.
  • 24 కేసులు: ప్రేమ సందేశాలను ఎస్సెమ్మెస్ ల రూపంలో పంపుతూ ఇబ్బందిపెట్టి పట్టుబడ్డవారి సంఖ్య
  • 24 కేసులు: పాత స్నేహాన్ని అడ్డంపెట్టుకుని, గతంలో ఉన్న చనువును అడ్వాంటేజిగా తీసుకుని వేధింపులకు పాల్పడినవి.
  • 19 కేసులు: అసభ్యకరంగా మాట్లాడుతూ, అసభ్యకరమైన ఫొటోలు పంపిన కేసులు
  • 8 కేసులు: వాట్సాప్ ద్వారా అభ్యంతరకరమైన వీడియోలు, ఫొటోలు పంపి పట్టుబడినవారు
  • 6 కేసులు: ఫోన్ కాల్స్ చేసి భయభ్రాంతులకు గురిచేసినవారు


వీళ్లేకాకుండా ఇంకా ఎంతోమంది పోకిరీలు మహిళలపై వేధింపులకు పాల్పడుతూనే ఉన్నారు. అయితే కాస్త ధైర్యం చేసి షీ టీమ్స్ కు ఫోన్ ద్వారాకానీ, ఎస్సెమ్మెస్, వాట్సప్ ద్వారాగానీ సమాచారం ఇస్తే చాలు. వేధింపులకు పాల్పడేవారిపని పట్టడమేకాక, అవసరమైన పక్షంలో బాధిత మహిళలలకు రక్షణకూడా కల్పిస్తామంటున్నారు పోలీసులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement