‘ఇదే ఏరియాలో ఉంటా.. ఏం చేసుకుంటావో చేసుకో’
హైదరాబాద్: రోడ్డు దాటుతున్న యువతిని వెకిలిచేష్టలతో వేధించి షీ టీమ్స్‌కు చిక్కిన ఓ యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వివరాలు... బంజారాహిల్స్ రోడ్ నెం.5లోని దేవరకొండ బస్తీ నివాసి సయ్యద్ సోహైల్(21) ఈనెల 8న బంజారాహిల్స్ రోడ్ నెం.1లోని జీవీకే వన్ షాపింగ్ మాల్ ముందు బైకుపై నిలబడి లోపలి నుంచి షాపింగ్ చేసి వస్తున్న యువతులను వేధిస్తున్నాడు. ఐశ్వర్య అనే యువతి తన వదినతో కలిసి షాపింగ్ చేసి వస్తూ రోడ్డు దాటుతుండగా సోహైల్ ఆమెను చూసి విజిల్ వేసి అసభ్యకరంగా కామెంట్ చేశాడు.
బైకును తీసుకొచ్చి ఆమెపైకి ఎక్కించే ప్రయత్నం చేయగా.. ఆ దృశ్యాలను ఆమె ఫొటోలు తీసింది. దీంతో మరింత రెచ్చిపోయిన అతను నా పేరు సోహైల్.. ‘ఇదే ఏరియాలో ఉంటా.. ఏం చేసుకుంటావో చేసుకో’.. అని వెళ్లిపోయాడు. దీంతో బాధిత యువతి షీటీమ్స్‌కు ఫిర్యాదు చేసి బైకు నెంబర్ ఇచ్చింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడిని బుధవారం అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. నిం దితుడిపై ఐపీసీ సెక్షన్ 509, 506ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.