
సదస్సులో మాట్లాడుతున్న పోలీస్ కమిషనర్ కార్తికేయ
నిజామాబాద్‌రూరల్: రోజురోజుకు పెరిగిపోతున్న మహిళలపై అత్యాచారాలు, దౌర్జన్యాలను సహించబోమని, ఇలాంటి ఘటనలను అరికట్టడం కోసం పోలీస్ శాఖ ఎంతో కృషి చేస్తుందని సీపీ కార్తికేయ పేర్కొన్నారు. నేరాలను అదుపుచేసేందుకు ప్రజల సహకారం అవసరమని ఆయన పేర్కొన్నారు.
గురువారం నగర శివారులోని మేఘన దంత వైద్య కళాశాలలో జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షీటీం సంయుక్త అవగాహన సదస్సులో ఆయన పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఫెండ్లీ పోలీస్ గురించి వివరించారు. విద్యార్థినులకు ఈవ్‌టీజింగ్, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు రిపోర్ట్ చేయాలని సూచించారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రతాప్‌కుమార్ మాట్లాడుతూ నిజామాబాద్ పోలీస్ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలను కొనియాడారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు, వారికి కావాల్సిన భద్రత కల్పించడం సమాజంలో అందరి బాధ్యత అని చెప్పారు.
మహిళలు తమపై జరుగుతున్న అన్యాయాలను సహించకుండా ముందుకువచ్చి ఫిర్యాదు చేయాలన్నారు. షీ-టీం కానిస్టేబుల్ శ్రావణి విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు.మేఘన దంతవైద్య కళాశాల విద్యార్థులు షీ-టీమ్ గురించి నాటిక ప్రదర్శించారు.
అనంతరం కమిషనర్ కార్తికేయ, సీఐ వెంకటేశ్వర్లును కళాశాల యాజమాన్యం సత్కరించారు. కార్యక్రమంలో షీ-టీం ఎస్సై వెంకటయ్య, రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీధర్, డాక్టర్ సురేశ్‌కుమార్, డాక్టర్ శీనునాయక్, తదితరులు పాల్గొన్నారు.