ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: పబ్లిక్ ప్లేసుల్లోకి వస్తున్న అతివల్ని వేధిస్తున్న పోకిరీల్లో మైనర్లు పెద్ద సంఖ్యలోనే ఉంటున్నారు. ఈ ఏడాది ఆరున్నర నెలల కాలంలో నగర షీ టీమ్స్ బృందాలు పట్టుకున్న వారిలో 11.11 శాతం వీళ్లే ఉండటం ఆందోళనకర అంశం. లాక్‌డౌన్ పూర్తిగా తొలగిపోయి, సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో అతివలకు వేధింపులు పెరిగే ప్రమాదం ఉందని, ఈ నేపథ్యంలోనే నిఘా ముమ్మరం చేయాలని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఆదేశించారు. షీ టీమ్స్ పని తీరుపై ఆయన బుధవారం భరోసా కేంద్రంలో విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన కొన్ని వివరాలు వెల్లడించారు.
► ఈ ఏడాది జనవరి నుంచి జూలై 15 వరకు షీ టీమ్స్‌ను మొత్తం 889 మంది బాధితులు ఆశ్రయించారు. తీవ్రత ఆధారంగా వీటిలో 97 ఫిర్యాదులను ఎఫ్‌ఐఆర్‌లుగా నమోదు చేయగా మరో 22 పెట్టీ (చిన్న స్థాయి) కేసులుగా మారాయి.
►మొత్తం 288 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 201 మందిని మందలించి విడిచిపెట్టారు. మరో 87 మందిని మాత్రం ఆయా పోలీసుస్టేషన్లకు అప్పగించారు. మిగిలిన ఫిర్యాదులను దర్యాప్తు అనంతరం వెలుగులోకి వచి్చన అంశాల ఆధారంగా మూసేశారు.
►బహిరంగ ప్రదేశాల్లో రెచి్చపోయే పోకిరీలకు చెక్ చెప్పడానికి షీటీమ్స్‌కు చెందిన బృందాలు ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. వీటిలో పట్టుబడిన 135 మందిలో 15 మంది (11.11 శాతం) మైనర్లే ఉన్నారు. వీరికి అధికారులు భరోసా కేంద్రంలో కౌన్సెలింగ్ ఇచ్చి
పంపించారు.
►బాధితుల్లో 41 శాతం మంది నేరుగా భరోసా కేంద్రానికి వచ్చి షీటీమ్స్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. మిగిలిన వారిలో 30 శాతం మంది వాట్సాప్ ద్వారా, 14 శాతం మంది మెయిల్ ద్వారా, 12 శాతం మంది క్యూ ఆర్ కోడ్స్ స్కాన్ చేయడం ద్వారా, మిగిలిన వారు హాక్‌ఐ యాప్, ఫేస్‌బుక్, 100 ద్వారా ఆశ్రయించారు.
►వీటిలో 21 శాతం కేసులు ఫోన్ ద్వారా వేధింపులకు సంబంధించినవే ఉన్నాయి. 17 శాతం కేసులు నేరుగా వెంటపడి వేధించడం, 9 శాతం కేసులు పెళ్లి పేరుతో మోసాలు, 14 శాతం కేసులు బ్లాక్ మెయిలింగ్, మిగిలినవి ఫొటోల మార్ఫింగ్, ప్రాంక్ కాల్స్ తదితరాలు ఉన్నాయి.
ఆధునిక టెక్నాలజీ వాడండి
మహిళలపై జరుగుతున్న వేధింపుల తరహా నేరాల్లో నిందితుల్ని పట్టుకోవడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించండి. చిక్కిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోండి. బాధితురాళ్లు సైతం ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేసేలా అవగాహన పెంచండి.
– షీ టీమ్స్‌తో నగర కొత్వాల్
Comments
Please login to add a commentAdd a comment