సాక్షి,హైదరాబాద్: ఐమాక్స్ వద్ద అడ్వకేట్ కల్యాణ్‌పై ఇద్దరు దాడి చేసి మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు. నిందితులిద్దరూ మైనర్లని పోలీసులు తెలిపారు. ఈ మేరకు అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం(నవంబర్ 13) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అబిడ్స్,సైఫాబాద్ ఏసీపీలు చంద్రశేఖర్, సంజయ్ కేసు వివరాలు వెల్లడించారు.
మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అబిడ్స్ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లోని గన్‌ఫౌండ్రిలోని ప్రసాద్ అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌ను కత్తితో బెదిరించిన ఇద్దరు మైనర్లు మొబైల్ ఫోన్‌ను ఎత్తుకెళ్లారు. అక్కడి నుంచి ఐమాక్స్ వద్దకు వెళ్లారు. 5 గంటల సమయంలో అక్కడ వాకింగ్ చేస్తున్న న్యాయవాది కల్యాణ్ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్‌ను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు.
కల్యాణ్ వారిని అడ్డుకోవడంతో కత్తితో బెదిరించారు.ఈ క్రమంలో మైనర్ల చేతిలో కల్యాణ్ గాయపడ్డారు.సెంట్రల్ జోన్ పరిధిలో ఒకేరోజు గంటల వ్యవధిలో రెండు ఇదే తరహా కేసులు నమోదు కావడంతో డీసీపీ యాదవ్ నేతృత్వంలో రెండు ప్రత్యేక బృందాలు ఏర్పడి దర్యాప్తు చేపట్టారు.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రాంనగర్ ఫిష్ మార్కెట్ వద్ద ఓ మైనర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు.అతని వద్ద ఉన్న వాచ్‌మెన్ మొబైల్ ఫోన్‌ను పోలీసులు తొలుత స్వాధీనం చేసుకున్నాం.నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా చాంద్రాయణగుట్ట బండ్లగూడ వద్ద మరో మైనర్‌ను అదుపులోకి తీసుకున్నాం.
అతని వద్ద న్యాయవాది కల్యాణ్ స్మార్ట్ ఫోన్, దాడికి ఉపయోగించిన కత్తి, వారు వాడిన హోండా యాక్టివా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నాం. వారి ఆధార్ కార్డుల ప్రకారం మైనర్లుగా తేలిందని..అయితే, వారి వయసును నిర్ధరించేందుకు ఉస్మానియా ఆస్పత్రిలో టెస్టుల కోసం పంపించాం. గతంలో వారిపై ఇదే తరహాలో ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొబైల్ స్నాచింగ్ కేసు నమోదైంది’ అని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: ట్యాపింగ్ కేసులో భుజంగరావుకు షాక్
Comments
Please login to add a commentAdd a comment