
హైదరాబాద్, సాక్షి: ఫోన్‌ట్యాపింగ్ కేసులో పలువురు రాజకీయ నాయకులకు నోటీసులు వెళ్తున్న వేళ.. ఈ కేసులో నిందితుడు భుజంగరావుకు పెద్ద షాక్ తగిలింది. ఆయన బెయిల్‌ను రద్దు చేస్తూ బుధవారం నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది. మధ్యంతర బెయిల్‌ను రద్దు చేసిన కోర్టు.. రేపు(గురువారం) సాయంత్రం. 4గం. లోపు జైలుకు వెళ్లాలని భుజంగరావును ఆదేశించింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు ఏ2 నిందితుడు. అనారోగ్య కారణాల రిత్యా ఈ ఏడాది ఆగష్టు 19వ తేదీన ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత దానిని పొడగిస్తూ వచ్చింది. అయితే కిందటి నెలలో రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేయగా.. కోర్టు దానిని తిరస్కరించింది. అదే టైంలో మధ్యంతర బెయిల్ విషయంలో మరికొంత ఊరట ఇచ్చింది.
ఫోన్ టాపింగ్ కేసులో మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావును మార్చి 23వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి మిగతా నిందితులతో పాటు ఆయన బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ కేసులో మొదట అరెస్ట్ అయ్యింది మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు. ఆయన ఇచ్చిన సమాచారంతోనే పంజాగుట్ట పోలీసులు అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావుల్ని అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో ప్రధాన సూత్రధారి, ఏ1 ప్రభాకర్‌రావు అమెరికాలో ఉండగా.. ఆయన కోసం ఈ మధ్యే రెడ్ కార్నర్ నోటీసులు సైతం జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment