వేధిస్తే... వాట్సాప్ పంపుడే!
- పోకిరీలపై ఫిర్యాదు చేస్తున్న బాధితులు
- సగానికిపైగా ఫిర్యాదులు వాట్సాప్ ద్వారానే..
- త్వరగా స్పందిస్తున్న సైబరాబాద్ షీ టీమ్స్
సిటీబ్యూరో: పోకిరీల ఈవ్‌టీజింగ్‌పై ఫిర్యాదు చేస్తే ఎక్కడ పరువుపోతుందోనని.. ఒకవేళ ధైర్యం చేసి ఫిర్యాదు చేసినా ఎన్నిసార్లు ఠాణా చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వస్తుందోననే దిగులుతో బాధిత మహిళలు ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చేవారు కాదు... ఇదంతా గతం. మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు తీసుకుంటున్న విప్లవాత్మక మార్పులు మహిళలను చైతన్యపరుస్తున్నాయి. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన షీ బృందాల పుణ్యమా అని ఈవ్‌టీజర్లపై ఫిర్యాదు చేసే బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వేధింపులకు గురైన క్షణంలోనే బాధిత మహిళలు పోలీసుస్టేషన్ గడప తొక్కకుండానే అరచేతిలో ఉన్న మొబైల్ సహాయంతో వాట్సాప్ ద్వారా సైబరాబాద్ వాట్సాప్ నంబర్ 9490617444కు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు వచ్చిన 376 ఫిర్యాదుల్లో దాదాపు 200 ఫిర్యాదులు వాట్సాప్ ద్వారానే రావడం విశేషం.
ఒక్క ఎస్‌ఎంఎస్‌తో రంగంలోకి ...
అభయ ఘటన తర్వాత సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మహిళల భద్రత కోసం పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే సైబరాబాద్‌లోని శంషాబాద్, మాదాపూర్, బాలానగర్, మల్కాజిగిరి, ఎల్బీనగర్ జోన్లలో ఏడాదిన్నర క్రితం ఏర్పాటుచేసిన 60 షీ టీమ్స్ తమ పనిని నిశ్శబ్దంగా చేసుకుపోతున్నాయి. కళాశాలలు, బస్సుస్టాప్‌లు, బస్సులు, రైల్వే స్టేషన్లు, కార్యాలయాల్లో యువతులు, మహిళలను వేధించేవారిపై నిఘా ఉంచుతున్నాయి. సైబరాబాద్ పోలీసు వాట్సాప్ నంబర్ 9490617444కు బాధిత యువతులు ఎస్‌ఎంఎస్ పంపిన మరుక్షణం షీ టీమ్స్ స్పందించి ఘటనా స్థలానికి చేరుకుంటున్నాయి. ఈవ్‌టీజర్ల వెకిలి చేష్టలను చిత్రీకరించి సాక్ష్యాలు పట్టుకొని షీ కార్యాలయానికి తరలిస్తున్నారు. వేధించేవాళ్లలో విద్యార్థులు, యువకులు ఉంటే వారి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని మరోమారు ఇలాంటి చర్యలకు పాల్పడబోమంటూ లిఖితపూర్వకంగా రాయించుకొని పెట్టీ కేసులు పెడుతున్నారు. మళ్లీ అదే తప్పు చేసే వారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి జైలుకు పంపుతున్నారు.
టెక్నాలజీతో ఈవ్‌టీజర్లపై ఫిర్యాదు
ఈవ్‌టీజింగ్, వేధింపులకు గురయ్యే మహిళలు చాలా మంది సైబరాబాద్ వాట్సాప్ నంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపుతున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు 376 కేసులు నమోదు చేశాం. వీటిలో 309 పెట్టీ కేసులు, 67 ఎఫ్‌ఐఆర్‌లున్నాయి. ఈ కేసుల్లో మొత్తం 427 మందిని పట్టుకున్నాం. వీరిలో 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉన్న 314 మంది ఉన్నారు. 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారు 51 మంది, 40 నుంచి 50 ఏళ్ల వయసు మధ్య ఉన్నవారు 18 మంది, 21 మంది మైనర్లు ఉన్నారు. 50కి పైబడినవారు ఐదుగురున్నారు. వీరందరికీ కౌన్సెలింగ్ నిర్వహించాం. మరోమారు వేధింపులకు పాల్పడవద్దని సుతిమెత్తగా హెచ్చరించాం.
-శ్రీనివాసులు, ఏసీపీ, సైబరాబాద్ షీ టీ మ్స్ ఇన్‌చార్జి