
సాక్షి, కరీంనగర్ : గత కొద్ది రోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రాల్లో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠాలు తిరుగుతున్నాయన్న పుకార్లే అందుకు కారణం. ‘సైకోలు వచ్చారు...పిల్లలను ఎత్తుకుపోతున్నారు, రాత్రివేళ ఎవరైనా తలుపు కొడితే తీయకండి.. చంపేసి డబ్బు, నగలు దోచుకుపోతారు..’ వంటి హెచ్చరికలతో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ శాఖ స్పందించింది. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భద్రత కోసం పోలీస్ శాఖ ప్రతీక్షణం పనిచేస్తోందని వెల్లడించారు.
అత్యవసర పరిస్థితుల్లో ఎప్పుడైనా 100కు కాల్ చేయాలని, దగ్గరలోని పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు . అయితే ఇవన్నీ వదంతులని, వీటిలో ఏమాత్రం వాస్తవం లేదని పోలీసు ఉన్నతాధికారులు చెప్పినా ప్రజలు ఏ మాత్రం లెక్క చేయకుండా మతిస్థితంలేని, వలస కూలీలను, తెలుగు భాష రాని వారిని పట్టుకుని పలుచోట్ల దాడులు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. దొంగల పేరుతో మహిళా పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఏడుగురిని షీ టీమ్ అరెస్ట్ చేసింది. వారిలో ముగ్గురిపై నిర్భయ కేసు, నలుగురిపై ఈవ్ టీజింగ్ కేసు నమోదు చేసి జరిమానా విధించామని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు ఉంటాయని, సీపీ కమలాసన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment