karimnagan district
-
‘అగ్రికల్చర్ పాలిటెక్నిక్’ నోటిఫికేషన్ విడుదల
సాక్షి, జగిత్యాల: పదో తరగతి పూర్తయిన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కోర్సులు వరంగా మారాయి. రెండేళ్ల కోర్సు చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉండటంతో వీటికి డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా వ్యవసాయంపై మక్కువ ఉన్నవారు, రైతుబిడ్డలు మరింత వ్యవసాయ విజ్ఞానాన్ని పొంది, సాగు చేసే పంటల్లో అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది. ఈ కోర్సులు చేసిన తర్వాత ఉన్నత విద్యనభ్యసించాలంటే ఎంసెట్‌తో సంబంధం లేకుండా బీఎస్సీ(అగ్రికల్చర్) కోర్సులో చేరవచ్చు. డిప్లొమా చేసిన వారికి బీఎస్పీ అగ్రికల్చర్లో 10 నుంచి 15 శాతం సీట్లు రిజర్వ్ చేస్తారు. సీట్ల వివరాలు... దరఖాస్తులను బట్టి సీట్లను కౌన్సెలింగ్ పద్ధతిలో భర్తీ చేస్తా రు. రాష్ట్రంలో ఉన్న 9 ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీల్లో 200 సీట్లు, 7 ప్రైవేట్ కాలేజీల్లో 420 సీట్లు ఉన్నాయి. విత్తన సాంకేతిక పరిజ్ఞానం(సీడ్ టెక్నాలజీ)లో... ఒక ప్రభుత్వ కాలేజీలో 20 సీట్లు, ఒక ప్రైవేట్ కాలేజీలో 60 సీట్లు ఉన్నాయి. అలాగే మూడేళ్ల అగ్రికల్చర్ ఇంజినీరింగ్ డిప్లొమాలో.. ఒక ప్రభుత్వ కళాశాలలో 20 సీట్లు, మూడు ప్రైవేట్ కాలేజీల్లో 90 సీట్లు ఉన్నాయి. ఇటీవల నూతనంగా వికారాబాద్ జిల్లా గింగుర్తిలో ప్రవేశపెట్టిన సేంద్రియ వ్యవసాయం డిప్లొమా కోర్సుల్లో 60 సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది నుంచి అగ్రికల్చర్ ఇంజినీరింగ్ డిప్లొమా మూడేళ్లు, అగ్రికల్చర్, సీడ్ టెక్నాలజీ, సేంద్రియ వ్యవసాయం రెండేళ్ల డిప్లొమా కోర్సులను సైతం ఇంగ్లిష్ మీడియంలో చదవాల్సి ఉంటుంది. అర్హత వివరాలు... ఈ ఏడాదికి గాను రెండేళ్ల అగ్రికల్చర్ పాలిటెక్నిక్, సీడ్ టెక్నాలజీ కోర్సులతో పాటు మూడేళ్ల అగ్రికల్చర్ ఇంజినీరింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది. ఈ కోర్సులు చదివేందుకు పదో తరగతి చదివిన విద్యార్థులు అర్హులు. ఇంటర్మీడియట్, ఆపైన చదివిన వారు అనర్హులు. పదేళ్ల చదువు కాలంలో కనీసం నాలుగేళ్ల పాటు గ్రామీణ పాంత్రాల్లో(మున్సిపల్ ఏరియా కాకుండా) చదివిన వారు అర్హులు. అభ్యర్థి వయసు డిసెంబర్ 31, 2020 నాటికి 15–22 ఏళ్ల మధ్య ఉండాలి. పాలిసెట్–2020 పరీక్షల్లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. దరఖాస్తు విధానం, ఫీజులు ఇలా... దరఖాస్తు ఆన్లైన్లో అక్టోబర్ 16లోగా చేసుకోవాలి. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1100, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ వారు రూ.600 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సీటు వస్తే ప్రభుత్వ కళాశాలల్లో రూ.12,810, ప్రైవేట్ కళాశాలల్లో రూ.17,810 చెల్లించాలి. మరిన్ని వివరాలకు వ్యవసాయ విశ్వవిద్యాలయ వెబ్సైట్ డబ్లూడబ్ల్యూడబ్ల్యూ.పీజేటీఎస్ఏయూ.ఎసీ.ఇన్ లో సంప్రదించవచ్చు. -
ఆ వార్తలు నిజం కాదు
సాక్షి, కరీంనగర్ : గత కొద్ది రోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రాల్లో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠాలు తిరుగుతున్నాయన్న పుకార్లే అందుకు కారణం. ‘సైకోలు వచ్చారు...పిల్లలను ఎత్తుకుపోతున్నారు, రాత్రివేళ ఎవరైనా తలుపు కొడితే తీయకండి.. చంపేసి డబ్బు, నగలు దోచుకుపోతారు..’ వంటి హెచ్చరికలతో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ శాఖ స్పందించింది. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భద్రత కోసం పోలీస్ శాఖ ప్రతీక్షణం పనిచేస్తోందని వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో ఎప్పుడైనా 100కు కాల్ చేయాలని, దగ్గరలోని పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు . అయితే ఇవన్నీ వదంతులని, వీటిలో ఏమాత్రం వాస్తవం లేదని పోలీసు ఉన్నతాధికారులు చెప్పినా ప్రజలు ఏ మాత్రం లెక్క చేయకుండా మతిస్థితంలేని, వలస కూలీలను, తెలుగు భాష రాని వారిని పట్టుకుని పలుచోట్ల దాడులు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. దొంగల పేరుతో మహిళా పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఏడుగురిని షీ టీమ్ అరెస్ట్ చేసింది. వారిలో ముగ్గురిపై నిర్భయ కేసు, నలుగురిపై ఈవ్ టీజింగ్ కేసు నమోదు చేసి జరిమానా విధించామని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు ఉంటాయని, సీపీ కమలాసన్ తెలిపారు. -
సార్లు...సీఎంను కలువాలే..
హూజూరాబాద్ : సార్లు.. నా భర్త పులి రాములుకు 90 ఏళ్లు ఉంటాయి. పదేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. సాకడం కష్టమైతంది. సీఎం సారు వస్తున్నాడని మా చుట్టు పక్కన వారు చెప్పిండ్రు. తోపుడు బండి మీద మా భర్తను జమ్మికుంట నుంచి తీసుకువచ్చిన. సారును కలువాలే అంటూ రాములు భార్య లచ్చమ్మ అధికారులను వేడుకోవడం పలువురిని కలిచివేచింది. నడవలేని స్థితిలో ఉన్న అతను భార్య సాయంతో తోప్పుడు బండి మీద ఎక్కించుకొని నాలుగు కిలోమీటర్ల దూరం తోసుకువచ్చింది. భర్త పరిస్థితి సీఎంకు చెప్పుకుంటానని అధికారుల కాళ్ల ఏళ్ల పడింది. మరోక్క ప్రక్క ఎండ విపరీతంగా ఉండటంతో రాములు తట్టుకోలేకపోయాడు. అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో మళ్లీ ఎండలో తోప్పుడు బండి మీద భర్త తీసుకోని జమ్మికుంట వరకు తోసుకెళ్లింది. సభకు వచ్చిన జనం భార్య, భర్తల మలి దశ అనుబంధంపై చర్చించుకోవడం గమనార్హం. -
స్కూల్లో మద్యం తాగి టీచర్ల వీరంగం
కరీంనగర్: ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులే పెడదారిపట్టారు. దేవాలయం వంటి పాఠశాలలోనే మద్యం తాగి వీరంగం చేశారు. కరీంనగర్ జిల్లా దంగర్‌వాడి స్కూల్లో ఈ సంఘటన జరిగింది. స్కూల్లో మద్యం తాగుతూ పట్టుబడ్డ ఉపాధ్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై డీఈవో వెంటనే చర్యలు తీసుకున్నారు. ఏడుగురు ఉపాధ్యాయులతో సహా మరో ఉద్యోగిని సస్పెండ్ చేశారు.