టీచర్‌ వెంటపడిన ప్ర‘వృద్ధుడు’ | Old Man Harassments On School Teacher In Hyderabad | Sakshi
Sakshi News home page

వేధింపులు తాళలేక ఉద్యోగం మానేసింది

Published Tue, Jun 12 2018 10:56 AM | Last Updated on Tue, Sep 4 2018 5:48 PM

Old Man Harassments On School Teacher In Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: బతుకు తెరువు కోసం స్కూల్‌ టీచర్‌గా పని చేస్తున్న  మహిళను వేధించాడో ప్ర‘వృద్ధుడు’. అతని వేధింపులు తాళలేక ఉద్యోగం మానేసినా అతడు మారలేదు. దాదాపు రెండేళ్ల పాటు ఈ హింసను భరించిన ఆమె ఇటీవల ‘షీ–టీమ్స్‌’ను ఆశ్రయించింది. ఆ వేధింపుల వృద్ధుడికి చెక్‌ చెప్పిన బృందాలు ఫలక్‌నుమ పోలీసుల ద్వారా కటకటాల్లోకి పంపాయి. పాతబస్తీకి చెందిన ఓ మహిళ స్కూల్‌లో టీచర్‌గా పని చేయడంతో పాటు ఇంటి వద్ద ట్యూషన్లు చెప్పేది. అదే ప్రాంతానికి చెందిన ఉస్మాన్‌ (52) తన ముగ్గురు పిల్లలను ట్యూషన్‌కు తీసుకువచ్చి, తీసుకువెళ్తుండేవాడు. ఈ వంకతో ఆమెతో మాట్లాడాలని ప్రయత్నించేవాడు. కొన్నాళ్లకు ఇది వేధింపులుగా మారింది. ఓ దశలో శృతిమించడంతో బాధితురాలు ఉద్యోగం మానేయడంతో పాటు ఉస్మాన్‌ పిల్లలకు ట్యూషన్‌ చెప్పడాన్నీ విరమించుకుంది. అయినప్పటికీ మారని ఆ ప్ర‘వృద్ధుడు’ తన పంథా కొనసాగిస్తూ మరింత రెచ్చిపోయాడు. దాదాపు రెండేళ్ల పాటు ఈ హింస భరించిన బాధితురాలు ఎట్టకేలకు ఇటీవల షీ–టీమ్స్‌ను ఆశ్రయించింది. లోతుగా దర్యాప్తు చేసిన బృందాలు ఉస్మాన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం అంగీకరించాడు. దీంతో ఫలక్‌నుమ ఠాణాలో కేసు నమోదు చేయించిన బృందాలు ఉస్మాన్‌ను అరెస్టు చేసి స్థానిక పోలీసులకు అప్పగించాయి.

ఫోన్‌లో సైకో వేధింపులు...
తార్నాకలోని ఓ మాల్‌లో సెల్స్‌గర్ల్‌గా పని చేస్తున్న యువతికి సెల్‌ఫోన్‌ వేధింపులు ఎదురయ్యాయి. సదరు పోకిరీ సైకోగా మారి రెచ్చిపోవడంతో బాధితురాలు షీ–టీమ్స్‌ను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన బృందాలు కొండాపూర్‌కు చెందిన కె.కిరణ్‌బాబు బాధ్యుడిగా తేల్చి పట్టుకున్నాయి. బాధితురాలు పని చేసే మాల్‌కు కిరణ్‌ నిత్యం వచ్చేవాడు. ఆమెతో మాట కలుపుతూ ఫోన్‌ నెంబర్‌ ఇవ్వాల్సిందిగా బలవంతం చేసే వాడు. ఆమె తిరస్కరించినప్పటికీ అతడి ప్రవర్తన మారలేదు. కొన్నాళ్లకు మరో మార్గంలో ఆమె సెల్‌ఫోన్‌ నెంబర్‌ తెలుసుకున్న అతగాడు ఫోన్‌ చేశాడు. ఆ సమయంలో యువతి తన ఫోన్‌ను మాల్‌ సెక్యూరిటీ వద్ద డిపాజిట్‌ చేయడంతో మిస్డ్‌కాల్‌గా నమోదైంది. ఫోన్‌ తీసుకున్న ఆమె మిస్డ్‌కాల్స్‌ చూసి తన తల్లిదండ్రులు మరో నెంబర్‌ నుంచి ఫోన్‌ చేసి ఉంటారని భావించింది. కాల్‌ బ్యాక్‌ చేయగా... మొదలైన కిరణ్‌ వేధింపులు తారా స్థాయికి చేరాయి. గతంలో మాల్‌కు వచ్చి తన ఫోన్‌ నెంబర్‌ కోరిన వ్యక్తే ఈ పని చేస్తున్నట్లు ఆమె గుర్తించింది. ఫోన్‌ను తన బంధువుకు ఇచ్చి మాట్లాడమని కోరింది. సైకోగా మారిపోయిన కిరణ్‌ అత్యంత అభ్యంతరకరమైన రీతిలో మాట్లాడటంతో  బాధితురాలు షీ–టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన బృందాలు కిరణ్‌ను పట్టుకుని ఉస్మానియా వర్శిటీ పోలీసులకు అప్పగించాయి. 

ఐదు నెలల్లో 310 ఫిర్యాదులు: నగర షీ–టీమ్స్‌ ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో 310 ఫిర్యాదులు వచ్చినట్లు అదనపు సీపీ షికా గోయల్‌ సోమవారం తెలిపారు. ఇందులో 45 మందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో పాటు తదుపరి చర్యలు తీసుకున్నామన్నారు. వేధింపులు ఎదురైన మహిళలు, యువతులు 100, హాక్‌–ఐ, వాట్సాప్‌ నెం.9490616555, ఈ–మెయిల్‌ ఐడీ (hydsheteam@gmail.com), షీటీమ్స్‌ ఫేస్‌బుక్, ట్విటర్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు. నాంపల్లిలోని హాకాభవన్‌లో  ఉన్న భరోసా కేంద్రాన్ని నేరుగా సంప్రదించవచ్చని సూచించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement