ఆకతాయిలకు కౌన్సెలింగ్ ఇస్తున్న పోలీసులు
సాక్షి, సిటీబ్యూరో: ఈవ్‌టీజింగ్ చేస్తున్నారని ఫిర్యాదు అందితే సంఘటనా స్థలానికి చేరుకొని నిఘా వేసి నిందితులను పట్టుకునే సైబరాబాద్, రాచకొండ షీ బృందాలు పంథా మార్చాయి. ఎక్కువగా ఈవ్‌టీజింగ్ జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో మాటు వేసి ఆకతాయిల ఆట కట్టిస్తున్నాయి. ఇటు అమ్మాయిలు, అటు ఈవ్‌టీజర్లకు తెలియకుండానే పోకిరీల వెకిలిచేష్టలు, వేధింపులను వీడియో రికార్డు చేసి సాక్ష్యాలతో సహా పట్టుకుంటున్నాయి. వారిపై కేసులు నమోదుచేసి న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నారు. వీరిలో కొందరికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి పరివర్తన తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. బస్టాప్‌లు, మల్టీప్లెక్స్‌లు, షాపింగ్‌మాల్స్, పర్యాటక ప్రాంతాల్లో యువతులు, విద్యార్థినులను వేధిస్తున్నారంటూ ఫిర్యాదులు అందుతుండటంతో సైబరాబాద్, రాచకొండ పోలీసు ఉన్నతాధికారులు ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. నెలరోజుల్లో రెండు కమిషనరేట్ల పరిధిలో 210 కేసులు నమోదు చేశారు. 80 మందిపై క్రిమినల్, పెట్టీ కేసులు పెట్టారు.
ఆకతాయిలను వెంబడిస్తూ...
వివిధ పనుల నిమిత్తం ఇల్లు, వసతి గృహాల నుం చి ఒంటరిగా బయటికి వస్తున్న విద్యార్థినులు, యువతులను టార్గెట్‌గా చేసుకుని పోకిరీలు వేధిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసులు, విచారణలు అంటూ ఠాణాల చుట్టూ తిరగాల్సి వస్తుందని బాధితులు వారి ఆగడాలను బరిస్తున్నారు. కొందరు పోకిరీలు గచ్చిబౌలి, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, ఎల్‌బీనగర్, ఉప్పల్, అల్వాల్ తదితర ప్రాంతాల్లో యువతులు, విద్యార్థినులను ప్రతిరోజూ వెంటపడి వేధిస్తున్నారు. బాధితులు భయపడుతుండడంతో వారు మరింత రెచ్చిపోతున్నారు. దీనిపై నిఘా వేసిన ‘షీ’ బృందాలు వెంటనే వారిని అదుపులోకి తీసుకుంటున్నాయి. ఎవరికీ ఏమాత్రం అనుమానం రాకుండా మఫ్టీలో ఉంటూ ఆకతాయిల ఆగడాలను వీడియో తీసి న్యాయస్థానంలో సాక్ష్యాలు సమర్పిస్తున్నారు.
లేడీస్ హాస్టళ్లలోనూ ప్రత్యేక చర్యలు...
బస్‌స్టాపులు, బహిరంగ ప్రదేశాల్లో వేధింపులను నియంత్రిస్తున్న పోలీసులు.. యువతులు, మహిళల హాస్టళ్లు పరిసర ప్రాంతాల్లో ఈవ్‌టీజింగ్ నివారించేందుకు చర్యలు చేపట్టారు. అపహరణలు.. అత్యాచారయత్నాలు.. వేధింపులు.. ఈవ్‌టీజింగ్ తదితర నేరాలను కట్టడి చేసేందుకు లా అండ్ అర్డర్ పోలీసులకూ సమాచారం ఇస్తున్నారు. హాస్టళ్ల నిర్వాహకులతో చర్చించి సీసీ కెమెరాలు, పరిసర ప్రాంతాల్లో భద్రత ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఎస్‌సీఎస్‌సీ మార్గదర్శనంలో ‘సేఫ్ స్టే’ పకడ్బందీగా అమలు చేయాలని సూచిస్తున్నారు. హాస్టళ్లలో వైఫై సౌకర్యంతో పాటు బాధితులకు వేధింపుల ఫోన్లు రాగానే ‘షీ’ బృందం సాంకేతిక సభ్యులకు సమాచారం అందించాలని సూచించారు. బాధితుల్లో ఎక్కువ మంది స్టేషన్‌కు వచ్చేందుకు సందేహిస్తున్న నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలకు ఉపక్రమించారు. అలాగే ఆకతాయిలకు ఎలా బుద్ధి చెప్పాలి, స్వీయ ఆత్మరక్షణ, పోలీసులకు ఎలాంటి సమాచారంఇవ్వాలన్న అంశాలపై వారికి అవగాహన కల్పిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment