‘ఆమె’కు ఆమే భద్రత | She Temas Awareness in Colleges | Sakshi
Sakshi News home page

‘ఆమె’కు ఆమే భద్రత

Published Thu, May 23 2019 8:14 AM | Last Updated on Mon, May 27 2019 7:44 AM

She Temas Awareness in Colleges - Sakshi

షీ ఫర్‌ హర్‌ వలంటీర్లకు అవగాహన కలిగిస్తున్న సీపీ మహేష్‌ భగవత్‌

‘ఇబ్రహీంపట్నంలోని ఓ కాలేజీకి చెందిన విద్యార్థిని షీ ఫర్‌ హర్‌ వలంటీర్‌ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది.  శివగౌడ్‌ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఫోన్లు చేసి వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో  ఇబ్రహీం పట్నం పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.’

‘అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఓ కాలేజీ విద్యార్థినికి బనవత్‌ గణేశ్‌ అనే యువకుడితో పరిచయం ఉంది. ఆమె తన స్నేహితురాళ్లతో కలిసి సంఘీ గుడికి వెళ్లిన సమయంలో అక్కడికి వచ్చి న అతను ఆమెతో సెల్ఫీలు దిగాడు. అతని వైఖరి నచ్చక బాధితురాలు అతడితో మాట్లాడం మానేసింది. అయితే బాధితురాలికి వివాహం నిశ్చయమైనట్లు తెలుసుకున్న గణేశ్‌ కాలేజీకి వచ్చి ప్రేమించాలంటూ ఆమెపై ఒత్తిడి చేశాడు. గతంలో తీసుకున్న ఫొటోలను అందరికీ పంపిస్తానంటూ బెదిరించాడు. దీంతో ఆందోళనకు గురైన బాధితురాలు ‘షీ ఫర్‌ హర్‌’ ద్వారా పోలీసులకు ఫిర్యాదుచేసింది. అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు.’

సాక్షి, సిటీబ్యూరో: కళాశాలల్లో మహిళలు, యువతుల భద్రత కోసం రాచకొండ పోలీసులు మూడేళ్ల క్రితం ప్రారంభించిన ‘షీ ఫర్‌ హర్‌’ సత్ఫలితాలనిస్తోంది. తద్వారా ర్యాంగింగ్, వేధింపులు తగ్గుముఖం పట్టాయి. బహిరంగ ప్రాంతాల్లో అమ్మాయిలను అటకాయించి వేధించేవారి భరతం పట్టేందుకు షీ బృందాలు పనిచేస్తున్నా కాలేజీ లోపల జరిగే వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదని రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ దృష్టికి రావడంతో ‘షీ ఫర్‌ హర్‌’ను ప్రారంభించి వారి రక్షణకు అండగా నిలిచారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడకుండా వేధింపులపై ఫిర్యాదు చేసే ధైర్యం చేయని విద్యార్థినులకు మహిళా భద్రత చట్టాలపై అవగాహన కలిగించారు. ఈ షీ ఫర్‌ హర్‌ కార్యక్రమం కింద ఒక్కో కాలేజీ నుంచి ఇద్దరు సీనియర్‌ విద్యార్థినులను వలంటీర్లుగా ఎంపిక చేసి మహిళల చట్టాలపై చైతన్యం చేశారు. వీరు ఇక్కడ నేర్చుకున్న అంశాలను తోటి విద్యార్థినులకు సెమినార్ల ద్వారా వివరించారు. ఆయా కాలేజీల్లో వేధింపులు ఎదుర్కొనే విద్యార్థినుల సమస్యలు ‘షీ ఫర్‌ హర్‌’ దృష్టికి తీసుకు వస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. అయితే బాధితురాలి వివరాలు గోప్యంగా ఉంచి సదరు ఆకతాయిని తీవ్రతను బట్టి కేసు నమోదు చేస్తారు. లేదా కౌన్సెలింగ్‌ ఇచ్చి  హెచ్చరిస్తారు.

రాచ‘కొండ’ంత అండ...
రాచకొండ పరిధిలో ‘షీ ఫర్‌ హర్‌’ వలంటీర్లుగా 625 ఉన్నారు. ఒక్కో కాలేజీ నుంచి ఇద్దరు సీనియర్‌ విద్యార్థినులకు షీ ఫర్‌ హర్‌ వలంటీర్లుగా ఎంపిక చేశారు. 2017లో 157 మంది, 2018లో 259 మంది, 2019లో 209 మంది షీ ఫర్‌ హర్‌ వలంటీర్లుగా చేరారు. వీరు ఆయా కళాశాలల్లో తోటి విద్యార్థినులకు ఎదురయ్యే వేధింపులను పోలీసుల దృష్టికి రావడంలో చురుగ్గా పనిచేస్తున్నారు. తద్వారా 2017లో 13 కేసులు, 2018లో ఆరు కేసులు, 2019లో మూడు కేసులు...మొత్తం మూడేళ్లలో 22 కేసులు నమోదయ్యాయి. అయితే చాలా వరకు ఫిర్యాదులు వచ్చినా ఆకతాయిలకు కౌన్సెలింగ్‌ చేసి ఈవ్‌టీజింగ్‌ ఎదురయ్యే అనర్థాలపై ముందస్తు హెచ్చరికలు చేశారు. దీనివల్ల చాలావరకు కాలేజీల్లో అమ్మాయిలకు వేధింపులు తగ్గుముఖం పట్టాయని షీ ఫర్‌ హర్‌ వలంటీర్లు పేర్కొంటున్నారు. రాచకొండ పోలీసుల అండతో భద్రత వాతావరణం నెలకొందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

ఆమెకు అండగా ...
కాలేజీల్లో ర్యాగింగ్‌ వల్ల గతంలో ఎన్నో గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో మహిళల రక్షణకు షీ బృందాలు పనిచేస్తున్నట్లుగానే కాలేజీల్లో విద్యార్థినుల కోసం విద్యార్థినులే పనిచేస్తే సత్పలితాలుంటాయన్న ఆలోచనతో మూడేళ్ల క్రితం ‘షీ ఫర్‌ హర్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అనుకున్నట్టుగానే కాలేజీ విద్యార్థినుల నుంచి మంచి స్పందన వచ్చింది. కేసులు తక్కువ ఉన్నా వీరి ప్రభావం కాలేజీల్లో ఎక్కువగా ఉంది.      –మహేష్‌ భగవత్,రాచకొండ పోలీసు కమిషనర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement