అతివలకు భరోసా.. హైదరాబాద్‌లో సైబర్‌ షీ–టీమ్స్‌ ఏర్పాటు | Women Safety Hyderabad Cyber She Teams Telangana | Sakshi
Sakshi News home page

అతివలకు భరోసా.. హైదరాబాద్‌లో సైబర్‌ షీ–టీమ్స్‌ ఏర్పాటు

Jan 1 2023 8:26 AM | Updated on Jan 1 2023 4:01 PM

Women Safety Hyderabad Cyber She Teams Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు, యువతులకు మరింత భరోసా ఇవ్వడానికి హైదరాబాద్‌ నగర పోలీసు విభాగం చర్యలు చేపట్టింది. ఈ మేరకు కొత్తగా సైబర్‌ షీ–టీమ్స్‌ను ఏర్పాటు చేయాలని పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ నిర్ణయించారు. ఈ బృందాల్లో సాంకేతిక నిపుణులతోపాటు ఎథికల్‌ హ్యాకర్లు కూడా ఉండనున్నారు. ఈవ్‌టీజింగ్‌ సహా వివిధ రకాల వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు, యువతులు, బాలికల కోసం షీ–టీమ్స్‌ పని చేస్తున్నాయి. ఈవ్‌టీజర్లపై కన్నేసి రెడ్‌çహ్యాండెడ్‌గా పట్టుకోవడం దగ్గరి నుంచి కుటుంబ సమస్యల పరిష్కారం వరకు అనేక విధాలుగా అండగా నిలుస్తున్నాయి.

కానీ ఇటీవల కాలంలో వేధింపుల తీరు మారింది. స్మార్ట్‌ఫోన్, సోషల్‌ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ‘ఈ–పోకిరీ’లు పెరిగిపోయారు. వారు బాహ్య ప్రపంచంలో కాకుండా సోషల్‌ మీడియా ద్వారా రెచి్చపోతున్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌.. ఇలా వివిధ రకాల ప్లాట్‌ఫామ్స్‌ కేంద్రంగా వేధింపులకు పాల్పడుతున్నారు. వారికి చెక్‌ చెప్పడానికే సైబర్‌ షీ–టీమ్స్‌ ఏర్పాటు చేయనున్నారు. 

బయటికి చెప్పుకోలేక భరిస్తూ.. 
ఆన్‌లైన్‌ వేధింపుల బారినపడుతున్న అతివల్లో అనేక మంది తమకు ఎదురైన ఇబ్బందులను బయటికి చెప్పుకోలేకపోతున్నారు. వేధింపులకు పాల్పడుతున్నవారి నుంచి వస్తున్న బెదిరింపులకు తోడు పరువు పోతుందనే ఉద్దేశంతో మిన్నకుండిపోతున్నారు. ఈ పరిస్థితిని అలుసుగా తీసుకుంటున్న మోసగాళ్లు మరింతగా రెచ్చిపోతున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌ షీ–టీమ్స్‌కు వస్తున్న ఫిర్యాదుల్లో 60శాతం దాకా ఆన్‌లైన్‌ వేధింపులకు సంబంధించినవే ఉంటున్నాయి. శాంతిభద్రతల విభాగం, సైబర్‌ క్రైమ్‌ ఠాణాలకు వస్తున్న సైబర్‌ కేసుల్లోనూ వేధింపులకు సంబంధించినవే అధికంగా ఉంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే.. 2022లో సైబర్‌ నేరాల కేసులు 9,815 నమోదుకాగా.. వీటిలో సైబర్‌ వేధింపులకు సంబంధించినవి 1,118, అశ్లీల సందేశాలు పంపడానికి సంబంధించినవి 141 ఉన్నాయి. ఈ వేధింపులు, అశ్లీల సందేశాల కేసుల్లో బాధితులు మహిళలు, యువతులే. దీనికితోడు ఇటీవలి కాలంలో ప్రేమ ముసుగులో జరిగే ‘ఈ–నేరాలు’ పెరిగిపోయాయి. వాటితో యువతులు, మహిళలు వ్యక్తిగతంగా, మానసికంగా, ఆర్థికంగా నష్టపోతున్నారు. 

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో.. 
సైబర్‌ వేధింపులు ఎదురైన బాధితులు నేరుగా షీ–టీమ్స్‌ వద్దకు రావాల్సిన అవసరం లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఫోన్, వాట్సాప్, ఫేస్‌బుక్‌.. ఇలాంటి మార్గాల్లోనూ ఫిర్యాదు చేయవచ్చని చెప్తున్నారు. బాధితుల వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సైబర్‌ షీ–టీమ్స్‌కు వచ్చే ఫిర్యాదులకు సంబంధించిన అంశాలను దర్యాప్తు చేయడం, నిందితులను గుర్తించి పట్టుకోవడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతోపాటు ప్రత్యేక టూల్స్‌ వినియోగించనున్నారు. ఆయా అంశాల్లో నిష్ణాతులైన వారిని బృందాల్లో నియమించనున్నారు. అవసరమైతే డార్క్‌నెట్‌ను కూడా ఛేదించే నైపుణ్యమున్న ఎథికల్‌ హ్యాకర్ల సేవలను వినియోగించుకుంటారు. ఇప్పటికే సిటీ పోలీసు విభాగం మహేశ్‌ బ్యాంకు కేసు సహా పలు సైబర్‌ నేరాల దర్యాప్తు కోసం ఎథికల్‌ హ్యాకర్ల సేవలు వినియోగించుకుంది. 

స్మార్ట్‌ఫోన్‌ కూడా చేటుకు కారణం! 
ఒకప్పుడు ఫోన్‌ విలాసవస్తువు. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ నిత్యావసరంగా మారిపోయింది. ఇవి వచ్చాక ఎవరికి వారికి ‘స్వేచ్ఛ’ పెరిగింది. ఆకర్షణను ప్రేమగా భావిస్తున్న యువతులు అపరిచితులతోనూ హద్దులు దాటుతున్నారు. కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత అంశాలను రికార్డు చేయడాన్నీ పట్టించుకోవడం లేదు. ఓ దశలో ఇవే వారి పాలిట శాపంగా మారుతున్నాయి. ఏటా నమోదవుతున్న సైబర్‌ నేరాల్లో ఈ తరహాకు చెందినవి పెద్ద సంఖ్యలో ఉంటున్నాయి. సైబర్‌ షీ–టీమ్స్‌ ఏర్పాటుతో పరిస్థితులు మారే అవకాశం ఉంది. 
– సైబర్‌ క్రైమ్‌ పోలీసులు 

ఇటీవల షీ–టీమ్స్‌కు వచ్చిన ‘ఈ–కేసు’ల్లో కొన్ని... 

► బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కొంతకాలం హైదరాబాద్‌లోని ఓ మలీ్టనేషనల్‌ కంపెనీలో పనిచేశాడు. అప్పట్లో తన సహోద్యోగిని అయిన యువతిపై ఆన్‌లైన్‌లో వేధింపులకు పాల్పడ్డాడు. ఈ–మెయిల్స్, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్స్‌ ద్వారా అభ్యంతరకర ప్రచారానికి దిగాడు. పోలీసులు సదరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను అరెస్టు చేశారు. 
► హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లికి చెందిన ఓ మరుగుజ్జు యువకుడు ఫేజ్‌బుక్‌లో తనదేనంటూ ఓ అందమైన యువకుడి ఫొటో పెట్టాడు. ఓ యువతి ‘ఫ్రెండ్‌’గా పరిచయం కావడంతో చాటింగ్‌ ప్రారంభించాడు. ప్రేమ పేరుతో వలవేసి.. అనేక కారణాలు చెప్పి ఆమె నుంచి రూ.3 లక్షల నగదు, 50 తులాల బంగారం స్వాహా చేశాడు. 
► ఓ వ్యక్తి బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. గతంలో ప్రాజెక్టు వర్క్‌ నేపథ్యంలో పరిచయమైన యువతిని ప్రేమించాడు. ఆమె తిరస్కరించడంతో కక్షగట్టాడు. ఓ ల్యాప్‌టాప్, డేటాకార్డ్‌ కొనుగోలు చేసి.. సదరు యువతి మెయిల్‌ ఐడీని హ్యాక్‌ చేశాడు. ఆమె బంధువులు, స్నేహితులకు ఆమే పంపిస్తున్నట్టుగా అసభ్య చిత్రాలు, సందేశాలు పంపాడు.
చదవండి: Telangana: గ్రూప్‌–4లో 8,039 పోస్టులే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement