సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రతకు కీలక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర పోలీసు విభాగం దానికోసం సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటోంది. ఇందులో భాగంగా అమలులోకి తీసుకువచ్చిన పోలీసు అంతర్గత యాప్ ‘షీ–టీమ్స్’లో కొత్త హంగులు చేర్చింది. యువతులు, మహిళలపై నేరాలు జరిగే ప్రాంతాలను గుర్తించి జియోట్యాగింగ్ చేస్తోంది. ఈ మ్యాప్స్‌ను అప్లికేషన్‌లో ఉంచడం ద్వారా ఉమెన్ సేఫ్టీ వింగ్ ప్రత్యేక పర్యవేక్షణకు మార్గం సుగమమైంది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు ఎక్కడైనా షీ–టీమ్స్ పనితీరు, స్పందన ఒకేలా ఉండేందుకు ఈ యాప్ వినియోగిస్తున్నారు. దీన్ని పోలీసు విభాగం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది.
నిఘా మూసధోరణిలో కాకుండా
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 370 షీ–టీమ్స్ పనిచేస్తున్నాయి. ఈ బృందాలు మఫ్టీలో సంచరిస్తూ ఈవ్‌టీజర్లు, మహిళలపై వేధింపులకు పాల్పడే వారిపై నిఘా వేసి ఉంచుతున్నాయి. సాధారణంగా బస్టాండ్లు, రైల్వేస్టేషన్లతో పాటు ఇతర పబ్లిక్ ప్లేసుల్లో ఈ బృందాలు సంచరిస్తుంటాయి. అన్ని వేళలా, అన్ని ప్రాంతాల్లోనూ ఉండటం సాధ్యం కాకపోవడంతో కొన్ని సందర్భాల్లో షీ–టీమ్స్ నిఘా మూస ధోరణిలో సాగుతోంది. ఉదాహరణకు హైదరాబాద్‌లోని కోఠి ఉమెన్స్ కాలేజ్ బస్టాప్ వద్ద వీళ్లు ఎక్కువ నిఘా ఉంచితే... ముషీరాబాద్‌లో ఈవ్‌టీజింగ్ జరుగుతుంటుంది. ఇలాంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక నగరాలు, పట్టణాలు, జిల్లాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే షీ–టీమ్స్ యాప్‌లో జియోట్యాగింగ్‌ను చేర్చారు.
మ్యాప్‌పై ఆ ప్రాంతాలు ప్రత్యక్షం
హైదరాబాద్ కేంద్రంగా పని చేసే ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇలాంటి హాట్‌స్పాట్స్‌ను ఎప్పటికప్పుడు గుర్తిస్తుంటుంది. ఆయా ప్రాంతాల్లో నమోదైన కేసులు, వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా వీటిని గుర్తిస్తుంది. మ్యాప్‌పై ఆ వివరాలు పొందుపరుస్తూ జియోట్యాగింగ్ చేస్తుంది. రాష్ట్రంలోని అన్ని షీ–టీమ్స్ వద్ద ఈ యాప్ అందుబాటులో ఉంది. అందులోని మ్యాప్‌లో ఈవ్‌టీజింగ్ హాట్‌స్పాట్స్‌ను నిర్దేశిస్తుంటుంది. దీని ఆధారంగా ఆయా ప్రాంతాలను తెలుసుకునే సిబ్బంది వాటిపైనే ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. కాలమాన పరిస్థితులను బట్టి ఈ హాట్‌స్పాట్స్ మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఉమెన్ సేఫ్టీ వింగ్ ఈ మ్యాప్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ షీ–టీమ్స్‌ను సమాచారం అందేలా చేస్తుంటుంది.
ఆ ఫిర్యాదులన్నీ ఈ యాప్‌లోకి..
ఈవ్‌టీజింగ్ తరహాలో మహిళలపై జరిగే నేరాలు, వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులనూ ఈ యాప్‌లోకి తీసుకువస్తున్నారు. షీ–టీమ్స్ కేంద్రాలు, భరోస కేంద్రాలు, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ వింగ్, సైబర్ క్రైమ్... ఇలా కేటగిరీల వారీగా మహిళలు, యువతులపై జరిగే నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు రాష్ట్రంలో ఎక్కడ వచ్చినా వాటిని షీ–టీమ్స్ యాప్‌లో పొందుపరుస్తారు. ఫిర్యాదులోని అంశాలను బట్టి ఆయా విభాగాలకు దీన్ని బదిలీ చేస్తారు. సదరు ఫిర్యాదుపై అధికారులు, సిబ్బంది స్పందించిన తీరు, సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలు, పరిష్కరించిన విధానాలను ఈ యాప్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. పోకిరీల వివరాలు, వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన ప్రాంతాలు, సమయం, తేదీలు ఇందులో నిక్షిప్తం అవుతాయి. వీటి ఆధారంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ పదేపదే ఈ తరహా నేరాలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసుల నమోదుకు చర్యలు తీసుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment