She team police
-
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఏఎస్ఐ మృతి
హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ షీ టీమ్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రాజేందర్‌రెడ్డి (51) హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఈ నెల 11న విధులు ముగించుకొని ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వైపు వెళ్తుండగా నాగోలు ప్లైఓవర్‌పై బైక్ స్కిడ్ అయి కిందపడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నాగోలులోని సుప్రజా హాస్పిటల్ తరలించారు. వారం రోజుల పాటు చికిత్స పొందినా ఫలితం లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ రాజేందర్‌రెడ్డి చనిపోయాడు. పలువురు పోలీసు అధికారులు అతడి మృతదేహాన్ని సందర్శించి నివాళులరి్పంచారు. ఆదివారం నాగోలు శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. రాజేందర్‌రెడ్డి అంత్యక్రియల కోసం షీ టీమ్ డీసీపీ 70 వేలు నగదు, ఇతర పోలీసులు సిబ్బంది 70 వేలు అతడి కుటుంబ సభ్యులకు అందజేశారు. -
పడవతో గస్తీ..లేక్ పోలీసింగ్ వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్: ఇటీవల 17 ఏళ్ల ఓ ఇంటర్ విద్యార్థి కేబుల్ బ్రిడ్జి మీద నుంచి దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జిలపై లేక్ పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తొలిసారిగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో దుర్గం చెరువులో పడవతో పెట్రోలింగ్‌ను ఏర్పాటు చేశారు. కేబుల్ బ్రిడ్జి కింద వాచ్ టవర్‌ను ఏర్పాటు చేశారు. త్వరలోనే అధికారికంగా ప్రారంభించేందుకు సైబరాబాద్ కమిషనరేట్ పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యాటక ప్రాంతాలపై దృష్టి.. కరోనా కారణంగా రెండేళ్ల పాటు ఇంటికే పరిమితమైన పర్యాటకులు క్రమంగా బయటకు వస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లే బదులు స్థానికంగా ఉన్న టూరిస్ట్ ప్లేస్‌లపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. దీంతో దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జిలపై సందర్శకుల తాకిడి పెరిగింది. వారాంతాల్లో ఈ సంఖ్య మరీ ఎక్కువగా ఉంటోంది. దీంతోపాటు ఆయా ప్రాంతాల్లో సాయంత్రం వేళల్లో మద్యం తాగడం, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడం వంటివి పోలీసుల దృష్టికి వచ్చాయి. దీంతో సందర్శకులకు భద్రతతో పాటూ అసాంఘిక కార్యకలాపాలకు జరగకుండా ఉండేందుకు పోలీసుల గస్తీని ఏర్పాటు చేశామని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. బ్రిడ్జిపై వాచ్ టవర్.. ఇప్పటికే దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జి పరిసరాల్లో సైబరాబాద్ పోలీసులు 67 కెమెరాలను ఏర్పాటు చేశారు. తాజాగా బ్రిడ్జి కింద పోలీసు వాచ్‌టవర్‌ను ఏర్పాటు చేశారు. దీనికి అన్ని సీసీ కెమెరాలు అనుసంధానమై ఉంటాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ఏ మూలన ఏ సంఘటన కెమెరాల్లో నిక్షిప్తమవుతుంది. అనుమానిత వ్యక్తులు సంచరించినా, ట్రాఫిక్‌జాం, ఇతరత్రా ఇబ్బందులు జరిగినా వెంటనే వాచ్ టవర్లోని పోలీసులకు తెలిసిపోతుంది. వెంటనే క్షేత్ర స్థాయిలోని పోలీసులకు సమాచారం అందించి, ఘటన స్థలానికి వెళ్లి తగిన చర్యలు చేపడతారు. వాచ్ టవర్‌లో పోలీసులు 24 గంటలు విధుల్లో ఉంటారు. లేక్ పోలీసులకు ఈవీ వాహనాలు.. దుర్గం చెరువు పరిసరాలలో ఆర్టిఫీషియల్ వాటర్ ఫాల్స్, రాక్ గార్డెన్, ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్, ర్యాప్లింగ్, వాకింగ్ ట్రాక్‌ల వంటివి ఉన్నాయి. దీంతో పిల్లలు, యువకులతో ఎల్లప్పుడూ సందడిగా ఉంటుంది. కేబుల్ బ్రిడ్జి రోడ్డు మధ్యలో నిలబడి సెల్ఫీలు తీసుకోవటం, వాహనాలకు అంతరాయం కలిగిస్తుండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటిని నియంత్రించేందుకు లేక్ పోలీసులు 24 గంటలు గస్తీ చేస్తుంటారు. ఎలక్ట్రిక్ వాహనాలతో లేక్ పోలీసులు పెట్రోలింగ్ విధులను నిర్వహిస్తుంటారు. ఆయా ప్రాంతాలలో మహిళలతో అసభ్యంకరంగా ప్రవర్తించే పోకిరీలను షీ టీమ్ పోలీసులు అక్కడిక్కడే అరెస్ట్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. పలుమార్లు ఇలాంటి ప్రవర్తనే కనిపిస్తే జైలుకు పంపిస్తున్నారు. (చదవండి: నైట్ బజార్.. ఫుల్ హుషార్.) -
తెలంగాణ: మహిళలపై నేరాలు జరిగే ప్రాంతాల గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రతకు కీలక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర పోలీసు విభాగం దానికోసం సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటోంది. ఇందులో భాగంగా అమలులోకి తీసుకువచ్చిన పోలీసు అంతర్గత యాప్ ‘షీ–టీమ్స్’లో కొత్త హంగులు చేర్చింది. యువతులు, మహిళలపై నేరాలు జరిగే ప్రాంతాలను గుర్తించి జియోట్యాగింగ్ చేస్తోంది. ఈ మ్యాప్స్‌ను అప్లికేషన్లో ఉంచడం ద్వారా ఉమెన్ సేఫ్టీ వింగ్ ప్రత్యేక పర్యవేక్షణకు మార్గం సుగమమైంది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు ఎక్కడైనా షీ–టీమ్స్ పనితీరు, స్పందన ఒకేలా ఉండేందుకు ఈ యాప్ వినియోగిస్తున్నారు. దీన్ని పోలీసు విభాగం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. నిఘా మూసధోరణిలో కాకుండా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 370 షీ–టీమ్స్ పనిచేస్తున్నాయి. ఈ బృందాలు మఫ్టీలో సంచరిస్తూ ఈవ్‌టీజర్లు, మహిళలపై వేధింపులకు పాల్పడే వారిపై నిఘా వేసి ఉంచుతున్నాయి. సాధారణంగా బస్టాండ్లు, రైల్వేస్టేషన్లతో పాటు ఇతర పబ్లిక్ ప్లేసుల్లో ఈ బృందాలు సంచరిస్తుంటాయి. అన్ని వేళలా, అన్ని ప్రాంతాల్లోనూ ఉండటం సాధ్యం కాకపోవడంతో కొన్ని సందర్భాల్లో షీ–టీమ్స్ నిఘా మూస ధోరణిలో సాగుతోంది. ఉదాహరణకు హైదరాబాద్‌లోని కోఠి ఉమెన్స్ కాలేజ్ బస్టాప్ వద్ద వీళ్లు ఎక్కువ నిఘా ఉంచితే... ముషీరాబాద్‌లో ఈవ్‌టీజింగ్ జరుగుతుంటుంది. ఇలాంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక నగరాలు, పట్టణాలు, జిల్లాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే షీ–టీమ్స్ యాప్‌లో జియోట్యాగింగ్‌ను చేర్చారు. మ్యాప్‌పై ఆ ప్రాంతాలు ప్రత్యక్షం హైదరాబాద్ కేంద్రంగా పని చేసే ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇలాంటి హాట్‌స్పాట్స్‌ను ఎప్పటికప్పుడు గుర్తిస్తుంటుంది. ఆయా ప్రాంతాల్లో నమోదైన కేసులు, వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా వీటిని గుర్తిస్తుంది. మ్యాప్‌పై ఆ వివరాలు పొందుపరుస్తూ జియోట్యాగింగ్ చేస్తుంది. రాష్ట్రంలోని అన్ని షీ–టీమ్స్ వద్ద ఈ యాప్ అందుబాటులో ఉంది. అందులోని మ్యాప్‌లో ఈవ్‌టీజింగ్ హాట్‌స్పాట్స్‌ను నిర్దేశిస్తుంటుంది. దీని ఆధారంగా ఆయా ప్రాంతాలను తెలుసుకునే సిబ్బంది వాటిపైనే ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. కాలమాన పరిస్థితులను బట్టి ఈ హాట్‌స్పాట్స్ మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఉమెన్ సేఫ్టీ వింగ్ ఈ మ్యాప్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ షీ–టీమ్స్‌ను సమాచారం అందేలా చేస్తుంటుంది. ఆ ఫిర్యాదులన్నీ ఈ యాప్‌లోకి.. ఈవ్‌టీజింగ్ తరహాలో మహిళలపై జరిగే నేరాలు, వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులనూ ఈ యాప్‌లోకి తీసుకువస్తున్నారు. షీ–టీమ్స్ కేంద్రాలు, భరోస కేంద్రాలు, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ వింగ్, సైబర్ క్రైమ్... ఇలా కేటగిరీల వారీగా మహిళలు, యువతులపై జరిగే నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు రాష్ట్రంలో ఎక్కడ వచ్చినా వాటిని షీ–టీమ్స్ యాప్‌లో పొందుపరుస్తారు. ఫిర్యాదులోని అంశాలను బట్టి ఆయా విభాగాలకు దీన్ని బదిలీ చేస్తారు. సదరు ఫిర్యాదుపై అధికారులు, సిబ్బంది స్పందించిన తీరు, సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలు, పరిష్కరించిన విధానాలను ఈ యాప్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. పోకిరీల వివరాలు, వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన ప్రాంతాలు, సమయం, తేదీలు ఇందులో నిక్షిప్తం అవుతాయి. వీటి ఆధారంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ పదేపదే ఈ తరహా నేరాలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసుల నమోదుకు చర్యలు తీసుకుంటోంది. -
నాపెళ్లి ఆపండి.. ఓ అమ్మాయి ఫోన్
షాద్‌నగర్ రూరల్: ‘నాకు చదువుకోవాలని ఉంది.. కానీ మా తల్లిదండ్రులు పెళ్లి చేస్తామంటున్నారు.. సంబంధం కూడా చూశారు.. నాకు ఇష్టం లేకున్నా పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. ఈ పెళ్లిని ఎలాగైనా ఆపండి’ అంటూ ఓ అమ్మాయి ఫోన్ ద్వారా షీ టీం పోలీసులను కోరింది. తల్లిదండ్రులపై ఐసీడీఎస్ అధికారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఈ ఘటన గురువారం షాద్‌నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే... ఫరూఖ్‌నగర్ గుండుకేరికి చెందిన అమ్మాయి(18) పదో తరగతి పూర్తి చేసింది. (‘ప్రేమ పెళ్లి’కి ప్రోత్సాహం) రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన అబ్బాయితో ఈమెకు పెళ్లి సంబంధం చూశారు. ఈ నెల 31న వివాహం చేసేందుకు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తనకు చదువుకోవాలని ఉందని, పెళ్లి ఇష్టం లేదని సదరు అమ్మాయి షీ టీం పోలీసులకు ఫోన్ చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు యువతి ఇంటికి చేరుకున్నారు. ఈ సమయంలో అమ్మాయి.. ఐసీడీఎస్ అధికారి నాగమణికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఎక్కడైనా ప్రభుత్వ వసతిగృహంలో చేర్పించి చదువకునే అవకాశం కల్పించాలని కోరింది. దీంతో నాగమణి అమ్మాయి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ చేశారు. అనంతరం షీ టీం పోలీసులు విషయాన్ని షాద్‌నగర్ పోలీస్ స్టేషన్లో పట్టణ సీఐ శ్రీధర్‌కుమార్‌కు వివరించి యువతిని హైదరాబాద్ వనస్థలిపురంలోని సఖి కేంద్రానికి తరలించారు. అమ్మాయిని హైదరాబాద్‌కు తీసుకువెళ్తుతున్నషీ టీం పోలీసులు వేధింపులకు పాల్పడితే చర్యలు.. అమ్మాయిలపై వేధింపులకు పాల్పడితే చర్యలు తప్పవని షీ టీం శంషాబాద్, షాద్‌నగర్ జోన్ ఇన్చార్జ్, ఏఎస్ఐ జయరాజ్ తెలిపారు. ఎవరు వేధించినా అమ్మాయిలు ఆందోళన చెందకుండా షీ టీం పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. వివరాలు అందించిన వారి సమాచారం, పేరును గోప్యంగా ఉంచుతామన్నారు. సమాజంలో ఆడపిల్లలపై దాడులు, వేధింపులు జరిగితే ఏ విధంగా ఎదుర్కోవాలి అనే విషయాలపై అవగాహన కల్పింస్తామని చెప్పారు. ముఖ్యంగా కళాశాలలు, బస్టాండ్వంటి ప్రాంతాలలో విద్యార్థినులను పోకిరీలు ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. మహిళలు, యువతులకు ఇబ్బందులు ఎదురైతే సైబరాబాద్ షీ టీం ఫోన్ నంబర్ 9490617444, శంషాబాద్, షాద్‌నగర్ ప్రాంత షీ టీం ఫోన్ నంబర్ 9490617354కు వాట్సాప్ ద్వారా సమాచారాన్ని అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షీ టీం పోలీసులు సులోచన, శ్రీనివాస్‌రెడ్డి, లఖన్, ప్రహ్లాద్ తదితరులు పాల్గొన్నారు. అమ్మాయిలపై వేధింపులకు పాల్పడితే.. సైబరాబాద్ షీ టీం ఫోన్ నంబర్ 9490617444 శంషాబాద్, షాద్‌నగర్ ప్రాంతషీ టీం ఫోన్ నంబర్ 9490617354 -
రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఈవ్‌టీజర్..
సాక్షి, హైదరాబాద్ : ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేస్తూ, వారితో సీక్రెట్‌గా దిగిన ఫోటోలను ఫేస్బుక్లో పెడతానంటూ బెదిరిస్తున్న ఓ యువకుడిని బుధవారం షీ టీం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్కొండ ప్రాంతానికి చెందిన అల్తాన్ ఖాన్ తరచూ అమ్మాయిలను వేధించేవాడు. వారితో రహస్యంగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడు. అల్తాన్ ఖాన్ చర్యలకు విసుగు చెందిన ఓ అమ్మాయి షీ టీం పోలీసులను ఆశ్రయించింది. టోలీచౌకి చౌరస్తా వద్ద మాటు వేసిన పోలీసులు అల్తాన్ ఖాన్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గతంలో అమ్మాయిలను వేధించిన కేసులో అల్తాన్ ఖాన్ అరెస్టయిన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
మహిళలను వేధిస్తున్న కీచకుడిపై నిర్భయ కేసు
సాక్షి, హైదరాబాద్: ఐడీఏ బొల్లారంలో కూలీగా పనిచేస్తున్న అదిలాబాద్ జిల్లా సిర్పూర్ కొత్తపల్లికి చెందిన అదె రంజిత్‌పై పోలీసులు నిర్భయ కేసును శనివారం నమోదుచేశారు. వాట్సప్ ద్వారా అశ్లీల వీడియోలు, చిత్రాలు చాలా మంది మహిళలకు పంపించడంతో పాటు, అర్ధరాత్రి సమయాల్లో అమ్మాయిలకు ఫోన్‌కాల్స్ చేసి వేధించేవాడని నగర షీ టీమ్‌ను పర్యవేక్షిస్తున్న క్రైమ్స్, షిట్ అదనపు పోలీసు కమిషనర్ స్వాతిలక్రా తెలిపారు. ముగ్గురు వేర్వేరు బాధితులు ఫిర్యాదు చేయడంతో ఫోన్ నంబర్ ఆధారంగా అతడిని అరెస్టు చేశామన్నారు. వివరాల్లోకి వెళితే...ప్యాకర్స్ అండ్ మూవర్స్ కంపెనీలో రంజిత్ పనిచేస్తున్నాడు. పాకింగ్ సేవల కోసం వచ్చే కస్టమర్ల ఫోన్ నంబర్లలో మహిళల నంబర్లను తీసుకొని సేవ్‌చేసుకునేవాడు. తరచూ వారికి ఫోన్‌కాల్స్ చేయడంతో పాటు అశ్లీల వీడియోలు, చిత్రాలు వాట్సప్ ద్వారా పంపించేవాడు. అయితే మహిళ ఫోన్‌కాల్ తీయగానే వేధింపులు చేయడం మొదలెట్టేవాడు. ముగ్గురు వేర్వేరు బాధితులు ఫిర్యాదు చేయడంతో నిందితుడు రంజిత్‌ను షీ టీమ్ పోలీసులు పట్టుకున్నారు. కేసు తదుపరి విచారణ కోసం ఎస్ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారు. 354-ఏ(3), 292, 507 ఐపీసీ సెక్షన్లతో నిర్భయ యాక్ట్ నమోదుచేశారు. రిమాండ్‌కు తరలించారు.