సాక్షి, హైదరాబాద్: ఐడీఏ బొల్లారంలో కూలీగా పనిచేస్తున్న అదిలాబాద్ జిల్లా సిర్పూర్ కొత్తపల్లికి చెందిన అదె రంజిత్‌పై పోలీసులు నిర్భయ కేసును శనివారం నమోదుచేశారు. వాట్సప్ ద్వారా అశ్లీల వీడియోలు, చిత్రాలు చాలా మంది మహిళలకు పంపించడంతో పాటు, అర్ధరాత్రి సమయాల్లో అమ్మాయిలకు ఫోన్‌కాల్స్ చేసి వేధించేవాడని నగర షీ టీమ్‌ను పర్యవేక్షిస్తున్న క్రైమ్స్, షిట్ అదనపు పోలీసు కమిషనర్ స్వాతిలక్రా తెలిపారు. ముగ్గురు వేర్వేరు బాధితులు ఫిర్యాదు చేయడంతో ఫోన్ నంబర్ ఆధారంగా అతడిని అరెస్టు చేశామన్నారు. వివరాల్లోకి వెళితే...ప్యాకర్స్ అండ్ మూవర్స్ కంపెనీలో రంజిత్ పనిచేస్తున్నాడు. పాకింగ్ సేవల కోసం వచ్చే కస్టమర్ల ఫోన్ నంబర్‌లలో మహిళల నంబర్‌లను తీసుకొని సేవ్‌చేసుకునేవాడు.
తరచూ వారికి ఫోన్‌కాల్స్ చేయడంతో పాటు అశ్లీల వీడియోలు, చిత్రాలు వాట్సప్ ద్వారా పంపించేవాడు. అయితే మహిళ ఫోన్‌కాల్ తీయగానే వేధింపులు చేయడం మొదలెట్టేవాడు. ముగ్గురు వేర్వేరు బాధితులు ఫిర్యాదు చేయడంతో నిందితుడు రంజిత్‌ను షీ టీమ్ పోలీసులు పట్టుకున్నారు. కేసు తదుపరి విచారణ కోసం ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారు. 354-ఏ(3), 292, 507 ఐపీసీ సెక్షన్లతో నిర్భయ యాక్ట్ నమోదుచేశారు. రిమాండ్‌కు తరలించారు.
మహిళలను వేధిస్తున్న కీచకుడిపై నిర్భయ కేసు
Published Sat, Jan 30 2016 10:15 PM | Last Updated on Sun, Sep 3 2017 4:38 PM
Advertisement
Advertisement