ఇక గ్రామస్థాయిలోనూ షీటీమ్స్
వితంతువులతో పాటు మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు
రాష్ట్ర స్థాయి వితంతువుల మహాసభలో హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: వితంతువులపై సమాజంలో ఎక్కువవుతున్న వేధింపులను అరికట్టేందుకు గ్రామస్థాయిలోనూ షీటీమ్స్‌ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో వితంతువులను భాగస్వాములను చేస్తామని, వారు కీడు అని భావిస్తున్న సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు వారితోనే కొబ్బరికాయలు కొట్టిస్తామని చెప్పారు. హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో బాలవికాస, వితంతు ఉద్యమ సమాఖ్య ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన రాష్ట్ర స్థాయి వితంతువుల మహాసభలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వితంతువులందరూ ఎదుర్కొంటున్న సమస్యలపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో లోతైన చర్చ చేపడతామని, వితంతువులు అంటే కీడు కాదు మంచి అనే సందేశం గ్రామస్థాయి వరకు వెళ్లేలా కృషి చేస్తామన్నారు. ఇంటా, బయటా వేధింపులు ఎదుర్కొంటున్న వితంతువుల విషయంలో కఠిన చట్టాలు తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తామని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళతామని చెప్పారు. వితంతువులంటే వివక్ష చూపే వాళ్ల మెదడుకు పట్టిన బూజును తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఇక్కడకు వచ్చిన వితంతువుల్లో ఎక్కువ మంది బాల్యవివాహాలు చేసుకున్నవారు ఉన్నారు.
చిన్న వయసులోనే భర్తలు చనిపోయారని చాలా మంది చెప్పారు. గ్రామాల్లో గుడుంబా సేవించి ఆనారోగ్యం పాలై చిన్నతనంలోనే ఎక్కువ మంది చనిపోతున్నారు. ఈ విషయాన్ని గుర్తించే గుడుంబా రహిత గ్రామాల కోసం మా ప్రభుత్వం కృషి చేస్తోంది. అలాగే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఆడపిల్ల కుటుంబ సభ్యులకు ఆర్థిక చేయూతనివ్వడమే అనుకుంటున్నారు. ఇది బాల్యవివాహాలను అరికట్టేందుకు ప్రభుత్వం దూరదృష్టితో తీసుకున్న నిర్ణయం’అని హరీశ్‌రావు వివరించారు.
కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
బాలవికాస సంస్థ తరఫున శౌరిరెడ్డి మాట్లాడుతూ.. ‘దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ ఎన్నో పథకాలను ప్రారంభించి.. ఎన్నో కార్యక్రమాలకు కొబ్బరికాయ కొట్టారు. అదే మన గ్రామంలో శుభకార్యాలను కానీ, ఇతర కార్యక్రమాలను కానీ వితంతువులతో చేయిస్తే కీడు జరుగుతుందన్న అపోహ ఉంది. వితంతువుల ఆత్మగౌరవం, సమాన అవకాశాలను తీసుకొచ్చేందుకు అందరూ కలసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ, గుజరాత్ నుంచి కూడా వితంతువులు హాజరుకావడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది’అని అన్నారు. వితంతువుల కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని కోరారు.
వితంతువులతోనే కొబ్బరికాయ కొట్టిస్తా..
వితంతువు పిల్లల చదువు కోసం ప్రధానంగా తల్లి, తండ్రి లేని పిల్లలకు ప్రాధాన్యమిస్తూ రాష్ట్రంలో 21 ఇంగ్లిష్ మీడియం అర్బన్ రెసిడెన్సీ స్కూల్స్‌ను ప్రారంభించామన్నారు. తన నియోజక వర్గంలో ఎలాంటి కార్యక్రమం నిర్వహిం చినా మొదట వితంతువులతోనే కొబ్బరి కాయ కొట్టిస్తానని చెప్పారు. వితంతు వుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న బాల వికాస స్వచ్ఛంద సంస్థకు మంత్రి హరీశ్ తన నెల జీతాన్ని విరాళంగా ప్రకటించా రు. శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ.. వితంతువుల పిల్లలకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు.
నా భర్త మరణిస్తే నేను తప్పు చేసినట్టా..
మాది వరంగల్ జిల్లాలోని వెంకటాపురం. 18 ఏళ్ల వయసులోనే పెళ్‌లైంది. ఒక బాబు, పాప ఉన్నారు. నా భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆయన చనిపోయి ఐదురోజులు గడవకముందే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నన్ను మా పుట్టింటికి వెళ్లిపోమన్నారు. గత ఏడేళ్ల నుంచి తల్లిదండ్రుల వద్దనే ఉంటున్నా. పిల్లలను చదివించేందుకు నానా కష్టాలు పడుతున్నా. నా భర్త ప్రమాదంలో మరణిస్తే నేను చేసిన తప్పేంటో అర్థం కావడం లేదు. భర్త లేకపోవడంతో ఇతర మగవాళ్లు మరోరకంగా చూస్తుండటంతో ఇబ్బందవుతోంది. ఇలాంటి వారి లైంగిక వేధింపులు తట్టుకోలేక ఒక దశలో చనిపోవాలనుకున్నా.
– ఉమ, వితంతువు
చులకన బాధ కలిగిస్తోంది
మాది మహబూబాబాద్ దంతాలపల్లి గ్రామం. పదమూడేళ్ల వయసులోనే పెళ్‌లైంది. ఏడు నెలల బాబు ఉన్న సమయంలో భర్త మరణించాడు. అప్పటినుంచి కష్టాలు చుట్టుముట్టాయి. ఎక్కడికి వెళ్లినా లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి. బంధువులు శుభకార్యాలకు పిలిచినా.. అక్కడ అన్ని విషయాల్లోనూ మమ్మల్ని చులకన చేసి వెనక పెడుతున్నారు. బతుకుదెరువు కోసం కుట్టుమెషీన్ నడుపుతున్నా గిరాకీ రావడం లేదు. నాతో బట్టలు కుట్టించుకుంటే వాళ్లకేదో కీడు జరుగుతుందని అనుకుంటున్నారు. చనిపోయినవారి ఇళ్లలో దుస్తులు కుట్టేందుకు మాత్రం మా తలుపు తడుతున్నారు.
– అహల్య, వితంతువు