ప్రత్యేక చట్టమూ లేదు... ఠాణా హోదా రాదు! | She Teams have not been given full justice for victims | Sakshi
Sakshi News home page

ప్రత్యేక చట్టమూ లేదు... ఠాణా హోదా రాదు!

Published Thu, Jan 19 2023 12:48 AM | Last Updated on Thu, Jan 19 2023 9:42 AM

She Teams have not been given full justice for victims - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యువతులు, మహిళలను వేధించే పోకిరీలకు చెక్‌ చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం 2014లో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన షీ–టీమ్స్‌ గత ఎనిమిదేళ్లుగా ఎనలేని సేవలు అందిస్తున్నా నేటికీ వాటికి ప్రత్యేక చట్టం, కనీసం పోలీసుస్టేషన్‌ హోదా లేకపోవడంతో బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగట్లేదు. నేరాల తీవ్రత ఎక్కువగా ఉండి, పక్కా ఆధారాలు ఉంటే తప్ప ఆకతాయిలపై ఐపీసీతోపాటు ఇతర చట్టాల కింద కేసులు నమోదు చేయడం సాధ్యం కావట్లేదు.

గతేడాది రాజధానిలోని మూడు కమిషనరేట్లలో ఉన్న షీ–టీమ్స్‌కు అందిన ఫిర్యాదులు, పట్టుబడ్డ పోకిరీల సంఖ్య 2,322గా నమోదైనప్పటికీ వాటిలో 395 మాత్రమే ఎఫ్‌ఐఆర్‌లుగా నమోదయ్యాయి. మిగిలిన వాటిలో కొన్ని పెట్టీ కేసులు కాగా, మరో 1,798 మందికి కౌన్సెలింగ్‌తో సరిపెట్టాల్సి వచ్చింది. ఈవ్‌ టీజింగ్‌కు పాల్పడుతూ రెండోసారి చిక్కిన ఓ వ్యక్తితోపాటు తీవ్రస్థాయిలో రెచ్చిపోయిన వారిపైనే కేసులు నమోదు చేయగలిగారు. 

ప్రత్యేక చట్టం కోసం... 
ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు ఈవ్‌టీజర్లను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు ప్రత్యేక చట్టం అవసరమని భావించారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాలను అధ్యయనం చేసి చివరకు తమిళనాడులో అమలవుతున్న ‘తమిళనాడు ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ఈవ్‌ టీజింగ్‌ యాక్ట్‌’ఉపయుక్తంగా ఉందని తేల్చారు. అక్కడి చట్టంలోని అంశాలతోపాటు ఇతర అంశాలను చేరుస్తూ ఓ ముసాయిదాను రూపొందించి 2014లోనే ప్రభుత్వానికి పంపారు. అయితే ఈ ఫైలు న్యాయశాఖ వద్ద పెండింగ్‌లో ఉండిపోయింది. 

పోలీసుస్టేషన్ల మెట్లెక్కాల్సిందే... 
షీ–టీమ్స్‌ ఏర్పడి ఇన్నాళ్లైనా ఇప్పటికీ వాటికి పోలీసుస్టేషన్‌ హోదా ఇచ్చే అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదు. తమ బాధలు, సమస్యలు పోలీసుస్టేషన్‌లో చెప్పుకోలేక చాలామంది అతివలు షీ–టీమ్స్‌ను ఆశ్రయిస్తున్నా కేసు నమోదు తప్పనిసరైతే ఆ పనిని ఠాణా హోదా లేని షీటీమ్స్‌ చేయలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా బాధితురాలు నివసించే పరిధిలో ఉండే మహిళా ఠాణా, సైబర్‌క్రైమ్‌ పోలీసుస్టేషన్‌... ఇలా ఏదో ఒక చోటకు బాధితురాలిని తీసుకెళ్లి షీ–టీమ్స్‌ కేసులు నమోదు చేయిస్తున్నాయి.

అయితే అక్కడ అధికారులకు నిత్యం వస్తున్న అనేక కేసుల్లో ఇదీ ఒకటిగా మారిపోతోంది. దీంతో షీ–టీమ్స్‌పై ఉన్న నమ్మకం, ధైర్యంతో వచ్చిన బాధితురాళ్లకు నిరాశ తప్పట్లేదు. షీ–టీమ్స్‌కే ఠాణా హోదా ఇచ్చి అవసరమైన సిబ్బందిని కేటాయిస్తే వాటి లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరుతుందని నిపుణులు సూచిస్తున్నారు. 

‘షీ–టీమ్స్‌’ ముసాయిదా చట్టంలోని కొన్ని అంశాలు 
బహిరంగ ప్రదేశాలతోపాటు పని చేసే ప్రాంతాలు, మాల్స్‌... ఇలా ఎక్కడైనా ఈవ్‌ టీజింగ్‌కు పాల్పడుతూ చిక్కిన పోకిరీలపై నేరం నిరూపణ అయితే ఏడాది జైలు లేదా రూ. 10 వేల జరిమానా లేదా రెండూ. 

ఈవ్‌ టీజింగ్‌ చేయడానికి పోకిరీలు వాహనాలను వినియోగిస్తే వాటిని స్వాధీనం చేసుకొనే వీలు. 
దేవాలయాలు, విద్యాసంస్థలు తదితర చోట్ల జరిగే ఈవ్‌ టీజింగ్‌లను నిరోధించాల్సిన బాధ్యత వాటి నిర్వాహకులదే. అలాంటి సమాచారాన్ని తక్షణం సంబంధిత పోలీసులకు చేరవేయాల్సిందే. దీనికి భిన్నంగా వ్యవహరిస్తే ఆ నేరానికి యాజమాన్యాలనూ బాధ్యుల్ని చేయవచ్చు. వారికి న్యాయస్థానం జరిమానా విధించే అవకాశం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement