హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వినాయక నిమజ్జనం జరిగే ప్రాంతాలను పరిశీలిస్తున్న డీజీపీ మహేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: వినాయక నిమజ్జన కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు హైటెక్ పద్ధతిలో ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. 31 జిల్లాల్లోని వినాయక మండపాలు, నిమజ్జన ప్రక్రియను పోలీస్ ముఖ్య కార్యాలయం నుంచి లైవ్‌లో వీక్షించేలా సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 74,809 మండపాలను జియో ట్యాగ్ చేసి ప్రతి జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 65 వేల మంది పోలీసులు ప్రత్యక్షంగా, పరోక్షంగా విధుల్లో ఉంటారని.. సోషల్ మీడియాలో వదంతులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆదివారం వినాయక నిమజ్జనం సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై డీజీపీ సమీక్ష నిర్వహించారు. అనుమానాస్పద వ్యకులను గుర్తించేందుకు ఫేషియల్ రికగ్నైజేషన్ కెమెరాలను రంగంలోకి దించినట్లు వెల్లడించారు. జిల్లాల్లో లోతయిన చెరువుల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. మహిళలు, అమ్మాయిలను వేధించే పోకిరీలను గుర్తించేందుకు షీ టీమ్స్‌ను రంగంలోకి దింపిన ట్లు వెల్లడించారు. సున్నిత ప్రాంతాలు, గతం లో అల్లర్లు సృష్టించేందుకు యత్నించిన వారిపై నిఘా పెంచామన్నారు. గణేశ్ మండపాల నిర్వాహకులతో పోలీస్ అధికారులు సమన్వయం చేసుకోవాలని, వాళ్లను కలుపుకుంటూ వెళ్లి కార్యక్రమాలు ప్రశాంతంగా పూర్తయ్యేలా చూడాలని ఎస్పీలు, కమిషనర్లను ఆదేశించారు.
3 ఫీట్ల పైబడినవే..: రాష్ట్రవ్యాప్తంగా 3 ఫీట్ల పైబడి ఉన్న విగ్రహాల ఏర్పాటుకు పోలీస్ శాఖ అనుమతిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 74,809 విగ్రహాలు ఏర్పాటయినట్లు ఆ శాఖ నివేదిక రూ పొందించింది. ఇందులో 60% విగ్రహాల నిమజ్జనం ఇప్పటికే పూర్తయిందని డీజీపీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment