
సాక్షి, హైదరాబాద్ : నాలుగున్నర కోట్లతో నూతన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్టు రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్ తెలిపారు. రాచకొండ కమిషనరేట్ ఏర్పాటయి రెండేళ్లు పూరైనా సందర్భంగా కమిషనరేట్ పరిధిలో సాధించిన విజయాలను మహేశ్ భగవత్ వివరించారు. ‘రాచకొండ కమిషనరేట్ విస్తీర్ణంలో దేశంలోనే అతి పెద్దది. కమిషనరేట్ పరిధిలో 3,787 సిబ్బంది పనిచేస్తుండగా.. 3,119 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. త్వరలో పూర్తి స్థాయిలో సిబ్బంది నియామకం చేపడుతాం. 2017 జూన్ నుంచి 2018 జూన్ వరకు 20, 817 కేసులు నమోదయ్యాయి. 4,243 ఆర్థిక నేరాలు జరిగాయి.
కమిషనరేట్ పరిధిలో మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఏడాది కాలంలో షీ టీమ్ బృందాలు 591 కేసులు నమోదు చేశాయి. మరో 700 మందిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. 40కు పైగా బాల్య వివాహాలను అడ్డుకున్నాం. 760 కుటుంబ సమస్యలను పరిష్కరించాం. ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 210 మంది చిన్నారులను రక్షించాం. మైనర్ నేరస్తులపై ప్రత్యేక దృష్టిపెట్టి తిరిగి నేరాలకు పాల్పడకుండా చర్యలు తీసుకుంటున్నాం. నాలుగున్నర కోట్లతో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశాం. మేడిపల్లిలో 56 ఎకరాల్లో కమిషనరేట్ భవన నిర్మాణం జరగనుంద’ని మహేశ్ భగవత్ తెలిపారు.