సాక్షి, సిటీబ్యూరో: కొత్త ఏడాది నుంచి రాచకొండ పోలీసు కమిషనరేట్‌కు కొత్త బాస్ రానున్నారు. సుదీర్ఘ కాలం నుంచి రాచకొండ పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహేశ్ మురళీధర్ భగవత్ బదిలీ కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయనను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డైరెక్టర్ జనరల్ (డీజీ)గా స్థానచలనం కలి్పంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.
రాచకొండ కమిషనరేట్‌కు కొత్త పోలీసు కమిషనర్‌గా 2004 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి వీబీ కమలాసన్ రెడ్డిని నియమించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం కమలాసన్ రెడ్డి హైదరాబాద్, నిజామాబాద్ రేంజ్ ఇన్‌చార్జి డీఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. ఇటీవల హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో అప్పటివరకు కరీంనగర్ పోలీసు కమిషనర్‌గా ఉన్న కమలాసన్ రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసి.. డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసింది. ఆ తర్వాత హైదరాబాద్, నిజామాబాద్ రేంజ్ ఇంచార్జీ డీఐజీగా తాత్కాలిక కాలం పాటు పోస్టింగ్ ఇచ్చారు.
పలువురు డీసీపీలు కూడా..
విస్తీర్ణంలో ఢిల్లీ తర్వాత అతిపెద్ద పోలీసు కమిషనరేట్ అయిన సైబరాబాద్ మెట్రోపాలిటన్ పోలీస్‌ను 2016లో విభజించి.. సైబరాబాద్ ఈస్ట్‌కు రాచకొండ పోలీసు కమిషనరేట్‌గా నామకరణం చేశారు. అనంతరం రాచకొండ తొలి సీపీగా మహేశ్ భగవత్ బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒక పోలీసు కమిషనరేట్‌కు వరుసగా ఆరేళ్ల కంటే ఎక్కువ కాలం పోలీసు కమిషనర్‌గా పనిచేసి మహేశ్ భగవత్ రికార్డు సృష్టించారు. ఇదిలా ఉండగా.. సీపీ బదిలీ అనంతరం.. రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో సుదీర్ఘ కాలం నుంచి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు (డీసీపీ)లుగా పనిచేస్తున్న పలువురిని కూడా బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment