Rachakonda Police Commissionerate
-
ఆయన టార్గెట్.. ఎవరెస్ట్!
సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీసు కమిషనరేట్ కొత్త కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ఓ పర్వతారోహకుడు. ఆదిలాబాద్ ఎస్పీగా పని చేస్తున్న సమయంలోనే పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్న ఆయన ఇప్పటి వరకు 6 పర్వతాలను అధిరోహించారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడమే లక్ష్యంగా అనునిత్యం సాధన చేస్తున్నారు డాక్టర్. తరుణ్ జోషి బుధవారం రాచకొండ సీపీగా ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ♦పంజాబ్‌కు చెందిన తరుణ్ జోషి పాటియాలాలోని గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుంచి బీడీఎస్ పూర్తి చేసి దంత వైద్యుడిగా మారారు. 2004లో సివిల్ సరీ్వసెస్ ఉత్తీర్ణులైన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో ఐపీఎస్ అధికారిగా నియమితులయ్యారు. ♦ ఓ పక్క విధులు నిర్వర్తిస్తూనే కొత్త అంశాలను నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఉద్యోగంలో తర్వాతే పదేళ్ల క్రితం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోలీస్ మేనేజ్మెంట్ విభాగంలో మాస్టర్స్ పూర్తి చేశారు. ఆపై ఎల్ఎల్బీలో చేరి 2019 జూలైలో ఉత్తీర్ణులు కావడమే కాదు... వర్సిటీ టాపర్‌గా నిలిచారు. ♦ తరుణ్ జోషి 2014 నుంచి 2016 వరక ఆదిలాబాద్ జిల్లా ఎస్పీగా పని చేశారు. ప్రస్తుతం ఏపీ పోలీసు విభాగంలో ఉన్న ఎస్పీ జి.రాధిక అప్పట్లో అదే జిల్లాలో అదనపు ఎస్పీగా పని చేశారు. పర్వతారోహణపై పట్టున్న ఆమె పలు పర్వతాలను అధిరోహించారు. విధి నిర్వహణలో భాగంగా అనునిత్యం తరుణ్ జోషిని కలిసే ఆమె తన పర్వతారోహణ అనుభవాలను పంచుకునే వారు. ♦ ఇలా అనుకోకుండా ఆ రంగంపై ఆసక్తి పెంచుకున్న ఆయన తాను పర్వతారోహకుడు కావాలని భావించారు. సంతృప్తితో పాటు మానసిక, శారీరక దారుఢ్యానికి ఇది ఉపకరిస్తుందనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని రాధికతో చెప్పగా... తొలుత డార్జిలింగ్‌లోని హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకోవాలని, ఆపై తుది నిర్ణయానికి రావాలని ఆమె సూచించారు. ♦ ఆదిలాబాద్ ఎస్పీగా పని చేసినన్నాళ్లు పని ఒత్తిడి నేపథ్యంలో డార్జిలింగ్ వెళ్లడం ఆయనకు సాధ్యం కాలేదు. అక్కడ నుంచి రాచకొండ పోలీసు కమిషనరేట్‌కు తొలి సంయుక్త పోలీసు కమిషనర్‌గా వచి్చన తరుణ్ తనలో ఉన్న పర్వతారోహణ ఆసక్తికి పదును పెట్టారు. ♦ 2017లో హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్న ఆయన అదే ఏడాది అక్టోబర్‌లో తొలిసారిగా హిమాలయాల్లోనే ఉన్న మౌంట్ రీనాక్‌కు ఎక్కారు. అప్పటి నుంచి అవకాశం దొరికినప్పుడల్లా పర్వతారోహణ చేస్తున్న ఆయన ఇప్పటి వరకు ఆరింటిపై తన కాలు మోపారు. ఎవరెస్ట్‌పై కాలు పెట్టడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. తరుణ్ జోషి అధిరోహించిన పర్వతాలు... ► 2018 మేలో సదరన్ రష్యాలోని భారీ అగి్నపర్వతమైన మౌంట్ ఎల్బ్రస్ను ఎక్కారు. సముద్ర మట్టానికి 5,642 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ శిఖరం యూరప్‌లోనే పెద్దది. ► 2019 జనవరిలో అర్జెంటీనాలో ఉన్న మౌంట్ ఎకనగ్వాపై అడుగుపెట్టారు. మెండౌజా ప్రావెన్సీలో ఉన్న దీని ఎత్తు 6962 మీటర్లు. దక్షిణ అమెరికాలోనే ఎత్తైనది. ► అదే ఏడాది ఆగస్టులో ఇండోనేయాలో ఉన్న మౌంట్ కార్‌స్టెంజ్స్ అధిరోహించారు. ఇది ప్రపంచంలోని మైదాన ప్రాంతంలో ఉన్న శిఖరాల్లో అతి పెద్దది. దీని ఎత్తు 4,884 మీటర్లు. ► 2020 జనవరి 21న అంటార్కిటికాలోనే అత్యంత ఎత్తైన మౌంట్ విన్సన్‌ను అధిరోహించారు. దీని ఎత్తు 4,897 మీటర్లే అయినప్పటికీ.. మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రతతో తీవ్ర ప్రతికూల వాతావరణం ఉంటుంది. ► విన్సన్ అధిరోహించిన మూడు రోజుల్లోనే ఆస్ట్రేలియాలోని అత్యంత ఎత్తయిన మౌండ్ కోస్యూస్కోపై కాలు పెట్టారు. ఇది సముద్ర మట్టానికి 2,280 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ► 2021 జనవరి 21న టాంజానియాలో ఉన్న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. ఇది సముద్ర మట్టానికి 5,895 మీటర్ల ఎత్తులో ఉంది. -
రాచకొండ పోలీసు కమిషనరేట్ మరింత బలోపేతం!
సాక్షి,హైదరాబాద్: పట్టణీకరణ, కొత్త ప్రాంతాల ఏర్పాటుతో రాచకొండ పోలీసు కమిషనరేట్ శరవేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం 5,116 చదరపు కిలో మీటర్ల మేర విస్తరించిన రాచకొండలో 44 లక్షల మంది జనాభా నివాసం ఉంటోంది. ఏటేటా జనాభా, ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో కొత్త ఠాణాలు, ట్రాఫిక్ పోలీసు స్టేషన్లు, పోలీసుల సంఖ్యను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాచకొండకు కొత్తగా 763 పోలీసు పోస్టులకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం రాచకొండలో ఎల్బీనగర్, మల్కాజ్గిరి, భువనగిరి జోన్లు, ఒక్కో ట్రాఫిక్, ఎస్ఓటీ జోన్లతో కార్యాకలాపాలు సాగిస్తుంది. తాజా నిర్ణయంతో అదనంగా ఒక శాంతి భద్రతల జోన్, రెండు ట్రాఫిక్ జోన్లు, రెండు స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) జోన్లను ఏర్పాటు చేయనున్నట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. కొత్తగా మహేశ్వరం జోన్: ఎల్బీనగర్ జోన్ నుంచి ఇబ్రహీంపట్నం డివిజన్‌ను వేరు చేసి కొత్తగా రానున్న మహేశ్వరం డివిజన్‌తో కలిపి కొత్తగా మహేశ్వరం జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. పోస్టులు: డీసీపీ–1; అదనపు డీసీపీ–1, పీసీ–2, జేఏ–1 ► ఇబ్రహీంపట్నం డివిజన్ నుంచి మహేశ్వరం, కందుకూరు పోలీసు స్టేషన్లు, వనస్థలిపురం డివిజన్ నుంచి పహాడీషరీఫ్, బాలాపూర్ ఠాణాలను వేరు చేసి కొత్తగా మహేశ్వరం డివిజన్‌ను ఏర్పాటు చేయనున్నారు. పోస్టులు: ఏసీపీ–1; పీసీ–2 ► ఇప్పటికే ఉన్న ఎల్బీనగర్, మల్కాజ్గిరి, భువనగిరి జోన్లతో పాటు కొత్తగా రానున్న మహేశ్వరం జోన్‌కు ఒక్కో అదనపు డీసీపీలను నియమించనున్నారు. ఐదు కొత్త ఠాణాలు.. ప్రస్తుతం 43 శాంతి భద్రతలు, రెండు మహిళా పోలీసు స్టేషన్లు ఉండగా.. కొత్తగా మరో ఠాణాలను ఏర్పాటు చేయనున్నారు. చర్లపల్లి, నాగోల్, హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ, పోచారం ఐటీ కారిడార్ స్టేషన్లుతో పాటు ఉప్పల్‌లో మహిళా ఠాణా రానుంది. అలాగే ప్రస్తుతం ఉన్న కీసర, అబ్దుల్లాపూర్‌మెట్, బాలాపూర్ ఠాణాలను నవీకరించనున్నారు. యాదాద్రిలో భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో కేవలం గట్టు కోసమే ప్రత్యేకంగా ఏసీపీ ర్యాంకు అధికారిని మంజూరు చేశారు. యాదాద్రి టెంపుల్ పీఎస్, రాయగిరి పీఎస్‌లు ఆయన పరిధిలో ఉంటాయి. రెండు ఎస్ఓటీ జోన్లు.. ప్రస్తుతం రాచకొండలో ఒకటే ఎస్ఓటీ జోన్ ఉంది. కొత్తగా ఎల్బీనగర్–మహేశ్వరం, మల్కాజ్గిరి–భువనగిరి ఎస్ఓటీ జోన్లు రానున్నాయి. పోస్టులు: డీసీపీ–2, అదనపు డీసీపీ–1, ఏసీపీ–1, ఇన్స్పెక్టర్లు–2 ► స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) విభాగాన్ని కూడా బలోపేతం చేయనున్నారు. ఎస్బీకి కొత్తగా డీసీపీ ర్యాంకు అధికారి రానున్నారు. అదనంగా ఒక డీసీపీ, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, 3 ఎస్ఐలు, ఐదుగురు ఏఎస్ఐలు, 5 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 16 మంది కానిస్టేబుళ్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. నాలుగు కంట్రోల్ రూమ్‌లు.. రాచకొండలో కొత్తగా నాలుగు జోనల్ కంట్రోల్ రూమ్‌లు రానున్నాయి. ఒక్కో కంట్రోల్ రూమ్‌కు ఒక ఏఎస్ఐ, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్లుంటారు. వీటితో పాటు ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్)లో 70 మంది, ఐటీ, క్లూస్, సీసీఎస్ వంటి ఇతరత్రా విభాగాలలో 75 మంది, ఐడీ స్టాఫ్‌లో 13 అదనపు పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రాఫిక్‌లో రెండు జోన్లు, జాయింట్ సీపీ.. ఏటేటా వాహనాల సంఖ్య, రద్దీ పెరగడంతో ట్రాఫిక్ నియంత్రణ ఇబ్బందిగా మారింది. దీంతో ఈ విభాగాన్ని కూడా విస్తరించనున్నారు. కొత్తగా రాచకొండ ట్రాఫిక్‌కు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసు (సీపీ)ను పోస్టును భర్తీ చేయనున్నారు. కొత్తగా రానున్న రెండు ట్రాఫిక్ జోన్ల మధ్య సమన్వయం, విధుల కేటాయింపు, ట్రాఫిక్ నియంత్రణ అంశాలను జాయింట్ సీపీ పర్యవేక్షిస్తారు. ఆయనతో పాటు రెండు పీసీలు, ఒక జేఏ పోస్టులు కూడా మంజూరయ్యాయి. కొత్తగా రెండు ట్రాఫిక్ జోన్లు: ► ప్రస్తుతం రాచకొండ మొత్తానికీ ఒకటే ట్రాఫిక్ జోన్ ఉంది. కొత్తగా ఎల్బీనగర్–మహేశ్వరం, మల్కాజ్గిరి–భువనగిరి రెండు జోన్లను ఏర్పాటు చేయనున్నారు. పోస్టులు: డీసీపీ–1, అదరపు డీసీపీ–1, పీసీలు–2 ► కొత్తగా మహేశ్వరం ట్రాఫిక్ డివిజన్‌ను కూడా రానుంది. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ట్రాఫిక్ ఠాణాలను కలిపి ఈ డివిజన్ ఉంటుంది. పోస్టులు: ఏసీపీ–1, పీసీ–1 ► ప్రస్తుతం ఎనిమిది ట్రాఫిక్ పోలీసు స్టేషన్లు ఉండగా.. అదనంగా మరో నాలుగు ఠాణాలు రానున్నాయి. కొత్తగా ఘట్కేసర్, జవహర్‌నగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ స్టేషన్లను ఏర్పాటు, యాదాద్రి ట్రాఫిక్ పీఎస్‌లను నవీకరించనున్నారు. (క్లిక్: సంచలనాల సమాహారం.. ‘ఫామ్‌హౌస్–ఈడీ’ కేసుల వరకు ఎన్నెన్నో..) -
పెళ్లి పేరుతో యువకుడికి ‘మాయలేడి’ వల.. రూ.31లక్షలకు టోకరా
సాక్షి, హైదరాబాద్: మత్తెక్కించే మాటలతో ఆకట్టుకుంటుంది. చూపు తిప్పుకోలేని అందమైన ఫొటోలు, వీడియోలతో ఆకర్షిస్తుంది. పెళ్లి చేసుకుందామని నమ్మించి జేబు ఖాళీ చేసేస్తుంది ఈ మాయలేడి! సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు తెరిచి యువకులకు గాలం వేస్తున్న యువతితో పాటు ఆమెతో సహజీవనం చేస్తున్న మరొకరిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ బీ రాజు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా, గిద్దలూరుకు చెందిన పరాస తనుశ్రీ, పరాస రవితేజ ఇద్దరు గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలని భావించిన ఇరువురూ పథకం వేశారు. సోషల్ మీడియాలో నకిలీ ఖాతా తెరిచి యువకులను ఆకర్షించాలని నిర్ణయించుకున్నారు. తనుశ్రీ పేరుతో ఇన్‌స్ట్రాగామ్‌లో నాలుగు అకౌంట్లు తెరిచి అందమైన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేసేది. దీంతో తక్కువ సమయంలోనే ఆమెకు ఫాలోవర్స్ సంఖ్య పెరిగింది. కామెంట్లు పెట్టేవారిలో బ్యాచిలర్స్, అమాయకులను ఎంపిక చేసుకుని వారికి రిప్లై ఇచ్చేది. ఫోన్ నంబర్లు తీసుకుని తియ్యని మాటలతో ప్రేమగా మాట్లాడుతూ నమ్మించేది. ఈ క్రమంలో ఓ రోజు ఫిర్యాదుదారుడికి తనుశ్రీ ఇన్‌స్ట్రాగామ్ నుంచి మెసేజ్ వచ్చింది. తక్కువ సమయంలో ఇద్దరూ మంచి స్నేహితులుగా మారిపోయారు. ఒకరికొకరు ఫోన్ నంబర్లు మార్చుకొని గంటల కొద్దీ మాట్లాడుకునేవారు. తల్లికి ఆరోగ్యం బాలేదని, గృహ రుణం వాయిదా చెల్లించాలని, కరోనా వచ్చిందని ఇలా రకరకాల సాకులతో ఖర్చులకు డబ్బులు కావాలని అడగడంతో 8 నెలల కాలంలో రూ.31.66 లక్షలు బదిలీ చేశాడు. ఒక రోజు యువతి బాధితుడితో పెళ్లి చేసుకుందామని చెప్పింది. నిజమేనని నమ్మిన బాధితుడు ఎదురుచూశాడు. ఆపై ఆమె నుంచి రిప్లై రాకపోవటంతో మోసపోయానని గుర్తించి రాచకొండ సైబర్ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సాంకేతికత ఆధారాల ఆధారంగా తనుశ్రీ, రవితేజలను అరెస్టు చేసి, జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు వీరు ఇద్దరూ పలువురు యువకులను మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటికే వీరిపై మేడిపల్లి ఠాణాలోనూ కేసు నమోదయింది. ఇదీ చదవండి: Anti Hijab Protests: ఆస్కార్ విన్నింగ్ మూవీ నటి అరెస్ట్ -
రాచకొండ సీపీగా కమలాసన్?
సాక్షి, సిటీబ్యూరో: కొత్త ఏడాది నుంచి రాచకొండ పోలీసు కమిషనరేట్‌కు కొత్త బాస్ రానున్నారు. సుదీర్ఘ కాలం నుంచి రాచకొండ పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహేశ్ మురళీధర్ భగవత్ బదిలీ కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయనను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డైరెక్టర్ జనరల్ (డీజీ)గా స్థానచలనం కలి్పంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. రాచకొండ కమిషనరేట్‌కు కొత్త పోలీసు కమిషనర్‌గా 2004 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి వీబీ కమలాసన్ రెడ్డిని నియమించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం కమలాసన్ రెడ్డి హైదరాబాద్, నిజామాబాద్ రేంజ్ ఇన్చార్జి డీఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. ఇటీవల హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో అప్పటివరకు కరీంనగర్ పోలీసు కమిషనర్‌గా ఉన్న కమలాసన్ రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసి.. డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసింది. ఆ తర్వాత హైదరాబాద్, నిజామాబాద్ రేంజ్ ఇంచార్జీ డీఐజీగా తాత్కాలిక కాలం పాటు పోస్టింగ్ ఇచ్చారు. పలువురు డీసీపీలు కూడా.. విస్తీర్ణంలో ఢిల్లీ తర్వాత అతిపెద్ద పోలీసు కమిషనరేట్ అయిన సైబరాబాద్ మెట్రోపాలిటన్ పోలీస్‌ను 2016లో విభజించి.. సైబరాబాద్ ఈస్ట్‌కు రాచకొండ పోలీసు కమిషనరేట్‌గా నామకరణం చేశారు. అనంతరం రాచకొండ తొలి సీపీగా మహేశ్ భగవత్ బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒక పోలీసు కమిషనరేట్‌కు వరుసగా ఆరేళ్ల కంటే ఎక్కువ కాలం పోలీసు కమిషనర్‌గా పనిచేసి మహేశ్ భగవత్ రికార్డు సృష్టించారు. ఇదిలా ఉండగా.. సీపీ బదిలీ అనంతరం.. రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో సుదీర్ఘ కాలం నుంచి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు (డీసీపీ)లుగా పనిచేస్తున్న పలువురిని కూడా బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. -
సైబర్ మోసాలకు గురయ్యారా.. ఈ నంబర్‌కు కాల్ చేయండి!
సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నవంబరు, డిసెంబరు నెలల్లో ఇప్పటివరకు 50 సైబర్ నేరాలు జరిగాయి. ఆయా కేసులను ఛేదించిన సైబర్ క్రైమ్ పోలీసులు రూ.68 లక్షలు రికవరీ చేసి బాధితులకు అందించినట్లు రాచకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ ఎస్ హరినాథ్ తెలిపారు. కస్టమర్ కేర్ మోసాలు, జాబ్ ఫ్రాడ్స్, ఫిష్పింగ్ కాల్స్, ఓటీపీ మోసాలు, హనీ ట్రాప్స్, గిఫ్ట్, పెట్టుబడి మోసాలు వంటి వివిధ ఆన్లైన్ మోసాలకు సంబంధించి కేసులు కమిషనరేట్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. విచారణ సమయంలో ఒక ఖాతా నుంచి అనేక ఇతర అకౌంట్లు, వ్యాలెట్లకు నిధుల బదిలీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వాటిని సంబంధిత బాధితుల ఖాతాల్లోకి తిరిగి రికవరీ చేపించారు. కొన్ని సందర్భాలలో బాధితులు మోసానికి గురయ్యామని తెలిసిన తక్షణమే టోల్ ఫ్రీ నంబర్ 155260కి ఫిర్యాదు చేయడంతో ఆయా బాధితుల ఖాతాను హోల్డ్‌లో ఉంచి.. నేరగాళ్ల ఖాతాలను ఫ్రీజ్ చేశారు. దర్యాప్తు బృందాలు నిరంతరం విచారణ జరిపి బాధితులకు పోగొట్టుకున్న మొత్తాలను వాపస్ చేశారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఈ– మెయిల్స్ ద్వారా వచ్చే నకిలీ సందేశాలు, కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. కేవైసీ అప్డేట్, కస్టమర్ కేర్ సర్వీస్ అంటూ అపరిచిత వ్యక్తుల కాల్స్‌కు స్పందిచకూడదని రాచకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ ఎస్. హరినాథ్ సూచించారు. సైబర్ మోసాలకు గురైన తక్షణమే జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 155260 నంబర్‌కు ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న సొమ్మును రికవరీ అయ్యే అవకాశముందని తెలిపారు. -
అసభ్యకర ప్రవర్తన: యాదగిరిగుట్ట రూరల్ సీఐ సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో మరొక పోలీస్ అధికారిపై వేటు పడింది. ఈనెల 21న అవినీతి ఆరోపణలపై సరూర్‌నగర్ సబ్ ఇన్స్పెక్టర్ సైదులును సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా.. భువనగిరి డివిజన్ పరిధిలోని యాదగిరిగుట్ట రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) జీ నర్సయ్య సస్పెండ్ అయ్యారు. స్టేషన్‌లోని ఓ మహిళా పోలీస్తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఈ చర్యలు తీసుకున్నామని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. చదవండి: తనిఖీల వీడియో వైరల్: క్లారిటీ ఇచ్చిన సీపీ అంజనీ కుమార్ నర్సయ్య ప్రవర్తనపై సదరు మహిళ పోలీస్ పైఅధికారుల దృష్టికి తీసుకు వచ్చిందని తెలిసింది. దీంతో విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నర్సయ్య స్థానంలో ఎల్బీనగర్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అటాచ్గా ఉన్న ఇన్స్పెక్టర్ బీ నవీన్ రెడ్డిని యాదగిరిగుట్ట రూరల్ సీఐగా బదిలీ అయ్యారు. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ ఎం భగవత్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: ఇదేమి చోద్యం? మూతికి ఉండాల్సిన మాస్క్ నంబర్ ప్లేటుకు .. -
సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పునర్విభజన?
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ రంగారెడ్డి జిల్లాలో.. రాచకొండ కమిషనరేట్ మేడ్చల్ జిల్లాలో ఉండటంతో.. వీటి పరిధిలోకి వచ్చే ప్రాంతాలకు సంబంధించి గందరగోళం నెలకొంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన కొన్ని ఏరియాలు రాచకొండకు, మేడ్చల్‌కు చెందినవి సైబరాబాద్ పరిధిలోకి వస్తాయి. దీన్ని గమనించిన ఉన్నతాధికారులు ఈ రెండు కమిషనరేట్లను పునర్విభజన చేయాలని యోచిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రాథమిక కసరత్తు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ రూపు వచ్చిన తర్వాత ప్రభుత్వానికి నివేదించడం ద్వారా అనుమతి పొంది అమలులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. చదవండి: ‘రామప్ప’ పరిసరాలు కాంక్రీట్ జంగిల్‌గా మారొద్దు : హైకోర్టు అప్పట్లో ఒకే కమిషనరేట్.. ► రాజధానిలో ఒకప్పుడు కేవలం హైదరాబాద్ కమిషనరేట్ మాత్రమే ఉండేది. మిగిలిన ప్రాంతాలన్నీ రంగారెడ్డితో పాటు ఇతర జిల్లాల పరిధిలోకి వచ్చేవి. 2002లో సైబరాబాద్ కమిషనరేట్‌కు రూపమిచ్చారు. ► రాష్ట్ర విభజన తర్వాత పెరుగుతున్న జనాభా, మారుతున్న అవసరాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం 2016లో సైబరాబాద్ చుట్టూ ఉన్న ఇతర జిల్లాల్లోని ముఖ్యమైన అభివృద్ధికి ఆస్కారం ఉన్న ప్రాంతాలను కలుపుతూ రెండుగా విభజించారు. ► తొలినాళ్లల్లో సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్గా వ్యవహరించిన వీటిని ఆపై సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లుగా మార్చారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు ఈ రెండు కమిషనరేట్ల పరిధిలో విస్తరించి ఉండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రిక్రూట్‌మెంట్స్‌లోనూ సమస్యలే.. ► పోలీసు విభాగంలో ఎంపికలు యూనిట్ ఆధారంగా జరుగుతుంటాయి. పోలీసు విభాగంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా కేవలం మూడు స్థాయిల్లోనే ఎంపికలు చేస్తుంది. కానిస్టేబుల్, ఆపై సబ్–ఇన్స్పెక్టర్తో (ఎస్సై) పాటు గ్రూప్–1లో భాగమైన డీఎస్పీ పోస్టుల్ని ప్రభుత్వం భర్తీ చేసుకుంటుంది. ► ఈ మూడింటిలోనూ కానిస్టేబుల్‌కు రెవెన్యూ జిల్లా, ఎస్సైకి జోన్, డీఎస్పీకి రాష్ట్రం యూనిట్‌గా ఉంటుంది. ఆయా యూనిట్స్‌కు చెందిన దరఖాస్తుదారుల్ని స్థానికులుగా ఇతరుల్ని స్థానికేతరులుగా పరిగణిస్తారు. వీటి ప్రామాణికంగానే పోలీసు ఎంపికలు జరగడం అనివార్యం. ► రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్ ప్రాంతాలు రాచకొండ కమిషనరేట్లోకి, మిగిలినవి సైబరాబాద్ కమిషనరేట్లోకి వచ్చాయి. ► మేడ్చల్ జిల్లాలోకి బాలానగర్, పేట్ బషీరాబాద్ తదితరాలు సైబరాబాద్ పరిధిలోకి, మిగిలినవి రాచకొండలోనూ ఉన్నాయి. ఇలా ఒకే జిల్లా రెండు కమిషనరేట్లలో విస్తరించి ఉండటం కానిస్టేబుల్ స్థాయి అధికారుల ఎంపికలో సాంకేతిక ఇబ్బందులకు కారణమవుతోంది. జోన్ల మార్పులతో సమస్యలకు చెక్ ► ఈ సమస్యలతో పాటు ఇతర ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న పోలీసు విభాగం సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లను పునర్విభజన చేయాలని యోచిస్తోంది. ఒక కమిషనరేట్‌లో ఒకటి కంటే ఎక్కువ రెవెన్యూ జిల్లాలు ఉన్నప్పటికీ.. ఒక రెవెన్యూ జిల్లా మొత్తం ఆ కమిషనరేట్‌లోనే ఉండేలా కసరత్తు చేస్తోంది. ►ప్రాథమిక పరిశీలన నేపథ్యంలో రెవెన్యూ పరంగా రంగారెడ్డి జిల్లాలో ఉండి.. పోలీసు విషయానికి వచ్చేసరికి రాచకొండ పరిధిలోకి వచ్చే ఎల్బీనగర్ జోన్‌ను సైబరాబాద్‌లో కలపాలని భావిస్తున్నారు. మేడ్చల్ జిల్లాకు చెందిన, సైబరాబాద్ కమిషనరేట్‌లో ఉన్న బాలానగర్ జోన్‌ను రాచకొండ కమిషనరేట్‌కు మార్చాలని భావిస్తున్నారు. ► ఈ మార్పుచేర్పులకు సంబంధించి ఉన్నతాధికారులు ప్రాథమిక కసరత్తులు చేస్తున్నారని సమాచారం. ఒకే రెవెన్యూ జిల్లా రెండు కమిషనరేట్లలో లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిసింది. -
వైరల్ వీడియో: రోడ్డుపై వర్షం నీటిని తొలగిస్తున్న ట్రాఫిక్ పోలీసులు
-
వైరల్: ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులపై ప్రశంసల జల్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లో బుధవారం రాత్రి వాన పడింది. దీంతో పలు రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయింది. ఇక మాదాపూర్‌లో 5 సెంటిమీటర్లు, గచ్చిబౌలింలో 4.6 సెంటిమీటర్లు, చందానగర్‌లో 4.2 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. రాత్రి కురిసిన వానకు ఉప్పల్ ప్రాంతంలోని ఆదిత్య ఆస్పత్రి రోడ్డుపై ఉన్న గుంతలు జలమయం అయ్యాయి. రోడ్డుపై నిలిచిపోయిన నీటితో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అక్కడే ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి రహదారిపై నీటితో నిండిన గుంతలలో పార సాయంతో స్వయంగా మట్టినింపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను రాచకొండ పోలీసు కమిషనరేట్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోను వీక్షించిన పోలీసు అధికారులు, నెటిజన్లు ట్రాఫిక్ పోలీసులు పని తీరును ప్రశంసిస్తున్నారు. చదవండి: ఓలా ఫౌండేషన్: ఇంటి ముందుకే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు -
Kavitha Natarajan: ఆప్యాయతే.. అభయం
ఇప్పుడు సమాజం ఎన్నడూ లేనంత భయాందోళనల మధ్య కొట్టుమిట్టాడుతోందని, ఆప్యాయత, అవగాహన నిండిన మాటలతో దాన్ని పోగొట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు కవితా నటరాజన్. కరోనా కల్లోలం నేపథ్యంలో సమాజంలో విజృంభిస్తున్న పలు రకాల మానసిక సమస్యలకు ఆమె తన వంతు పరిష్కారాలను స్వచ్ఛందంగా అందిస్తున్నారు. గత ఏడాది తెలంగాణలోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటైన సైకోసోషల్ కౌన్సిలింగ్ సర్వీసెస్‌లో భాగంగా ఆమె కౌన్సిలింగ్ సేవలు కొనసాగిస్తున్నారు. ఐటీ ఉద్యోగినిగా పనిచేస్తూనే మరోవైపు తనకు ఇష్టమైన సోషల్ సర్వీస్‌నూ వదలకుండా కృషి చేస్తున్న కవితానటరాజన్ తన అనుభవాలను పంచుకున్నారిలా... కిందటేడాది కరోన.. ‘‘కార్పొరేట్ రంగంలో ఉన్నా, ప్రస్తుతం సిజిఐ అనే ఐటి కంపెనీలో పనిచేస్తున్నా. చిన్ననాటి నుంచీ స్వచ్ఛంద సేవ అంటే ఇష్టం. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఎన్నడూ ఎరగనంత విచిత్రమైన పరిస్థితులున్నాయి. లాక్‌డవున్ అనే మాట అంతకుముందు మనలో ఎవరమూ కనీ విననిది. ఆకలి కేకలు విని చాలా బాధపడ్డా. అయితే బయటకు వెళ్లి ఫుడ్ ప్యాకెట్స్ పంచాలి వంటి ఆలోచనలు వచ్చినా, నా వ్యక్తిగత ఇమ్యూన్ సిస్టమ్ గురించి తెలుసు కాబట్టి అలా చేయలేకపోయా. అదే సమయంలో ఎన్నడూ లేనట్టు కొన్ని నెలల పాటు ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితుల వల్ల చుట్టుపక్కల పలువురిలో విభిన్న రకాల మానసిక సమస్యలను గుర్తించాను. అప్పటికే సైకాలజీలో డిగ్రీ చేశాను కాబట్టి.. స్వచ్ఛందంగా సైకలాజికల్ కౌన్సిలింగ్ ఎందుకు ఇవ్వకూడదు? అనిపించింది. ఆ ఆలోచనను పోలీసు ఉన్నతాధికారి మహేష్ భగవత్ గారితో పంచుకుని, వారి సూచనల మేరకు రాచకొండ కమిషనరేట్ ఆధ్వర్యంలో మేం గత ఏడాది ఏప్రిల్ 2 న కౌన్సిలింగ్ సేవలు ప్రారంభించాం. ఉదయం 9గంటల నుంచి రాత్రి 9గంటల వరకూ వచ్చిన కాల్స్ ఇంకా గుర్తున్నాయి. లాక్ డౌన్ వల్ల పెరిగిన పనిభారంతో ఇళ్లలో మహిళలు చాలా ఇబ్బందులు పడ్డారు. వర్క్ డివిజన్ తెలియక చాలా మానసికంగా ఒత్తిళ్లకు లోనయ్యారు. మహిళలపై గృహహింసకు సంబంధించిన కాల్స్ కూడా విపరీతంగా వచ్చాయి. వీరందరికీ కౌన్సిలింగ్ ఇస్తూ అలా... మూడు నెలల పాటు పని చేశాం. కోవిడ్ తగ్గటంతో ఆ కాల్స్ తగ్గిపోయాయి. అయితే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయినప్పుడు మానసిక సంఘర్షణకు లోనైన యువత నుంచి పెద్ద సంఖ్యలో కాల్స్ వచ్చాయి. సెకండ్‌వేవ్ బాధితులు మరోసారి కోవిడ్ తన ప్రతాపం చూపిస్తున్న పరిస్థితుల్లో భావోద్వేగాలు మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అందుకే మరోసారి ఈ కౌన్సిలింగ్ సేవలు ప్రారంభించాం. గతం తో పోలిస్తే ఇప్పుడు మరింత విభిన్నమైన మానసిక సమస్యలతో సంప్రదిస్తున్నారు. వీరిలో తమ వారిని పోగొట్టుకున్న మహిళల మానసిక పరిస్థితి దయనీయంగా ఉంది. అలాగే దగ్గర బంధువుల్లో చావులు ఈసారి చాలామంది మనోధైర్యాన్ని పోగొడుతున్నాయి. తాజాగా బ్లాక్ ఫంగస్ గురించి కూడా కాల్స్ వస్తున్నాయంటే... ఇప్పుడు భయం ఎంతగా జనాల్లో పేరుకుపోయిందో అర్థమవుతుంది. మా వంతుగా వారిలో ధైర్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈసారి నాతోపాటు బాగా అనుభవం ఉన్న మరో 13 మంది మహిళ కౌన్సిలర్లు తమ సేవలు అందిస్తున్నారు. పోలీసుకూ మహిళకూ మధ్య గతంలో కూడా ఈ తరహా కౌన్సిలింగ్ చేసిన అనుభవం ఉంది. ‘మార్గదర్శక్’ పేరుతో మా లాంటి కొందరు స్వచ్ఛంద సేవకులకు గృహహింస, వేధింపులు.. వంటి వాటి విషయంలో చట్టబద్ధమైన అంశాలపై పోలీసు శాఖ ఆధ్వర్యం లో శిక్షణ అందించారు. అలాగే మన సమాజంలో కొందరు మహిళలకు పోలీస్ స్టేషన్ అన్నా, పోలీసులన్నా భయం ఉండొచ్చు. ముందు వారిని మానసికంగా ధైర్యం పుంజుకునేలా చేసి, వారి సమస్య నిర్భయంగా చెప్పగలిగేలా ప్రిపేర్ చేస్తాం, షీ టీమ్‌కు అనుసంధానంగా పనిచేస్తాం’’ అని వివరించారు కవిత. – నిర్మలారెడ్డి -
పోలీసుల ఎంట్రీ: ఫామ్‌హౌజ్‌లో భారీ రేవ్ పార్టీ భగ్నం
సంస్థాన్ నారాయణపురం/ చౌటుప్పల్: ఓ వ్యవసాయ క్షేత్రంలో యువత రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి కూతవేటు దూరంలోని గాంధీనగర్ తండా పరిధిలో ఉన్న జక్కిడి ధన్వంత్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో గురువారం రాత్రి జరుగుతున్న రేవ్ పార్టీపై ఎస్ఓటీ, భువనగిరి పోలీసు బృందాలు దాడులు నిర్వహించాయి. 97 మందిని (88 మంది యువకులు, ఇద్దరు యువతులు, ఏడుగురు నిర్వాహకులు) అదుపులోకి తీసుకున్నారు. వీరిలో విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగులు ఉన్నారు. భారీగా మద్యం, డ్రగ్స్, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌కు చెందిన పేపర్ ప్రొడక్ట్ వ్యాపారి గిరీశ్ దడువాయ్, ఎల్బీనగర్కు చెందిన విద్యార్థి శ్రీకర్‌రెడ్డి (ఫౌంహౌజ్ యజమాని ధన్వంత్‌రెడ్డి కుమారుడు), వనస్థలిపురానికి చెందిన జ్యువెల్లరీ వ్యాపారి చొల్లేటి శ్రీకాంత్, షేక్ ఉమర్ ఫారూఖ్ కలసి రేవ్ పార్టీ ఏర్పాటు చేయాలని భావించారు. శ్రీధర్‌రెడ్డి తండ్రి ధన్వంత్రెడ్డికి నారాయణపురం మండలం గాంధీనగర్ తండాలో ఫామ్‌హౌజ్ ఉండటంతో అక్కడే పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. డీజే సౌండ్ సిస్టమ్ నిర్వహణతో పాటు డ్రమ్ వాయిద్యంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఢిల్లీకి చెందిన సయ్యద్ అమ్రాన్ అలీరెజాను సంప్రదించారు. సూర్యాపేట జిల్లా బాలాజీనగర్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి బాలెంల ప్రవీణ్ నిషేధిత మత్తు పదార్థాలను సమకూర్చాడు. సోషల్‌మీడియా (ఇన్స్టాగ్రామ్) వేదికగా ‘పీఎస్ వై దమ్రూ’ అనే పేజీ క్రియేట్ చేసి ఒక్కొక్కరికి రూ.499 తీసుకొని 90 మందిని ఎంట్రీ చేసుకున్నారు. ‘మహదేవ్ గ్యాదరింగ్ ఎట్ రాచకొండ హిల్స్’ పేరుతోనూ యువతను ఆకర్షించారు. పక్కా సమాచారంతో.. ఈ రేవ్‌పార్టీ విషయం పోలీసులకు సమాచారం అం దింది. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ఆదేశం మేరకు ఎస్ఓటీ సిబ్బందితో పాటు స్థానిక పోలీసు బలగాలు గురువారం రాత్రి దాడి చేశారు. పార్టీలో యువత మద్యంతో పాటు డ్రగ్స్, గంజాయి వినియోగించారు. 400 గ్రాముల గంజాయి, 3 గ్రాముల ఎల్ఎస్డీ డ్రగ్, 2 గ్రాముల గుర్తు తెలియని డ్రగ్ పోలీసులకు చిక్కింది. 120 మద్యం ఫుల్ బాటిళ్లు, మూడు ల్యాప్‌టాప్‌లు, 2 కెమెరాలు, 76 సెల్ఫోన్లు, 15 కార్లు, 30 బైక్‌లు, జెనరేటర్, డీజేసౌండ్ సిస్టం, రూ.27,030 నగదు, 21 ఎంట్రీ టికెట్లు, సిగరెట్ ప్యాకెట్లు, గంజాయిలో వినియోగించే ఓసీఏం పేపర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులను రిమాండ్ కోసం కోర్టుకు తరలించారు. పట్టుబడిన యువతులు, యువకులపై కూడా కేసు నమోదు చేశారు. గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందో.. ఈ కేసును లోతుగా విచారణ చేపడుతున్నామని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. 3 నెలల కింద లక్నవరం సరస్సు వద్ద కూడా ఇలాగే పార్టీ జరిగిందని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో ఈ ఘటనపై విచారణ జరుపుతామన్నారు. నిర్వాహకులకు డ్రగ్స్, గంజాయి సరఫరా ఎక్కడి నుంచి జరిగిందన్న విషయాన్ని తెలుసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో భువనగిరి డీసీపీ కె.నారాయణరెడ్డి, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ సురేందర్‌రెడ్డి, ఏసీపీ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, పోలీసుల అదు పులో ఉన్న వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహిం చగా ఒకరి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. -
ఎన్ని చట్టాలొచ్చినా మహిళలపై దాడులా ?: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్: ఆడపిల్లలపై అఘాయిత్యాలు తగ్గాలంటే చట్టాల అమలు సరిగా జరగాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. నిర్భయ చట్టాలు వచ్చినా కూడా ఎక్కడ అమలు కావట్లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు 40 శాతం హింసను ఇళ్లల్లోనే ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను మనుషులుగా చూడాలని, మహిళలంతా సంఘటితమై తమ సమస్యలను ఎదుర్కోవాలని సూచించారు. కడుపులో ఉన్నప్పటి నుంచే ఆడబిడ్డలపై దౌర్జన్యం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. హజీపూర్ ఘటన దేశవ్యాప్తంగా చర్చ జరిగిందని, మళ్లీ అలాంటి అఘాయిత్యాలు జరగకుండా చర్యలు తీసుకొని అన్ని సౌకర్యాలు కల్పించిన కమిషనర్‌ను అభినందిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శనివారం జరిగిన సంఘమిత్ర అవార్డుల కార్యక్రమంలో కవిత పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ మానస పుత్రిక ‘షీ టీమ్స్’ అన్ని జిల్లాల్లో ఉన్నాయని, ఇతర రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు చేశారని చెప్పారు. తెలంగాణలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామని గుర్తుచేశారు. ఆడబిడ్డలకు గౌరవం ఇచ్చే రాష్ట్రం తెలంగాణ అని ప్రకటించారు. మహిళలు సంతోషంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు. షీ టీమ్స్‌తో పాటు సంఘమిత్ర కార్యక్రమాలు చేయడం అభినందనీయమని కొనియాడారు. సంఘమిత్రలు తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ని కోరుతానని చెప్పారు. తనను కూడా సంఘమిత్రలో చేర్చుకోవాలని సీపీని ఈ సందర్భంగా కవిత కోరారు. -
ఫ్లాగ్ మార్చ్‌లో రికార్డు!
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల సందర్భంలో బందో బస్తు, భద్రత ఏర్పాట్లలో భాగంగా ఫ్లాగ్‌మార్చ్‌ల పేరిట పోలీసు, సాయుధ బలగాల కవాతులు నిర్వహించడం పరిపాటే. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రాచకొండ పోలీసు కమిషనరేట్ అధికారులు కొత్త రికార్డు సృష్టించారు. కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ నేతృత్వంలో సుదీర్ఘ ఫ్లాగ్‌మార్చ్‌ను మంగళవారం నిర్వహించారు. మూడు పోలీసుస్టేషన్ల పరిధిలో మొత్తం 5 కి.మీ. మేర ఈ కవాతు జరిగింది. కమిషనర్ స్థాయి అధికారి నేతృత్వంలో ఇంత దూరం జరగడం పోలీసు చరిత్రలో ఇదే తొలిసారి. కుషాయిగూడ, నేరేడ్మెట్, జవహర్‌నగర్ పోలీసుస్టేషన్ల పరిధిలో ఉన్న నాలుగు వార్డుల్లోని సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలను కవర్ చేస్తూ ఈ ఫ్లాగ్‌మార్చ్ జరిగింది. ఇందులో 129 మంది సివిల్ పోలీసులు, 212 మంది టీఎస్ఎస్పీ, ఆర్మ్డ్ రిజర్వ్ అధికారులు పాల్గొన్నారు. పోలింగ్ రోజున ఆయా పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఈ బలగాలు విధులు నిర్వర్తించనున్నాయి. పోలీసు బ్యాండ్, అశ్వకదళాలు ఈ కవాతును ముందుకు నడిపించాయి. ప్రజల్లో స్థైర్యం నింపేందుకే : మహేశ్ భగవత్ స్వేచ్ఛాయుత ఎన్నికల ప్రక్రియ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఫ్లాగ్‌మార్చ్ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రజల్లో నైతిక స్థైర్యం నింపడానికి ఈ ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించామని పేర్కొన్నారు. ఫ్లాగ్‌మార్చ్‌లో మల్కాజ్గిరి డీసీపీ రక్షిత మూర్తి, కుషాయిగూడ ఏసీపీ శివకుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు. -
దుర్బుద్ధి: స్నేహితుడి డబ్బుల్నే కాజేసి..
సాక్షి, సిటీబ్యూరో: కరోనా ముందు వరకు వారిద్దరు స్నేహితులు. ఒకే గదిలో ఉన్నారు.. ఎవరి ఉద్యోగాలు వారు చేశారు. సాఫీగా సాగుతున్న వీరి ప్రయాణం కరోనా రాకతో కకావికలమైంది. ఉద్యోగం పోగొట్టుకున్న ఓ మిత్రుడు సొంతూరుకు వెళ్లాడు. అతనికి ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. మరో స్నేహితుడు నగరంలోనే ఉండి తనకు వచ్చే జీతంలో డబ్బులు ఆదా చేసుకోవడం అతనికి కనిపించింది. తన మనసులో పుట్టిన దుర్బుద్ధితో ఏకంగా స్నేహితుడి డబ్బుల్నే కాజేసి కటకటాలపాలయ్యాడు. నిందితుడి నుంచి కీసర పోలీసులు రూ.29.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను బుధవారం నేరేడ్మెట్లోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. చదవండి: చిట్టీల పేరుతో మోసం 24 గంటల్లోనే కేసు ఛేదన.. వరంగల్ జిల్లా ధర్మసాగర్‌లోని వ్యవసాయ కుటుంబానాకి చెందిన ఆవుల నరేశ్ ఇదే జిల్లా హన్మకొండలోని ఎస్వీఎస్ కాలేజీలో ఇంజినీరింగ్ చదువును మధ్యలోనే ఆపేశాడు. హైదరాబాద్‌కు వచ్చి చర్లపల్లిలోని ఓ కంపెనీలో చేరాడు. కుషాయిగూడలోని ఓ హాస్టల్లో ఉండేవాడు. ఇక్కడే యోగేశ్వరరావు, మణికంఠ, లక్ష్మణ్‌లతో నరేశ్‌కు ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. ఆ తర్వాత వీరు నలుగురూ కీసర మండలంలోని నగరం గ్రామంలోని సాయి సదన్ అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారు. ఆ సమయంలో ఈ నలుగురికి ఫ్లాట్‌కు సంబంధించి తాళచెవులు ఒక్కొక్కరి వద్ద ఒక్కొక్కటి ఉంది. కాప్రా జీహెచ్ఎంసీలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇంజినీర్‌గా పని చేస్తున్న సంగారెడ్డి జిల్లా కాలేరు మండలం మర్ది గ్రామానికి చెందిన యోగేశ్వరరావు తన ఖాళీ సమయాల్లో కన్సల్టెన్సీల ద్వారా ఉద్యోగ పనులు చేసి పొదుపు చేసిన రూ.29.5 లక్షల నగదు వీఐపీ సూట్‌కేసులో ఉండటాన్ని నరేశ్ గమనించాడు. ఇదే సమయంలో తన వద్ద మెయిన్ డోర్ తాళపు చెవి ఎక్కడో పడిపోయిందంటూ కరోనా సమయంలో బీటెక్ చదువు మధ్యలోనే ఆపేసిన నరేశ్ స్నేహితులతో చెప్పాడు. ఆ తర్వాత ఉద్యోగాలు పోవడంతో నరేశ్, లక్ష్మణ్‌లు ఆ ఫ్లాట్ ఖాళీ చేసి సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎక్కువ కావడంతో తన స్నేహితుడి డబ్బులు కాజేయాలని నరేశ్ ప్లాన్ చేశాడు. ఈ మేరకు ఈ నెల 17న వచ్చి తన స్నేహితులు యోగేందర్, మణికంఠ ఉద్యోగాల విధులకు వెళ్లే వరకు ఎదురుచూసి తన వద్ద ఉన్న తాళం చెవితో ఫ్లాట్ డోర్ తెరిచి లోపలికి వెళ్లాడు. వీఐపీ సూట్‌కేసును బద్దలుకొట్టి అందులోని రూ.29.5 లక్షల డబ్బు తీసుకొని తన బ్యాగ్‌లో వేసుకుని పరారయ్యాడు. పగటి సమయంలో సొంతూరుకు వెళ్లేందుకు భయపడిన నరేశ్ నగరంలోనే ఉన్నాడు. అదే సమయంలో యోగేశ్వరరావు ఫోన్ చేయగా వరంగల్‌లో ఉన్నానని తప్పుడు సమాచారమిచ్చాడు. దీంతో యోగేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కీసర సీఐ నరేందర్‌గౌడ్ నేతృత్వంలోని బృందం సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించింది. సెల్‌ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేసి బుధవారం తెల్లవారుజామున ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద నరేశ్ వరంగల్ వెళ్లే బస్సు ఎక్కుతుండగా కీసర పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.29.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసును 24 గంటల్లో ఛేదించిన కీసర సీఐ నరేందర్ గౌడ్‌తో పాటు ఇతర సిబ్బందిని సీపీ మహేష్ భగవత్ రివార్డులతో సన్మానించారు. కార్యక్రమంలో అడిషనల్ సీపీ సుధీర్‌బాబు, మల్కాజ్గిరి డీసీపీ రక్షితా కే మూర్తి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
వీడియో కాల్స్ చేస్తూ.. సీఐ వేధింపులు..
-
నగ్నంగా వీడియో కాల్స్ చేస్తూ సీఐ వేధింపులు..
సాక్షి, హైదరాబాద్ : ఓ ఖాకీచకుడి బరితెగింపు ఇది. నగర నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్‌లో (ఎస్బీ) ఈస్ట్ జోన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ సస్పెన్షన్‌కు గురైన కె.చంద్రకుమార్ బాధితురాలితో అత్యంత హేయంగా ప్రవర్తించాడు. తన కోరిక తీర్చకుంటే యాసిడ్ పోసి చంపేస్తానంటూ బెదిరించాడు. నగ్నంగా వీడియో కాల్స్ చేస్తూ వేధించాడు. ఈ అంశంపై వనస్థలిపురం పోలీసులు నమోదు చేసిన ప్రాథమిక సమాచార నివేదికలో (ఎఫ్ఐఆర్) దర్యాప్తు అధికారులు ఈ వివరాలు పొందుపరిచారు. ప్రస్తుతం వనస్థలిపురంలో నివసిస్తున్న బాధితురాలు వరంగల్‌లో ఫుడ్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం తన పదో తరగతి సర్టిఫికెట్లు పోవడంతో ఫిర్యాదు చేయడానికి మిర్యాలగూడ పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే అప్పట్లో అక్కడ ఎస్సైగా పని చేస్తున్న చంద్రకుమార్‌తో బాధితురాలికి పరిచయమైంది. ఆ సర్టిఫికెట్లు రికవరీ చేసి ఇచ్చిన చంద్రకుమార్ అప్పటి నుంచి అప్పుడప్పుడు బాధితురాలికి ఫోన్లు చేయడం, సందేశాలు పంపడం చేసేవాడు. ఐదేళ్ల క్రితం ఆమె వ్యక్తిగత పనికి సంబంధించిన ఫైల్‌ను సచివాలయంలో క్లియర్ చేయిస్తానంటూ రూ.5 లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత యాచారం ఇన్స్పెక్టర్గా బదిలీపై వచ్చిన చంద్రకుమార్ బాధితురాలికి తరచూ ఫోన్లు, ఎస్సెమ్మెస్‌లు పంపుతూ వేధించడం మొదలుపెట్టాడు. తన కోరిక తీరిస్తే వేధింపులు ఆపేస్తానంటూ బెదిరించడంతో బాధితురాలు అతడిని దూరంగా ఉంచడం మొదలెట్టారు. దీంతో ఆమె ఇంటికి వెళ్లి యాసిడ్ పోసి చంపేస్తానంటూ బెదిరించాడు. పిల్లల్నీ హత్య చేస్తానంటూ హెచ్చరించాడు. బాధితురాలి తండ్రికీ ఫోన్లు చేసి దుర్భాషలాడాడు. రాచకొండ పోలీసుల కౌన్సెలింగ్ బాధితురాలు రాచకొండ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా అతడికి కౌన్సెలింగ్ ఇచ్చారు. బాధితురాలి జోలికి వెళ్లనని, ఆమె నుంచి తీసుకున్న నగదు కూడా తిరిగి ఇచ్చేస్తానంటూ చెప్పి చర్యల నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత కూడా ఇన్స్పెక్టర్ తన ధోరణి మార్చుకోలేదు. బాధితురాలికి నగ్నంగా వీడియో కాల్స్ చేయడం మొదలెట్టాడు. చంద్రకుమార్ వ్యవహారం శ్రుతి మించుతుండటంతో బాధితురాలు హైదరాబాద్ పోలీసు కమిషనర్‌తోపాటు వనస్థలిపురం పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. దీంతో నగర కొత్వాల్ అతడిని సస్పెండ్ చేయగా వన స్థలిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఓ మహిళతో అత్యంత హేయంగా ప్రవర్తించిన చంద్రకుమార్‌పై కేసు నమోదైన విషయాన్ని మాత్రం వనస్థలిపురం పోలీసులు గోప్యంగా ఉంచడం గమనార్హం. చంద్రకుమార్‌ను అరెస్ట్ చేయాలి తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నా ఎస్బీ సీఐ చంద్రకుమార్‌ను ఇప్పటివరకూ అరెస్ట్ చేయలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. వనస్థలిపురం పోలీసులు ఆయనను రక్షిస్తున్నారని ఎఫ్ఐఆర్ నమోదై మూడు రోజులు గడుస్తున్నా అరెస్ట్ చేయలేదన్నారు. మహిళలను మానసికంగా వేధిస్తున్న సీఐ చంద్రకుమార్‌ను వదలకూడదని ఆమె డిమాండ్ చేశారు. కాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రకుమార్‌ను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ మూడు రోజుల క్రితం విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఆయనపై ఇప్పటికే నిర్భయ కేసు నమోదు అయింది. -
‘రాచకొండ మహిళా పోలీసులకు మర్దానీ-2 ప్రదర్శన’
సాక్షి, హైదరాబాద్ : రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలో విధులు నిర్వరిస్తున్న మహిళా పోలీసుల కోసం రాచకొండ సీపీ మహేష్ భగవత్ ‘మర్దానీ’ 2 చిత్రాన్ని ప్రదర్శించారు. ఉప్పల్‌లోని ఏషియన్ సినిమా థియేటర్లో ఈ సినిమాను ప్రదర్శించారు. మర్దానీ చిత్రంలో మహిళల భద్రత కోసం రాణి ముఖర్జీ ఎలా కృషి చేసిందే ప్రతీ ఒక్కరు అలాగే పనిచేయాలని సీపీ మహేష్ భగవత్ సూచించారు. 2020లో మహిళలపై ఒక్క నేరం కూడా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ నిరంతరం పనిచేస్తున్నాయని అన్నారు. శివారు ప్రాంతాల భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని సీపీ పేర్కొన్నారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్: 3148 మందిపై కేసులు
సాక్షి, హైదరాబాద్: డిసెంబర్ 31 సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 239 డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించామని పోలీసులు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలకు సంబంధించి హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 951 కేసులు నమోదు చేశామని తెలిపారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 873, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 281 కేసులు నమోదైనట్టు వివరించారు. తెలంగాణవ్యాప్తంగా 3148 కేసులు నమోదయ్యాయని, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడిన వారిలో ఒక మహిళ, 3,147 మంది పురుషులు ఉన్నారని వివరించారు. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. -
ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రయత్నం
సాక్షి, హైదరాబాద్ : నూతన మోటారు వాహన సవరణ చట్టంతో వాహనాదారులు బెంబేలెత్తుతున్న సంగతి మనకు తెలిసిందే. ట్రాఫిక్ ఉల్లంఘనపై విధిస్తున్న జరిమానాలతో తమ వాహనాలను బయటికి తీయడానికి కూడా వాహనదారులు భయపడుతున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వెలువడుతున్ననేపథ్యంలో తెలంగాణలోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ వినూత్న కార్యక్రమానికి తెరలేపింది. డీజీపీ మహేందర్ రెడ్డి, రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఆదేశానుసారం కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రయత్నం చేపట్టారు. ఇకపై హెల్మెట్, బండి ఇన్సురెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, లైసెన్స్ లేని వాహనదారులకు ట్రాఫిక్ చలాన్లు విధించకుండా వాటిని వారితోనే కొనిచ్చే ప్రయత్నాన్ని మొదలు పెట్టినట్లు ట్రాఫిక్ డీసీపీ దివ్య చరణ్ రావు పేర్కొన్నారు. ఇది మంచి ప్రయత్నం అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. -
150 మంది చిన్నారులకు విముక్తి
సాక్షి, హైదరాబాద్ : చిన్నపిల్లల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠా గ్యాంగ్ సభ్యులను రాచకొండ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బీహార్ నుంచి తెలంగాణకు చిన్న పిల్లలను తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ముఠాలో మొత్తం పదకొండు మంది ఉండగా ప్రస్తుతం ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 54 మంది చిన్నారులకు విముక్తి కలిగించారు. 15 రోజుల వ్యవధిలో మొత్తం 150 మంది చిన్నారులకు విముక్తి కలిగించామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు. - -
ఉద్యోగవేటలో ఊపిరి వదిలిన యువకుడు
ఇబ్రహీంపట్నం: పోలీస్ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా శిక్షణ పొందుతున్న ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాద సంఘటన గురువారం ఉదయం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎల్మినేడు అనుబంధ గ్రామం మెటిల్లకు చెందిన యాదయ్య, నాగమ్మ దంపతుల ఏకైక కుమారుడు ఏకాంబరం(23) నగరంలో ఉన్నతవిద్య అభ్యసించాడు. పోలీసు శాఖలో ఉద్యోగం సాధించడం అతడి కల. తన స్వప్నాన్ని సాకారం చేసుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ క్రమంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసు ఉద్యోగాల శిక్షణ శిబిరానికి ఎంపికయ్యాడు. పోలీస్ రిక్రూట్మెంట్ ప్రాథమిక పరీక్షల్లో అర్హత సాధించాడు. ఈ నెల 23న జరగనున్న దేహదారుఢ్య పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. ఎప్పటి మాదిరిగానే ఖానాపూర్ సమీపంలోని సెయింట్ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో గురువారం ఉదయం శిక్షణకు హాజరయ్యాడు. పరుగు తీస్తూ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. స్నేహితులు స్థానిక అస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. -
రెండేళ్లు పూర్తి చేసుకున్న రాచకొండ కమిషనరేట్
సాక్షి, హైదరాబాద్ : నాలుగున్నర కోట్లతో నూతన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్టు రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్ తెలిపారు. రాచకొండ కమిషనరేట్ ఏర్పాటయి రెండేళ్లు పూరైనా సందర్భంగా కమిషనరేట్ పరిధిలో సాధించిన విజయాలను మహేశ్ భగవత్ వివరించారు. ‘రాచకొండ కమిషనరేట్ విస్తీర్ణంలో దేశంలోనే అతి పెద్దది. కమిషనరేట్ పరిధిలో 3,787 సిబ్బంది పనిచేస్తుండగా.. 3,119 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. త్వరలో పూర్తి స్థాయిలో సిబ్బంది నియామకం చేపడుతాం. 2017 జూన్ నుంచి 2018 జూన్ వరకు 20, 817 కేసులు నమోదయ్యాయి. 4,243 ఆర్థిక నేరాలు జరిగాయి. కమిషనరేట్ పరిధిలో మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఏడాది కాలంలో షీ టీమ్ బృందాలు 591 కేసులు నమోదు చేశాయి. మరో 700 మందిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. 40కు పైగా బాల్య వివాహాలను అడ్డుకున్నాం. 760 కుటుంబ సమస్యలను పరిష్కరించాం. ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 210 మంది చిన్నారులను రక్షించాం. మైనర్ నేరస్తులపై ప్రత్యేక దృష్టిపెట్టి తిరిగి నేరాలకు పాల్పడకుండా చర్యలు తీసుకుంటున్నాం. నాలుగున్నర కోట్లతో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశాం. మేడిపల్లిలో 56 ఎకరాల్లో కమిషనరేట్ భవన నిర్మాణం జరగనుంద’ని మహేశ్ భగవత్ తెలిపారు. -
విక్టోరియా హోం లీజు రికార్డులను ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ నిర్మాణం కోసం విక్టోరియా మెమోరియల్ హోం రెసిడెన్షియల్ స్కూల్ కు చెందిన భూమిని లీజుకివ్వడానికి సంబంధించిన రికార్డులన్నింటినీ తమ ముందుంచాలని ఉమ్మడి హైకోర్టు మంగళవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు రాచకొండ పోలీస్ కమిషనరేట్ నిర్మాణం కోసం లీజుకిచ్చిన భూమి రూపు రేఖలను మార్చొద్దని, భూమిని చదును చేయడం గానీ, ఆ భూమిలో ఉన్న చెట్లను కొట్టేయడం గానీ చేయవద్దంటూ గతవారం ఇచ్చిన ఉత్తర్వులను పొడిగించింది. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. విక్టోరియా మెమోరియల్‌కు చెందిన పదెకరాల భూమిని రాచకొండ పోలీస్ కమిషనరేట్ నిర్మాణం కోసం లీజుకిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ విక్టోరియా మెమోరియల్ హోం అనాథ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ఎల్.బుచ్చిరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
హైదరాబాద్ లో నకిలీ డ్రగ్స్ కలకలం..
సాక్షి, హైదరాబాద్: నగరంలో భారీ స్థాయి నకిలీ డ్రగ్స్తయారీ గుట్టు రట్టైంది. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ డ్రగ్స్ తయారవుతున్నాయన్న సమాచారం అందుకున్న రాచకండో పోలీసులు సోమవారం తయారీ కేంద్రంపై దాడి చేశారు. గర్భిణీలు ఎక్కువగా ఉపయోగించే ప్రోటీన్ పౌడర్, టానిక్స్, పిల్లలు తాగే మిల్క్ పౌడర్లను నకిలీగా గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు ఐదు వందల కోట్ల రూపాయలుంటుందని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చివరకు చిన్న పిల్లలు తాగే పాల పౌడర్, గర్బిణీలు ఉపయోగించే మందులను కల్తీ చేస్తుండటం నగరవాసులను కలవర పెడుతుంది. ఈ తయారీ కేంద్రం సహయజమానిగా గుర్తించిన రాజేందర్ రెడ్డి కోసం పోలీసులు వేట మొదల పెట్టారు. -
ఈ దొంగను పట్టిస్తే 50 వేలిస్తాం
సాక్షి, హైదరాబాద్: ఓ వృద్ధురాలిని చంపి బంగారు నగలతో ఉడాయించిన ఓ నిందితుడు ఏడాదిన్నరగా నగర పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఆ దొంగ సమాచారం అందిస్తే 50 వేల నజరాన ఇస్తామని రాచకొండ కమిషనర్ పోలీసులు శనివారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలు తమిళనాడులోని తుత్తుకూడి గ్రామానికి చెందిన బాలసుబ్రమణ్యం, డ్రైవింగ్ చేస్తూ భార్యతో మెడ్చల్‌లోని హౌజింగ్ బోర్డు కాలనీలో నివసించేవాడు. గతేడాది మార్చిలో మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్‌పేట,వెంకటాద్రి నివాస్‌లో ఒంటిరిగా నివసిస్తున్న నాగమణి అనే వృద్ధురాలిని హతమార్చి ఆమె నగలతో ఉడాయించాడు. అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా నిందితుడు తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇప్పటికే అతని భార్యను అదుపులోకి తీసుకున్న మీర్పేట్ పోలీసులు అతని ఆచూకి కనుగొనడంలో మాత్రం విఫలమయ్యారు. దీంతో పోలీసులు నిందితుని సమాచారం తెలియజేస్తే రూ.50 వేల రివార్డు అందిస్తామని, సమాచారం అందించిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంచుతామని ప్రకటించారు.