
సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నవంబరు, డిసెంబరు నెలల్లో ఇప్పటివరకు 50 సైబర్ నేరాలు జరిగాయి. ఆయా కేసులను ఛేదించిన సైబర్ క్రైమ్ పోలీసులు రూ.68 లక్షలు రికవరీ చేసి బాధితులకు అందించినట్లు రాచకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ ఎస్ హరినాథ్ తెలిపారు. కస్టమర్ కేర్ మోసాలు, జాబ్ ఫ్రాడ్స్, ఫిష్పింగ్ కాల్స్, ఓటీపీ మోసాలు, హనీ ట్రాప్స్, గిఫ్ట్, పెట్టుబడి మోసాలు వంటి వివిధ ఆన్‌లైన్ మోసాలకు సంబంధించి కేసులు కమిషనరేట్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. విచారణ సమయంలో ఒక ఖాతా నుంచి అనేక ఇతర అకౌంట్లు, వ్యాలెట్లకు నిధుల బదిలీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వాటిని సంబంధిత బాధితుల ఖాతాల్లోకి తిరిగి రికవరీ చేపించారు.
కొన్ని సందర్భాలలో బాధితులు మోసానికి గురయ్యామని తెలిసిన తక్షణమే టోల్ ఫ్రీ నంబర్ 155260కి ఫిర్యాదు చేయడంతో ఆయా బాధితుల ఖాతాను హోల్డ్‌లో ఉంచి.. నేరగాళ్ల ఖాతాలను ఫ్రీజ్ చేశారు. దర్యాప్తు బృందాలు నిరంతరం విచారణ జరిపి బాధితులకు పోగొట్టుకున్న మొత్తాలను వాపస్ చేశారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఈ– మెయిల్స్ ద్వారా వచ్చే నకిలీ సందేశాలు, కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. కేవైసీ అప్‌డేట్, కస్టమర్ కేర్ సర్వీస్ అంటూ అపరిచిత వ్యక్తుల కాల్స్‌కు స్పందిచకూడదని రాచకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ ఎస్. హరినాథ్ సూచించారు. సైబర్ మోసాలకు గురైన తక్షణమే జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 155260 నంబర్‌కు ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న సొమ్మును రికవరీ అయ్యే అవకాశముందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment