పోలీసుల ఎంట్రీ: ఫామ్‌హౌజ్‌లో భారీ రేవ్‌ పార్టీ‌ భగ్నం | Rave Party Busted In Sansthan Narayanapur, Arrested 90 Persons | Sakshi
Sakshi News home page

పోలీసుల ఎంట్రీ: ఫామ్‌హౌజ్‌లో భారీ రేవ్‌ పార్టీ‌ భగ్నం

Published Sat, Mar 13 2021 2:45 AM | Last Updated on Sat, Mar 13 2021 4:42 AM

Rave Party Busted In Sansthan Narayanapur, Arrested 90 Persons - Sakshi

సంస్థాన్‌ నారాయణపురం/ చౌటుప్పల్‌: ఓ వ్యవసాయ క్షేత్రంలో యువత రేవ్‌ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండల కేంద్రానికి కూతవేటు దూరంలోని గాంధీనగర్‌ తండా పరిధిలో ఉన్న జక్కిడి ధన్వంత్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో గురువారం రాత్రి జరుగుతున్న రేవ్‌ పార్టీపై ఎస్‌ఓటీ, భువనగిరి పోలీసు బృందాలు దాడులు నిర్వహించాయి. 97 మందిని (88 మంది యువకులు, ఇద్దరు యువతులు, ఏడుగురు నిర్వాహకులు) అదుపులోకి తీసుకున్నారు. వీరిలో విద్యార్థులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఉద్యోగులు ఉన్నారు. భారీగా మద్యం, డ్రగ్స్, గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌కు చెందిన పేపర్‌ ప్రొడక్ట్‌ వ్యాపారి గిరీశ్‌ దడువాయ్, ఎల్బీనగర్‌కు చెందిన విద్యార్థి శ్రీకర్‌రెడ్డి (ఫౌంహౌజ్‌ యజమాని ధన్వంత్‌రెడ్డి కుమారుడు), వనస్థలిపురానికి చెందిన జ్యువెల్లరీ వ్యాపారి చొల్లేటి శ్రీకాంత్, షేక్‌ ఉమర్‌ ఫారూఖ్‌ కలసి రేవ్‌ పార్టీ ఏర్పాటు చేయాలని భావించారు. శ్రీధర్‌రెడ్డి తండ్రి ధన్వంత్‌రెడ్డికి నారాయణపురం మండలం గాంధీనగర్‌ తండాలో ఫామ్‌హౌజ్‌ ఉండటంతో అక్కడే పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. డీజే సౌండ్‌ సిస్టమ్‌ నిర్వహణతో పాటు డ్రమ్‌ వాయిద్యంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఢిల్లీకి చెందిన సయ్యద్‌ అమ్రాన్‌ అలీరెజాను సంప్రదించారు. సూర్యాపేట జిల్లా బాలాజీనగర్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి బాలెంల ప్రవీణ్‌ నిషేధిత మత్తు పదార్థాలను సమకూర్చాడు. సోషల్‌మీడియా (ఇన్‌స్టాగ్రామ్‌) వేదికగా ‘పీఎస్‌ వై దమ్రూ’ అనే పేజీ క్రియేట్‌ చేసి ఒక్కొక్కరికి రూ.499 తీసుకొని 90 మందిని ఎంట్రీ చేసుకున్నారు. ‘మహదేవ్‌ గ్యాదరింగ్‌ ఎట్‌ రాచకొండ హిల్స్‌’ పేరుతోనూ యువతను ఆకర్షించారు.



పక్కా సమాచారంతో.. 
ఈ రేవ్‌పార్టీ విషయం పోలీసులకు సమాచారం అం దింది. రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ ఆదేశం మేరకు ఎస్‌ఓటీ సిబ్బందితో పాటు స్థానిక పోలీసు బలగాలు గురువారం రాత్రి దాడి చేశారు. పార్టీలో యువత మద్యంతో పాటు డ్రగ్స్, గంజాయి వినియోగించారు. 400 గ్రాముల గంజాయి, 3 గ్రాముల ఎల్‌ఎస్‌డీ డ్రగ్, 2 గ్రాముల గుర్తు తెలియని డ్రగ్‌ పోలీసులకు చిక్కింది. 120 మద్యం ఫుల్‌ బాటిళ్లు, మూడు ల్యాప్‌టాప్‌లు, 2 కెమెరాలు, 76 సెల్‌ఫోన్లు, 15 కార్లు, 30 బైక్‌లు, జెనరేటర్, డీజేసౌండ్‌ సిస్టం, రూ.27,030 నగదు, 21 ఎంట్రీ టికెట్లు, సిగరెట్‌ ప్యాకెట్లు, గంజాయిలో వినియోగించే ఓసీఏం పేపర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులను రిమాండ్‌ కోసం కోర్టుకు తరలించారు. పట్టుబడిన యువతులు, యువకులపై కూడా కేసు నమోదు చేశారు.

గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందో..
ఈ కేసును లోతుగా విచారణ చేపడుతున్నామని సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. 3 నెలల కింద లక్నవరం సరస్సు వద్ద కూడా ఇలాగే పార్టీ జరిగిందని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో ఈ ఘటనపై విచారణ జరుపుతామన్నారు. నిర్వాహకులకు డ్రగ్స్, గంజాయి సరఫరా ఎక్కడి నుంచి జరిగిందన్న విషయాన్ని తెలుసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో భువనగిరి డీసీపీ కె.నారాయణరెడ్డి, అడిషనల్‌ డిప్యూటీ కమిషనర్‌ సురేందర్‌రెడ్డి, ఏసీపీ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, పోలీసుల అదు పులో ఉన్న వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహిం చగా ఒకరి పాజిటివ్‌ వచ్చినట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement