సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ రంగారెడ్డి జిల్లాలో.. రాచకొండ కమిషనరేట్ మేడ్చల్ జిల్లాలో ఉండటంతో.. వీటి పరిధిలోకి వచ్చే ప్రాంతాలకు సంబంధించి గందరగోళం నెలకొంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన కొన్ని ఏరియాలు రాచకొండకు, మేడ్చల్‌కు చెందినవి సైబరాబాద్ పరిధిలోకి వస్తాయి. దీన్ని గమనించిన ఉన్నతాధికారులు ఈ రెండు కమిషనరేట్లను పునర్విభజన చేయాలని యోచిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రాథమిక కసరత్తు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ రూపు వచ్చిన తర్వాత ప్రభుత్వానికి నివేదించడం ద్వారా అనుమతి పొంది అమలులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.
చదవండి: ‘రామప్ప’ పరిసరాలు కాంక్రీట్ జంగిల్‌గా మారొద్దు : హైకోర్టు
అప్పట్లో ఒకే కమిషనరేట్..
► రాజధానిలో ఒకప్పుడు కేవలం హైదరాబాద్ కమిషనరేట్ మాత్రమే ఉండేది. మిగిలిన ప్రాంతాలన్నీ రంగారెడ్డితో పాటు ఇతర జిల్లాల పరిధిలోకి వచ్చేవి. 2002లో సైబరాబాద్ కమిషనరేట్‌కు రూపమిచ్చారు.
► రాష్ట్ర విభజన తర్వాత పెరుగుతున్న జనాభా, మారుతున్న అవసరాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం 2016లో సైబరాబాద్ చుట్టూ ఉన్న ఇతర జిల్లాల్లోని ముఖ్యమైన అభివృద్ధికి ఆస్కారం ఉన్న ప్రాంతాలను కలుపుతూ రెండుగా విభజించారు.
► తొలినాళ్లల్లో సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్‌గా వ్యవహరించిన వీటిని ఆపై సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లుగా మార్చారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు ఈ రెండు కమిషనరేట్ల పరిధిలో విస్తరించి ఉండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
రిక్రూట్‌మెంట్స్‌లోనూ సమస్యలే..
► పోలీసు విభాగంలో ఎంపికలు యూనిట్ ఆధారంగా జరుగుతుంటాయి. పోలీసు విభాగంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డ్ ద్వారా కేవలం మూడు స్థాయిల్లోనే ఎంపికలు చేస్తుంది. కానిస్టేబుల్, ఆపై సబ్–ఇన్‌స్పెక్టర్‌తో (ఎస్సై) పాటు గ్రూప్–1లో భాగమైన డీఎస్పీ పోస్టుల్ని ప్రభుత్వం భర్తీ చేసుకుంటుంది.
► ఈ మూడింటిలోనూ కానిస్టేబుల్‌కు రెవెన్యూ జిల్లా, ఎస్సైకి జోన్, డీఎస్పీకి రాష్ట్రం యూనిట్‌గా ఉంటుంది. ఆయా యూనిట్స్‌కు చెందిన దరఖాస్తుదారుల్ని స్థానికులుగా ఇతరుల్ని స్థానికేతరులుగా పరిగణిస్తారు. వీటి ప్రామాణికంగానే పోలీసు ఎంపికలు జరగడం అనివార్యం.
► రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్ ప్రాంతాలు రాచకొండ కమిషనరేట్‌లోకి, మిగిలినవి సైబరాబాద్ కమిషనరేట్‌లోకి వచ్చాయి.
► మేడ్చల్ జిల్లాలోకి బాలానగర్, పేట్ బషీరాబాద్ తదితరాలు సైబరాబాద్ పరిధిలోకి, మిగిలినవి రాచకొండలోనూ ఉన్నాయి. ఇలా ఒకే జిల్లా రెండు కమిషనరేట్లలో విస్తరించి ఉండటం కానిస్టేబుల్ స్థాయి అధికారుల ఎంపికలో సాంకేతిక ఇబ్బందులకు కారణమవుతోంది.
జోన్ల మార్పులతో సమస్యలకు చెక్
► ఈ సమస్యలతో పాటు ఇతర ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న పోలీసు విభాగం సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లను పునర్విభజన చేయాలని యోచిస్తోంది. ఒక కమిషనరేట్‌లో ఒకటి కంటే ఎక్కువ రెవెన్యూ జిల్లాలు ఉన్నప్పటికీ.. ఒక రెవెన్యూ జిల్లా మొత్తం ఆ కమిషనరేట్‌లోనే ఉండేలా కసరత్తు చేస్తోంది.
►ప్రాథమిక పరిశీలన నేపథ్యంలో రెవెన్యూ పరంగా రంగారెడ్డి జిల్లాలో ఉండి.. పోలీసు విషయానికి వచ్చేసరికి రాచకొండ పరిధిలోకి వచ్చే ఎల్బీనగర్ జోన్‌ను సైబరాబాద్‌లో కలపాలని భావిస్తున్నారు. మేడ్చల్ జిల్లాకు చెందిన, సైబరాబాద్ కమిషనరేట్‌లో ఉన్న బాలానగర్ జోన్‌ను రాచకొండ కమిషనరేట్‌కు మార్చాలని భావిస్తున్నారు.
► ఈ మార్పుచేర్పులకు సంబంధించి ఉన్నతాధికారులు ప్రాథమిక కసరత్తులు చేస్తున్నారని సమాచారం. ఒకే రెవెన్యూ జిల్లా రెండు కమిషనరేట్లలో లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment